SreeLeela: ఓ వైపు ఎంబీబీఎస్‌... మరో వైపు సినిమా

తెలుగులో తొలి సినిమాతోనే ఆకట్టుకున్న కథానాయిక... శ్రీలీల. కె.రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన  ‘పెళ్లిసందడి’తో తెలుగు తెరకు పరిచయమైన ఈమె... వరుస అవకాశాలతో దూసుకెళుతోంది.

Updated : 22 Dec 2022 07:22 IST

తెలుగులో తొలి సినిమాతోనే ఆకట్టుకున్న కథానాయిక... శ్రీలీల (Sree Leela). కె.రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన  ‘పెళ్లిసందడి’తో తెలుగు తెరకు పరిచయమైన ఈమె... వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. శ్రీలీల తన రెండో చిత్రంలోనే రవితేజతో జట్టు కట్టింది. ‘ధమాకా’ (Dhamaka) పేరుతో రూపొందిన ఆ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శ్రీలీల బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైందో చెబుతారా?

నా తొలి తెలుగు చిత్రం ‘పెళ్లిసందడి’ విడుదల కాక ముందే వచ్చిన అవకాశం ఇది. దర్శకుడు త్రినాథరావు తన ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంలోని ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అప్పుడే రచయిత ప్రసన్నకుమార్‌ బెజవాడ కూడా పరిచయం అయ్యారు. కానీ అప్పట్లో ఆ సినిమాలో నటించలేకపోయా. ఈసారి మాత్రం కథ విన్న పది నిమిషాల్లోనే సినిమా చేయడానికి అంగీకారం తెలిపా.

అంతగా మిమ్మల్ని ఆకట్టుకున్న విషయం ఏమిటి?

హాస్యం ప్రధానంగా సాగే కథలకి నేను పెద్ద అభిమానిని. ఆద్యంతం నవ్వించే కథ, కథనాలున్న చిత్రమిది. 

సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

ప్రణవి అనే యువతిగా కనిపిస్తా. స్వామి, ఆనంద్‌ చక్రవర్తి అనే ఇద్దరితో కలిసి ప్రయాణం చేస్తుంది.  ఇద్దరినీ ఇష్టపడిన ప్రణవి ప్రయాణంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయనేదే కీలకం.  ఈ సినిమాకోసం చేసిన డాన్సుల్ని కూడా చాలా  ఆస్వాదించా. ఈ సినిమాతో పీపుల్‌ మీడియా ప్యాక్టరీతో మరింత అనుబంధం పెరిగింది. దర్శకుడు త్రినాథరావు నక్కిన సెట్లో అందించిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ప్రయాణంలో మరెన్నో మధురానుభూతులు ఉన్నాయి. స్పెయిన్‌కి  జింతాక్‌ పాట చిత్రీకరణ కోసం వెళ్లినప్పుడు నా దుస్తుల సంచి పోయింది. అప్పుడు మా దర్శకుడు, ఛాయాగ్రాహకుడు మూడు గంటలు ప్రయాణం చేసి నాకోసం షాపింగ్‌ చేశారు. నా కుటుంబ సభ్యులు నా కోసం షాపింగ్‌ చేసినట్టు అనిపించింది.

నటిగా ఇప్పటివరకు సాగిన మీ ప్రయాణం గురించి ఏం చెబుతారు?

ఎలాంటి సమస్యల్లేవు. ఎం.బి.బి.ఎస్‌ చదువుతూ సినిమాలు చేస్తున్నా. వృత్తి, చదువు రెండింటినీ బ్యాలెన్స్‌ చేయడం అలవాటైంది. దీని వెనక మా అమ్మ సహకారం చాలా ఉంది. మా అమ్మ కూడా వైద్యురాలే. ఎం.బి.బి.ఎస్‌ పూర్తయ్యాక పెళ్లి చేసుకుని, ఆ తర్వాత పదేళ్లకి పీజీ చేసింది. నేను అలా స్పెషలైజేషన్‌ ఎప్పుడు చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు.

కెరీర్‌ ఆరంభ దశలోనే అగ్ర కథానాయకుడు రవితేజతో జట్టుకట్టడంపై మీ అభిప్రాయం?

ఇదొక గొప్ప అనుభవం. రవితేజకి నేను పెద్ద అభిమానిని. ఆయన ‘కిక్‌’, ‘విక్రమార్కుడు’ సినిమాల్ని ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు.  అలాంటిది నా  రెండో సినిమానే రవితేజతో చేయాలన్నప్పుడు  మొదట కొంచెం ఒత్తిడికి గురయ్యా. సెట్లో ఆయనతో మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడేదాన్ని.   పనిచేస్తున్నకొద్దీ నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆయన తోటి నటుల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంటారు. ‘విక్రమార్కుడు’లో రెండు పాత్రలు ఎంత బాగా, ఎంత విభిన్నంగా చేశారో, ‘ధమాకా’లోని పాత్రల్ని కూడా అదే తరహాలో చేశారు.

మీకు డ్యాన్సులంటే ఇష్టమా?

మూడేళ్ల వయసు నుంచే డ్యాన్స్‌ క్లాసులకి వెళ్లడం మొదలుపెట్టా. పెరిగేకొద్దీ డ్యాన్స్‌ని, సంగీతాన్ని ఇంకా సీరియస్‌గా తీసుకున్నా. ఎనిమిదేళ్ల వయసు నుంచే మఠాలు, దేవాలయాల్లో  ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టా. నేను రంగస్థలం నుంచి వచ్చా.

ప్రస్తుతం చేస్తున్న సినిమాల కబుర్లేమిటి?

బాలకృష్ణ - అనిల్‌ రావిపూడి కలయికలో రూపొందుతున్న ఓ సినిమాలో నటిస్తున్నా. రామ్‌ - బోయపాటి శ్రీను కలయికలో సినిమా చేస్తున్నా. వైష్ణవ్‌తేజ్‌తో ఓ సినిమా, వారాహి సంస్థలో మరో చిత్రం, నితిన్‌తో ఓ చిత్రం చేస్తున్నా. నవీన్‌ పొలిశెట్టితో సినిమాతోపాటు, మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

ఇన్ని సినిమాలు చేయడం సవాల్‌గా అనిపిస్తోందా?

ఒకేసారి పలు పనులు చేయడం నాకు ఇష్టం. నన్ను నేను అలా ట్యూన్‌ చేసుకుంటూ పాత్రల్లోకి మారిపోతుంటా.

పరిశ్రమలో పోటీ గురించి మీ అభిప్రాయం?

ప్రతి నటికీ పరిశ్రమలో వాళ్లకంటూ ఓ స్థానం ఉంటుంది. అందుకే ఇక్కడ పోటీ ఉంటుందని నేననుకోను. నేను ఇతరులతో పోటీ పడుతున్నానని అనుకోవడం కంటే వాళ్ల నటన నచ్చిందంటే మెచ్చుకోవడంపైనే మొగ్గు చూపుతాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని