‘ఓబూ.. నీ మనసులోని బాధను ఎవరూ పట్టించుకోలేదు’: అలేఖ్యా రెడ్డి

తారకరత్న(Taraka Ratna)ను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి. పెళ్లి తర్వాత తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు చెప్పారు.

Updated : 20 Mar 2023 17:47 IST

హైదరాబాద్‌: తన భర్త, దివంగత నటుడు తారకరత్న(Taraka Ratna)ను గుర్తు చేసుకుంటూ తాజాగా ఓ భావోద్వేగపు పోస్ట్‌ పెట్టారు అలేఖ్యా రెడ్డి (Alekhya Reddy). తమ పెళ్లి జరిగిన నాటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పారు. అయిన వాళ్లు చూపించిన ద్వేషం వల్ల తన భర్త మానసిక వేదనకు గురయ్యాడని తెలిపారు.

‘‘నువ్వు మాకు దూరమై సరిగ్గా నెల రోజులు అవుతోంది. నీ జ్ఞాపకాలు ఇంకా నా మదిలో అలాగే ఉన్నాయి. మనం కలిశాం.. స్నేహితులమయ్యాం.. డేటింగ్‌లో ఉన్నాం.. మన బంధం ముందుకు కొనసాగుతుందా? అనే సందేహంలో ఉన్నప్పుడు జీవితంలో కొత్త ప్రయాణం పట్ల నువ్వు పూర్తి నమ్మకంతో ఉన్నావు. ఆ నిర్ణయం వల్ల నువ్వు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నావు. మన పెళ్లి జరిగింది. గందరగోళ పరిస్థితుల్లో మనం వివక్ష ఎదుర్కొన్నాం. ఇబ్బందులు ఎదురైనా మనం సంతోషంగా ముందుకు సాగాం. నిష్కా పుట్టిన తర్వాత మన జీవితం ఎంతో మారింది. సంతోషం పెరిగినప్పటికీ బాధ అలాగే కొనసాగింది. రోజూ ఏదో ఒక విధంగా ద్వేషాన్ని ఎదుర్కొన్నాం. అలాంటి సమయంలో 2019లో ఒక అద్భుతం జరిగింది’’

‘‘మనకు కవల పిల్లలు జన్మించారు. కుటుంబాన్ని నువ్వు ఎంతో మిస్‌ అవుతున్న కారణంగా మనకంటూ ఒక పెద్ద కుటుంబం ఉంటే బాగుంటుందని అనుకున్నావు. చివరి వరకూ నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు. సొంతవాళ్ల వల్లే నీ మనసుకు బాధ కలిగింది. కానీ, దాన్ని ఎవరూ అర్థం చేసుకోలేదు. ఆఖరికి నేను కూడా నిన్ను ఆ బాధ నుంచి బయటకు తీసుకురాలేకపోయాను. మనతో మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్లే చివరి దాకా అండగా నిలిచారు. మనం ఎవరిని అయితే కోల్పోయామో వాళ్లు నీ చివరి చూపునకు కూడా రాలేదు. నీతో ఉన్నది తక్కువ సమయమే అయినప్పటికీ.. నీ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నాను. శాంతి, సంతోషం ఉన్న చోట మనం మళ్లీ కలుసుకుందాం’’ అంటూ ఆమె ఎమోషనల్‌ పోస్ట్‌  పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని