Adah Sharma: ‘ది కేరళ స్టోరీ’ విషయంలో నా నమ్మకమే నిజమైంది : అదా శర్మ

‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) విజయంపై అదా శర్మ (Adah Sharma)  మాట్లాడింది. ఈ స్థాయిలో ప్రేక్షకాదరణ లభిస్తుందని అనుకోలేదని తెలిపింది.

Published : 16 May 2023 12:26 IST

ముంబయి: ‘ది కేరళ స్టోరీ’ వివాదాస్పద సినిమాగా విడుదలై రూ.కోట్లు వసూళ్లు చేస్తోంది. గతంలో ఈ చిత్రంపై నిషేధం విధించిన రాష్ట్రాల్లో  కొన్ని చోట్ల తాజాగా ప్రదర్శనకు అనుమతులు లభించాయి. రోజు రోజుకూ ప్రేక్షకాదరణ పెరుగుతుండడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన అదా శర్మ (Adah Sharma) తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడింది. ఊహించని స్థాయిలో విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. కోట్ల మంది ఈ చిత్రాన్ని చూశారని ఆనందం వ్యక్తం చేసింది. 

‘‘నాకు ఈ కలెక్షన్స్‌ లెక్కల గురించి తెలియదు. కానీ, ఒక నటిగా ఈ సినిమా నటించినంతసేపు ప్రజలు చూడాలన్న ఆశతోనే చేశాను.  ప్రేక్షకులకు ఇందులోని భావోద్వేగ సన్నివేశాలు కచ్చితంగా హత్తుకుంటాయని నమ్మకంగా ఉన్నాను. నా నమ్మకమే నిజమైంది ఈ సినిమాలోని తల్లీ కూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్‌కు అందరూ కనెక్ట్‌ అయ్యారు. స్క్రిప్ట్‌ వినగానే నాకు తెలియకుండానే కన్నీరు వచ్చేసింది. అందుకే వెంటనే ఓకే చేశాను. కానీ, ఈ స్థాయిలో విజయాన్ని అయితే నేను ఊహించలేదు’’ అని అదా శర్మ ఆనందం వ్యక్తం చేసింది.

ఇక ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసే విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘‘మేము ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమా చిత్రీకరణ సమయంలో దీన్ని విదేశాల్లో రిలీజ్‌ చేయాలని అనుకోలేదు. కానీ, మే 5న ఇక్కడ విడుదలయ్యాక ఎన్నో దేశాల పంపిణీదారులు మాకు ఫోన్‌ చేశారు. డెన్మార్క్‌, స్వీడన్‌, ఐర్లాండ్‌.. ఇలా చాలా దేశాల వాళ్లు ఫోన్‌ చేయడంతో ఈ సినిమాను గ్లోబల్‌ స్థాయిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాంగంగానే 37 దేశాల్లో రిలీజ్‌కు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లు సినిమా చూశాక అభిప్రాయాన్ని తప్పకుండా మార్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక మే5న విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ వసూళ్ల విషయంలో అగ్ర హీరోల సినిమాలతో పోటీ పడుతోంది. ఈ వారంతంలోపు రూ.150 కోట్లు కలెక్షన్స్‌ వస్తాయని సినీ పండితులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని