Subhashri: పాఠశాలకు వెళ్లకుండా ఉండేందుకు సినిమాల్లోకి వచ్చా..శుభశ్రీ

జెంటిల్‌మెన్‌లో అల్లరిపిల్ల..తమిళంలో అగ్రదర్శకుల సినిమాల్లో హీరోయిన్‌..చిలిపి పాత్రలతో యువతరంలో గిలిగింతలు పెట్టిన శుభశ్రీ..అంటే తెలియని వారుండరు..

Updated : 13 May 2022 12:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘జెంటిల్‌మెన్‌’లో అల్లరిపిల్ల.. తమిళంలో అగ్ర దర్శకుల సినిమాల్లో హీరోయిన్‌.. చిలిపి పాత్రలతో యువతరంలో గిలిగింతలు పెట్టిన శుభశ్రీ అంటే తెలియని వారుండరు. హీరోయిన్‌గానే కాదు.. ముఖ్యమైన పాత్రలతో తెలుగులో ప్రేక్షకులను అలరించారు. వివాహానంతరం వెండితెరకు దూరమైన ఆమె దాదాపుగా 27 ఏళ్ల తర్వాత మళ్లీ తెర ముందుకు వచ్చారు. ఆలీతో సరదాగా కార్యక్రమంలో సినిమా అనుభవాలతో పాటు వ్యక్తిగత విషయాలను తెలిపారు.

భారతీ పాండే అసలు పేరు కదా..? శుభశ్రీగా ఎలా మారింది..?

శుభశ్రీ: అసలు పేరు భారతీ పాండే. పెళ్లయిన తర్వాత భారతీ భువన్యా అయ్యింది. అక్కలాగే నాకు కూడా పార్వతి రాజ్‌కుమార్‌గారు శుభశ్రీగా పేరు మార్చారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో సుమారుగా 30 సినిమాల్లో నటించా.

మాలాశ్రీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత శుభశ్రీ సినిమాల్లోకి రావడానికి కారణం ఏంటి..?

శుభశ్రీ: అక్కతో షూటింగ్‌లకు వెళ్లేదాన్ని. త్యాగరాజన్‌గారు చూసి ఈ అమ్మాయి సినిమాల్లో చేస్తుందా? అని మా పిన్నిని అడిగారు. పాఠశాలకు వెళ్లనవసరం ఉండదనే ఉద్దేశంతో సినిమా చేస్తానని చెప్పా. అప్పటికి నా వయసు 14 ఏళ్లు ఉంటుంది. అలా తమిళంలో తొలిసారి ఎంగతంబి మూవీ ప్రశాంత్‌తో చేశా. 

ప్రముఖ దర్శకుడు శంకర్‌కి ఎవరు పరిచయం చేశారు..?

శుభశ్రీ: శంకర్‌గారు మా ఇంటి కిందనే ఉండేవారు. ఎంగతంబి షూటింగ్‌ అవుతుండగానే త్యాగరాజన్‌గారు శంకర్‌గారికి నా గురించి చెప్పడంతో ‘జెంటిల్‌మెన్‌’లో అవకాశం వచ్చింది. 

మొదటి తెలుగు సినిమా ఏది..?

శుభశ్రీ: వినోద్‌కుమార్‌ హీరోగా నటించిన ‘అందరూ అందరే’. ‘గ్యాంగ్‌మాస్టర్‌’ రెండో సినిమా. కృష్ణంరాజు, రాజశేఖర్‌ ఉన్నారు. నా ఫేవరేట్‌ సినిమా అది. 

మీ భర్త ఎలా ఉన్నారు...? ఎక్కడ పరిచయం?

శుభశ్రీ: బాగున్నారు..స్మార్ట్‌గా ఉంటాడు. నిజంగా చెప్పాలంటే నాకు తమ్ముడిలా ఉంటారు. బెంగళూరులో ఎదురెదురు ఇళ్లు మావి. పిల్లలందరం ఆడుకునే వాళ్లం. అక్కడే పరిచయం అయ్యింది. ఆయన తమ్ముడు నాకు స్నేహితుడు. మేమంతా ఆడుకుంటుంటే.. ఆయన గేటు దగ్గర సైటు కొట్టేవారు. మెల్లమెల్లగా మాటలు మొదలై స్నేహంగా మారింది. ఇటు మా ఇంట్లో, అటు వాళ్ల ఇంట్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చే వాళ్లు. అందుకే అందరూ పడుకున్న తర్వాత ఒంటిగంటకు కలుసుకునే వాళ్లం. మాకు వాచ్‌మెన్‌, వంటవాడు కాపలాగా ఉండేవారు. ఆయన ఇంజినీరింగ్‌ పూర్తయ్యేదాకా సినిమాల్లో చేస్తానని చెప్పా. అలాగే తర్వాత మానేశా. 

మీ పెళ్లి ఎప్పుడైంది? వాళ్లింట్లో అభ్యంతరం వ్యక్తం చేశారా..?

శుభశ్రీ: 1998లో పెళ్లి అయ్యింది. మా బెంగళూరులో టై, క్యాప్‌, కార్పొరేట్‌ గిఫ్టింగ్‌.. ఇలా విభిన్న రకాల బిజినెస్‌లు చేస్తారు. పెళ్లి మా వాళ్ల ఇంట్లో అభ్యంతరం పెట్టలేదు గానీ సినిమా వాళ్లంటే ప్రైవసీ ఉండదని చెప్పేవారు. మెల్లమెల్లగా ఒప్పించాను. ఇప్పుడు సినిమాల్లోకి వెళ్లాలని మా అత్తగారే సూచించారు. 

ఒక సినిమాలో డైరెక్టర్‌ తిట్టాడని మేకప్‌ లేకుండా నటించారట..?

శుభశ్రీ: ‘అత్తా నీ కొడుకు జాగ్రత్త’. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకుడు. మేకప్‌ వేసుకొని వచ్చా. చూసి తిట్టారు. కోపంలో మేకప్‌ మొత్తం తీసుకొని వచ్చా..ఇలాగే చేస్తానని చెప్పా. 

శుభశ్రీ రెబలా..? సాఫ్ట్‌..?కూలా..?

శుభశ్రీ: ఒకప్పుడు రెబల్‌గా ఉండేదాన్ని.. ఇప్పుడు సాఫ్ట్ అండ్‌ కూల్‌.  మాతృత్వం తర్వాత మార్పు వచ్చింది. 

మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు..? ఎక్కడున్నాడు..? సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా..?

శుభశ్రీ: ప్రస్తుతం చదువుకుంటున్నాడు. వాడికి సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉంది. ముందు నువ్వు సినిమాల్లో నటించు..నేను తర్వాత వస్తానన్నాడు. 

పెళ్లి తర్వాత ‘ఇంత తొందరగా ఎందుకు సినిమా ఇండస్ట్రీని వదిలేశానా’ అని అనిపించిందా..?

శుభశ్రీ: చాలాసార్లు అనిపించింది. ఆయనతో కూడా అనేదాన్ని. సినిమాల్లో ఉంటే అక్కలాగా ఇప్పటికీ సినిమాలు చేసేదాన్ని కదా.. అనిపించేది. కానీ అప్పట్లో పెళ్లి కావాలా..? సినిమాలు కావాలా? అంటే పెళ్లి కావాలని చెప్పా. మ్యారేజ్‌ లైఫ్‌ని చాలా ఎంజాయ్‌ చేశా. 

వర్కవుట్స్‌ బాగా చేస్తారట..!

శుభశ్రీ: ఇప్పుడే మొదలు పెట్టా. నేను చాలా బద్దకస్తురాలిని. మా ఆయన ఎప్పుడూ తిడుతుంటారు. స్పిన్‌ సైకిల్‌ కావాలని వెంటపడ్డా. జిమ్‌కు వెళ్లు. వాకింగ్‌ చేయమంటే..నాకు స్పిన్‌ సైకిల్‌ కొనివ్వు. సన్నపడి చూపిస్తానన్నా..వారం పాటు చేశా..తర్వాత టవల్‌ ఎండేయడం, బట్టలు ఆరేయడానికి స్పిన్‌ సైకిల్‌ను ఉపయోగించా. 
మీ స్కూల్‌ ప్రిన్సిపల్‌ నీ కంట పడకూడదని అనుకునే వారట..?

శుభశ్రీ: చిన్నప్పుడు చాలా అల్లరి చేసే దాన్ని. పాఠశాలలో ఏ సంఘటన జరిగినా అందులో నేనుండేదాన్ని. తరచూ ప్రిన్సిపల్‌ ఆఫీస్‌కు తీసుకెళ్లేవారు. ఇలా వారం వారం జరిగేది. చదువంటే నాకిష్టం ఉండేది కాదు.. మ్యాథ్స్‌ అంటే గ్రౌండ్‌లోకి వెళ్లిపోయేదాన్ని.. చివరికి నాకే టీసీ ఇచ్చి పంపించారు. చాలా కష్టపడి 7వతరగతి దాకా చదివా. 

చిన్నప్పుడు మీ నాన్న గ్లాసులో మద్యం పోస్తే జ్యూస్‌ అనుకొని తాగారట..?

శుభశ్రీ: మా నాన్న ప్రతి ఆదివారం మద్యం తీసుకునేవారు. అమ్మ నాన్‌వెజ్‌ వండుతుంటే.. నాన్న సహాయం చేయడానికి వెళ్లారు. అప్పటికే గ్లాస్‌లో మద్యం పోశారు. నేను ఆడుకుంటూ వచ్చి జ్యూస్‌ అనుకుని కొంచెం కొంచెం తాగివెళ్లా.. చివరిగా తాగుతుంటే వెనక నుంచి వచ్చి ఒక్కటేశారు. ‘ఎందుకు కొడుతారు. చంపేయండి’ అంటూ వెళ్లిపోయా. మద్యం ఫుల్‌గా ఎక్కేసింది. అగర్‌బత్తి తీసుకెళ్లి నాన్నకు పూజ చేయడంలాంటివి చేశా. 

పెద్దరాయుడు సినిమాలో అవకాశం వస్తే చేయనని చెప్పారట..?

శుభశ్రీ: నటించనని చేయనని చెప్పలేదు. క్యారెక్టర్‌ కొంచెం నచ్చలేదు. మోహన్‌బాబు సర్‌, రవిరాజా పినిశెట్టిగారు నువ్వే చేయి. .బాగుంటుందని చెప్పిన తర్వాత చేశా. 

భారతీరాజా సినిమా మిస్సయ్యిందట ఏంటది?

శుభశ్రీ: సినిమా పేరు గుర్తులేదండీ..అది తమిళ సినిమా. అప్పటికే ఒక తమిళ సినిమా చేస్తున్నా. డేట్స్‌ కుదరక పోవడంతో చేయలేదు. 

తిరుపతిలో దెబ్బలు తిన్నావెందుకు..?

శుభశ్రీ: తిరుపతిలో మా మావయ్య పెళ్లికి వెళ్లా. ఆటలాడుకుంటూ..లడ్డూలు తింటూ అటు ఇటూ తిరగడంతో పెళ్లి సామాను పాడయ్యింది. నాన్న పిలిచి నాలుగు వేశారు. ఆ రోజంతా ఏడ్చుకుంటూ కూర్చున్నా. అమ్మ బతిమిలాడి అన్నం తినిపించారు. మరుసటి రోజే ప్రమాదంలో అమ్మ చనిపోయింది. 

మీ మొదటి సినిమాలో డైరెక్టర్‌ చెప్పిన మాటకు రెండు గంటలు ఏడ్చావట..?

శుభశ్రీ: ఓ సీన్‌లో ఏడవాలి. నాకు రావడం లేదు. మీ అమ్మ ఉంటే ఎలా ఉండేది..అది ఇది అంటూ ఎమోషన్‌లోకి తీసుకెళ్లారు. ఇక షూటింగ్‌ చేయనని ఏడ్చాను. ఎలాగోలా ఒప్పించి షూట్‌ చేయించారు. మంచి పేరు వచ్చింది. 

మీ ఆయన ఎప్పుడైనా గిఫ్ట్‌ ఇచ్చారా..?

శుభశ్రీ: నాకు బహుమతులు చాలా ఇచ్చేవారు. మొదటి బహుమతి డైమండ్‌ రింగ్‌ ఇచ్చారు. 1994-95లో పాకెట్‌ మనీ దాచుకొని నాకు ఆ రింగ్‌ కొనిచ్చారు. ఇప్పుడు ఆ రింగ్‌ పట్టడం లేదు కానీ దాచి ఉంచా. 

మీకు వంట బాగా వచ్చా..?

శుభశ్రీ: నేను నార్త్‌ ఇండియన్‌ వంటకాలు బాగా వండుతాను. నాకు ఇప్పటి వరకు ఉప్మా చేయడం రాదు. ఒకసారి చేస్తే మా అత్తామామ ఏమనుకున్నారో ఏమోగానీ తిన్నారు. నాకు చండాలంగా ఉందనిపించింది. వాళ్లు మాత్రం బాగుందన్నారు. 

ఎంత మంది అన్నదమ్ములు..? అప్పుడప్పుడు కలుస్తుంటారా..?

శుభశ్రీ: నలుగురం. పెద్దక్క,అన్నయ్య, మాలశ్రీ అక్క, నేను..కానీ ఇద్దరు అమ్మలు వేరైనా..మేం అలాగే చెప్పుకుంటాం.  మాలశ్రీపై ఒక కోపం ఉండేది. ఎప్పుడొచ్చినా మా అమ్మను తీసుకెళ్తావని అనేదాన్ని. అప్పుడప్పుడు కాదు..వారం వారం కలుసుకుంటాం. అంతా పిక్నిక్‌లాగా ఉంటుంది. 

జెంటిల్‌మెన్‌ షూటింగ్‌ అప్పుడు ప్రమాదం జరిగిందా..?

శుభశ్రీ: షాట్‌ మధ్యలో నాకు బైక్‌ తోలాలని ఆశ ఉండేది. ఆర్ట్‌ డైరెక్టర్‌ బైక్‌ ఉంది. నడుపుకుంటూ వెళ్లి నా బండికే ఢీ కొట్టా. కిందపడడంతో కాలు విరిగింది. అంతా రచ్చ రచ్చ అయిపోయింది.

శుభశ్రీ సినిమాల్లోకి వస్తుందా..? వస్తే ఎలాంటి పాత్రలు చేస్తారు..?

శుభశ్రీ: మంచి పాత్రలు..నాకు తగ్గట్టు ఉంటే చేస్తా. తల్లి, ఇతర క్యారెక్టర్లు ఏవైనా చేయగలను. కుటుంబ సభ్యులు ఒత్తిడి కూడా చేస్తున్నారు. ఆశ కూడా పెరిగింది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని