ANR:కృష్ణుడి వేషం వేయమని సీఎంతో రికమెండ్‌ చేయించిన ఎన్టీఆర్‌

తొలినాళ్లలో తెలుగు సినిమాకు రెండు కళ్లలా వ్యవహరించిన అగ్రతారలు నందమూరి తారక రామారావు(NTR), అక్కినేని నాగేశ్వరరావు(ANR).

Updated : 07 Jul 2022 15:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తొలినాళ్లలో తెలుగు సినిమాకు రెండు కళ్లలా వ్యవహరించిన అగ్రతారలు నందమూరి తారక రామారావు(NTR), అక్కినేని నాగేశ్వరరావు(ANR). సినిమాల విషయంలో ఇద్దరూ పోటీ పడి నటించేవారు. అదే సమయంలో వీరు కలిసి మల్టీస్టారర్‌ మూవీలు కూడా చేశారు. పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్‌ పెట్టింది పేరు. తెలుగు వారికి వెండితెరపై రాముడు, కృష్ణుడు అంటే గుర్తొచ్చే నిండైన రూపం ఎన్టీఆర్‌ది. అలాంటి ఆయన ఏయన్నార్‌ను పిలిచి కృష్ణుడిగా నటించమని అడిగారట. అయితే, అందుకు ఏయన్నార్‌ సున్నితంగా తిరస్కరించారట. పైగా అప్పటి సీఎం జలగం వెంగళరావుతోనూ ఎన్టీఆర్‌ రికమెండ్‌ చేయించినా ఏయన్నార్‌ ఒప్పుకోలేదు. ఓ సందర్భంలో దీని గురించి ఏయన్నార్‌ ఇలా పంచుకున్నారు.

‘‘ఎన్టీఆర్‌(NTR) సినీ రంగ ప్రవేశం చేయగానే ఏయన్నార్‌ (ANR) పనిపోతుందని అందరూ అనుకున్నారు. కొందరు నిర్మాతలే నేరుగా నాతో చెప్పారు. ఎందుకంటే నా కన్నా ఆయన ఎత్తు, గంభీరంగా ఉంటారు. వాయిస్‌ కూడా బాగుంటుంది. పైగా ప్రతిభ కూడా ఉంది. నాకు కేవలం టాలెంట్‌ మాత్రమే ఉంది. ఇద్దరికీ మార్కులేస్తే ఆయనకే ఎక్కువ పడతాయి. రావణాసురుడు చెడ్డవాడని రామాయణం చెబుతుంటే అలాంటి పాత్రను వేసి సమర్థుడు అనిపించుకున్నారు. దుర్యోధనుడు దుర్మార్గుడు అని భారతం చెబుతుంటే ఆ పాత్రను గుర్తుండిపోయేలా చేశారు. అది ఆయన పర్సనాలిటీ. ఒకవేళ ఆయన్ను చూసి నేను అలాంటి పాత్రలు వేస్తే రక్తికట్టవు. ఒకసారి నన్ను పిలిచి కర్ణుడి వేషం వేయమని అడిగారు. ‘వేయను’ అని చెప్పా. అలాగే ‘చాణక్య చంద్రగుప్త’లో చంద్రగుప్తుడి వేషం వేయమన్నారు. ‘అందుకు నేను పనికిరాను. చాణక్యుడు వేషం వేస్తా’నని చెప్పా. ఎందుకంటే చంద్రగుప్త మహారాజు ఆహార్యం నాకు లేదు. చాణక్యుడు తెలివైన వాడు అలాంటి పాత్ర నాకు సరిపోతుంది’’

‘‘ఈ సినిమా కన్నా ముందు కృష్ణుడు వేషం వేయమని ఎన్టీఆర్‌ అడిగారు. అందుకు కూడా నేను నిరాకరించా. ఎందుకంటే ఆ పాత్రకు ఆయన పాపులర్‌. న్యాయంగా అయితే, కృష్ణుడి పాత్రకు నేను బెటర్‌. ఎందుకంటే కృష్ణుడు ‘ఆజానుబాహుడు.. అరవింద దళయాతాక్షుడు’ అని ఎక్కడా లేదు. పైగా చిలిపివాడు.. చమక్కులు ఉన్నవాడు.. మాయలమరాఠీ. ఇలాంటి వేషాలకు నేను పనికొస్తా. కానీ, అప్పటికే కృష్ణుడిగా ఆయన పాపులర్‌. కాబట్టి నేను ఆ పాత్ర జోలికి వెళ్లలేదు. కృష్ణుడి పాత్ర చేయమని సీఎం జలగం వెంగళరావుతో రికమెండ్‌ చేయించారు. ఆయనకు కూడా ‘చేయను’ అని చెప్పా. ఆ తర్వాతే ‘చాణక్య చంద్రగుప్త’లో వేషం వేసేందుకు ఒప్పుకొన్నా. నటన విషయంలో ఇద్దరి మధ్యా పోటీ ఉన్నా, నా ఆహార్యం, వాచకానికి తగని పాత్రలను నేనెప్పుడూ చేయలేదు. అంజలి దేవి, సావిత్రి తర్వాత నాకెరీర్‌లో ఎక్కువ సినిమాలకు పనిచేసిన కో-స్టార్‌ ఆయన’’ అని ఏయన్నార్‌ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌-ఏయన్నార్‌లు తమ సినీ కెరీర్‌లో 15 చిత్రాలకు పైగా కలిసి నటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని