PV Sindhu: ప్రభాస్‌ అంటే ఇష్టం.. సినిమా వాళ్లను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు: పి.వి.సింధు

PV Sindhu.. పి.వి.సింధు.. ఆమె విజయాల రాకెట్‌.. మాతృభూమి కీర్తి పతాకం.. తన క్రీడా ప్రస్థానంలో అంతర్జాతీయంగా ఎన్నో అద్భుతాలను అందుకున్న తెలుగమ్మాయి.. కామన్వెల్త్‌లో

Updated : 28 Sep 2022 13:31 IST

అమ్మానాన్నలు వెన్నంటి ఉండటంతోనే ఆటలో ఎదిగా!

PV Sindhu.. పి.వి.సింధు.. ఆమె విజయాల రాకెట్‌.. మాతృభూమి కీర్తి పతాకం.. తన క్రీడా ప్రస్థానంలో అంతర్జాతీయంగా ఎన్నో అద్భుతాలను అందుకున్న తెలుగమ్మాయి.. కామన్వెల్త్‌లో గోల్డ్‌ సాధించి స్టార్‌గా ఎదిగింది.. తొలిసారి ఈటీవీలో ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన ఆమె. తన ఆటే కాదు..మాటతోనూ ఆకట్టుకున్నారు. మనసారా నవ్వుతూ ఎన్నో అసక్తికర విషయాలను పంచుకున్నారు.

బ్యాడ్మింటన్‌ ఆడాలనే కోరిక నాన్నదా..? అమ్మదా..? నీదా..?

సింధు: నాన్న రైల్వేలో పని చేశారు. ఇప్పుడు వీఆర్‌ఎస్‌ ఇచ్చారు. అమ్మకూడా రైల్వేలోనే పని చేశారు. నా చదువు హైదరాబాద్‌లోనే సాగింది. ఎంబీఏ చేశా. ఆట ఆడాలన్న కోరిక నాదే. అమ్మానాన్న వాలీబాల్‌ క్రీడాకారులు, నాన్న వాలీబాల్‌ ఆడుతుంటే నేను బ్యాడ్మింటన్‌ ఆడేదాన్ని. అలా సరదాగా మొదలై.. ఇప్పుడు ఈ స్థాయికి చేరా.

నీ మొదటి గెలుపు ఎక్కడ?

సింధు: వయస్సు ఆధారంగా గ్రూపు టోర్నీలుంటాయి. అండర్‌-10లో కొచ్చిన్‌లో జాతీయ స్థాయిలో గెలిచా. అదే తొలి విజయం. తర్వాత 13, 19 గ్రూప్‌లో పలు విజయాలు సాధించాను.

భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు..?

సింధు: ప్రస్తుతమైతే స్పోర్ట్స్‌ మాత్రమే. ఆంధ్రాలో డిప్యూటీ కలెక్టర్‌ జాబ్‌ ఉంది. ఆన్‌డ్యూటీ లీవ్‌లో ఉన్నా.

తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం..?

సింధు: చాలా మంది ఉన్నారు. ప్రభాస్‌ అంటే ఇష్టం. తర్వాత అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ అంతే..! హిందీలో రణ్‌వీర్‌సింగ్‌, అమ్మాయిల్లో దీపికా పదుకొణె. తను నాకు మంచి ఫ్రెండ్‌ కూడా.

స్పోర్ట్స్‌ పర్సన్‌లో మీకెవరు స్ఫూర్తి?

సింధు: నాకు మా నాన్నే స్ఫూర్తి. లింగ్‌యాన్‌ బ్యాడ్మింటన్‌లో లెజెండ్‌. ఆయన ఆట బాగుంటుంది.

ఎంత కష్టపడితే ఈ స్థాయికి చేరుకోగలిగారు..?

సింధు: నేను ఆట మొదలెట్టినప్పుడు సికింద్రాబాద్‌లో ఉండేవాళ్లం. తొలుత రైల్వే గ్రౌండ్‌లో ఆడేదాన్ని. ఆ ఆట తీరు బాగుండటంతో మెరుగైన ట్రైనింగ్‌ కోసం ఎల్బీ స్టేడియానికి వెళ్లా. గచ్చిబౌలికి మారిన తర్వాత దూరం మరింత పెరిగింది. ఖర్చు కూడా బాగా అయింది. మనం అంత భరించలేమోనని నాన్న అన్నారు. నేను ఏడవటంతో నాన్న కాదనలేకపోయారు. నా ప్యాషన్‌గా బ్యాడ్మింటన్‌ మారింది. అమ్మానాన్న వాళ్ల జీవితాన్ని నా కోసం కేటాయించారు. అందుకే ఇలా ఉన్నా..!

మీకొక అక్క ఉన్నారు కదా? ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు..?

సింధు: అక్క డాక్టర్‌. తను హైదరాబాద్‌లోనే ఉంటుంది. మా ఇద్దరి మధ్య ఏడేళ్ల దూరం ఉంది. మేమిద్దరం చాలా క్లోజ్‌. నా చదువు కోసం బాగా శ్రమించింది. అమ్మ నాకు వంట చేస్తుంది. కొవిడ్‌తో ఎక్కువగా విదేశాలకు రావడం లేదు. పెద్ద టోర్నీకి వెళ్లినపుడు అమ్మ వస్తుంది. అవార్డులు, ఫంక్షన్లకు అమ్మే వస్తుంది. దేవుడిని నమ్ముతా.. ‘దేవుడా బాగా ఆడాలి’అని కోరుకుంటా.

పి.వి.సింధుకు గురువు ఎవరు?

సింధు: మొదట మహబూబ్‌ ఆలీ దగ్గర శిక్షణ పొందా. ఆ తర్వాత ఆరిఫ్‌, గోవర్ధన్‌, గోపి సర్‌ దగ్గర ఆట నేర్చుకున్నాను.

పుల్లెల గోపీచంద్‌ పాత్ర ఏంటీ..?

సింధు: ఒక్కో కోచ్‌ దగ్గర ఒక స్కిల్‌ ఉంటుంది. ఒక్కొక్కరి వద్ద కొన్ని అంశాలను స్వీకరించాను. ఇండోనేషియా, దక్షిణ కొరియా కోచ్‌ల దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా.

పతకం తీసుకున్న ప్రతీసారి మన చేతిలో జాతీయ జెండా ఉంటుంది. అలాంటి సమయంలో మీ ఫీలింగ్‌ ఎలా ఉంటుంది..?

సింధు: ఇట్స్‌ ఎ వండర్‌ఫుల్‌ ఫీలింగ్‌. దాన్ని మాటల్లో చెప్పలేను. పోడియం మీద నిల్చున్నప్పుడు జాతీయ గీతం వస్తుంటే కళ్ల నుంచి నీళ్లు వస్తాయి.

ఏదైనా టోర్నీకి వెళ్లినప్పుడు మ్యాచ్‌కు ముందురోజు నుంచే ఒత్తిడి ఉంటుందా..?

సింధు: చాలా ఉంటుంది. నాన్నకు కూడా అలాగే ఉంటుంది. మ్యాచ్‌ ఎలా గెలవాలనే ఆలోచన ఎక్కువగా చేస్తాం. నాకు ప్రతి మ్యాచ్‌ పోటాపోటీగానే ఉంటుందని భావిస్తా. కామన్వెల్త్‌కి వెళ్లేటప్పుడు ప్రజలు సింధు బంగారం గెలవాలని కోరుకున్నారు. క్రీడాకారులు, అందరూ అలాగే కోరతారనే ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆ దేశాల వాతావరణం, కోర్టుల తీరు అన్నింటినీ తట్టుకొని విజయం సాధించాలంటే 100శాతం పట్టుదలతో ఆడాలి.

మీ స్నేహితులు సినిమాలు, షికార్లకు వెళుతుంటే ఎలా ఉంటుంది..?

సింధు: నాకు పెద్దగా ఫీలింగ్ ఉండేది కాదు. నేను విదేశాల్లో వాళ్ల కంటే ఎక్కువగా తిరుగుతా కదా (నవ్వులు) హైదరాబాద్‌లో చాలా అరుదుగా బయటకు వెళ్తా.

క్రికెట్‌లో బౌలర్‌ రెచ్చగొడితే సచిన్‌ ఫోర్లు, సిక్స్‌లు బాదేవాడు.. అలా బ్యాడ్మింటన్‌లో నిన్ను రెచ్చిగొట్టిన సందర్భాలున్నాయా..?

సింధు: చాలా మంది తగిలారు. 2018లో ప్రపంచ ఛాంపియన్‌ ఫైనల్‌లో కెరెలినాతో ఆడుతున్నా. నేను లీడింగ్‌లో ఉండటంతో ఆమె అరవటం మొదలు పెట్టింది. ఆమె అలా ఎందుకు అరుస్తోందో తెలియక చికాకు పడి పాయింట్లు ఇచ్చేసి ఓడిపోయిన మ్యాచ్‌లున్నాయి. ఇటీవల ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో యమగుచితో మొదటి మ్యాచ్‌ గెలిచా. రెండో మ్యాచ్‌ లీడింగ్‌లో ఉంటే ఆమె అరుస్తుంటే చికాకు పడ్డా. సర్వీస్‌ చేస్తుంటే అంపైర్‌ ఆలస్యం చేస్తున్నావ్‌. ప్రత్యర్థికివ్వు అన్నారు. ఫైట్‌ చేసినా ఫలితం దక్కలేదు. చివరికి ఓడిపోయా. ఒత్తిడిని తట్టుకుంటేనే విజయం సాధించగలం.

భవిష్యత్తులో సింధుని సినిమా హీరోయిన్‌గా చూడొచ్చా..?

సింధు: ప్రస్తుతమయితే లేదు. ఏమో నా బయోపిక్‌ తీయొచ్చేమో.. నాతో తీస్తేనే నేచురల్‌గా ఉంటుంది కదా..!

సీరియస్‌ క్వశ్చన్‌ నీకు.. ఇప్పటిదాకా ఎన్ని లవ్‌లెటర్లు అందుకున్నావ్‌..?

సింధు: చాలా లెటర్లు ఇంటికి వచ్చాయి. ఇంట్లో అందరం కలిసి చదివాం. చాలా లెటర్లు ఇండియా నుంచే వస్తాయి. సోషల్‌ మీడియాలో వచ్చాయి. కొన్నేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన 70 ఏళ్ల వ్యక్తి ‘సింధును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.  మీరు పెళ్లికి ఒప్పుకోకపోతే కిడ్నాప్‌ చేసి పెళ్లి చేసుకుంటా’ అని పత్రికలో వచ్చింది.

పెళ్లెప్పుడు..? చాలా మంది క్రీడాకారులు సినిమా వాళ్లను చేసుకుంటున్నారు.? నువ్వు ఇలాగే చేసుకుంటావా..?

సింధు: ఇప్పుడయితే కాదు.. 2024 ఒలింపిక్స్‌పై దృష్టి పెట్టా. పారిస్‌లో ఉంటుంది. ఆ తర్వాత నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటా. నాకు సినిమా వాళ్లను చేసుకోవాలనే ఆశలు లేవు.

బాగా ఇబ్బంది పడిన సందర్భం ఏదైనా ఉందా..?

 

సింధు: క్రీడల్లో గాయాలు కావడం సాధారణ విషయమే. చాలా సార్లు గాయాలయ్యాయి. ఆరు నెలలు గాయంతోనే ఆడాను. తర్వాత ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఎక్కువ టోర్నీలు ఆడితేనే ర్యాంకింగ్‌ మెరుగుపడుతుంది. తొలి 16 ర్యాంకుల్లో ఉండేవారికే ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వీలుంది. గాయాలు కాకుండా జాగ్రత్త పడటంతో ఒలింపిక్స్‌లో పాల్గొన్నా.. తొలిసారే పతకం సాధించాను. గెలిచే మ్యాచ్‌ కోల్పోయినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. వరసగా 8 టోర్నీలలో ఫైనల్స్‌లో ఓడిపోయా.

విమర్శలను ఎలా ఎదుర్కొంటారు..?

సింధు: పత్రికల్లో చాలా వస్తుంటాయి. సోషల్‌ మీడియాలో చాలా కామన్‌ అయిపోయింది. డాడీకి కూడా చాలా సార్లు చెప్పా. ‘నేను విజయాలు సాధించలేనా’ అని అడిగేదాన్ని.. నాన్న మాత్రం చాలా నమ్మకంగా ‘నువ్వు విజయం సాధిస్తావ’ని చెప్పేవారు. నాకు అవసరం లేని వాటి గురించి పట్టించుకోను.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో ఐస్‌క్రీం తిన్నట్టున్నారు...? అది ఏ ఫ్లేవర్‌..?

సింధు: చాలా రకాలు తెచ్చారు. ఆయనతో పంచుకున్న సమయం చాలా అద్భుతం. గెలిచిన ప్రతీ సారి ఆయనను కలవడం, ఆయన స్ఫూర్తినిచ్చే మాటలు బాగుంటాయి. చాలా గర్వంగా అనిపిస్తుంది. గౌరవంగా అనిపిస్తుంది. ‘మోదీ 20’ బుక్‌ విడుదల చేశారు. అందులో ఒక చాఫ్టర్‌ రాసే అదృష్టం వచ్చింది.

బ్యాడ్మింటన్‌ కాకుండా ఇతర ఆటలు.. ఏవి ఇష్టం?

సింధు: ఫుట్‌బాల్‌, బాక్సింగ్‌, వాలీబాల్‌ ఇష్టం. మాజీ క్రికెటర్‌ చాముండి నన్ను బాగా ప్రోత్సహించారు. నాకు తొలిసారిగా కారు ఇచ్చారు..ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే సచిన్‌ వచ్చి కారు ఇస్తాడని చెప్పారు. అలాగే వచ్చి కారు ఇచ్చారు. ఏదైనా ఆయన చెప్పినట్టే ప్రతీ టోర్నీలో గెలిచా. ఈసారి పారిస్‌లో కూడా గెలుస్తానేమో..

నువ్వు ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన పుల్లెల గోపీచంద్‌ అకాడమీ నుంచి బయటకు రావడానికి కారణం ఏంటి?

సింధు: అక్కడ కొన్ని మ్యాచ్‌లు ఆడాను. కోచ్‌, ప్లేయర్‌గా కొన్ని నచ్చవచ్చు.. నచ్చకపోవచ్చు. నాకు కొన్ని నచ్చలేదు. నాకు వర్కవుట్‌ కావడం లేదని బయటకు వచ్చా. మా కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకున్నాం. నన్ను నేను నిరూపించుకున్నా. ఇప్పటి వరకు ఎంత నేర్చుకున్నా.. ఇంకా ఎంతో నేర్చుకోవాలి. దేశం కోసం ఎన్నో గెలవాలి. అదే నా లక్ష్యం.

నీకు పదేళ్లున్నపుడు నాన్న నీపై చేయి చేసుకున్నారట..?

సింధు: ఆ సంఘటనతో చాలా నేర్చుకున్నా. రాకెట్‌తో షటిల్‌కాక్‌ తీయడం రావడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా రాలేదు. ఒక్కటి పడింది.. ఆ భయానికి రెండోరోజు ప్రాక్టీసు చేసి చేసి అలవాటు చేసుకున్నా.

పాఠశాలకు వెళ్లకపోయినా పరీక్షల్లో మార్కులు బాగానే వచ్చేవట ఎలా..?

సింధు: పాఠశాల, కళాశాలకు వెళ్లకపోయినా ఇంట్లో చదువుకునేదాన్ని. కాపీ బ్యాచ్‌ అయితే కాదు. టీచర్లకు అనుమానం ఉన్నా పరీక్షల్లో మంచి మార్కులు సాధించి మంచి పేరు తెచ్చుకున్నా.

ప్రస్తుతం మీ ర్యాంకు ఎంత..?

సింధు: ప్రపంచ ర్యాంకింగ్‌లో ఏడు. కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకు 2, కొవిడ్‌తో ర్యాంకులు ఆపేశారు. మళ్లీ ఇస్తే 4వ ర్యాంకు వస్తుందేమో. మొదటి ర్యాంకులోకి రావాలనుకుంటున్నా. ఎక్కువ టోర్నీలు ఆడితే ర్యాంకు పెరుగుతుంది.

మీ తాతయ్య సినీ నిర్మాతగా చేశారా..? అశ్వనీదత్‌ బంధువా..?

సింధు: అవును. దోనేపూడి బ్రహ్మయ్య.. ఎన్టీఆర్‌తో బందిపోటు, కలవారి సంసారం తీశారు. తర్వాత విజయవాడ వచ్చారు. అశ్వినీదత్‌గారు అమ్మ తరుఫున బంధువు.

పద్మభూషణ్‌ ప్రకటించినప్పుడు ఫీలింగ్‌ ఏంటి?

సింధు: అప్పుడు టోర్నీలో ఉన్నా.. న్యూస్‌ చూసి తెలుసుకున్నా. ఒకసారి టీవీలలో వచ్చినా అవార్డు రాలేదు. మళ్లీ ప్రచారం అవుతుంది. అది నిజం కానీ అనుకున్నా..అధికారికంగా ప్రకటించినప్పుడు సంతోషం అంతా ఇంతా కాదు.. కొవిడ్‌ ఉండటంతో ఆలస్యంగా అవార్డును తీసుకున్నా. ఇలాంటి అవార్డులు ఎంతో ప్రోత్సాహం అందిస్తాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని