Adipurush: ‘ఆదిపురుష్‌’.. ప్రేక్షకుల సూచన మేరకు మెరుగులద్దాం: నిర్మాత

‘ఆదిపురుష్‌’ (Adipurush) గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిత్ర దర్శక నిర్మాతలు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ టీమ్‌ ఇప్పుడు మరింత మెరుగ్గా పనిచేసినట్లు చెప్పారు.

Published : 24 Apr 2023 01:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) విషయంలో ఇప్పుడు తాము ఎంతో ఆనందంగా ఉన్నట్లు నిర్మాత భూషణ్‌ కుమార్‌ తెలిపారు. ప్రేక్షకుల సూచన మేరకు తమ చిత్రానికి అవసరమైన మెరుగులద్దామని చెప్పిన ఆయన సినిమా విషయంలో ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. ‘‘ఆదిపురుష్‌’ కోసం మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాం. నిరాశకు గురయ్యాం. విమర్శల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ప్రేక్షకుల సూచన మేరకు కొన్ని మెరుగులద్దాం. రిజల్ట్‌ విషయంలో ఇప్పుడు ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ అత్యద్భుతంగా ఉంది’’ అని ఆయన వెల్లడించారు.

‘ఆదిపురుష్‌’ (Adipurush) రిలీజ్‌పై దర్శకుడు ఓంరౌత్‌ (Om Raut) మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది ఆరంభంలోనే దీనిని రిలీజ్‌ చేద్దామనుకున్నాం. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల జూన్‌కు వాయిదా వేశాం. అలా, మాకు ఆరేడు నెలల కాలం కలిసి వచ్చింది. అది మాకు ఎంతో ముఖ్యమైన సమయం. విజువల్‌ ఎఫెక్ట్స్ స్టూడియో వాళ్లు మరింత మెరుగ్గా పనిచేయడానికి అది దోహదపడింది. సవాళ్లు మాకు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. అవి మా ప్రయాణాన్ని మరింత దృఢంగా మార్చాయి. భారత్‌లో ఇలాంటి సినిమా మునుపెన్నడూ రాలేదు. మార్వెల్‌, అవతార్‌, డీసీ వంటి భారీ హాలీవుడ్‌ చిత్రాల్లో ఉపయోగించే టెక్నాలజీని ఇందులో వాడాం’’ అని అన్నారు.

రామాయణ కావ్యాన్ని ఆధారంగా చేసుకుని ‘ఆదిపురుష్‌’ సిద్ధమవుతోంది. ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా కనిపించనున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడి పాత్రలో నటించారు. విజువల్‌ వండర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని గతేడాదిలోనే విడుదల చేయాలని చిత్రబృందం మొదట ప్లాన్‌ చేసినప్పటికీ.. ‘లాల్‌సింగ్‌ చడ్డా’ రిలీజ్‌ని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసింది. అనంతరం ఈ ఏడాది జనవరిలో రిలీజ్‌ చేయాలనుకున్నారు. కాకపోతే ఫైనల్‌గా జూన్‌ 16ను రిలీజ్‌ డేట్‌గా ఫిక్స్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని