Published : 20 Aug 2021 01:41 IST

Bell Bottom Review: రివ్యూ: బెల్‌బాటమ్‌

చిత్రం: బెల్‌బాటమ్‌; నటీనటులు: అక్షయ్‌కుమార్‌, లారాదత్త, వాణీకపూర్‌, హ్యుమాఖురేషి, అదిల్‌ హుస్సేన్‌, డెంజిల్‌ స్మిత్‌ తదితరులు; సంగీతం: అమాల్‌ మాలిక్‌, తనిష్‌ బాగ్చి, (డేనియల్‌ బి.జార్జ్‌); ఎడిటింగ్‌: చందన్‌ అరోరా; సినిమాటోగ్రఫీ: రాజీవ్‌ రవి; రచన: అసీమ్‌ అరోరా, పర్వేజ్‌ షేక్‌; నిర్మాత: వాసు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్‌, నిఖిల్‌ అడ్వాణీ; దర్శకత్వం: రంజిత్‌ ఎం. తివారి; విడుదల: 19-08-2021

ఒక్కోసారి అనుకోకుండా ఒకే నేపథ్యం ఉన్న వేర్వేరు కథలు బాక్సాఫీస్‌ను పలకరిస్తుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో అదే పరిస్థితి నెలకొంది. దేశభక్తి నేపథ్యంతో ‘షేర్‌షా’, ‘భుజ్‌’ రెండూ ఓటీటీ వేదికగా సందడి చేస్తుండగా, ఇప్పుడు అక్షయ్‌ ‘బెల్‌బాటమ్‌’ థియేటర్‌లలో విడుదలైంది. అయితే, ఇందులో దేశభక్తి ఉన్నా, కాస్త కమర్షియల్‌ అంశాలను జోడించిన యాక్షన్‌ థ్రిల్లర్‌. మరి గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథేంటి? అక్షయ్‌కుమార్‌ ఎలా నటించారు?

కథేంటంటే: 1984, ఆగస్టు 24న కొందరు ఉగ్రవాదులు దిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానాన్ని హైజాక్‌ చేస్తారు. అప్పటికి ఇది ఐదో హైజాక్‌. వరుసగా విమానాలను హైజాక్‌ చేసి పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ల్యాండ్‌ చేస్తుంటారు. హైజాకర్స్‌కు, భారత ప్రభుత్వానికి మధ్య పాకిస్థాన్‌ అధికారులు సమన్వయం చేస్తూ ప్రయాణికులను విడిపిస్తుంటారు. తమకు తలనొప్పిగా మారిన ఇలాంటి ఘటనలను ఎలాగైనా నివారించాలని ఇందిరాగాంధీ (లారాదత్త) ప్రభుత్వం భావిస్తుంది. అయితే, రా ఏజెంట్‌ అన్షుల్ మల్హోత్ర అలియాస్‌ బెల్‌బాటమ్‌ (అక్షయ్‌కుమార్‌) ఈసారి చర్చలు జరపొద్దని ప్రధానికి సలహా ఇస్తాడు. గత హైజాక్‌ల తీరును పరిశీలించిన బెల్‌బాటమ్‌ వీటి వెనుక ఐఎస్‌ఐ హస్తం ఉందని నిరూపిస్తాడు. అదే సమయంలో పాక్‌ అధ్యక్షుడు జియా-ఉల్‌-హక్‌ నుంచి ప్రధాని ఇందిరకు ఫోన్‌కాల్‌ వస్తుంది. ‘వాళ్లతో చర్చలు జరపమంటారా’ అని అడుగుతాడు. బెల్‌బాటమ్‌ సూచన మేరకు ఇందిర వద్దని చెబుతారు. మరి హైజాక్‌ అయిన విమానాన్ని, అందులో ప్రయాణికులను ఎలా కాపాడారు? అందుకు బెల్‌బాటమ్ ఏం చేశాడు? ప్రయాణికులను రక్షించే క్రమంలో బెల్‌బాటమ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: బెల్‌బాటమ్‌ ‘యాక్షన్‌ థ్రిల్లర్‌’ అయినా, నిజ జీవిత ఘటనల ఆధారంగా అసీమ్‌ అరోరా, పర్వేజ్‌ షేక్‌లు కథ రాసుకున్నారు. దాన్ని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు రంజిత్‌ విజయవంతమయ్యారు. హైజాక్‌ నేపథ్యంతో కూడిన కథలు చివరి వరకూ ఉత్కంఠతో అలరిస్తాయి. చివరికి ప్రయాణికులు బతుకుతారా? లేదా? ఎవరిని ఏం చేస్తారు?  అన్న ఉత్కంఠ సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని తొలి చేస్తుంది. తెలుగులో వచ్చిన ‘గగనం’ కథ ఇలాంటిదే. హైజాక్‌ ఎపిసోడ్‌తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు, కథా నేపథ్యం, పాత్ర పరిచయానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే పట్టింది. హైజాక్‌లు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? తదితర అంశాలను ప్రధానికి బెల్‌బాటమ్‌ వివరించే సన్నివేశాలు, బెల్‌బాటమ్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌తో ప్రథమార్ధం సాగుతుంది.అసలు కథను ద్వితీయార్థానికి ఉంచుకున్నాడు దర్శకుడు. దీంతో ప్రథమార్ధం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించినా, విరామం తర్వాత బెల్‌బాటమ్‌ ఆపరేషన్‌ ఏంటన్నది ఆసక్తిని కలిగిస్తుంది. అందుకు తగినట్లు గానే కథా, కథనాలను నడిపాడు దర్శకుడు. దుబాయ్‌ చేరుకున్న  బెల్‌బాటమ్‌ ఆయన టీమ్‌ హైజాక్‌ ఎలా అడ్డుకున్నదనేది ఆసక్తి అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో వచ్చే రెండు ట్విస్ట్‌లు అలరిస్తాయి. చివరి 20 నిమిషాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. థియేటర్‌లో సినిమా చూడాలని ఉవ్విళ్లూరే ప్రేక్షకులను ఈ సినిమా తప్పకుండా మెప్పిస్తుంది.

ఎవరెలా చేశారంటే: అక్షయ్‌కుమార్‌ ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమా చాలా వరకూ తన భుజాలపై మోశారు. యాక్షన్‌ చిత్రాల్లో ఆయన నటనకు మరోస్థాయిలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందిరా గాంధీ పాత్రలో లారాదత్త సెటిల్డ్‌గా నటించారు. మేకప్‌ బృందం అద్భుతం చేసింది. వాణీకపూర్‌, హ్యుమా ఖురేషి పాత్రలకు పెద్దగా ప్రాధానం లేదు. వాణీకో పాట, హ్యుమాకో ఫైట్‌తో ఇద్దరి పాత్రలకు సమ ప్రాధాన్యం ఇచ్చాడు. మిగిలిన వాళ్లు వాళ్ల పాత్రల పరిధి మేరకు నటించారు. పాటలు ఓకే. డేనియల్‌ నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ కూడా పర్వాలేదు. కొన్ని చోట్ల వీఎఫ్‌ఎక్స్‌ కృత్రిమంగా ఉంది. రంజిత్‌ ఎం. తివారి గత చిత్రం ‘లక్నో సెంట్రల్‌’తో పోలిస్తే ‘బెల్‌ బాటమ్‌’ను తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది.

బలాలు

+ అక్షయ్‌కుమార్‌

+ ద్వితీయార్ధం

+ సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు

- ప్రథమార్ధం

- అక్కడక్కడా అతకని సన్నివేశాలు

చివరిగా: అక్షయ్‌ వన్‌మెన్‌ షో ‘బెల్‌బాటమ్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని