Aishwarya Rai: వెండి గౌనులో ఐశ్వర్య.. ట్రోల్స్‌ చేస్తోన్న నెటిజన్లు

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్లో ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai) వెండిగౌనులో తళుక్కున మెరిసింది. అయితే కొందరు నెటిజన్లు ఆమె డ్రెస్‌పై ట్రోల్స్‌ చేస్తున్నారు.

Updated : 19 May 2023 12:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా వేడుకలంటేనే తారలు ధరించే దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అందులోనూ ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌(Aishwarya Rai) లాంటి స్టార్‌ హీరోయిన్స్‌ ధరించే దుస్తులపైనే అందరి చూపులు ఉంటాయి. ఇక ఏ సినీ వేడుకలోనైనా ఐశ్వర్య విభిన్న కాస్ట్యూమ్స్‌తో కనిపించి ఆకట్టుకుంటుంది. అలా ఆమె కనిపించగానే తమ కెమెరాల్లో క్లిక్‌మనిపించేందుకు వందల మంది ఫొటోగ్రాఫర్లు సిద్ధంగా ఉంటారు. ప్రతి సంవత్సరం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు కొత్త కళ తెచ్చే ఐశ్వర్య లుక్‌పై ఈసారి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది.

ఫ్రాన్స్‌లో 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Cannes 2023) అట్టహాసంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ తారలు, సెలబ్రిటీలు నూతన డిజైనర్‌ దుస్తుల్లో రెడ్‌ కార్పెట్‌పై హొయలుపోతూ కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మాజీ ప్రపంచ సుందరి కూడా వెండి గౌన్‌లో తళుక్కున మెరిసింది. ఆమె ధరించిన ఈ వెండి హుడిపై కొందరు నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. ‘మీరు డిజైనర్‌ను మార్చండి’ అని ఒకరు అంటే.. ‘వెండి హుడీ ఏంటి విడ్డూరంగా’ అంటూ మరొకరు అభిప్రాయపడ్డారు. అయితే మరికొందరు మాత్రం ఫ్యాషన్‌ను మరోస్థాయికి తీసుకెళ్లారంటూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ ఫొటోలు వైరలవుతున్నాయి.

ఇక మరోవైపు నిన్న ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ధరించిన నెక్లెస్‌పై కూడా విభిన్న కామెంట్స్‌ వినిపించాయి. పింక్‌ కలర్‌ డ్రెస్‌లో బార్బీ బొమ్మలా వచ్చిన ఊర్వశి.. మెడలో మాత్రం మొసలి డిజైన్‌తో తయారు చేసిన నెక్లెస్‌ను ధరించింది. చెవి రింగులు కూడా అలాంటివే పెట్టుకోవడంతో నెటిజన్లు ట్రోల్‌ చేశారు. ‘ఆ నెక్లెస్‌ కిందపడితే నిజంగా మొసలి అనుకొని భయపడతారేమో జాగ్రత్త’ అని కామెంట్స్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని