Samantha: సమంత సక్సెస్‌ సీక్రెట్లు ఇవే... మీరూ ఫాలో అవుతారా?

‘‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’’ అంటూ కెరీర్‌లోనే తొలిసారి ఐటమ్‌ సాంగ్‌లో నర్తించింది టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంత.

Published : 11 Jan 2022 14:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ’’ అంటూ కెరీర్‌లో తొలిసారి ఐటమ్‌ సాంగ్‌లో నర్తించింది టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంత. గతేడాది వైవాహిక బంధానికి ముగింపు పలికిన సామ్‌ జీవితంలో తాను కూడా మానసిక సమస్యలను ఎదుర్కొన్నానని స్నేహితులు, కౌన్సెలర్స్‌ సాయంతో బయటపడ్డానని ఇటీవలే చెప్పింది. అయితే, ఓ నటిగానే మనకు తెలిసిన సమంత డైలీలైఫ్‌ వెనుక దాగి ఉన్న కష్టం.. ఎదిగేందుకు ఆమె ఏమేం చేస్తుంది? రోజూ వారీ జీవితం ఎలా ఉంటుంది? తన అలవాట్లతో పాటు ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌స్క్రీన్‌కి సంబంధించిన సక్సెస్‌ సీక్రెట్లను ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో పంచుకుంది.

‘‘ఉదయం 5గంటలకే నా దినచర్య ప్రారంభమవుతుంది. పొద్దున్నే లేవడం చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. కచ్చితంగా వ్యాయామం చేస్తా. వెయిట్‌ లిఫ్టింగ్స్‌ ఎక్కువ చేస్తుంటా. ఇక నా డైట్‌ విషయం అంటారా.. నా ఆహారం పూర్తిగా కూరగాయలకు సంబంధించినదే ఉంటుంది. శాకాహారిగా ఉండటం వ్యక్తిగతంగా నాకెంతో సంతృప్తినిస్తుంది’’


‘‘తెల్లటి కాన్వాస్ బోర్డ్‌ లాగా నా ముందున్న రోజుని విజువలైజ్ చేస్తూ కొన్ని నిమిషాలు గడుపుతా. అందుకే నేను చేసే ప్రతీ పనిలో ఇదే నా ఫస్ట్‌ అనేలా వ్యవహరించేందుకు సహాయపడుతుంది. ఆ పని పూర్తి చేసేంత వరకూ అదే ఉత్సాహం నాలో ఉంటుంది’’


‘‘సైక్లింగ్‌, ధ్యానం ఇష్టంగా చేస్తా. పనిచేశాక విరామం, హాలిడే బ్రేక్‌ తీసుకుంటా. పర్యాటక ప్రదేశాలను సన్నిహితులతో కలిసి చుట్టొస్తా. ఇవన్నీ ఉపశమనం కలిగించే విషయాలు ఆ ప్రదేశం వెనుక దాగి ఉన్న చరిత్రను పూర్తిగా తెలుసుకుంటే అదో సంతృప్తి. అలాగే నాకెంతో ఇష్టమైన నా పెట్స్‌ హష్‌, సాషతో సమయం గడుపుతా’’


‘‘రాళ్ల మధ్య నుంచి నది ప్రవహిస్తుందంటే.. అది దానికున్న శక్తితో కాదు.. దాని పట్టుదలతో..’ అనే సూత్రాన్ని నేను నమ్ముతా.. పాటిస్తాను కూడా. చేసే పనిలో వెనుకడుగు వేయను.. భయపడను.. అందుకే షార్ప్‌గా ఉంటా’’


‘‘నా ఆలోచనల కన్నా ముందు ఎదుట వ్యక్తి ఫీలింగ్స్‌ను అర్థం చేసుకుంటా. ఒక నటిగా, వ్యక్తిగా ఎదిగేందుకు ఈ గుణం నాకెంతో తోడ్పడింది. ఎదుటవ్యక్తిని నిందించడం కన్నా ప్రతీ సమస్యకు ఓ మార్గం ఉంటుంది. ఇదే గుణాన్ని కొనసాగించేందుకు నిత్యం నేను నిర్వహించే ‘ప్రత్యూష ఫౌండేషన్‌’ ద్వారా అనాథ పిల్లల బాగోగులను చూస్తుంటా, చిన్నారులతో గడపడం వంటివి చేస్తా. అవే నా సామర్థ్యాలను మరింత పెంచుతాయి’’


‘‘మీకు పోటీ ఎవరు?’ అని అడుగుతుంటారు. నాకు నేనే పోటీ. ఇంకా ఎదగాలనే తపనే నన్ను ముందుకు నడిపిస్తుంది. రోజూ నాకంటూ, కొత్త లక్ష్యం ఏర్పరచుకుంటా. అది జిమ్‌ కావొచ్చు. సెట్‌లో కావొచ్చు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలన్నదే నా ఆశయం. నా శక్తి సామర్థ్యాలతో కేవలం నటన మాత్రమే కాకుండా ఇంకా ఎదగాలనుకుంటున్నా. అందుకే నేను ఎంచుకునే ప్రతీ పని కొత్తగా ఉండాలి. దాని ద్వారా ఎంతో కొంత నేర్చుకోవాలి, ఎదగాలి. అన్ని నాకు తెలుసు అనే భావనతో ఎప్పటికీ ఉండను. ఏదైనా కొత్త విషయం నేర్పించే వారితోనే ఎక్కువ సమయం గడుపుతా’’ అని సమంత చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని