Aishwarya Rajesh: రష్మిక వర్క్‌ను అవమానించినట్లు క్రియేట్‌ చేశారు.. తాజా వివాదంపై ఐశ్వర్యా రాజేశ్‌ వివరణ

నటి రష్మిక (Rashmika) ను ఉద్దేశిస్తూ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు నటి ఐశ్వర్యా రాజేశ్‌ (Aishwarya Rajesh). తన ఉద్దేశాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు.

Published : 17 May 2023 22:49 IST

హైదరాబాద్‌: ‘పుష్ప’ (Pushpa) లో రష్మిక (Rashmika) పోషించిన శ్రీవల్లి పాత్ర తనకు బాగా సెట్‌ అవుతుందంటూ ఇటీవల ఐశ్వర్యా రాజేశ్‌ (Aishwarya Rajesh) వెల్లడించిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలు కాస్త నెట్టింట వివాదంగా మారడంతో నటి ఐశ్వర్యా రాజేశ్‌ తాజాగా ఓ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశారు. ఆ సినిమాలో రష్మిక వర్క్‌ అద్భుతంగా ఉందని, తోటి నటీనటులపై తనకు అమితమైన గౌరవం ఉందని చెప్పారు.

‘‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటి నుంచి నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, నా సినిమాలను ఆదరిస్తున్నందుకు సినీ ప్రియులందరికీ ధన్యవాదాలు. నన్నూ, నా వర్క్‌నూ అమితంగా ప్రేమించే అభిమానులు, ప్రేక్షకులు ఉన్నందుకు నేనెంతగానో సంతోషిస్తున్నా. ఇక, వర్క్‌ విషయానికి వస్తే.. ‘మీరు ఎలాంటి పాత్రలు పోషించడానికి ఇష్టపడతారు..?’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నన్ను ప్రశ్నించారు. దానికి నేను.. తెలుగు సినీ పరిశ్రమ అంటే నాకెంతో ఇష్టమని, మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పాను. ఉదాహరణకు ‘పుష్ప’లోని శ్రీవల్లి పాత్ర నాకెంతో నచ్చిందని, అలాంటి పాత్రలు నాకు సూట్‌ అవుతాయని చెప్పాను. దురదృష్టవశాత్తు నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ సినిమాలో రష్మిక పెర్ఫార్మెన్స్‌ను నేను అవమానించేలా మాట్లాడినట్లు వార్తలు సృష్టించారు. ఆ సినిమాలో రష్మిక వర్క్‌ నుంచి నేను ప్రేరణ పొందాను. అలాగే, నాతోటి నటీనటులపై నాకు ఎంతో గౌరవం ఉంది. నా వ్యాఖ్యలకు హానికరమైన ఉద్దేశాలను రుద్ది వదంతులు సృష్టించడం మానండి’’ అని ఆమె వివరణ ఇచ్చారు.

సినిమాల విషయానికి వస్తే ఐశ్వర్యా రాజేశ్‌ నటించిన సరికొత్త చిత్రం ‘ఫర్హానా’. తమిళం, తెలుగులో విడుదలైన ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే ఆమె తెలుగు సినీ పరిశ్రమ గురించి మాట్లాడారు. ‘‘టాలీవుడ్‌ అంటే నాకు అమితమైన గౌరవం ఉంది. తెలుగులో నటిస్తే తప్పకుండా మా కుటుంబం గౌరవించే పాత్రలనే పోషించాలని అనుకున్నా. అందుకోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూసి ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో నటించా. భవిష్యత్తులో మంచి పాత్రలు వస్తే తప్పకుండా డైరెక్ట్‌ తెలుగులో నటిస్తా. ‘పుష్ప’లో రష్మిక, ‘దసరా’లో కీర్తి సురేశ్‌ పోషించిన పాత్రలు నాకు బాగా సెట్‌ అవుతాయి. అలాంటి స్ట్రాంగ్‌ రోల్స్‌లో నటించాలని ఉంది’’ అని ఆమె తెలిపారు. ఆ వ్యాఖ్యలే అంతటా చర్చనీయాంశంగా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు