Aishwarya Rajesh: ‘పుష్ప’లో ఛాన్స్‌ వచ్చి ఉంటే ఆ పాత్ర చేసేదాన్ని..: ఐశ్వర్య రాజేశ్‌

అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh). ఆ సినిమాలో తనకు అవకాశం వచ్చి ఉంటే తప్పకుండా ఓకే చేసేదాన్ని అని ఆమె చెప్పారు.

Published : 13 May 2023 10:14 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ (Allu Arjun) నటించిన పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘పుష్ప’ (Pushpa). సుకుమార్‌ దర్శకుడు. రష్మిక కథానాయిక. తాజాగా ఈ సినిమా గురించి నటి ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh) మాట్లాడారు. ‘పుష్ప’ సినిమాలో అవకాశం వచ్చి ఉంటే తప్పకుండా నటించేదాన్ని అని చెప్పారు. ఇందులోని ఓ రోల్‌ తనకు బాగా సరిపోతుందని ఆమె పేర్కొన్నారు.

‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకెంతో ఇష్టం. తెలుగులో సినిమా చేస్తే తప్పకుండా అది నా కుటుంబం గర్వపడే ప్రాజెక్ట్‌ అయి ఉండాలని అనుకునేదాన్ని. అలా, ఎన్నో ఏళ్లు ఎదురుచూశాక ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో నటించే అవకాశం వచ్చింది. అది నన్ను తెలుగువారికి చేరువ చేసింది. ఆ తర్వాత ‘టక్‌ జగదీశ్‌’, ‘రిపబ్లిక్‌’లో చేశా. తెలుగులో ఆఫర్స్‌ రావట్లేదని కాదు.. వస్తున్నాయి. కాకపోతే మంచి పాత్రలతో మళ్లీ కమ్‌ బ్యాక్‌ ఇవ్వాలని ఉంది. ప్రస్తుతానికి తెలుగులో ఏ ప్రాజెక్ట్‌ ఓకే చేయలేదు. ఒకవేళ ‘పుష్ప’లో నాకు అవకాశం వచ్చి ఉంటే తప్పకుండా చేసేదాన్ని. రష్మిక బాగా నటించారు. అందులో సందేహం లేదు. కాకపోతే ఆ రోల్‌ నాకు బాగా సెట్‌ అవుతుందని నా నమ్మకం. అలాగే, డ్రీమ్‌ రోల్‌ అంటూ నాకు ఏదీ లేదు. ప్రేక్షకులను అలరించే విధంగా మంచి పాత్రలు చేయాలని ఉంది. పాత్ర ఏదైనా సరే దుమ్ము దులిపేయడమే’’ అని ఐశ్వర్య వివరించారు.

అనంతరం ఆమె ఇక్కడ ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ.. ‘‘సినిమా చిన్నదైనా లేదా పెద్దదైనా తెలుగు ప్రేక్షకులు దాన్ని ఆదరించే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. సినిమా బాగుందని చెబితే చాలు వాళ్లే దాన్ని బ్లాక్‌బస్టర్‌ చేసేస్తారు. ఇలాంటి ప్రేమను ఏ పరిశ్రమలోనూ నేను చూడలేదు. నేను నటించిన ‘డ్రైవర్‌ జమున’ ప్రాజెక్ట్‌ను ‘ఆహా’ వేదికగా తెలుగులో విడుదల చేయగా.. ఇక్కడ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చేసింది నాలుగు సినిమాలే అయినప్పటికీ తెలుగువారి ప్రేమను మెండుగా పొందుతున్నందుకు ఆనందిస్తున్నా’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని