
Akhanda : ‘అఖండ’లో రుద్ర సికందర్ అఘోరా... ఎలా సిద్ధమయ్యాడో చూశారా?
Akhanda Special Making Video: గతేడాది ఆఖరులో వచ్చి... టాలీవుడ్‌కి హిట్ ఫ్లేవర్ తీసుకొచ్చిన చిత్రం ‘అఖండ’ (Akhanda). బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో హ్యాట్రిక్‌గా వచ్చి భారీ విజయం అందుకుంది. ఆ తర్వాత ఓటీటీలో కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ‘అఖండ’ మేకింగ్ వీడియో (Akhanda Making Video)ను విడుదల చేసింది. అఖండ రుద్ర సికందర్ అఘోరా పాత్రను బోయపాటి మలచిన తీరును అందులో చూపించారు.
‘అఖండ’ సినిమా సెట్స్ మీద ఉండగానే అఘోరా పాత్ర గురించి చాలా రకాల వార్తలొచ్చాయి. ఈ పాత్రలో బాలయ్యను చూస్తే... అభిమానులకు పూనకాలే అంటూ హింట్స్ ఇచ్చారు కూడా. సినిమా వచ్చాక చూస్తే ఆ లీకులే కరెక్ట్ అని తెలిసింది. ఆ పాత్రను ప్రధానంగా చేసుకొని ఈ కొత్త మేకింగ్ వీడియోను రూపొందించారు. అఘోరా పాత్ర కోసం బాలయ్య ఎలా సిద్ధమైంది, బోయపాటి ప్రతి సన్నివేశాన్ని చేసి చూపించిన విధానం... ఇలా అన్నీ ఆ వీడియోలో చూడొచ్చు.
ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల విషయంలో దర్శకుడు బోయపాటి శ్రీను తీసుకున్న శ్రద్ధ మేకింగ్ వీడియోలో కనిపిస్తోంది. స్టంట్ మాస్టర్లు స్టన్ శివ అతని తనయులు ఫైట్స్‌ను రూపొందించిన విధానం ఆకట్టుకుంటోంది. మధ్య మధ్యలో మురళీ కృష్ణ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కూడా కొన్ని కనిపిస్తాయి. ఓ సందర్భంలో బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా వీడియోలో కనిపించారు.
ఇక ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా ఇటీవల మొదలైంది. థియేటర్లలో రికార్డులు బద్దలుకొట్టినట్లుగానే ఓటీటీల్లోనూ రికార్డులు క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు బాలయ్య. స్ట్రీమింగ్ మొదలైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించి రికార్డు నెలకొల్పింది ‘అఖండ’. ఈ సినిమాను తొలి రోజు పది లక్షలమందికిపైగా వీక్షించారట. ఆ మేకింగ్ వీడియో ఇదిగో...