Akshay Kumar: కెనడా పౌరసత్వం వదులుకుంటా: అక్షయ్‌ కుమార్‌

Akshay Kumar Citizenship: కెనడా పౌరసత్వం వదులుకోబోతున్నట్లు అక్షయ్‌ కుమార్‌ తెలిపారు. అసలు ఆ దేశ పౌరసత్వం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

Published : 24 Feb 2023 16:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెనడా పౌరసత్వాన్ని (Canada Citizenship) వదులుకోబోతున్నానని బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kuma) వెల్లడించారు. తనకు అన్నీ ఇచ్చిన భారత్‌ పౌరసత్వాన్ని తిరిగి పొందాలని అనుకుంటున్నానని చెప్పారు. అసలు కెనడా పౌరసత్వం తీసుకోవడం వెనుక కారణమేంటో తాజాగా ఓ టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఇవేవీ తెలియని కొందరు తనపై విమర్శలు చేస్తుంటారని చెప్పారు.

2017లో ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ చిత్రం ప్రమోషన్ల సమయంలో తాను కెనడా పౌరసత్వం కలిగి ఉన్న విషయాన్ని అక్షయ్‌ బయటపెట్టారు. అయితే, 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని అక్షయ్‌ ఇంటర్వ్యూ చేసిన అనంతరం అక్షయ్‌పై విమర్శలు వచ్చాయి. భారతీయులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అక్షయ్‌ అప్పట్లో కోరారు. ఓటు హక్కు లేని వ్యక్తి భారత పౌరులకు ఓటింగ్‌కు పిలుపివ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై 2019లోనే ఆయన వివరణ ఇచ్చారు. తాను కెనడా పౌరసత్వం గురించి ఎప్పుడూ దాయాలనుకోలేదని, గడిచిన ఏడేళ్లుగా భారత్‌లోనే ఉంటూ ఇక్కడే పన్నులు చెల్లిస్తున్నానని అప్పట్లో వివరణ కూడా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో పౌరసత్వం అంశం తాజాగా ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో చర్చకు వచ్చింది. దీనిపై అక్షయ్‌ మాట్లాడుతూ.. కెనడా పౌరసత్వం వదులుకుంటున్న విషయాన్ని చెప్పారు. ‘‘భారత్‌ నాకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడు అనుభవిస్తున్నదంతా ఈ దేశం నాకు ఇచ్చిందే. నా దేశానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నా. భారత పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా. అది రాగానే కెనడా పౌరసత్వాన్ని  వదులుకుంటా’’ అని వివరించారు. ఈ సందర్భంగా కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాన్ని వివరించారు.

‘‘1990ల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. వరుసగా 15 సినిమాలు పరాజయం పాలయ్యాయి. కెనడాలో ఉన్న స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నా. అందుకోసమే పాస్‌పోర్ట్‌కు అప్లయ్‌ చేశా. అప్పుడే కెనడా పాస్‌పోర్ట్‌ వచ్చింది. ఇంతలో అప్పటికే నటించిన రెండు సినిమాలు భారత్‌లో ఘన విజయం సాధించడంతో అక్కడికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఇక్కడే మరిన్ని అవకాశాలు తలుపుతట్టాయి. ఈ క్రమంలోనే పాస్‌పోర్ట్‌ విషయం మరిచిపోయా. అందుకే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా’’ అని అక్షయ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని