Akhil Akkineni: ‘ఏజెంట్‌’ ఫెయిల్యూర్‌పై తొలిసారి స్పందించిన అఖిల్‌

అఖిల్‌ అక్కినేని (Akhil) నటించిన రీసెంట్‌ చిత్రం ‘ఏజెంట్‌’ (Agent). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకోని విధంగా పరాజయాన్ని అందుకుంది. ఈనేపథ్యంలోనే ‘ఏజెంట్‌’ ఫలితంపై అఖిల్‌ తాజాగా స్పందించారు.

Updated : 15 May 2023 19:31 IST

హైదరాబాద్‌: ‘ఏజెంట్‌’ (Agent) సినిమా పరాజయంపై నటుడు అఖిల్‌ అక్కినేని (Akhil) తొలిసారి స్పందించారు. అనుకున్న విధంగా చిత్రాన్ని డెలివరీ చేయలేకపోయామని అన్నారు. ఆ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ సోమవారం సాయంత్రం ఆయన ప్రత్యేకంగా ఒక లేఖను విడుదల చేశారు.

‘‘ఏజెంట్‌’ చిత్రబృందానికి, ఆ సినిమా తెరకెక్కించడంలో తమ జీవితాలను అంకితం చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఎంతో కష్టపడినప్పటికీ దురదృష్టవశాత్తు మేము అనుకున్నదాన్ని స్క్రీన్‌పైకి తీసుకురాలేకపోయాం. ఆ విధంగా మంచి చిత్రాన్ని అందించలేకపోయాం. నాకెంతో అండగా నిలిచిన చిత్ర నిర్మాత అనిల్‌కు కృతజ్ఞతలు. మా చిత్రాన్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు, సపోర్ట్‌ చేసిన మీడియాకు ధన్యవాదాలు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఇస్తున్న ప్రేమ వల్లే నేను కష్టపడి వర్క్‌ చేస్తున్నా. నాపై నమ్మకం పెట్టుకున్న వారి కోసం మరింత దృఢంగా సిద్ధమై మళ్లీ వస్తాను’’ అని అఖిల్‌ పేర్కొన్నారు.

యాక్షన్‌, స్పై థ్రిల్లర్‌గా ‘ఏజెంట్‌’ తెరకెక్కింది. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర దీన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం అఖిల్‌ ఎంతో కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్‌తో కనిపించడం కోసం ఆయన కొన్నినెలలపాటు శ్రమించారు. భారీ అంచనాల మధ్య గత నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఈ క్రమంలోనే నిర్మాత అనిల్‌ సైతం.. కొన్నిరోజుల క్రితం వివరణ ఇచ్చారు. ‘ఏజెంట్‌’ ఫలితం విషయంలో పూర్తి బాధ్యత తమదే అని ఆయన స్పష్టం చేశారు. స్క్రిప్టు పక్కాగా సిద్ధంకాకముందే చిత్రాన్ని ప్రారంభించడం తప్పిదమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు