Ahimsa movie review: రివ్యూ: అహింస.. దగ్గుబాటి అభిరామ్‌ ఫస్ట్‌ మూవీ ఎలా ఉందంటే?

AHIMSA Movie Review.. అభిరామ్‌ హీరోగా తేజ తెరకెక్కించిన ‘అహింస’ ఎలా ఉందంటే..?

Updated : 02 Jun 2023 15:22 IST

Ahimsa movie review: చిత్రం: అహింస; నటీనటులు: అభిరామ్‌ దగ్గుబాటి, గీతికా తివారీ, సదా, రజత్ బేడి, కమల్‌ కామరాజు, దేవి ప్రసాద్‌, తదితరులు; సంగీతం: ఆర్పీ పట్నాయక్‌; నేపథ్య సంగీతం: అనూప్‌ రూబెన్స్‌; మాటలు: అనిల్‌; సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి; ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు; నిర్మాణ సంస్థ: ఆనందీ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌; నిర్మాత: కిరణ్‌; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ; విడుదల తేదీ: 02-06-2023

కొత్తతరం నటులను పరిచయం చేయడంలోనూ, గాఢతతో కూడిన ప్రేమకథలను తెరకెక్కించడంలోనూ సిద్ధహస్తులు దర్శకులు తేజ. ఈసారి ఆయన దగ్గుబాటి కుటుంబానికి చెందిన అభిరామ్‌ను పరిచయం చేయడం.. రొమాంటిక్‌ ప్రేమకథను ఎంచుకోవడం ‘అహింస’పై ఆసక్తిని పెంచింది. మరి, ఈ సినిమా ఎలా ఉంది..? అభిరామ్‌ తన నటనతో ఆకట్టుకున్నాడా?(AHIMSA Movie Review)

కథేంటంటే: రఘు (అభిరామ్‌ దగ్గుబాటి), అహల్య (గీతికా తివారీ) బావామరదళ్లు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరుగుతుంది. అదే రోజు అహల్యపై అత్యాచారం చోటు చేసుకుంటుంది. ధనలక్ష్మి దుష్యంతరావు (రజత్‌ బేడి) తనయులు ఈ అఘాయిత్యానికి పాల్పడతారు. అంగబలం, అర్థబలం ఉన్న దుష్యంతరావుపై చట్టరీత్యా పోరాటానికి దిగుతాడు రఘు. అతడికి న్యాయవాది లక్ష్మి (సదా) అండగా నిలుస్తుంది. మరి ఈ పోరాటంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి. చివరికి గెలుపు ఎవరిది? అహింసావాదాన్ని నమ్మే రఘు ఈ పోరాటంలో తాను నమ్ముకున్న విలువలను పక్కనపెట్టేడా? లేదా? (AHIMSA Movie Review)

ఎలా ఉందంటే: ఒక బలవంతుడిపై బలహీనుడు చేసే పోరాటమే ఈ కథ. కథానాయకుడు, ప్రతినాయకుడు పాత్రల తీరుతెన్నులు చూస్తే దీన్ని ‘జయం -2’ అని చెప్పొచ్చు. అహింసావాదాన్ని నమ్ముకున్న కథానాయకుడు తన పరివారాన్ని కాపాడే విషయంలో కృష్ణతత్వం వైపు మళ్లే సంఘటనలు ఈ సినిమాలో కీలకం. పేరుకే అహింస కానీ సినిమా చాలావరకూ ఛేజింగ్‌లు, యాక్షన్‌ సీక్వెన్స్‌లతో హింసాత్మకంగా కనిపిస్తుంది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకునే సన్నివేశాలు, పతాక సన్నివేశాలు, ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు మాత్రం బాగున్నాయి. అయితే, కథానాయకుడి పాత్ర ప్రయాణం, ఇతర పాత్రల భావోద్వేగాలతో ప్రేక్షకుడు అంతగా కనెక్ట్‌ కాడు. ప్రథమార్ధంలో హీరోహీరోయిన్స్ మధ్య బంధాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. ఆ తర్వాత కథలోని మలుపులు, సంఘర్షణలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఎక్కడా కలగదు. సదా పాత్ర పరిచయం ఆకట్టుకున్నా.. తర్వాత డ్రామాను కొత్తగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. కథానాయకుడు.. నాయికను తీసుకువెళ్లడం, అడవుల్లో సాగే పోరాట ఘట్టాలు మెప్పిస్తాయి. కృష్ణతత్వానికి సంబంధించిన కొన్ని సంభాషణలు కూడా ఆకట్టుకుంటాయి. (AHIMSA Movie Review)

ఎవరెలా చేశారంటే: అభిరామ్‌ తొలి సినిమా నటుడిలాగే కనిపిస్తాడు. అక్కడక్కడా తన నటనలో పరిణతి లోపించింది. పాత్రకు తగ్గట్టుగా చాలా సన్నివేశాల్లో పర్వాలేదనిపించాడు. గీతికా తివారీ అందం, నటన బాగుంది. రజత్‌ బేడి, కమల్‌ కామరాజు తదితరుల నటన మరీ అతిగా అనిపిస్తుంది. సదా లాయర్‌ లక్ష్మిగా తనదైన ప్రభావం చూపించింది. మిగతా పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. సాంకేతికంగా సినిమా బాగుంది. కెమెరా, సంగీతం విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. ఎడిటింగ్‌ పరంగా చాలా లోపాలు కనిపిస్తాయి. రొమాంటిక్‌ ప్రేమకథలను తెరకెక్కించడంలో దర్శకుడు తేజకి ఒక ప్రత్యేకత ఉంది. అది ప్రతి సినిమాలోనూ ఒకేలా కనిపించడమే మైనస్‌గా మారింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆయన తెరకెక్కించిన పాత సినిమాల్లోని సన్నివేశాలు గుర్తుకువస్తుంటాయి. మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దాన్ని ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో ఆయన విఫలమయ్యారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. (AHIMSA Movie Review)

  • బలాలు
  • + హీరో, హీరోయిన్స్‌ పాత్రలు
  • + కథ
  • బలహీనతలు
  • - కథనం
  • భావోద్వేగాలు పండకపోవడం
  • చివరిగా: అడవిబాట పట్టిన అహింస..!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని