Adah Sharma: ప్రేక్షకులు గెలిచారు.. ‘ది కేరళ స్టోరీ’ పై అదా శర్మ ట్వీట్‌

‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story)ని ఆదరించిన వారికి హీరోయిన్‌ అదా శర్మ కృతజ్ఞతలు చెప్పింది. త్వరలోనే ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

Published : 14 May 2023 12:11 IST

హైదరాబాద్‌: ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తోన్న సినిమా ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story).  టీజర్‌ విడుదలైనప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోన్న ఈ చిత్రం సూపర్‌ హిట్‌ సాధించి రూ.కోట్లు వసూళ్లు చేస్తోంది. ఇందులోని నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. అదా శర్మ ( Adah Sharma) ఈ సినిమాలో షాలినీ ఉన్నికృష్ణన్‌ అనే పాత్రలో కనిపించింది. సినిమా మొత్తానికి ఎంతో కీలకమైన ఈ పాత్రను ఆదరించి.. ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు ఆమె తాజాగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. 

ట్విటర్‌ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంది. ‘నా నిజాయతీని కొందరు అపహాస్యం చేశారు. మా చిత్తశుద్ధిని చులకనగా చూశారు. ‘ది కేరళ స్టోరీ’ టీజర్‌ వచ్చాక ఈ సినిమాను విడుదల చేయెద్దని బెదిరింపులు కూడా వచ్చాయి. కొన్ని రాష్ట్రాలు ఏకంగా దీనిపై నిషేధం విధించాయి. సినిమాకు వ్యతిరేకంగా ఎన్నో ప్రచారాలు చేశారు. కానీ, ప్రేక్షకులు ఈ చిత్రానికి అఖండ విజయాన్ని అందించారు. ఒక మహిళ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను ఇంతగా ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు గెలిచారు. ఇప్పుడు మేము అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపింది.

వివాదాల మధ్యే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు..
సుదీప్తోసేన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ మంచి వసూళ్లు చేస్తోంది. కేరళలో కొన్నేళ్లుగా ‘32 వేల మంది’ మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో దీన్ని రూపొందించారు. మే 5న విడుదలైన ఈ చిత్రం రూ.112 కోట్లు రాబట్టింది.  ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ట్వీట్‌ చేసింది. మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని