Akash Puri: పూరీ దంపతుల విడాకుల వార్తలు.. ఆకాశ్‌ పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు

పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)‌, ఆయన సతీమణి లావణ్య(Lavanya) విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరి మధ్య తరచూ గొడవలు తలెత్తుతున్నాయని....

Updated : 22 Jun 2022 11:01 IST

ఆమె వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాం

హైదరాబాద్‌: పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)‌, ఆయన సతీమణి లావణ్య(Lavanya) విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవాలని నిర్ణయించుకున్నారని పలు వెబ్‌సైట్లలో వార్తలు కూడా వచ్చాయి. తన తల్లిదండ్రుల గురించి జరుగుతోన్న ప్రచారంపై తాజాగా నటుడు ఆకాశ్‌పూరీ (Akash Puri) స్పందించారు. అవన్నీ అవాస్తవమేనని కొట్టిపారేశారు. ఆకాశ్‌ హీరోగా నటించిన ‘చోర్‌ బజార్‌’ (Chor Bazaar) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘చిన్నప్పటి  నుంచి నాకు సినిమా అంటే పిచ్చి. ఏదేమైనా పరిశ్రమలోనే ఉండాలని నిర్ణయించుకున్నా. పదో తరగతిలోనే చదువు మానేసి పరిశ్రమలోకి వెళ్లిపోతానని ఇంట్లో వాళ్లకి చెప్పా. ఓసారి స్కూల్‌లో మా టీచర్‌ పెద్దయ్యాక ఏమవుతావ్‌ అని అడగ్గా.. ‘‘నేను నటుడిని అవుతాను సర్‌’’ అని బదులిచ్చా. దానికి ఆయన ‘‘నటుడిగా సక్సెస్‌ కాకపోతే ఏం చేస్తావ్‌?’’ అని ప్రశ్నించారు. ‘‘నటుడిగా ఫెయిలైతే.. దర్శకుడిగా వెళ్తా.. అక్కడ కూడా ఫెయిలైతే స్టంట్‌ మాస్టర్‌ అవుతా.. అది కూడా ఫెయిలైతే కొరియోగ్రాఫర్‌ అవుతా.. లేకపోతే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తా.. ఏదీ లేకపోతే చివరికి లైట్‌బాయ్‌గా అయినా వర్క్‌ చేస్తా’’ అని సమాధానం చెప్పా. నా మాట విని ఆయన షాకయ్యారు. ఇంట్లో వాళ్లకి ఫోన్‌ చేసి చెప్పారు. ఆ రోజు అమ్మ చాలా బాధపడింది. నా భవిష్యత్తు ఏంటోనని కంగారుపడింది’’

‘‘ఓ సమయంలో మా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. మా ఆస్తులన్నీ పోయాయి. ఇల్లు, కార్లు అమ్మేశారు. అలాంటి పరిస్థితి నుంచి మేము మళ్లీ ఈ స్థాయికి రాగలిగామంటే మా అమ్మే కారణం. అన్ని కష్టాల్లోనూ అమ్మ ఇచ్చిన సపోర్ట్‌తోనే నాన్న తిరిగి నిలదొక్కుకోగలిగారు. అమ్మ వాళ్లది ప్రేమ వివావాం. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు నాన్న ఓరోజు ఆమెకు ఫోన్‌ చేసి.. ‘‘నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నీకు ఓకే అయితే వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం. అయితే నా వద్ద ఇప్పుడు కేవలం రూ.200 మాత్రమే ఉన్నాయి. రేపు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా నీకు చెప్పలేను’’ అని చెప్పారట. దానికి ఆమె కంగారు పడకుండా ‘‘నేను వచ్చేస్తాను.. మనం వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం’’ అని ఇంట్లో నుంచి వచ్చేశారట. ఈవిషయాన్ని నాన్న నాతో ఓసారి చెప్పారు. వాళ్ల కథ విని నేనే ఆశ్చర్యపోయా. అమ్మాయిలు ఇంతలా ప్రేమిస్తారా? అని అనుకున్నా’’ అని ఆకాశ్‌ వివరించారు. అనంతరం విలేకరి.. ‘‘మీ తల్లిదండ్రులిద్దరూ విడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. దానిపై ఏం చెప్పాలనుకుంటున్నారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘అలాంటి వార్తలు వచ్చినట్లు నాకు తెలియదు. అవన్నీ అవాస్తవాలు మాత్రమే. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. ఏం చేయాలో తెలియక కొంతమంది ఇలాంటి వార్తలు సృష్టించినట్లు ఉన్నారు’’ అని ఆకాశ్‌ సమాధానమిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని