Published : 08 Feb 2021 08:41 IST

మళ్లీ.. మళ్లీ.. అందాలు జల్లి

సంక్రాంతి చిత్రాలు సినీ సీమలో కొత్త కాంతులు నింపాయి. ఇప్పుడీ  భరోసాతోనే ప్రేక్షకుల్ని వినోదాల వెన్నెల్లో ఓలలాడించేందుకు సినిమాలన్నీ వేసవికి వరుస కట్టాయి. ఈ వెన్నెల వెలుగుల నడుమనే మైమరపించే అందాలతో సిద్ధమైంది నాయికా లోకం. డబుల్‌ ట్రీట్‌ వినోదాలతో ప్రేక్షకులకు డబుల్‌ కిక్‌ అందించనుంది. మరి ఈ వేసవిలో వరుస చిత్రాలతో అలరించనున్న ఆ అందాల భామలు ఎవరు? వాళ్ల సినిమా విశేషాలేంటి? చూసేద్దాం పదండి.

వేసవిలో ప్రేమ పల్లవి

‘‘భానుమతి ఒక్కటే పీస్‌.. హైబ్రీడ్‌ పిల్ల’’ అంటూ ‘ఫిదా’ చిత్రంతో కుర్రాళ్ల గుండెల్లో కలల రాణిలా మారిపోయింది నటి సాయి పల్లవి. ‘పడిపడి లేచె మనసు’తో అందరినీ తన ప్రేమ మత్తులో దించేసింది. రెండేళ్లగా తెలుగులో ఆమె నుంచి మరో సినిమా ఏదీ రాలేదు. ఇప్పుడీ లోటుని వేసవిలో వడ్డీతో తిరిగి తీర్చబోతుంది ఈమలయాళీ ముద్దుగుమ్మ. ఆమె ప్రస్తుతం నాగచైతన్యకు జోడీగా ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో.. రానా సరసన ‘విరాటపర్వం’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండూ వేసవి కానుకగా ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలంగాణ నేపథ్యంగా సాగే ఓ సున్నితమైన ప్రేమకథతో శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన సినిమా ‘లవ్‌స్టోరీ’. ఏప్రిల్‌ 16న విడుదల కానుంది. ఇదే నెలలో విప్లవం నిండిన మరో వినూత్నమైన ప్రేమకథను ‘విరాటపర్వం’తో రుచి చూపించనుంది సాయి పల్లవి. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఏప్రిల్‌ 30న థియేటర్లలో సందడి చేయనుంది.


చందమామ కాంతులు

ఈ మండు వేసవిని తన వినోదాల కాంతులతో చలచల్లగా మార్చనుంది అందాల చందమామ కాజల్‌. ఆమె ఈమధ్య కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ వేసవికి ఆమె నుంచి రానున్న ‘ఆచార్య’, ‘మోసగాళ్లు’ చిత్రాల్లో అలాంటి మంచి నటనా ప్రాధాన్యమున్న పాత్రలనే పోషించిందట కాజల్‌. ఈ రెండు సినిమాలూ ఇప్పటికే విడుదల తేదీలు ఖరారు చేసుకున్నాయి. వీటిలో ముందుగా వచ్చేది ‘మోసగాళ్లు’. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నాడు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కుంభకోణం కథాంశంతో రూపొందుతోంది. దీంట్లో విష్ణుకు సోదరిగా కనిపించబోతుంది కాజల్‌. వేసవి కానుకగా మార్చి 19న విడుదల కానుందని సమాచారం. ఇక అగ్ర కథానాయకుడు చిరంజీవికి జోడీగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. ధర్మస్థలి కేంద్రంగా ఓ కామ్రేడ్‌ చేసిన పోరాట కథగా సినిమా ఉండనుంది. తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం.. మే 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


పూజా.. ప్రేమకథల చిరునామా

ఓవైపు స్టార్‌ హీరోలతో జోడీ కడుతూనే.. మరోవైపు కుర్ర హీరోలతోనూ ఆడిపాడుతూ వరుస   సినిమాలతో దూసుకెళ్తోంది నటి పూజా హెగ్డే. ఇప్పుడీ జోరునే ఆమె వేసవిలో బాక్సాఫీస్‌ ముందు ప్రదర్శించనుంది. పూజా ఇప్పటికే   ప్రభాస్‌తో కలిసి ‘రాధేశ్యామ్‌’లో, అఖిల్‌ అక్కినేనితో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ఓ విభిన్నమైన ప్రేమకథతో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ వేసవి ఆఖర్లోనే ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో ప్రేక్షకులకు మరో ట్రీట్‌ ఇవ్వనుంది పూజా. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. జూన్‌ 19న సినీప్రియుల ముందుకొస్తుంది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా.. ఓ కొత్తదనం నిండిన ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.


తెరపైకి వస్తూనే డబుల్‌ ట్రీట్‌..

వెండితెరపైకి అడుగు పెడుతూనే తెలుగు ప్రేక్షకులకు డబుల్‌ ట్రీట్‌ వినోదాలు అందించేందుకు సిద్ధమైంది నటి మీనాక్షి చౌదరి. సుశాంత్‌కు జోడీగా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంలో తెలుగు తెరపై కాలుమోపబోతున్న సంగతి తెలిసిందే. గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. కరోనా పరిస్థితులతో ఆలస్యమైంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకొని.. ఇప్పుడు వేసవి బరిలో పోటీకి నిలిచింది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది. ఆమె ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే రవితేజ సరసన ‘ఖిలాడీ’లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ చిత్రం..
మే 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది.


రీతూ అలా.. ఐశ్వర్య ఇలా

తెలుగు అందాలు ఐశ్వర్య రాజేష్‌.. రీతూ వర్మ ఈ  వేసవిలో వరుస సినిమాలతో జోరు చూపించనున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ నాని సరసన ‘టక్‌ జగదీష్‌’లో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమా.. ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఐశ్వర్య ‘రిపబ్లిక్‌’లో సాయితేజ్‌కు జోడీగా.. రీతూ ‘వరుడు కావలెను’లో నాగశౌర్య సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ‘రిపబ్లిక్‌’ జూన్‌ 4న విడుదల  కానుండగా.. ‘వరుడు కావలెను’ అదే నెలలో రానున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

అక్కడ సినిమా తీస్తే హిట్టే!

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని