Ali: పవన్‌కు నాకూ మధ్య గ్యాప్ లేదు. వాళ్లే క్రియేట్ చేశారు: ఆలీ
Ali: తాను వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి కొంతకాలం విరామం తీసుకోనున్నట్లు నటుడు, కమెడియన్ ఆలీ అన్నారు. ఈ సందర్భంగా అనేక విషయాలను పంచుకున్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి, హాస్య నటుడిగా, హీరోగా 1000కు పైగా చిత్రాల్లో తనదైన నటనతో అలరించారు ఆలీ (Ali). అంతేకాదు వ్యాఖ్యాతగానూ బుల్లితెరపై చెరగని ముద్రవేశారు. ఆయన వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga) కార్యక్రమం 300లకు పైగా ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఈ షోకు కొంతకాలం విరామం ఇవ్వబోతున్నారు ఆలీ. దీంతో స్పెషల్ ఎపిసోడ్‌కు ఆలీనే అతిథిగా విచ్చేయగా, ప్రముఖ యాంకర్ సుమ ప్రశ్నలు అడిగారు. మరి ఆలీ పంచుకున్న ఆ ఆసక్తికర విషయాలను మీరూ చూసేయండి.
మీ షోకు మీరే గెస్ట్‌గా రావడం ఎలా అనిపిస్తోంది?
ఆలీ: చాలా ఆనందంగా ఉంది. నేను అక్కడ కూర్చొని ప్రశ్నలు అడగడం.. వాళ్లు సమాధానం చెప్పడం. ముఖ్యంగా వాళ్ల సక్సెస్ వెనుక ఉన్న కష్టం గురించి చెప్పేవారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు ఇలా అన్ని విభాగాల వాళ్లు వచ్చారు. దాదాపు ఆరేళ్ల పాటు ‘ఆలీతో సరదాగా’ జర్నీ సాగింది. కరోనా సమయంలో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకుని చేశాం. ప్రతి ఇంట్లో సోమవారం ఈ కార్యక్రమం చూడటం ఒక అలవాటుగా మారిపోయింది. ఒకవేళ ప్రోగ్రామ్ రాకపోతే, యూట్యూబ్‌లో పాత ఎపిసోడ్ పెట్టుకుని చూస్తున్నారు. ఈ షో చూసి కృష్ణంరాజు నన్ను మెచ్చుకునేవారు. ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు పెద్దలు కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరూ ఉన్నారు. వారితో ఓ ఎపిసోడ్ చేయాలనుకున్నాం. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత కరోనా కారణంగా కుదరలేదు. ఇండస్ట్రీకి పంచభూతాలు ఎవరంటే ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు. సినిమాల్లో వీళ్లతో నటించా, సెకండ్, థర్డ్ జనరేషన్స్‌తోనూ చేశా. ఇలాంటి అవకాశం భగవంతుడు చాలా తక్కువ మందికి ఇస్తాడు. నాకు దక్కింది. ఎక్కడికి వెళ్లినా, ‘ఆలీ మనోడు’ అనిపించుకున్నా. నేను చనిపోయేవరకూ ఇలాగే ఉంటా.
300+ ఎపిసోడ్స్ చేశారు కదా! వీటిల్లో మీకు బాగా నచ్చిన సెలబ్రిటీ ఎవరో చెప్పండి?
ఆలీ: బాల సుబ్రహ్మణ్యంగారు, పూరిజగన్నాథ్, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, మోహన్‌బాబు, బ్రహ్మానందం ఇలా గొప్ప నటులు, దర్శకులని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం నా అదృష్టం. మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల నాకు ఈ అవకాశం లభించింది. నేను మంచి చేస్తే.. అది నా పిల్లలకు వస్తుంది.
అందరికీ మీ కుటుంబ నేపథ్యం తెలిసినా, మళ్లీ ఒకసారి చెబుతారా?
ఆలీ: రెండో ప్రపంచ యుద్ధంలో సమయంలో మా నాన్నను తీసుకుని నాయనమ్మ బర్మా నుంచి ఇక్కడకు వచ్చేశారు. ఆమె అరబిక్ టీచర్. మా తండ్రి మేనమామ టైలర్. మనిషిని చూసి, కొలతలు నోటితో కొలిచి, డ్రెస్ కుట్టగల సమర్థుడు మా నాన్న. సూట్‌లు, భరతనాట్యం డ్రెస్‌లు కుట్టేవారు. అమెరికా నుంచి కూడా వచ్చి మానాన్న దగ్గర భరతనాట్యం డ్రెస్‌లు కుట్టించుకునేవారు. వాళ్లు తీసుకు వచ్చిన క్లాత్ మిగిలిపోతే మాకు ఫ్రీగా ఇచ్చేవారు. ఆరోజుల్లో భరతనాట్యం డ్రెస్ కుట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ‘భంగిమ’ అన్నప్పుడు డిజైన్ చేసిన క్లాత్ వేలాడుతూ కనిపించాలి. ఆ క్లాత్ అలా రావడానికి దాదాపు పదిరోజులు ఇస్త్రీ చేయాల్సి వచ్చేది. ఆ పని నేను చేసేవాడిని. ఎన్టీఆర్ సినిమా చూడాలంటే నాన్న ఈ పని చెప్పేవారు. అందుకు రూపాయి ఇచ్చేవారు. దాంతో సినిమా చూసేవాడిని. ఆ రోజుల్లో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే, జనాలు విపరీతంగా వచ్చేవారు. పురుషుల క్యూ అసలు ఖాళీ ఉండేది కాదు. మహిళల క్యూ దగ్గరకు వెళ్లి మూగవాడిగా నటించి, టికెట్లు సంపాదించేవాడిని. మా తండ్రిగారి మేనమామకు పిల్లలు లేకపోవడంతో ఆయన ఆస్తులను మా నాన్న పేరుమీద రాశారు. అది కొంతమంది చుట్టాలకు నచ్చలేదు. దీంతో ఒకరోజు ఇంటి బయట నిద్రపోతున్న సమయంలో వచ్చి దాడి చేశారు. ఆ దాడిలో నాన్న చనిపోయాడనుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎలాగో బతికారు. ‘ఆస్తి కోసం నన్ను చంపాలనుకున్నారు కదా. ఈ ఆస్తి నాకు వద్దు’ అని కట్టుబట్టలతో మచిలీపట్నం నుంచి రాజమండ్రి వచ్చేశారు.
హనుమంతరావు అనే హెడ్ కానిస్టేబుల్ మా నాన్నకు స్నేహితుడు. ఆయన ఒక మెషీన్ అద్దెకు ఇప్పించారు. ఆ తర్వాత నెమ్మదిగా మా నాన్న రెండు మెషీన్లు కొని, పనివాళ్లను పెట్టుకుని బట్టలు కుట్టేవారు. మేం మొత్తం ఏడుగురు సంతానం. మా పెద్ద అక్కకు పెళ్లి చేసిన తర్వాత ఒక బాబు పుట్టాడు. రెండోసారి కడుపుతో ఉండగా, పిల్లవాడి కోసం పాలు కాస్తూ చీర కొంగుకు నిప్పు అంటుకుని ఒళ్లు కాలిపోయింది. ఆ సమయంలో మంటలు ఆర్పేందుకు ఒక వ్యక్తి నీళ్లు పోయడంతో కాలిన గాయాలకు ఇన్‌ఫెక్షన్ సోకి అక్క, ఆమె కడుపులో ఉన్న బిడ్డా ఇద్దరూ చనిపోయారు. దీంతో మా తండ్రి డీలా పడిపోయారు. మా అమ్మ ధైర్యం చెప్పి పనికి పంపారు. ఆ తర్వాత నాన్న చెన్నై వెళ్లి సర్కస్ వాళ్లకు బట్టలు కుట్టడం మొదలు పెట్టారు. ఇంట్లో తిడితే చెన్నై పారిపోయి, ఆలీ నటుడు అయ్యాడని అప్పట్లో పేపర్‌లో రాసేవారు. కానీ, అది నిజం కాదు. మా నాన్న స్వయంగా షూటింగ్‌లకు తీసుకెళ్లేవారు. ఫ్యామిలీ రాజమండ్రిలో ఉండటంతో నాన్న చెన్నైలో ఎక్కువ రోజులు ఉండేవారు కాదు. నన్ను అక్కడ ఎవరో ఒకరికి అప్పగించి వెళ్లిపోయేవారు. షూటింగ్ అయిపోయిన తర్వాత నేను సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి రాజమండ్రి వచ్చేవాడిని. దాదాపు ఎనిమిదేళ్ల పాటు బాలనటుడిగా నటించా. నా మొదటి సినిమా ‘సీతాకోకచిలుక’ అని చాలా మంది అనుకుంటారు. కానీ అది కాదు. ఏడో సినిమా అది. నా తొలి సినిమా ‘పునాదిరాళ్లు’. ఈ సినిమా తీసిన వాళ్లు మా బంధువులు. రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుండగా.. మా నాన్న నన్ను తీసుకెళ్లారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నన్ను కూడా సినిమాలో పెట్టారు. అది నేను నటించిన తొలి చిత్రం. చిన్నప్పటి నుంచి మిమిక్రీ చేసేవాడిని. శ్రీపాద జిత్‌మోహన్ మిత్ర మా గురువు. ఆయన ఆర్కెస్ట్రాలో మిమిక్రీ చేసేవాడిని.
మీ కెరీర్‌లో అందుకున్న మొదటి షీల్డ్ ఏది? ఏ సినిమాకు తీసుకున్నారు?
ఆలీ: నా కెరీర్‌లో మొదటిసారి ‘సీతాకోకచిలుక’ వందరోజులు ఆడిన సందర్భంగా షీల్డ్ తీసుకోవడానికి వెళ్లా. రావుగోపాలరావు ఆ కార్యక్రమానికి యాంకర్. ‘మల్లె పందిరి’ సినిమా షూటింగ్ ముగించుకుని కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. మా గురువుగారు జిత్‌మోహన్, ఆయన కూతురికి, నాకూ దెబ్బలు తగిలాయి. దీంతో ట్రీట్‌మెంట్ తీసుకుని రాజమండ్రి వెళ్లిపోయాం. యాక్సిడెంట్ గురించి ఇంట్లో చెప్పా. అప్పుడు మా అమ్మ ఇంట్లో లేదు. ‘నీ లైఫ్‌లో తీసుకుంటున్న మొదటి షీల్డ్. అది తీసుకోవాలంటే అదృష్టం ఉండాలి’ అని నాన్న చెప్పారు. ఆ తర్వాత నన్ను రెడీ చేసి తెల్లవారుజామున సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వరకూ తీసుకెళ్లారు. అక్కడి నుంచి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కించారు. అసలు వందరోజుల ఫంక్షన్ చెన్నైలో ఎక్కడ జరుగుతుందో కూడా తెలియదు. అదే రైలులో ఓ పెద్దాయన కనిపించి ‘వందరోజుల ఫంక్షన్‌కా’ అన్నారు. ‘అవునండీ’ అని చెప్పా. ‘నేనెవరో తెలుసా’ అని అడిగారు. ‘తెలియదు’అని చెప్పా. ‘నేను జంధ్యాల తండ్రిని’ అన్నారు. వెంటనే నమస్కారం పెట్టా. ఆయనే నన్ను ఫంక్షన్‌కు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ యాంకరింగ్ చేస్తున్న రావుగోపాలరావు నాకు యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకొని.. వేరే వాళ్లని పిలిచి షీల్డ్ ఇద్దామనుకున్నారు. ఇంతలో నేను అక్కడ ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అది నా జీవితంలో తీసుకున్న తొలి షీల్డ్. ఆ తర్వాత ఐదారొందల షీల్డ్స్ తీసుకున్నా. కొన్ని మా బంధువులు తీసుకెళ్లారు. ఏడాది పాటు ఆడిన సినిమాల గురించి విన్నా. కానీ, నేను నటించిన ఒక సినిమా ఏడాది పాటు ఆడుతుందని జీవితంలో అనుకోలేదు. అదే ‘యమలీల’. నిజంగా ఎస్వీకృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిగార్లకు ధన్యవాదాలు.
మీ చాట భాష కథ ఏంటి?
ఆలీ: ఎవరైనా తెలియని వ్యక్తి కనపడితే ‘బాబూ కాట్రే నీ పేరేంటి’ అని పిలిచేవాడిని. అలా దాన్ని వాడటం మొదలైంది. ఫ్లాంత్రఫగిడి అంటే పువ్వు అని అర్థం. జబ్బల్‌హాట్ రాజా.. అంటే చాలా పెద్ద మనసు ఉన్న వ్యక్తి. (నవ్వులు)
తాగుబోతు క్యారెక్టర్‌లు మీరు బాగా చేస్తారు? ఎవరిని చూసి అలా నటించడం నేర్చుకున్నారు?
ఆలీ: చిన్నప్పుడు మా నాన్నకు భోజనం క్యారేజీ పట్టుకుని వెళ్లేవాడిని. అక్కడికి దగ్గర్లో ఓ షాపు ఉండేది. రోజూ మధ్యాహ్నం ఓ వ్యక్తి అందులోకి మామూలుగా వెళ్లి.. బయటకు చాలా తేడాగా వచ్చేవాడు. అసలు లోపల ఏముందా? అని చూద్దామని వెళ్లా. అది సారా దుకాణమని అప్పుడు అర్థమైంది. సారా తాగిన తర్వాత ఆ వ్యక్తి చేసే చేష్టలు చూసి, అనుకరించేవాడిని. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నేను అలా చేస్తుండటం ఈవీవీ సత్యనారాయణగారు గుర్తించారు. అలా ‘హలో బ్రదర్’లో తాగుబోతు క్యారెక్టర్ ఇచ్చారు. దాదాపు 150కు పైగా సినిమాల్లో అటువంటి పాత్రలు చేశా. ‘ఖుషి’లో గుడుంబా సీన్ ఇప్పటికీ హైలైట్. ఇతర భాషల విషయానికొస్తే.. తమిళ్, మలయాళం, కన్నడ, ఇలా అన్ని భాషలు అర్థమవుతాయి.. అలాగే మాట్లాడతాను.
మిమ్మల్ని చూడటానికి ఓ దర్శకుడు సైకిల్ వేసుకుని నర్సీపట్నం నుంచి అనకాపల్లి వచ్చేవారట!
ఆలీ: పూరి జగన్నాథ్. నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం ‘షోలే’ సినిమా. అందులో అంజాద్‌ఖాన్ నటన చూసి షాకయ్యా. ఆయన కోసమే వంద సార్లు చూశా. ‘షోలే’ స్క్రీన్‌పై వేసి, మ్యూట్ పెట్టేస్తే.. అందరి డైలాగ్‌లు చెప్పేస్తా. నా కామెడీ అంటే పూరికి చాలా ఇష్టం. ఆ తర్వాత పూరి జగన్నాథ్ సినిమాల్లో ప్రత్యేకంగా నాకోసం కామెడీ ట్రాక్‌లు రాశారు. నేను పని చేసిన ఎక్కువమంది దర్శకుల్లో పూరి ఒకరు.
చాలా మంది హీరోలు ఉండగా, మిమ్మల్నే ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా ఎందుకు అనుకున్నారు?
ఆలీ: ‘మాయలోడు’ఆడియో ఫంక్షన్‌లో ఓ సాంగ్‌కు డ్యాన్స్ చేశా. అనుకోకుండా అది వాళ్లు చూశారు. ఒకరోజు నాకు చెక్ ఇచ్చి, అగ్రిమెంట్ చేయించుకున్నారు. ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుందేమోనని అనుకున్నా.ఆ తర్వాత హీరో నేనని తెలిసింది. అసలు ఈ సినిమాకు హీరో మహేశ్‌బాబు. కృష్ణగారికి కూడా కథ నచ్చింది. అయితే, ‘రెండు మూడేళ్లు ఆగండి. మహేశ్ చదువుకుంటున్నాడు’ అన్నారట. అయితే, కృష్ణారెడ్డిగారు ఎగ్జైట్‌మెంట్ ఆపుకోలేక నన్ను తీసుకున్నారు. మనీషా బ్యానర్‌లో నటించాలని అందరూ అనుకుంటారు. నేను నాలుగు సినిమాలు హీరోగా చేశా. నేను హీరోను అవుతానని జీవితంలో అనుకోలేదు. రాజబాబుగారిలా కమెడియన్ అవుదామనుకున్నానంతే.
మీ కెరీర్‌లో థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెబుతారు?
ఆలీ: చాలా పెద్ద లిస్ట్ ఉంది. రాళ్లపల్లి, జంధ్యాల, జిత్ మోహన్ మిత్రగారు. చైల్డ్‌ఆర్టిస్ట్‌గా నాకు రాఘవేంద్రరావు, రవిరాజా పినిశెట్టిగార్లు అవకాశాలు ఇస్తే, కమెడియన్‌గా నన్ను బాగా ప్రోత్సహించింది ఈవీవీగారు. ఇక హీరోగా ఎస్వీకృష్ణారెడ్డిగారు మర్చిపోలేని గుర్తింపు ఇచ్చారు. నాకోసం పాత్రలు సృష్టించిన వాళ్లు పూరి జగన్నాథ్, రాజమౌళి, వి.వి.వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా చాలామంది ఉన్నారు. ఇక నేను ఎక్కువగా పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్‌బాబు, నితిన్, అల్లు అర్జున్, అల్లరి నరేష్ ఇలా చాలా మందితో నటించా. సుమతో కలిసి ఆడియో ఫంక్షన్స్‌లో నేను చేసిన స్కిట్‌లు, పాత్రలు ట్రెండ్ సృష్టించాయి.
పెళ్లికి ముందు ఆలీకి ఎన్ని లవ్‌స్టోరీలు ఉన్నాయి?
ఆలీ: నాకు జుబేదాతో పెళ్లికాకముందు మా ఇంటి దగ్గర్లో ఒక అమ్మాయి ఉండేది. చాలా అందమైన కళ్లు ఉండేవి. చెన్నై నుంచి నేను ఇంటికి వెళ్లినప్పుడు ఆమెను చూస్తూ ఉండేవాడిని. ఒక రోజు వర్షంలో తడుచుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత చెన్నై నుంచి వచ్చేటప్పుడు ఇంపోర్టెడ్ గొడుగు తీసుకొచ్చి, ఆమెకు ఇవ్వమని చెల్లికి ఇచ్చా. అప్పుడు నాకు పదిహేడు, పద్దెనిమిదేళ్లు ఉండేవి. ఆ తర్వాత ఆమెను ప్రేమిస్తున్న విషయం అమ్మకు చెప్పా. ఆవిడ కూడా సరేనంది. ఆ తర్వాత కొన్నిరోజులకు మా తమ్ముడిని తీసుకుని అమ్మ సినిమాకు వెళ్తే, అదే థియేటర్‌కు ఫ్రెండ్స్‌తో కలిసి ఆ అమ్మాయి కూడా వచ్చింది. అది అమ్మకు నచ్చలేదు. దాంతో ఆ అమ్మాయితో పెళ్లి వద్దనుకున్నాం. ఆ తర్వాత ఒక అమ్మాయి నన్ను ఇష్టపడింది. అయితే, సంబంధం ఓకే అనుకునే సమయంలో వాళ్లు ఏదో అన్నారు. దీంతో బాగా కోపం వచ్చింది. ‘అమ్మా.. అదే ఫ్యామిలీలో వేరే ఏ అమ్మాయి అయినా పర్వాలేదు. ఓకే చెప్పు’ అన్నాను. అలా జుబేదాను వివాహం చేసుకున్నా. మాకు వివాహం అయి వచ్చే ఏడాదికి 30ఏళ్లు పూర్తవుతాయి. మాకు ముగ్గురు పిల్లలు. పెద్ద అమ్మాయికి పెళ్లి చేశాం.
మీకూ పవన్‌కల్యాణ్‌కు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది?
ఆలీ: నాకూ పవన్‌కల్యాణ్ (Pawan kalayn)కు మధ్య గ్యాప్ లేదు. కొందరు వెబ్‌సైట్స్ వాళ్లు దాన్ని క్రియేట్ చేశారు. ఇటీవల మా పాప పెళ్లికి పిలవడానికి ఆయన నటిస్తున్న సినిమా సెట్‌కు వెళ్లా. విషయం తెలిసి.. ఆయన నా దగ్గరకు వచ్చారు. అదే సమయంలో వేరే వాళ్లు వస్తే, వాళ్లను వెయిట్ చేయమని చెప్పారు. ఆయన తొలుత నా దగ్గరకు వచ్చారు. మేము 15 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఈ విషయం వేరే వాళ్లకు, వెబ్‌సైట్స్‌లో రాసే వారికి తెలియదు. ఏదో రాస్తే, అందరూ ఆసక్తిగా చూస్తారని అనుకుంటారు. ఏమీ ఉండదు అక్కడ. పెళ్లికి వస్తానని పవన్ చెప్పారు కూడా. అయితే, ఆయన ఎక్కాల్సిన విమానం మిస్సవడంతో రాలేకపోయారు. దీంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాశారు. అంతేకానీ, మా మధ్య గ్యాప్ ఏమీ లేదు.
దేశముదురులో స్వామిజీ గెటప్‌వేస్తే చాలా మంది నమస్కారం చేశారట!
ఆలీ: (నవ్వులు) అవును. నేను వెళ్లి వేరే స్వామీజీ పక్కన కూర్చొంటే ఆయనకు నాకూ దండం పెట్టారు. గెటప్ తీసేసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. ఆ క్యారెక్టర్‌కు మంచి పేరు వచ్చింది. పూరితో చేసిన రెండు సినిమాలకు నాకు రెండు ఫిల్మ్‌ఫేర్‌లు వచ్చాయి.
మీ 40ఏళ్ల సినీ కెరీర్‌లో సినిమా కష్టాలు ఏమైనా చూశారా?
ఆలీ: ఆరేళ్లపాటు ఒక పూట భోజనం చేసి బతికా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి అవకాశాలే వచ్చాయి. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఏడాదికి ఒకట్రెండు సినిమాలే వచ్చేవి. మెస్‌కార్డు కొనాలంటే రూ.75. ఆ డబ్బులు లేక ఒక పూటే తినేవాడిని. సాయం అడిగితే ఎవరికైనా చెబుతారని భయపడేవాడిని. 1984 నుంచి 90 దాకా చాలా తక్కువ సినిమాలు చేశా. అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో మా రూమ్మేట్స్ బట్టలు ఉతికేవాడిని. నా అద్దె కూడా వాళ్లే కట్టేవాళ్లు. వంట కూడా చేసేవాడిని. 1991 నుంచి మళ్లీ కెరీర్ ఊపందుకుంది.
మీ అమ్మాయి పెళ్లయిన తర్వాత సోషల్‌మీడియాలో ఒక వార్త బాగా చక్కర్లు కొడుతోంది. ‘ఆలీ అల్లుడికి ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా’ అని వార్తలు వస్తున్నాయి. అసలు నిజమేంటి?
ఆలీ: మా అల్లుడి కుటుంబం చాలా మంచిదని తెలిసి, ఆస్తులేమీ చూడకుండానే చేసుకున్నాం. అతను అమెరికాలో రోబోటిక్ ఇంజినీర్. చాలా మంది అతను డాక్టర్ అనుకుంటున్నారు. అయితే, అల్లుడి నాన్న ఆప్తమాలజిస్ట్, అల్లుడి అన్నయ్య, వదిన, చెల్లెలు ఆమె భర్త అందరూ డాక్టర్లే. మా అమ్మాయి బీడీఎస్ చేసింది. నా అల్లుడు సీబీఎస్ ఫార్మాలో టీమ్ లీడర్. నా శక్తి మేరకు అమ్మాయికి ఇవ్వాల్సింది ఇచ్చాను.
‘ఆలీతో సరదాగా’ షో అయిపోతోందా? మీరు ఇక రారా?
ఆలీ: అయిపోలేదు. బ్రేక్ ఇస్తున్నాం. మళ్లీ త్వరలో అద్భుతమైన షోతో మీ ముందుకు రాబోతున్నాం. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సారథ్యంలో తీసే, ఆ షో కూడా ఈటీవీలో ప్రసారమవుతుంది. ఇన్ని ఎపిసోడ్స్‌లో ఎవరూ ఇబ్బందిపడేలా ప్రశ్నలు అడగలేదు. విలువలు ఏంటో నాకు తెలుసు... నాకూ కుటుంబం ఉంది. మా కుటుంబం మొత్తం ఐదారొందల మంది ఉన్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆమెతోనే ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేశాం. ఇన్నేళ్ల పాటు నిర్విరామంగా కొనసాగింది. ఈ షోకు వచ్చిన తర్వాత చాలా మందికి మళ్లీ అవకాశాలు వచ్చాయి. ‘ఆలీతో సరదాగా’ 309 ఎపిసోడ్‌లు పూర్తయ్యాయి. మళ్లీ కొంత గ్యాప్ తీసుకుని.. ఈసారి గ్రాండ్ రీఎంట్రీ ఇస్తాం. మళ్లీ మొదలయ్యే ఎపిసోడ్‌కు కూడా మంచు లక్ష్మి, సుమ ఇద్దరినీ పిలుస్తాం. మా నిర్మాత నవీన, అనిల్ కడియాల, మా ఛైర్మన్ రామోజీరావుగారు, బాపినీడుగారు, మూర్తిగారు ఇలా అందరికీ నా ధన్యవాదాలు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
vizag: విశాఖ రామజోగయ్యపేటలో కూలిన మూడు అంతస్తుల భవనం.. చిన్నారి మృతి
-
Sports News
హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్
-
Movies News
Social Look: శోభిత కాఫీ కథ.. సిమ్రత్ సెల్ఫీ.. మృణాళ్ విషెస్
-
Movies News
Rashmika: అప్పుడు విమర్శలు ఎదుర్కొని.. ఇప్పుడు రక్షిత్‌కి క్రెడిట్ ఇచ్చి