ట్రోలింగ్‌కు గురైన స్టార్‌ హీరో.. కారణమేంటంటే..!

బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు అక్షయ్‌కుమార్‌(Akshay Kumar)ని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. తన ఇన్‌స్టా పేజీలో కామెంట్స్‌ చేస్తూ ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. 

Updated : 08 Dec 2022 12:57 IST

హైదరాబాద్‌: సినిమాలో తన ఫస్ట్‌లుక్‌ కారణంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు ఓ స్టార్‌ హీరో. నెటిజన్లు లాజిక్‌లతో తనని ప్రశ్నించారు. ఏకంగా ఆయన ఇన్‌స్టా పేజిలోనే కామెంట్స్‌ చేశారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) ప్రధాన పాత్రలో మరాఠీ చిత్రం ‘వేదత్‌ మరాఠే వీర్‌ దౌడ్లే సాత్‌’ (Vedat Marathe Veer Daudale Sat) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్టలుక్‌ను తాజాగా విడుదల చేశారు. దీనిని అక్షయ్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ‘నేను ఛత్రపతి శివాజీగా కనిపించనున్నా. ఈ అవకాశం రావడం నా అదృష్టం. అందరి ఆశీస్సులతో నా శక్తిమేర అత్యుత్తమంగా నటించడానికి ప్రయత్నిస్తా’ అని రాశారు. ఇది పంచుకున్న కొద్దిసేపటికే నెటిజన్లు ఆయన్ను ట్రోల్స్‌ చేయడం ప్రారంభించారు.

శివాజీ లాంటి మహా వీరుడి పాత్రలో నటించేందుకు వీల్లేదని కామెంట్స్‌ చేశారు. అంతేకాదు విడుదల చేసిన వీడియోలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పారు. ఛత్రపతి శివాజీ(Chhatrapati Shivaji) కాలంలో బల్బు కనిపెట్టలేదని.. మరి వీడియోలో లైట్స్‌ ఎందుకు వాడారని ఒకరు కామెంట్‌ చేయగా.. శివాజీ పాత్ర పోషించడానికి మరాఠీలో మంచి నటుడే దొరకలేదా అంటూ మరొకరు విమర్శించారు. మహేష్‌ మంజ్రేకర్ ‌(Mahesh Manjrekar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన ఇటీవల మాట్లాడుతూ..‘ఛత్రపతి శివాజీ గురించి ఎన్నో విషయాలు భారతదేశమంతా తెలియాల్సి ఉంది. అందుకే అక్షయ్‌ లాంటి పాన్‌ ఇండియా నటుడిని ఎంపిక చేసుకున్నాం. తను ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడు’ అని అన్నారు. అయితే, చాలా మంది నెటిజన్లు మాత్రం ఈ పాత్రకు శరద్‌కేల్కర్‌(Sharad Kelkar) అయితే సరిపోతారని అంటున్నారు. 

ఇక అక్షయ్‌ ఈ ఏడాది వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. ‘బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వి రాజ్, రక్షా బంధన్, కట్ పుత్లీ, రామ్ సేతు’ వంటి సినిమాల్లో కనిపించారు. తాజాగా ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు