Updated : 14 Apr 2022 13:11 IST

Alia Ranbir: ఒక్కటికానున్న ఆలియా-రణ్‌బీర్‌.. వేదిక మారిందా..!

ముంబయి: బాలీవుడ్‌ ప్రేమజంట ఆలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో వీరి వివాహ వేడుక గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు జరగనుంది. బాంద్రాలోని వాస్తు అపార్ట్‌మెంట్‌లో జరగనున్న ఈ పెళ్లికి అతి తక్కువమంది కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరు కానున్నారు. ఇప్పటికే ఆలియా తల్లిదండ్రులు, రణ్‌బీర్‌ కుటుంబసభ్యులు వివాహవేదిక వద్దకు చేరుకొని పెళ్లి పనులు దగ్గరుండి చూసుకొంటున్నారు. వధూవరులకు హల్దీ వేడుక పూర్తి చేశారు. మరోవైపు బుధవారం సాయంత్రం జరిగిన మెహందీ వేడుకల్లో ఇరువురి కుటుంబసభ్యులతోపాటు కరీనాకపూర్‌, కరీష్మాకపూర్‌, జాన్వీకపూర్‌, సారా అలీఖాన్‌, కరణ్‌ జోహార్‌, ఆయాన్‌ ముఖర్జీ దంపతులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

రాత్రి ఏడుగంటలకు మొదటి పిక్‌...!

తమ జీవితాల్లో స్పెషల్‌గా చెప్పుకునే ఈ వేడుకలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా రణ్‌బీర్‌-ఆలియా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పెళ్లి వేదిక వద్ద విధులు నిర్వర్తించనున్న సెక్యూరిటీ సిబ్బంది సెల్‌ఫోన్‌ కెమెరాలకు స్టిక్కర్లు అతికించారు. ఇక ఈ రోజు రాత్రి 7 గంటల సమయంలో తమ పెళ్లి తొలి ఫొటోని సోషల్‌మీడియాలో ఆలియా-రణ్‌బీర్‌ పంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాబోయే కోడలిపై నీతూ పొగడ్తలు..

నీతూకపూర్‌కు ఆలియాభట్‌ అంటే మొదటి నుంచి ఇష్టమే అయినప్పటికీ ఆమె ఎప్పుడూ మీడియా ముందు ఆ విషయాన్ని పెద్దగా బయటపెట్టలేదు. తాజాగా మెహందీ వేడుక పూర్తైన అనంతరం నీతూ, ఆమె కుమార్తె మీడియాతో మాట్లాడారు. ఆలియాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇక నీతూ అయితే.. తనకు కాబోయే కోడలు ‘ది బెస్ట్‌’ అంటూ కాంప్లిమెంట్‌ ఇచ్చేశారు. తన మరదలు చాలా క్యూట్‌గా ఉంటుందని.. రణ్‌బీర్‌-ఆలియా జోడీ చూడముచ్చటగా కనిపిస్తోందని నీతూ కుమార్తె చెప్పుకొచ్చింది.

ఖరీదైన గిఫ్ట్‌ ప్లాన్‌ చేసిన రణ్‌బీర్‌..!

తనకు కాబోయే భార్య ఆలియాభట్‌కు రణ్‌బీర్‌ ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకున్నారట. ఇందుకోసం ఆయన ఎనిమిది వజ్రాలతో కూడిన చేతి బ్యాండ్‌ని ప్రత్యేకంగా సిద్ధం చేయించారట. వివాహ వేదికపై కుటుంబసభ్యుల అందరి సమక్షంలో ఆలియా చేతికి రణ్‌బీర్‌ దీనిని తొడగనున్నారట. దీని కోసం ఆయన భారీగానే ఖర్చు చేసినట్లు సమాచారం. కపూర్‌ కుటుంబానికి 8 అదృష్టసంఖ్య అని.. అందుకే రణ్‌బీర్‌ తనకు కాబోయే సతీమణి కోసం 8 వజ్రాలతో బ్యాండ్‌ తయారు చేయించినట్లు వార్తలు వస్తున్నాయి.

వేదిక మారిందా..!

బాలీవుడ్‌ సెలబ్రిటీలు, ఇతర స్నేహితుల కోసం ఈ నెల 16న వివాహ విందు ఇవ్వాలని ఆలియా-రణ్‌బీర్‌ భావించారు. ఈ విందు కోసం ముంబయిలోని తాజ్‌ హోటల్‌ని మొదట వేదికగా అనుకున్నారు. కానీ, భద్రతా కారణాల రీత్యా ఆ వేదికను మార్చినట్టు సమాచారం. వాస్తు అపార్ట్‌మెంట్‌లోనే వివాహ విందు కూడా ఏర్పాటు చేయాలని ఇరు కుటుంబపెద్దలు భావించారట. ఈమేరకు బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని