‘Hit 2’ Review: అడివి శేష్ ‘హిట్ 2’ రివ్యూ!
Adivi Sesh Hit 2 Movie Review: అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నాని నిర్మించిన ‘హిట్ 2’ సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: అడివి శేష్ (Adivi Sesh), మీనాక్షి చౌదరి (Meenakshii Chaudhary), సుహాస్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు; సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫీ: మణి కందన్.ఎస్, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి; నేపథ్య సంగీతం: జాన్ స్టీవర్ట్ ఏడూరి; ప్రొడక్షన్ డిజైన్: మనీషా ఎ.దత్; కూర్పు: గ్యారీ బి.హెచ్; సమర్పణ: నాని (Nani); నిర్మాణం: ప్రశాంతి త్రిపిర్‌నేని; రచన, దర్శకత్వం: డా.శైలేష్ కొలను (Sailesh Kolanu); సంస్థ: వాల్ పోస్టర్ సినిమా; విడుదల: 2 డిసెంబర్ 2022 (Hit 2 Review)
తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు అరుదు. హాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ వాటి పరిధి ఎక్కువ. సిరీస్‌గా వచ్చిన గోల్ మాల్, హౌస్‌ఫుల్ తదితర ఫ్రాంచైజీ సినిమాలు హిందీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. `ఎఫ్2`తో తెలుగులోనూ ఆ సినిమాలు పరిచయం అయ్యాయి. `హిట్` చిత్రాలతో ఆ పరంపర కొనసాగుతోంది. పరిశోధనాత్మక కథలతో వరుసగా ఓ యూనివర్స్‌ని సృష్టించే దిశగా `హిట్` సినిమాలొస్తున్నాయి. తొలి కేస్‌తో కూడిన సినిమాలో విష్వక్‌సేన్ నటించగా, రెండో కేస్‌తో అడివి శేష్ రంగంలోకి దిగారు. ఈ సినిమాలోనే మూడో కేస్‌కి కూడా బీజం వేశారు. ఇంతకీ ఈ రెండో కేస్ ఎలా సాగిందో (Hit 2 Review), దాని పూర్వాపరాలేమిటో తెలుసుకుందాం పదండి...
కథేమిటంటే?
కృష్ణదేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్ ) ఓ యువ ఐపీఎస్ అధికారి. విశాఖపట్నం ఎస్పీగా విధుల్లో చేరతాడు. క్రిమినల్స్‌వి కోడి బుర్రలనీ, వాళ్లని పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదని తేలిగ్గా తీసిపారేస్తుంటాడు. ఆర్య (మీనాక్షి చౌదరి)ని ప్రేమించిన కేడీ ఆమెతో కలిసి జీవితాన్ని ఆరంభిస్తాడు. ఇంతలో విశాఖలోని ఓ పబ్‌లో ఓ అమ్మాయి దారుణ హత్యకి గురవుతుంది. చేతులు, కాళ్లూ, మొండెం అన్నీ వేరు చేసి.. దారుణ స్థితిలో ఉన్న ఆ అమ్మాయి మృతదేహాన్ని చూసిన కేడీకి.. పరిశోధనలో మరో విస్తుపోయే నిజం తెలుస్తుంది. ఆ కాళ్లూ చేతులు, మొండెం ఒకరివి కాదని.. మొత్తం నలుగురు అమ్మాయిలు హత్యకి గురయ్యారనేది ఆ నిజం. అమ్మాయి మెడపై ఉన్న పంటిగాటు తప్ప మరే ఆధారం లేకుండా హత్యలు చేస్తున్న ఆ కిల్లర్ ఎవరు? అమ్మాయిల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? కోడి బుర్రలని తేలిగ్గా తీసిపారేసిన కేడీకి కిల్లర్ ఎలాంటి సవాళ్లు విసిరాడనేది తెరపై చూడాల్సిందే. (Hit 2 Review)
ఎలా ఉందంటే?
నేరాల పరిశోధన కోసం పనిచేసే హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్)... అందులో కేస్‌లు, చిక్కుముడుల చుట్టూ ఈ హిట్ సినిమాల ప్రపంచం తిరుగుతోంది. `హిట్` సినిమాలో తొలి కేస్ పరిశోధన కనిపిస్తుంది. అందులో విక్రమ్ రుద్రరాజు (విష్వక్‌సేన్) ఆఫీసర్ కాగా, రెండో కేస్‌కి కృష్ణదేవ్ (అడవి శేష్) ఆఫీసర్. ఈసారి కథంతా విశాఖపట్నం నేపథ్యంలో సాగుతుంది. క్రిమినల్స్‌ని చాలా సులభంగా తీసుకుంటూ ఆడుతూ పాడుతూ పనిచేసుకుపోయే కేడీ పాత్రతో అడవి శేష్ పరిచయం అవుతాడు. అతడి కాన్ఫిడెన్స్‌కి తగ్గట్టుగానే ఓ హత్య కేస్‌ని చిటికెలో క్లోజ్ చేస్తాడు. పబ్‌లో జరిగిన అమ్మాయి హత్యతోనే అసలు సినిమా మొదలవుతుంది. అక్కడ ఒక అమ్మాయి కాదు, నలుగురమ్మాయిలు హత్యకి గురయ్యారని తెలిశాక.. అది మరింత లోతుగా ఉందనే విషయం అర్థమవుతుంది. హత్య చుట్టూ తిరిగే సగటు పరిశోధనాత్మక కథలకి తగ్గట్టే రకరకాల వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం అవడం, పక్కాగా నిందితుడు ఇతడే అనేలా అవి ముందుకు సాగడం, అంతలోనే ఊహించని మలుపు చోటు చేసుకుని అసలు నిందితుడు మరొకరు ఉన్నారని తేలడం... ఇలానే ఉంటుందీ చిత్రం కూడా.
విరామ సన్నివేశాల్లో ఎవ్వరూ ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. ద్వితీయార్ధంలో పరిశోధన మళ్లీ కొత్తగా మొదలైనట్టవుతుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా చూసుకుంటూనే... పట్టు కో చూద్దాం అన్నట్టుగా కిల్లర్ విసిరే సవాళ్లు, మరోపక్క డిపార్ట్‌మెంట్ నుంచి పెరిగే ఒత్తిళ్ల మధ్య ఓ ఆఫీసర్ పరిశోధన ఎలా సాగిందనేది కీలకం. పంటి గాటు, దాని చుట్టూ అల్లిన సన్నివేశాలు ద్వితీయార్ధంలో కీలకం. దాని ఆధారంగానే కేస్ చిక్కుముడిని విప్పే తీరు ఆకట్టుకుంటుంది. పరిశోధనాత్మక కథల్లో హీరో చుట్టూనే ఆధారాలు ఉంటాయి, కానీ వాటిని పసిగట్టడమే కీలకం. ఈ సినిమా కూడా ఆ సూత్రానికి తగ్గట్టుగానే సాగుతుంది. మూడో కేస్ పరిశోధించడానికి వచ్చే ఆఫీసర్ అర్జున్ సర్కార్‌ని ఇందులో పరిచయం చేయడం కొసమెరుపు. `హిట్` ప్రపంచం ఎప్పటికప్పుడు మరింత పెద్దదవుతుందని చెప్పడానికి ఆ ఆఫీసర్ పాత్రలో కనిపించే కథానాయకుడే తార్కాణం.
ఎవరెలా చేశారంటే?
కేడీ పాత్రలో అడివి శేష్ ఒదిగిపోయాడు. యువ ఐపీఎస్ అధికారికి తగ్గట్టే అతడు తెరపై కనిపించాడు. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ, అక్కడక్కడా భావోద్వేగాలకి ప్రాధాన్యమున్న సన్నివేశాల్లోనూ అతడి పనితీరు మెప్పిస్తుంది. గర్ల్‌ఫ్రెండ్ ఆర్య పాత్రలో మీనాక్షి చౌదరి కనిపిస్తుంది. ఆమె అందంతో ఆకట్టుకుంటుంది. తోటి అధికారుల పాత్రల్లో కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి తదితరుల పాత్రలు సినిమాకి కీలకం. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి తదితరులు చిన్న పాత్రల్లోనే కనిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. దర్శకుడు శైలేష్ కొలను రెండు సినిమాల అనుభవం ఈ సినిమాకి మరింతగా ఉపయోగపడింది. కథని మరింత బిగితో నడిపించాడు. సైకో పాత్రనీ, అతడు ఎందుకలా మారాడనే అంశాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దడంలోనే కొంచెం అలసత్వం ప్రదర్శించినట్టు అనిపిస్తుంది తప్ప, మిగతా కథని చాలా బాగా తీశాడు. నిర్మాణం బాగుంది. కెమెరా, సంగీతం, ఎడిటింగ్ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. (Hit 2 Review)
బలాలు: 👍ఆసక్తి రేకెత్తించే పరిశోధన, 👍 కేడీ పాత్ర, అడవి శేష్ నటన 👍 సంగీతం
బలహీనతలు: 👎 తెలిసిన కథ, 👎 కిల్లర్ నేపథ్యం
చివరిగా: రెండో కేస్ కూడా `హిట్` (Hit 2 Review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇదీ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
India News
Shocking: షాకింగ్.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి!
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
-
Movies News
Vishwak Sen: ఇండస్ట్రీలో నన్నెవరూ తొక్కేయాలనుకోలేదు.. విశ్వక్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
General News
SSC: కానిస్టేబుల్(జీడీ) అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. పోస్టుల సంఖ్య 50,187కి పెంపు