Samyuktha: ఊహించని గిఫ్ట్‌తో విరూపాక్ష దర్శకుడిని సర్‌ప్రైజ్‌ చేసిన సంయుక్త

Samyuktha: విరూపాక్ష దర్శకుడు కార్తీక్‌కు కథానాయిక సంయుక్త గిఫ్ట్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు.

Updated : 27 Apr 2023 17:09 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ‘విరూపాక్ష’ (Virupaksha) ఫీవర్‌ నడుస్తోంది. సాయిధరమ్‌తేజ్‌ (Sai Dharam Tej) కథానాయకుడిగా కార్తీక్‌ వర్మ (Karthik Varma Dandu) తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు, కథానాయిక సంయుక్త (Samyuktha) నటనపై విమర్శకులతో పాటు, సినీ ప్రేక్షకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు కార్తీక్‌ వర్మకు సంయుక్త ఐఫోన్‌ గిఫ్ట్‌గా ఇచ్చారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు.

‘విరూపాక్ష’ విడుదల రోజు చిత్ర బృందంతో కలిసి కార్తీక్‌ హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లారు. ఆ సమయంలో ప్రేక్షకులు ఎక్కువగా ఉండటంతో థియేటర్‌లో కార్తీక్ ఫోన్‌ పోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కథానాయిక సంయుక్త వెంటనే ఐఫోన్‌ ప్రో మోడల్‌ మొబైల్‌ను కొని దర్శకుడికి గిఫ్ట్‌గా ఇచ్చింది. ‘సినిమా హిట్‌ అయిన సందర్భంగా కార్తీక్‌కు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నా. సరిగ్గా ఆ సమయంలోనే ఫోన్‌ పోయిందని తెలిసింది. దాంతో ఆయనకు వచ్చే ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు ఆగిపోయాయి. అందుకని వెంటనే ఫోన్‌ కొనిచ్చా. అయినా సిమ్‌ పనిచేయడానికి ఒక రోజు సమయం పట్టింది. దాంతో సోషల్‌ మీడియాలో సినిమా పైన ఎలాంటి చర్చ జరుగుతుందో తెలుసుకోవడానికి చిత్రబృందంలో మిగతావారి ఫోన్లద్వారా కార్తీక్‌ చూసేవారు’ అని సంయుక్త చెప్పుకొచ్చింది.

గతవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ రూ.50కోట్లకు పైగావసూళ్లను రాబట్టింది. సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందించిన ఈ సినిమాకు అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అందించారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌లు సంయుక్తంగా నిర్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని