అజయ్‌ దేవగణ్‌ ‘మేరా నామ్‌ సిపాయి’ పద్యం.. కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్‌కుమార్‌.. సునీల్‌శెట్టి

ఎంతటి పరిస్థితుల్లోనైనా భావోద్వేగాలను నియంత్రించుకోగలిగిన వాళ్లను సైతం కదిలించేంది.. మనసు కరిగించేది.. ఉద్వేగానికి గురి చేసేది దేశభక్తి మాత్రమే. అది రాజకీయ నాయకులైన బాలీవుడ్‌ స్టార్‌ నటులైనా. తాజాగా భారత సైనికులపై ‘మేరా నామ్‌ సిపాయి’ అంటూ బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌దేవగణ్‌ చెప్పిన ఓ పద్యం అక్షయ్‌కుమార్‌తో పాటు

Published : 28 Jul 2021 19:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంతటి పరిస్థితుల్లోనైనా భావోద్వేగాలను నియంత్రించుకోగలిగిన వాళ్లను సైతం కదిలించేంది.. మనసు కరిగించేది.. ఉద్వేగానికి గురి చేసేది దేశభక్తి మాత్రమే. అది రాజకీయ నాయకులైన బాలీవుడ్‌ స్టార్‌ నటులైనా. తాజాగా భారత సైనికులపై ‘మేరా నామ్‌ సిపాయి’ అంటూ బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌దేవగణ్‌ చెప్పిన ఓ పద్యం అక్షయ్‌కుమార్‌తో పాటు సునీల్‌శెట్టితో కన్నీళ్లు పెట్టించింది. భారత సైనికుల త్యాగాలను, గొప్పతనాన్ని అభివర్ణిస్తూ పద్యం చదువుతూ అజయ్‌ ఓ వీడియో రూపొందించారు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ వీడియో చూసిన అక్షయ్‌కుమార్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నా నిజజీవితం విషయానికి వస్తే చాలా భావోద్వేగమైన విషయాలను నేను వ్యక్తీకరించను. కానీ.. ఇది నాకు కన్నీళ్లు తెప్పించింది. అజయ్‌ దేవగణ్‌ మీలో ఇంత అద్భుతమైన కవి ఉన్నారని మాకు తెలియదు. మీరు మా హృదయాలను గెలుచుకున్నారు’’ అని అక్షయ్‌ రాసుకొచ్చారు. అయితే.. ఆ పద్యం రాసింది అజయ్‌ కాదు.. మనోజ్‌ ముంతాషీర్ అనే రచయిత అని తెలియడంతో అక్షయ్‌ తన పొరపాటును సరిదిద్దుకున్నారు. మరో ట్వీట్‌ చేస్తూ.. ‘‘ఈ అద్భుతమైన పద్యం రాసింది ముంతాషిర్ అని ఇప్పుడే తెలిసిందే. అది అజయ్‌ దేవగణ్‌ చదివి వినిపించారు’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా.. ఈ పద్యంపై మరో బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ కూడా స్పందించారు. ‘‘భారతీయ సైనికుల ధైర్యసాహసాలకు అజయ్‌దేవగణ్‌ హృదయపూర్వక నివాళులర్పించారు’’ అంటూ రాసుకొచ్చారు. సునీల్‌శెట్టి స్పందిస్తూ.. ‘‘దేశం, సైనికుడి ఇంత గురించి గొప్పగా మాట్లాడిన నా ప్రియమైన స్నేహితుడికి హృదయపూర్వక అభినందనలు. కన్నీళ్లు వస్తున్నాయి’’ అంటూ ట్వీట్‌ చేశారు.

అజయ్‌ దేవగణ్‌ ప్రధానపాత్రలో ‘భుజ్‌’ అనే చిత్రం తెరకెక్కింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పిరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్‌ ఓ ఐఏఎఫ్‌ స్క్వాడ్రన్ లీడర్‌గా కనిపించనున్నారు. 1971 భారత్‌ - పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెలలో ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్‌ విశేష ఆదరణ సొంతం చేసుకుంది. అభిషేక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌, నటి సోనాక్షి సిన్హా, ప్రణీత తదితరులు కీలకపాత్రలు పోషించారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని