Bangarraju: సార్థకత ఏర్పడింది: నాగార్జున

‘‘బంగార్రాజు’ సినిమా చూసి చాలా మంది తమ అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, తల్లిదండ్రులను గుర్తు చేసుకున్నామని చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది’’ అన్నారు కథా నాయకుడు నాగార్జున. ఆయన తన తనయుడు నాగచైతన్యతో కలిసి నటించిన చిత్రమే ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్‌గా రూపొందింది.

Updated : 17 Jan 2022 06:48 IST

‘‘బంగార్రాజు’ సినిమా చూసి చాలా మంది తమ అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, తల్లిదండ్రులను గుర్తు చేసుకున్నామని చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది’’ అన్నారు కథా నాయకుడు నాగార్జున. ఆయన తన తనయుడు నాగచైతన్యతో కలిసి నటించిన చిత్రమే ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్‌గా రూపొందింది. కల్యాణ్‌ కృష్ణ తెరకెక్కించారు. రమ్యకృష్ణ, కృతి శెట్టి కథానాయికలు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘‘నాన్నగారు చేసిన ‘దసరా బుల్లోడు’ జనవరి14నే విడుదలై అప్పట్లో అఖండ విజయాన్ని అందుకుంది. అలాగే ఈసారి మేము ‘బంగార్రాజు’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ దక్కించుకున్నాం. సినిమా చూసిన వారంతా వారి భావోద్వేగాలు తెలియజేస్తుంటే.. తీసిన చిత్రానికి సార్థకత ఏర్పడిందనిపించింది. ఈ సినిమా చూసి అమల ఇంటికి రాగానే అత్త, మామ గారి ఫొటోలకు దండం పెట్టుకుని ఏడ్చేసింది. అవి ఆనందంతో కూడిన కన్నీళ్లు. ఈ చిత్ర ముగింపులో చూపించినట్లు దీనికి కొనసాగింపుగా మరో చిత్రం తియ్యొచ్చు. దానికి అన్నీ అనుకూలించాల్సి ఉంది’’ అన్నారు. ‘‘ఏపీలో నైట్‌ కర్ఫ్యూని వాయిదా వేయడం మాకు కలిసొచ్చింది’’ అన్నారు కల్యాణ్‌ కృష్ణ. ఈ కార్యక్రమంలో నాగచైతన్య, అనూప్‌ రూబెన్స్‌, సూర్య, జునైద్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని