Manchu Lakshmi: ఇది మన నేల గొప్పతనమే!

‘శక్తిమంతమైన సోషియో ఫాంటసీ కథల్ని తీసి ప్రేక్షకులకు చూపిస్తున్నామంటే అది మన నేల గొప్పతనమే’ అన్నారు నటి మంచు లక్ష్మి.ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘ఆదిపర్వం’.

Published : 10 Jul 2024 01:08 IST

‘ఆదిపర్వం’ వేడుకలో మంచు లక్ష్మి 

క్తిమంతమైన సోషియో ఫాంటసీ కథల్ని తీసి ప్రేక్షకులకు చూపిస్తున్నామంటే అది మన నేల గొప్పతనమే’ అన్నారు నటి మంచు లక్ష్మి.ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘ఆదిపర్వం’. శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్‌ నోరోన్హా కీలక పాత్రలు పోషించారు. సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహించారు. ఎమ్‌.ఎస్‌.కె నిర్మాత. తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళంలో రూపొందిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల హైదరాబాద్‌లో పాటల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ‘‘దేవతగా నటించాలన్నా... దెయ్యం పాత్ర అయినా ఈమధ్య నన్నే సంప్రదిస్తున్నారు. ‘యక్షిణి’ అనే వెబ్‌ సిరీస్‌ చేశాను. చాలా మంచి స్పందన వచ్చింది. ఆ వెంటనే ‘ఆదిపర్వం’ చేశా. ఓ మంచి సోషియో ఫాంటసీ చిత్రమిది. మా బృందమంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేసింది. నేను గతేడాది మొత్తం యాక్షన్‌ సన్నివేశాల్లో నటిస్తూనే ఉన్నా. అంతగా నాతో యాక్షన్‌ చేయించారు. మా దర్శకుడు ఓ భగీరథ ప్రయత్నమే చేశాడు. ఇంత భారీ చిత్రాన్ని సీజీతో సహా పూర్తి చేసి వేగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం అభినందనీయం’’ అన్నారు. దర్శకుడు సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ ‘‘నాగులాపురం నాగమ్మ పాత్రలో అలరిస్తారు మంచు లక్ష్మి. ఆమె ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాక సినిమా స్వరూపమే మారిపోయింది. ఇంటిల్లిపాదికీ నచ్చే చిత్రమిది’’ అన్నారు. శివ కంఠంనేని మాట్లాడుతూ ‘‘నేను క్షేత్రపాలకుడి పాత్రలో నటించా. నా మేకప్‌ కోసమే మూడు గంటల సమయం పట్టేసింది. నేను చేశానని చెబితే తప్ప గుర్తు పట్టలేని విధంగా ఉంటుందా పాత్ర. ఓ మంచి ప్రయత్నంగా ఈ సినిమా నిలిచిపోతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత సాగర్‌ నారాయణ్,  సంగీత దర్శకులు దొంతం ప్రవీణ్, మాధవ్‌ సైబా, గూడ రామకృష్ణ, బీఎన్‌ శర్మ, వెంకట్‌ కిరణ్, జెమినీ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని