The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ హీరోయిన్‌కు నెట్టింట వేధింపులు.. ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్‌

‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) హీరోయిన్‌ ఆదా శర్మ వ్యక్తిగత సమాచారాన్ని ఓ వ్యక్తి లీక్‌ చేశారు. దీనిపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Published : 25 May 2023 17:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) విడుదలకు ముందే వార్తల్లో నిలిచింది. ఇక రిలీజైన తర్వాత కూడా ప్రతిరోజు ఏదో వార్త సోషల్‌ మీడియాలో వైరలవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ఆదా శర్మకు (Adah Sharma) సంబంధించిన వ్యక్తిగత వివరాలను ఒక వ్యక్తి లీక్‌ చేశారు. ఆమె పర్సనల్‌ నంబర్‌తో సహా అన్ని వివరాలను ఇన్‌ స్టాలో పోస్ట్‌ చేశాడు. దీనిపై ఆదా శర్మ ఆవేదన వ్యక్తం చేసింది. 

‘‘ఒక వ్యక్తి నా ఫోన్‌ నంబర్‌ను సోషల్‌ మీడియాలో పెట్టారు. దీంతో నాకు చాలా మంది ఫోన్‌చేసి బెదిరిస్తున్నారు. నా ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వాట్సప్‌లో పంపుతున్నారు. ఒక సాధారణ ఆడపిల్ల ఇలాంటి విషయాల్లో ఎంత బాధపడుతుందో నేను అలాంటి బాధనే అనుభవిస్తున్నాను. ఇలాంటి నీచమైన పనులు చేసి ఆనందాన్ని పొందుతున్నారంటే వాళ్లు ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. ఈ పని చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వాళ్లే అతనికి తగిన శిక్ష వేస్తారు’’ అని చెప్పిన ఆదా శర్మ ‘ది కేరళ స్టోరీ’లో ఉన్న ఓ సన్నివేశాన్ని గుర్తుచేసుకుంది. ఇక ఇటీవల ఆదాశర్మ, సుదీప్తో సేన్‌లు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో వీళ్లిద్దరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కరీంనగర్‌లో ‘హిందూ ఏక్తా యాత్ర’లో పాల్గొనాల్సి ఉండగా రోడ్డు ప్రమాదం కారణంగా రాలేకపోయారు. 

రికార్డులు సృష్టిస్తూ.. ప్రశంసలు అందుకుంటున్న సినిమా..

ఇక ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. స్టార్‌ హీరోల సినిమాలతో పోటీపడుతూ రూ. కోట్లు వసూళ్లు చేస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.200 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్రబృందం పేర్కొంది. మరోవైపు ఆదా శర్మ నటనను అగ్ర తారలు కూడా ప్రశంసిస్తున్నారు. కేరళలో కొన్నేళ్లుగా ‘32 వేల మంది’ యువతులు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అన్న ఇతివృత్తంతో ‘ది కేరళ స్టోరీ’ తెరకెక్కింది. ఈ సినిమాకు సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించగా.. అదాశర్మ, సిద్ధి ఇద్నానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని