Aditi Rao Hydari: సిద్ధార్థ్‌తో డేటింగ్‌ రూమర్స్‌పై అదితి స్పందన.. నాకు నిజంగా సంతోషమే!

Aditi Rao Hydari: ఇండస్ట్రీలో తనపై వస్తున్న రూమర్స్‌పై కథానాయిక అదితీరావు హైదరీ తనదైన శైలిలో స్పందించింది.

Published : 06 Mar 2023 01:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ ప్రపంచంలో రూమర్స్‌కు కొదవలేదు. ఏ హీరో, హీరోయిన్‌ కలిసి కనిపించినా ఇద్దరి మధ్యా ఉన్న బంధం ఏంటి? అంటూ మొదలు పెట్టి, వారి పుట్టు పూర్వోత్తరాల వరకూ వెళ్తారు. కథానాయిక అదితీరావు హైదరీ (Aditi Rao Hydari) నటుడు సిద్ధార్థ్‌ (Siddharth)తో డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరికి ఆహ్వానం అందిన ఏ కార్యక్రమానికైనా జంటగా కలిసి వెళ్లడం, కుటుంబంలో జరిగే ఫంక్షన్స్‌లో కలిసి కనిపించడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. వీటిపై అటు అదితి కానీ, ఇటు సిద్ధార్థ్‌ కానీ స్పందించలేదు. తాజాగా ‘తుమ్‌ తుమ్‌’ పాటకు ఇద్దరూ కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియో కూడా వైరల్‌ అయింది.

ఈ క్రమంలో అదితీరావు హైదరీ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూమర్స్‌పై తనదైన శైలిలో స్పందించింది. ‘‘నేను ఇండస్ట్రీలో పనిచేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ విషయాలను పట్టించుకోవడం లేదు. జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లను మనం ఆపలేం. వాళ్లకు ఏది ఆసక్తో దాని కోసం వెతుకుతూ ఉంటారు. నాకు ఏది ఇష్టమో దాని కోసం నేను వెతుకుంటాం. నా వరకూ నాకు ఓకే. అయితే, ఎప్పటివరకూ అయితే నేను అద్భుతంగా పనిచేయగలనో, ఏ దర్శకులతో పనిచేయడాన్ని ప్రేమిస్తానో, ఎంతకాలం నన్ను ప్రేక్షకులు ఆదరిస్తూ నా సినిమాలు చూస్తారో అప్పటివరకూ నేను చాలా సంతోషంగా ఉంటా’’ అని చెప్పుకొచ్చింది. అదితి చెప్పిన మాటలు వింటే, ఇతర ఏ విషయాలనూ తాను పట్టించుకోన్నట్లే ఉన్నాయి.

అజయ్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మహాసముద్రం’ చిత్రంలో సిద్ధార్థ్‌-అదితి కలిసి నటించారు. ఈ సినిమాతోనే ఇద్దరి మధ్య స్నేహం చిగురించి, ప్రేమగా మారిందని టాక్‌. అయితే, ఇప్పటివరకూ ఈ విషయమై ఇరువురు స్పందించలేదు. ఇద్దరూ కలిసున్న ఫొటోలను అప్పుడప్పుడూ షేర్‌ చేస్తూ ఉంటారు. అదితి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసున్న ఫొటోను సిద్ధార్థ్‌ షేర్‌ చేస్తూ ‘హ్యాపీబర్త్‌డే పిన్సెన్స్‌ ఆఫ్‌ హార్ట్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇక ఇరువురు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అదితి తాజాగా ‘తాజ్‌: డివైడెడ్‌ బై బ్లడ్‌’ వెబ్‌సిరీస్‌లో నటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు