Adah Sharma: నాకు కొత్త అవకాశాలను సృష్టించుకోవడం రాదు.. కానీ.. : అదాశర్మ

హీరోయిన్‌ అదా శర్మ (Adah Sharma) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Published : 05 Jun 2023 20:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అదా శర్మ (Adah Sharma) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). ఎన్నో వివాదాల మధ్య నెల క్రితం విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. స్టార్‌ హీరోల కలెక్షన్స్‌తో పోటీపడుతూ వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా విజయంపై అదా శర్మ ఎంతో ఆనందంగా ఉంది. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘‘నా కెరీర్‌ ప్రారంభమైన 15 ఏళ్లకు నాకు మంచి అవకాశం వచ్చింది. నాపై ఎంతో నమ్మకంతో ‘ది కేరళ స్టోరీ’లో నన్ను ఎంపిక చేశారు. ఈ చిత్రం చూసి ఎంతోమంది నన్ను అభిమానిస్తున్నారు. మొదట్లో నేను నటించిన సినిమాలు చూసి కొందరు ఇలాంటి పాత్రలు ఎందుకు చేశావంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఈ చిత్రం తర్వాత నేను ఎలాంటి పాత్రల్లోనైనా నటించగలనని అందరికీ అర్థమైంది. మహిళా ప్రాధాన్య చిత్రాలు తీసే వారు నాపై నమ్మకంగా ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ, నా మొదటి సినిమా నుంచి అభిమానులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వాళ్లకు నాపై పూర్తి నమ్మకం ఉంది. వాళ్ల హృదయాల్లో నేను ఏర్పరచుకున్న స్థానం ఎప్పటికీ ఉంటుందని విశ్వసిస్తున్నాను. మంచి పాత్ర కోసం ఎంతో ఎదురుచూశాను. ఎన్నో కలలు కన్నాను. ‘ది కేరళ స్టోరీ’తో నా కల నిజమైంది. ఈ సినిమా ఇంతటి స్థాయిలో విజయం సాధిస్తుందని అనుకోలేదు.

నా తొలి సినిమాలో ఎన్నో ఆశలతో నటించాను. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అవార్డులను కూడా సొంతం చేసుకుంది. కానీ నాకు మంచి అవకాశాలు రాలేదు. నేను ఎప్పుడూ పెద్ద అవకాశాల కోసం చూడలేదు. నాకు నచ్చింది నేను చేస్తూ వెళితే చాలనుకున్నా. నాకు కొత్త అవకాశాలు సృష్టించుకోవడం రాదు. కానీ, దర్శకులు నా దగ్గరకు వచ్చి.. నా పాత్ర ఏంటో చెబితే దానికి వంద శాతం న్యాయం చేయాలని ప్రయత్నిస్తాను. ‘కేరళ స్టోరీ’ అవకాశం వచ్చినప్పుడు కూడా అలానే అనుకున్నా’’ అని అదా శర్మ చెప్పింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని