Akshay Kumar: నన్ను క్షమించండి.. నేను ఇప్పుడే తప్పుకుంటున్నా: అక్షయ్‌కుమార్‌

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. గత కొన్నిరోజులుగా అభిమానుల నుంచి వస్తోన్న రియాక్షన్‌ తననెంతగానో బాధపెట్టిందని ఆయన అన్నారు. ఈమేరకు ఆయన తాజాగా.....

Updated : 21 Apr 2022 13:16 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. గత కొన్నిరోజులుగా అభిమానుల నుంచి వస్తోన్న ప్రతిస్పందన తననెంతగానో బాధపెట్టిందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. అసలేం జరిగిందంటే.. వరుస సినిమాలతో బిజీగా ఉంటోన్న అక్షయ్‌కుమార్‌ అప్పుడప్పుడూ కొన్ని వాణిజ్య ప్రకటనల్లోనూ యాక్ట్‌ చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, యువత భవిష్యత్తును నాశనం చేసే ధూమపానం, మద్యపానం వంటి ప్రకటనలు తాను చేయనని గతంలో అక్షయ్‌ చెప్పారు. కాగా, తాజాగా ఆయన, అజయ్‌దేవ్‌గణ్‌, షారుఖ్‌ఖాన్‌లతో కలిసి ఓ పొగాకు బ్రాండ్‌ వాణిజ్య ప్రకటనలో నటించారు. ఈ ప్రకటన గత కొన్నిరోజుల నుంచి ప్రసారం అవుతోంది. అది చూసిన అక్షయ్‌ అభిమానులు, నెటిజన్లు అసహనానికి గురయ్యారు. సోషల్‌మీడియా వేదికగా తమ వ్యతిరేకతను తెలియజేశారు. వెంటనే సదరు కమర్షియల్‌ నుంచి తప్పుకోవాలని కోరారు.

అభిమానుల నుంచి వస్తోన్న ప్రతికూల స్పందనల అక్షయ్‌ పెదవి విప్పారు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తోన్న ప్రతిఒక్కరికీ క్షమాపణలు చెప్పారు. ‘‘ఎన్నో ఏళ్ల నుంచి నన్నెంతగానో ఆదరిస్తోన్న అభిమానులు, శ్రేయోభిలాషులకు నా క్షమాపణలు. గత కొన్నిరోజులుగా మీ నుంచి వస్తోన్న ప్రతికూల స్పందన నన్నెంతగానో కలచివేసింది. నేనెప్పటికీ పొగాకు వ్యతిరేకినే. మీ అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని ఆ యాడ్‌ నుంచి తప్పుకొంటున్నాను. అలాగే ఆ యాడ్‌ కోసం నాకు లభించిన మొత్తాన్ని ఓ మంచి పని కోసం ఉపయోగించాలనుకుంటున్నా. కాంట్రాక్ట్‌ ఉన్న కారణంగా న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఈ యాడ్‌ ప్రసారం అవుతూనే ఉంటుంది. ఇక భవిష్యత్తులో ప్రతి విషయంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని మీకు మాటిస్తున్నా’’ అని అక్షయ్‌ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని