Published : 23 Jun 2022 15:38 IST

Akash Puri: ఇకపై నాన్న సపోర్ట్‌ నాకొద్దు: ఆకాశ్ పూరీ

హైదరాబాద్‌: తన తండ్రి, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) సపోర్ట్‌ ఇకపై తనకి వద్దన్నారు నటుడు ఆకాశ్‌ పూరీ (Akash puri). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’ (Chor Bazaar). జీవన్‌ రెడ్డి దర్శకడు. యాక్షన్‌, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘చోర్‌ బజార్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పరశురామ్‌, బండ్లగణేశ్‌, సాయి రామ్‌ శంకర్‌, విశ్వక్‌సేన్‌ తదితరులు పాల్గొన్న ఈ వేడుకలో ఆకాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘చోర్‌ బజార్‌’ని మేమంతా ఎంతో కష్టపడి చేశాం. నేను మా ఊర్లో ఉన్నప్పుడు జీవన్‌ ఓసారి నన్ను కలిశారు. నాతో ఒక కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. కథ వినగానే నాకు బాగా నచ్చి ఓకే చెప్పేశా. ఇలాంటి కథను నాకిచ్చిన జీవన్‌కు, ఇతర టీమ్‌ సభ్యులకు కృతజ్ఞతలు. మా సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌ అద్భుతం. నాది ఏ సినిమా ట్రైలర్‌, టీజర్‌ విడుదలైన దాని కింద నెటిజన్లు పెట్టే కామెంట్స్‌ చదవడం అలవాటు. ఆడియన్స్‌ ఏం అనుకుంటున్నారో తెలుసుకోవాలనే ఆశ నాకు ఎక్కువ. ఎవరెన్నిసార్లు వద్దని చెప్పినా నేను ఆ అలవాటుని వదల్లేదు. ఎక్కువమంది నన్ను నెపోకిడ్‌గానే చూస్తున్నారని ఆ కామెంట్స్‌ చూశాకనే తెలిసింది. ఒక స్టార్‌ కొడుకు ఇండస్ట్రీలోకి వస్తే ఎవరూ అతన్ని సీరియస్‌గా తీసుకోరు. ఏ స్టార్‌ కిడ్‌ అయినా నెపోటిజం పేరుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగలడు మాత్రమే. టాలెంట్‌ ఉంటేనే అతను సక్సెస్‌ సాధించగలడు’’

‘‘మీ అందరూ అన్నట్టుగా నాకు అన్నీ ఉన్నాయి. మా నాన్న చిన్నప్పటి నుంచి అన్నీ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో పెద్ద కోట, తిరగడానికి కోట్ల రూపాయల కార్లు. అయితే అవన్నీ మా నాన్నవి. నావి కాదు. మా నాన్న నాకిచ్చిన క్రెడిట్‌ కార్డు పక్కన పెట్టేస్తే నేను జీరో. ఈ క్లారిటీ నాకు 18 ఏళ్ల వయసులో వచ్చింది. సినిమాల్లోకి అడుగుపెట్టాను. అందరూ నన్ను స్టార్‌ డైరెక్టర్‌ కొడుకుగానే చూశారు. బంధుప్రీతి అడ్డం పెట్టుకుని నేనూ మా నాన్నతో సినిమా చేయవచ్చు. ‘‘నాన్నా.. లైగర్‌ నాతో చెయ్‌’’ అని అడిగితే ఆయన ఓకే అంటారు. కానీ నాకు అది వద్దు. బాగా కష్టపడి, నాన్న స్థాయికి వెళ్లాలి. అప్పుడు మేమిద్దరం కలిసి సినిమా చేయాలి. ఇప్పటివరకూ నాన్న నాకు చేసింది చాలు. ఇకపై, మానాన్నని ఏమీ అడగకూడదు. నాకు కావాల్సింది ఆయన సపోర్ట్‌ కాదు. మీ సపోర్ట్‌. దయచేసి మమ్మల్ని కాస్త ప్రోత్సహించండి’’ అని ఆకాశ్‌ వ్యాఖ్యానించగా.. అక్కడే ఉన్న ఆయన మాతృమూర్తి లావణ్య భావోద్వేగానికి గురయ్యారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని