Actor Brahmaji: కృష్ణవంశీ, రమ్యకృష్ణలే మా పెళ్లి చేశారు: బ్రహ్మాజీ
Actor brahmaji: వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అలా మొదలైంది’ షోలో బ్రహ్మాజీ ఆయన సతీమణి పంచుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం..
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ (Actor Brahmaji). కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అగ్ర హీరోలతో పాటు, నేటి యువ హీరోలతోనూ తెరను పంచుకున్నారు. వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘అలా మొదలైంది’ షోకు తన సతీమణి శాశ్వతితో కలిసి విచ్చేసి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మీరిద్దరూ ఎలా కలిశారు?
శాశ్వతి: నేను, బ్రహ్మాజీ కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశాం. అప్పుడు ఆయనకు పెద్ద కళ్లు, మీసం, జుట్టు ఉండేవి. కొన్నేళ్లపాటు మా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. బ్రహ్మాజీకి నేనంటే ఇష్టమని మరో ఫ్రెండ్ చెబితే తెలిసింది. ఆ తర్వాత ఒక రోజు నా దగ్గరికి వచ్చి, ‘నువ్వంటే ఇష్టం. కాదంటే చెయ్యి కోసుకుని చచ్చిపోతానని బ్లేడ్ తీసుకుని వచ్చాడు’ దీంతో ఐ లవ్ యూ చెప్పక తప్పలేదు. (నవ్వులు)
బ్రహ్మాజీ: సాధారణంగా ఒక మనిషిలో క్యారెక్టర్, పర్సనాలిటీ చూస్తాం. ఎలా మాట్లాడుతున్నారో చూస్తాం. శాశ్వతి విషయంలో ఆమె క్యారెక్టర్ నాకు నచ్చింది. అందుకే ప్రేమించా.
మీ పెళ్లి ఎక్కడ, ఎలా జరిగింది?
బ్రహ్మాజీ: మేము పెళ్లి చేసుకున్న విషయం మా ఇళ్లలో తొలుత తెలియదు. కృష్ణవంశీ, రమ్యకృష్ణలే మా పెళ్లి చేశారు. నా తరపున గంగరాజుగారు, ఆమె తరపున జగపతిబాబు సోదరుడు రాం ప్రసాద్ పెళ్లికి వచ్చారు. కృష్ణవంశీ కన్యాదానం చేశాడు. కోఠిలోని ఆర్య సమాజ్‌లో మా వివాహం జరిగింది. అదే సమయంలో ‘చంద్రలేఖ’ షూటింగ్ జరుగుతుండటంతో అందరూ ఉదయం 8 గంటలకే వచ్చేశారు. నాగార్జున కూడా రావాలి కానీ, కుదరలేదు.
శాశ్వతి: కృష్ణవంశీ టీమ్ మా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసింది. నా బ్లౌజ్ కూడా రమ్యకృష్ణనే చెన్నై నుంచి కుట్టి తీసుకొచ్చారు. పెళ్లి అయిన తర్వాత ఒక గ్రూప్ ఫొటో దిగాం. అంతే.. బ్రహ్మాజీతో సహా అందరూ హడావిడిగా బయలుదేరారు. మోహన్‌బాబుగారి సినిమా షూటింగ్ అనంతపురంలో జరుగుతోంది. ఆ సినిమా కారు బయట వేచి చూస్తోంది. దీంతో పెళ్లి షర్టు, ప్యాంట్ మార్చుకుని వెళ్లిపోయారు. మూడు రోజుల తర్వాత మళ్లీ వచ్చారు. (నవ్వులు)
బ్రహ్మాజీ: చాలా మంది ఆర్టిస్ట్‌ల కాంబినేషన్ కావడంతో పెళ్లి అవగానే షూటింగ్‌కు రమ్మని మోహన్‌బాబుగారు చెప్పారు. అనంతపురంలో నా రూమ్మేట్ ఏవీఎస్‌గారు. ఆ రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత రూమ్‌కు వెళ్తే ‘ఫస్ట్ నైట్ నాతో గడుపుతున్నావ్’ అని సరదాగా ఆటపట్టించారు.
మీ భాగస్వామిని ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చేశారా?
శాశ్వతి: నాకు ఎలాంటి ఆలోచనలు రావు. నేనెప్పుడూ ఓపెన్‌గా ఉంటా. నేను ఎలా ఉన్నా ఎప్పుడూ ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉంటారు. పొరపాటున ఏదైనా చేస్తే, జీవితాంతం అలాగే ఉండాలంటారు. అందుకే నేనేమీ సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేయను. నన్ను ప్రేమించినా, ద్వేషించినా ఒకేలా ఉంటా.
బ్రహ్మాజీ: తన పుట్టినరోజు అంటే అప్పుడప్పుడు సర్‌ప్రైజ్‌లు ఇస్తా. వాళ్ల అమ్మా నాన్న, స్నేహితులను కూడా పిలుస్తా.
శాశ్వతి: ఈయన బాగానే సర్‌ప్రైజ్‌లు చేస్తారు. దాదాపు పాతిక, ముఫ్పై మంది వస్తారు. ఆ రోజు నాకు బాగానే ఉంటుంది. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో పని చేసుకోలేక అలసిపోతా. దాంతో జ్వరం వస్తుంది.
బ్రహ్మాజీ: చెన్నైలో అవకాశాల కోసం తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడు కృష్ణవంశీ నా రూమ్మేట్. శాశ్వతి పుట్టిరోజు నాడు ఆమెను హోటల్‌కు తీసుకెళ్లాలని అనుకున్నా డబ్బులు ఉండేవి కాదు. ఒకసారి కృష్ణవంశీ తన దగ్గర రూ.2 వేలు ఉంటే తీసి ఇచ్చాడు. మరొకసారి నా గొలుసు తాకట్టు పెట్టి సెలబ్రేషన్స్ చేశా.
పెళ్లికి ముందు మీ జీవితంలో జరిగిన మర్చిపోలేని సంఘటన?
బ్రహ్మాజీ: ఎవరికీ చెప్పకుండా ఆగ్రా వెళ్లాం.
మీ జీవితంలో జరిగిన సినిమాటిక్ ఘటన ఏది?
బ్రహ్మాజీ: మా పెళ్లే పెద్ద సినిమాటిక్. నాకు పెళ్లి జరిగిన విషయాన్ని చాలా క్యాజువల్‌గా మావాళ్లకు ఫోన్ చేసి చెప్పా. వాళ్లు ఆశ్చర్యపోయారు. ముందుగానే మా వాళ్లకు చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే అప్పటికే శాశ్వతికి పెళ్లయింది. విడాకులు తీసుకుంది. మా పెళ్లి విషయం తెలిసిన తర్వాత ‘ముందే చెప్పి ఉంటే బాగుండేది కదా’ అన్నారు.
పెళ్లికి ముందు ఫోన్‌లో మాట్లాడుకునేవారా?
బ్రహ్మాజీ: అప్పట్లో సెల్‌ఫోన్‌లు లేవు. ఎస్టీడీ బూత్‌లు. గంటలు గంటలు మాట్లాడేవాడిని. అప్పట్లో నా జీవితంలో రెండు, మూడు గంటలు పబ్లిక్ బూత్‌ల దగ్గర గడిచింది. నేను ఎప్పుడు ఫోన్ పెట్టేస్తానా? అని చాలా మంది ఫోన్ బూత్ బయట వేచి చూస్తూ ఉండేవాళ్లు.
బ్రహ్మాజీలో నచ్చిన క్వాలిటీ ఏది?
శాశ్వతి: బ్రహ్మాజీలో ఓపిక అంటే నాకు నచ్చే క్వాలిటీ. పరిస్థితులు ఎలా ఉన్నా స్వీకరించడం, ప్రతి ఒక్కరి పట్ల ఎంతో గౌరవం, శ్రద్ధగా ఉండటం.
బ్రహ్మాజీ: ఎప్పుడూ జోష్‌గా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది. సీక్రెట్స్ చెప్పలేదు. డేరింగ్‌గా ఉంటుంది. ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి అంటుంటుంది. తన వల్ల నాకు క్రమశిక్షణ అలవడింది. నాకు మామూలుగా చాలా మొహమాటం. ఫ్రెండ్స్‌కు డబ్బులు ఇస్తా. సోమవారం ఇస్తానని చెప్పి ఇవ్వరు. ఆమెకు చెబితే, ఫోన్ చేసి, మాట్లాడితే చాలు. సాయంత్రానికి వచ్చేస్తాయి.
శాశ్వతి: నన్ను విలన్ చేయాలని చూస్తున్నారు.
మధ్యలో వెన్నెల కిషోర్ అందుకుని, ‘‘మేడమ్.. మీ భర్త ఇచ్చిన డబ్బులే మీరు వసూలు చేస్తారా? ఫ్రెండ్స్‌కు కూడా ఈ విషయంలోసాయం చేస్తారా?’’అని అడిగితే... లేదండీ నేను ‘రికవరీ’ కంపెనీ పెట్టాలనుకుంటున్నా. అని శాశ్వతి చెప్పారు (నవ్వులు)
ఎప్పుడైనా మీ మధ్య ఫైట్ జరిగిందా?
శాశ్వతి: సరదా కోసం నేనే ఎప్పుడైనా గొడవ పెట్టుకుంటా. ఆయన ఏం చెప్పినా, ఎదురుచెబుతా. దాంతో మా మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇందాక కారులో వచ్చేటప్పుడు కూడా మా మధ్య గొడవ జరిగింది.
బ్రహ్మాజీ: ఈ షో అయిపోయిన తర్వాత ‘నా గురించి అలా ఎందుకు, ఇలా ఎందుకు చెప్పావు’ అని గంటసేపు వాదించగలదు. అయితే, చివరకు తనే సారీ చెబుతుంది. ఈ మధ్య గొడవ జరిగితే వెంటనే కారు వేసుకుని బయటకు వెళ్లిపోతున్నా. మధ్యాహ్నం 12.30 అవ్వగానే ఇంట్లో వాళ్లందరూ కలిసి భోజనం చేయాలి. దీంతో ‘ఎక్కడ ఉన్నావ్’ అని ఆ టైమ్‌కి ఫోన్ చేస్తుంది. అప్పుడు నాకు ఇష్టమైనవి చేసి పెడుతుంది. ఇక తను తిట్టే తిట్లు అర్థం కాకపోతే, ట్రాన్స్‌లేట్ చేసి మరీ చెబుతుంది.
శాశ్వతి: నేనేదో జాలి తలిచి సారీ చెప్పను. అప్పటికి నా మూడ్ సరైపోతుంది. మళ్లీ దాన్ని పాడుచేసుకోవడం ఎందుకని సారీ చెబుతా.
ఒకరినొకరు ప్రేమగా ఏమని పిలుచుకుంటారు?
శాశ్వతి: ప్రేమ ఎక్కువైతే బాజూ అని పిలుస్తా. నాకు కోపం వస్తే, బ్రహ్మాజీ అని పిలుస్తా.
బ్రహ్మాజీ: తనని చాచూ అని పిలుస్తా.
ఈ షోలో ఎలా అనిపించింది?
బ్రహ్మాజీ: ఈ షోలో నువ్వు (వెన్నెల కిషోర్) ఉంటావని, బాగుంటుందని అనుకున్నా. కానీ మీ ఇద్దరూ నన్ను టార్గెట్ చేశారు. మీరు బాగా ఎంజాయ్ చేశారు. (నవ్వులు)
బ్రహ్మాజీ, ఆయన సతీమణితో మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణలు, వారితో వ్యాఖ్యాత వెన్నెల కిషోర్ ఆడించిన సరదా ఆటలను ఈటీవీ విన్ యాప్‌లో వీక్షించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vivek Ramaswamy: వివేక్ రామస్వామితో డిన్నర్ ఆఫర్.. ఒక్కొక్కరికి 50 వేల డాలర్లపైమాటే!
-
ముందు ఈ మూడు పనులు చేయండి.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు