Ammu review: రివ్యూ: అమ్ము.. ఐశ్వర్య లక్ష్మి, నవీన్‌ చంద్రల సినిమా ఎలా ఉందంటే?

Ammu review: గృహహింస నేపథ్యంలో చారుకేష్‌ తెరకెక్కించిన, ఐశ్వర్య లక్ష్మి, నవీచంద్రల సినిమా ఎలా ఉందంటే?

Updated : 20 Oct 2022 17:29 IST

చిత్రం: అమ్ము; నటీనటులు: ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర, బాబీ సింహా, రఘు బాబు, సత్య, మాల పార్వతి, ప్రేమ్ సాగర్; సంగీతం: భరత్‌ శంకర్‌, ఎడిటింగ్‌: రాధా శ్రీధర్‌, సినిమాటోగ్రఫీ: అపూర్వ శాలిగ్రామ్‌; నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, కల్యాణ సుబ్రమణియన్, కార్తీక్ సుబ్బరాజ్; రచన- దర్శకత్వం: చారుకేష్ శేఖర్, విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

source: ట్విటర్‌

ప్రస్తుతం థియేటర్‌తో పాటు ఓటీటీకీ సమ ప్రాధాన్యం ఉంది. అయితే, మంచి కాన్సెప్ట్‌ కలిగిన చిన్న చిత్రాలు థియేటర్‌లో చూసే పరిస్థితి క్రమంగా తగ్గుతోంది. భారీ బడ్జెట్‌, గ్రాఫిక్స్‌, స్టార్‌హీరోల సినిమాలు మాత్రమే థియేటర్‌లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న సినిమాలకు మంచి వేదికగా ఓటీటీ నిలిచింది. గృహహింస అనే చిన్న ఎలిమెంట్‌తో ఓటీటీలో విడుదలైన చిత్రం ‘అమ్ము’. చారుకేష్ శేఖర్‌ దీన్ని తెరకెక్కించారు. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై ఈ సినిమలా ఎలా ఉంది? దర్శకుడు ఈ పాయింట్‌ను ఎలా చూపించారు?

కథేంటంటే: అమ్ము తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. పక్కింటి స్నేహితుల కుమారుడైన సీఐ రవీంద్రనాథ్‌కు ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లయిన కొత్తలో ఇద్దరూ చిలకా-గోరింకల్లా ఆనందంగా ఉంటారు. ఓ సంఘటనతో రవిలోని అసలు రూపం బయటపడుతుంది. అప్పటి నుంచి అమ్మును హింసిస్తుంటాడు రవి. తన వ్యవహారశైలి వల్లే రవి అలా ప్రవర్తిస్తున్నాడు అమ్ము బాదపడుతూ ఉంటుంది. అయినా కూడా రవిలో ఎలాంటి మార్పూ రాదు. ఎన్ని రకాలుగా భర్తను ఆనందింపజేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుంది. అప్పుడు అమ్ము ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రవికి ఎలా గుణపాఠం చెప్పింది అన్నది చిత్ర కథ!

ఎలా ఉందంటే: అమ్ము కేవలం ఆమె కథ మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో గృహహింస ఎదుర్కొంటున్న ఎంతో మంది మహిళల ఆవేదన. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద కంపెనీనైనా, వేల మంది ఉద్యోగులనైనా పర్యవేక్షిస్తూ చక్కగా బాధ్యతలు నిర్వర్తించవచ్చు కానీ, నలుగురున్న కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగల సమర్థత కలిగిన ఏకైక వ్యక్తి మహిళ మాత్రమే. భర్తకు భార్యగా, పిల్లలకు తల్లిగా, అత్తమామలకు కోడలిగా ఉంటూ తన తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించగలిగే శక్తి కేవలం మహిళలకు మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు. అలాంటి నారీ శక్తి నేటికీ గృహహింస ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఉంది. పైగా తాను ఎదుర్కొంటున్న శారీరక, మానసిక క్షోభను బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ‘ఆయన నన్ను కొట్టారమ్మా..’ అంటే అమ్ము తల్లి ‘ఎందుకే నువ్వేం చేశావు’ అంటుంది. ఈ ఒక్క డైలాగ్‌ చాలు ఇప్పటికీ తప్పు మహిళవైపు నుంచే జరిగి ఉంటుందని ఆలోచిస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. అలాంటి చిన్న ఎలిమెంట్‌తో ‘అమ్ము’ను తెరకెక్కించడంలో విజయం సాధించారు దర్శకుడు చారుకేశ్‌ శేఖర్‌.

పొరుగింటి కుర్రాడైన రవితో అమ్ము వివాహం, ఇద్దరూ సరదాగా గడపటం తదితర సన్నివేశాలతో నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆ తర్వాత చిన్న చిన్న విషయాలకే అమ్మును చూసి, రవి చిరాకు పడటం, అది నెమ్మదిగా పెరిగి పెద్దదవుతూ చేయి చేసుకోవడం వరకూ వెళ్తుంది. చిన్న చిన్న కారణాలకు కూడా అమ్మును విమర్శిస్తూ ఆమెపై దాడి చేయటం నిత్యకృత్యం అవుతుంది. ఇలా ఒక సాధారణ కుటుంబంలో మహిళ ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూపించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే తనపై మాత్రమే ఇలాంటి ఘటనలు జరగకుండా ఎదురు తిరగాలని అమ్ము నిశ్చయించుకుంటోందో అప్పటి నుంచి రవి-అమ్ముల మధ్య అసలైన నాటకీయత ప్రారంభమవుతుంది. ఆయా సన్నివేశాలను కూడా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. అయితే, సన్నివేశాలు కాస్త సుదీర్ఘంగా సాగినట్లు అనిపిస్తాయి. ప్రభు పాత్రలో బాబీ సింహా రాకతో సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. చివరకు ఎవరిపై ఎవరు గెలిచారన్నది ఓటీటీల చూసి తెలుసుకోవాల్సిందే. ఈ వీకెండ్‌లో ఒక డిఫరెంట్‌ సోషల్‌ డ్రామా చూడాలనుకుంటే ‘అమ్ము’ అమెజాన్‌ ప్రైమ్‌లో ఉంది.

ఎవరెలా చేశారంటే: అమ్ము పాత్రలో తన సహజ నటనతో ఐశ్వర్య లక్ష్మి ఆకట్టుకున్నారు. భర్త పెట్టే హింసలను భరించే, చివరకు వాటిపై పోరాటం చేసి మహిళగా ఒదిగిపోయారు. పురుషాహంకారం, శాడిజం ఉన్న వ్యక్తిగా నవీనచంద్ర చాలా బాగా నటించారు. ఆయన అలాంటి నటించడం వల్లే సన్నివేశాలు మరింత బలంగా పండాయి. బాబీ సింహా పాత్ర, ఆయన నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి. మిగిలిన నటీనటుల నటన పర్వాలేదు. సాంకేతికంగా సినిమా ఓకే. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఓటీటీలో రిపీటెడ్‌ సీన్స్‌ అనిపిస్తే, ప్రేక్షకులు భరించే పరిస్థితి ఉండదు. ఇక పద్మావతి మల్లాది డైలాగ్స్ సినిమాకి అదనపు ఆకర్షణ తెచ్చాయి. దర్శకుడు చారుకేష్ శేఖర్ తాను చెప్పాలనుకున్న పాయింట్‌ చెప్పడంలో సఫలమయ్యారు.

బలాలు

+ ఐశ్వర్య లక్ష్మి, నవీన్‌ చంద్ర, బాబీ సింహా

+ దర్శకత్వం

+ ఎంచుకున్న పాయింట్‌

బలహీనతలు

- ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు

- నిడివి

చివరిగా: సరికొత్త పాయింట్‌.. ఆసక్తికరంగా ‘అమ్ము’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు