Ahimsa: కోవెల శిథిలం అయినా దేవత కలుషితమవదే

తేజ - ఆర్పీ పట్నాయక్‌... పోస్టర్‌పై ఈ కలయిక కనిపిస్తే చాలు... సినిమా విజయం ఖాయమైనట్టే భావించేవాళ్లు ప్రేక్షకులు. గుర్తుండిపోయే పాటలు, విజయవంతమైన చిత్రాలకి కేరాఫ్‌ ఈ కలయిక. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆ ఇద్దరూ జట్టు కట్టారు. దగ్గుబాటి అభిరామ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ‘అహింస’ చిత్రం కోసం. గీతిక కథానాయిక.

Updated : 30 Sep 2022 09:29 IST

తేజ - ఆర్పీ పట్నాయక్‌... పోస్టర్‌పై ఈ కలయిక కనిపిస్తే చాలు... సినిమా విజయం ఖాయమైనట్టే భావించేవాళ్లు ప్రేక్షకులు. గుర్తుండిపోయే పాటలు, విజయవంతమైన చిత్రాలకి కేరాఫ్‌ ఈ కలయిక. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆ ఇద్దరూ జట్టు కట్టారు. దగ్గుబాటి అభిరామ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ‘అహింస’ చిత్రం కోసం. గీతిక కథానాయిక. తేజ - ఆర్పీలకి ఈసారి సీనియర్‌ రచయిత చంద్రబోస్‌ తోడయ్యారు. దాంతో ఈ పాటలపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.  ఆ అంచనాలకి తగ్గట్టే ఇటీవల విడుదలైన తొలి గీతం ‘నువ్వే.. నువ్వే’ శ్రోతల్ని అలరిస్తోంది. ఈ పాట ప్రయాణం గురించి చంద్రబోస్‌ ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు. ఆ విషయాలివీ...  

‘‘దర్శకుడు తేజతోనూ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌తోనే ఎంత పనిచేసినా ఇంకా చేయాలనిపిస్తుంది. అలాంటి వాతావరణాన్ని వాళ్లు సృష్టిస్తుంటారు. ఇదివరకు  తేజ దర్శకత్వం వహించిన పలు సినిమాలకి పాటలు రాశా. ఆర్పీ సంగీతంలోనూ రాశా. కానీ ఆ ఇద్దరితో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ఈ కలయికకి తోడు, మంచి బాణీ, మంచి సందర్భాలున్న కథ కావడంతో నాలో ప్రత్యేకమైన ఉత్సాహం ఉత్సుకత ఏర్పడింది. వాళ్లు ఒక సందర్భం, సన్నివేశం, ఇతర మౌళికమైన అంశాల్ని చెప్పి వదిలేస్తారు. అది ఏరకంగా ఇస్తామనేది మన ఇష్టమే. అలాంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు మరింత బాధ్యతగా పనిచేస్తాం. ఇద్దరి మధ్య ప్రేమ ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని పల్లవిలో చెబుతూ... చరణంలోకి వెళ్లా. ప్రేయసీప్రియులు చెలిమి చేసిన తొలినాళ్లల్లో ఒక క్షణానికీ, ఒక అడుగుకీ ఎంత విలువ ఉంటుందో చెబుతూ  
‘నీ జతగా అడుగే పడగా
ఆ క్షణమే కళ్యాణమే
నీ చెలిమే ముడులే పడగా
ఆ చనువే మాంగల్యమే’
అని రాశా.
స్నేహం సాప్తపదీనం అంటారు. పరిచయం లేని వ్యక్తితో ఏడడుగులు కలిసి నడిస్తే స్నేహం పుడుతుందట. ఇక అప్పటికే బంధంలో ఉన్న ఆ ఇద్దరూ ఒక అడుగు వేసినా అది కల్యాణంతో సమానమే అని... ముడుల్లాగా పెనవేసుకున్న చెలిమి, దాంతో ఇద్దరి మధ్య ఏర్పడిన చనువు మంగళసూత్రంతో సమానమని చెప్పే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది. అంత మంచి భావం ఇందులో ఉంది. నిండు నూరేళ్లు కలిసి ఉంటాననే వాగ్ధానమే మంగళసూత్రం వెనక ఉంటుంది. మునివేళ్లతో నేను స్పృశిస్తుంటే ఆ స్పర్శే నేనెప్పుడూ విడిపోననే వాగ్ధానం, వేద మంత్రంతో సమానమంటూ ‘నును లేతగ మునివేళ్ళు మెడ ఒంపున చేసేను... ఎన్నడు విడిపోనని వాగ్ధానమే...’ అని రాశా.
కథలో ఆ సందర్భానికి తగ్గట్టుగా ‘నీ మనసే విరిసే కమలం.. నా మనసే బిగిసే కవచం... ఏ సమయం నిను వీడదే...’ అంటూ రాశా.

ఈ మొత్తం పాటకి ప్రాణం ‘కోవెల శిథిలం అయినా దేవత కలుషితమవదే... నమ్మవే నను నమ్మవే మా అమ్మవే’ అనే వాక్యం. ఇది బాణీలో రావడం, రాయడం అన్నది చాలా అందాన్నిచ్చింది. కోవెల కూలిపోయినా అందులో దేవత మహిమకి, పవిత్రతకీ భంగం కలగదు అని  ఇక్కడ చెబుతున్నాం. సినిమాలో వచ్చే ఆ సందర్భానికి తగ్గ వాక్యం అది.  హీరో చెప్పే ఆ వాక్యంతో కథానాయికకి సాంత్వన చేకూరుతుంది. ఈ పాట విడుదలైన మరుక్షణమే కీరవాణి గారి నుంచి సందేశం వచ్చింది. ‘ట్యూన్‌ శిథిలం కాలేదు, మాటలు కలుషితం అవ్వలేదు’ ఈ పాటలో అన్నారాయన. భాస్కరభట్ల, జె.కె.భారవి, మధుర శ్రీధర్‌, మిట్టపల్లి సురేందర్‌... ఇలా చాలామంది ఫోన్‌ చేసి అభినందించారు. మంచి సాహిత్యం, విలువైన కవిత్వం రాస్తే ఎప్పటికీ ఆదరణ ఉంటుందనే పాత విషయాన్నే ఈ పాటతో కొత్తగా తెలుసుకున్నా. సిద్‌ శ్రీరామ్‌ గొంతులో మాధుర్యంతోపాటు, ఆత్మీయత ఉంటుంది. అది హృదయాల్ని కదిలిస్తుంది. ఇక తనలోనే సంగీతం నింపుకున్న తెలుగు భాష అయినప్పుడు, ఆర్ధ్రతతో కూడిన పదాలు పడినప్పుడు ఆ భావానికి ఆ గాత్రంతో మరింత వన్నె వస్తుంది. నేను రాసిన నీలి నీలి ఆకాశం, ఒకే ఒక లోకం, శ్రీవల్లి, కుంకుమలా నువ్వే, ఇప్పుడు నీతోనే... పాటల్ని సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఈ పాటని సత్యయామిని కూడా చాలా బాగా పాడారు. పూర్తిస్థాయిలో ప్రేమతోపాటు, ఆవేదన కూడా ఆ గొంతులో పలకాలి. అలాగే పలికించారు సత్యయామిని. మధ్య ప్రదేశ్‌లోని ఓ అడవి మధ్యలో కూర్చుని దర్శకుడు, ఛాయాగ్రాహకుడు ఒక పక్క లొకేషన్ల వేట కొనసాగిస్తుంటే, మరోపక్క నేను మూడు పాటలు రాశా. అందులో ఈ పాట ఒకటి’’.

చిత్రం: అహింస
రచన: చంద్రబోస్‌
సంగీతం: ఆర్పీ పట్నాయక్‌
గానం: సిధ్‌శ్రీరామ్‌, సత్యయామిని

పల్లవి: కలలో అయినా
కలయికలో అయినా
కలిసుండని కాలాలైనా...
నీతోనే నీతోనే నీతోనే నేనెపుడూ
నాతోనే నాతోనే నువ్వెపుడూ...
ఎదుటే వున్నా
ఎదలోనే వున్నా
ఏ దూర తీరానున్నా...
నీతోనే నీతోనే నీతోనే నేనెపుడూ
నాతోనే నాతోనే నువ్వెపుడూ...

చరణం: 1

నీ జతగా అడుగే పడగా
ఆ క్షణమే కళ్యాణమే
నీ చెలిమే ముడులే పడగా
ఆ చనువే మాంగల్యమే
నును లేతగ మునివేళ్ళు
మెడ ఒంపున చేసేను
ఎన్నడు విడిపోనని వాగ్ధానమే...
నీతోనే నీతోనే నీతోనే నేనెపుడూ
నాతోనే నాతోనే నువ్వెపుడూ

చరణం: 2

నీ మనసే విరిసే కమలం
ఏ మలినం నిన్నంటదే
నా మనసే బిగిసే కవచం
ఏ సమయం నిను వీడదే
కోవెల శిథిలం అయినా
దేవత కలుషితమవదే
నమ్మవే నను నమ్మవే మా అమ్మవే

।।నీతోనే నీతోనే।।


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని