బాలకృష్ణతో ‘ఆది’ అలా తీయాలనుకున్నా..!

ఆయనో మాస్‌ పల్స్‌ తెలిసిన బ్లాక్‌ బస్టర్‌ దర్శకుడు.. విజయాల తనవెంట వరుస కడతాయి..రికార్డులు తన ముందు మోకరిల్లుతాయి.. ఫ్యాక్షన్‌తో యాక్షన్‌..రొమాన్స్‌

Updated : 27 Dec 2022 19:48 IST

ఆయనో మాస్‌ పల్స్‌ తెలిసిన బ్లాక్‌ బస్టర్‌ దర్శకుడు.. విజయాలు ఆయన వెంట వరుస కడతాయి.. రికార్డులు ఆయన ముందు మోకరిల్లుతాయి.. ఫ్యాక్షన్‌తో యాక్షన్‌.. రొమాన్స్‌, కామెడీని కలిపి క్లాస్‌ మాస్‌ అనే తేడా లేకుండా ప్రేక్షకులను ఉర్రూతలూపారు. ఎన్నో సెన్సేషనల్‌ సినిమాలను ఎందరో స్టార్స్‌తో తీసి, కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌. ఆలీ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

ఎలా ఉన్నారు నానిగారు? మీ కుటుంబం గురించి?

వి.వి.వినాయక్‌: (నవ్వులు) నా ముద్దు పేరు నాని. మా నాన్న అలా పిలిచేవారు. మా ఇంటికి నేనే పెద్ద కొడుకుని. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్లు.. ముగ్గురు చెల్లెళ్లు.

చెన్నై వెళ్లాక ఏమైనా ఇబ్బందులు పడ్డారా?

వి.వి.వినాయక్‌: చెన్నై వెళ్లిన తర్వాత ఒక సంఘటన జరిగింది. ప్రతి సినిమాకు కో-డైరెక్టర్లు పనిచేస్తుంటారు. వాళ్లలో కొందరు నిరుత్సాహ పరుస్తుంటారు. నా కంటె వయసులో పెద్ద వాళ్లు కూడా కో-డైరెక్టర్‌లుగా మిగిలిపోయారు తప్ప దర్శకులుగా ఎదగలేదు. ‘వీళ్లే కాలేదు. నేనెప్పుడు అవుతాను’ అని ఒక రకమైన భయం వచ్చింది. ఎక్కడికి వెళ్లినా అవకాశం లభించేది కాదు. దీంతో ఇంటికి వెళ్లిపోయా. ఒకరోజు మా అమ్మ  ‘ఇక వద్దులేరా. ఏదైనా ఉంటే ఇక్కడే పని చేసుకుందాం’ అని బాధపడింది. నేను కూడా కన్నీరు పెట్టుకున్నాను. అది మా నాన్నకు నచ్చలేదు. పైగా మా ఊళ్లో ఉన్న ఓ వ్యక్తి ‘ఏం అబ్బాయి.. అయిపోయిందా సినిమా ఫీల్డ్‌’ అని వెటకారంగా అన్నాడు. నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఏదైతే అది అయిందని ఆ రాత్రి మళ్లీ చెన్నై రైలెక్కా. నాటి నుంచి నేను పడిన వాటిని కష్టాలు అనడం కన్నా, నరకం అనడం సబబు. ఆ తర్వాత సాగర్‌గారి వద్ద జాయిన్‌ అయ్యా. ఏడాది పాటు ఆయనతో ఉన్నా. ఆ సమయంలో రైటర్‌ వినయ్‌గారు నాకు ఎంతో సాయం చేశారు. రోజుకు 18 గంటలు పనిచేసినా సమయం సరిపోయేది కాదు. రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్‌ నాకు గురువులాంటివారు. ఆయన సంభాషణలు రాత్రిపూట రాసేవారు. తెల్లవారుజామున 4గంటల వరకూ ఆయనతో ఉండి వాటిని తీసుకుని వచ్చేవాడిని. ఆ తర్వాత కో-డైరెక్టర్‌గా చాలా సినిమాలకు పనిచేశా. ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా రాసుకునేవాడిని. నటులకు నేనే సంభాషణలు వినిపించేవాడిని.

పూర్తి పేరు వరుస విజయాల(వి.వి.) వినాయక్‌?

వి.వి.వినాయక్‌: నా పూర్తి పేరు గండ్రోతు వీర వెంకట వినాయకరావు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత వినయ్‌ అనేవారు. భాస్కరభట్ల నా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వి.వి.వినాయక్‌ అని చెప్పాను. నా మొదటి సినిమా ‘ఆది’ విడుదలైన తర్వాత ఓ సంఘటన జరిగింది. అప్పుడు నాగేశ్వరరావు అనే మేనేజర్‌ ఉండేవాడు. అన్నపూర్ణా స్టూడియోస్‌లో ‘చెన్నకేశవరెడ్డి’ సెట్‌ వేస్తున్నారు. పనులు జరుగుతుంటే చూద్దామని వెళ్లా. అప్పుడు ఆయన అక్కడే ఉన్నారు. ‘ఏంటయ్యా.. కో-డైరెక్టర్‌ అయ్యావా’ అని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో నిర్మాత త్రివిక్రమరావుగారు వచ్చి, ‘ఏవండీ డైరెక్టర్‌గారు.. బాగున్నారా. మా సినిమా సెట్‌ చూద్దురుగానీ రండి’ అంటూ నన్ను గౌరవించడం చూసి మేనేజర్‌ నాగేశ్వరరావు ఆశ్చర్యపోయారు. ‘ఏంటి సంగతి’ అని అడిగారు. ‘ఆది సినిమాకు నేనే డైరెక్టర్‌’ను అన్నాను. అతను ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత నుంచి అతను చనిపోయే వరకూ నా దగ్గరే పనిచేశాడు.

వి.వి.వినాయక్‌.. శీనయ్యగా మారడం ఏంటి?

వి.వి.వినాయక్‌: నేను ఒకరోజు ఆఫీస్‌లో ఉంటే దిల్‌రాజుగారు వచ్చారు. ‘వినయ్‌ నువ్వు నన్ను దిల్‌రాజును చేశావు. నేను నిన్ను హీరోను చేస్తా’ అన్నారు. మొదట నాకర్థం కాలేదు. ‘మంచి స్క్రిప్ట్‌ నీకు సరిపోతుంది’ అని చెప్పారు. నాకు కూడా కొత్తగా ఉంటుంది.. బరువు తగ్గుతాను కదాని ఒప్పుకొన్నా. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది.

మీకు ఏ డైరెక్టర్‌ స్ఫూర్తి?

వి.వి.వినాయక్‌: ఈవీవీ సత్యనారాయణగారు. నా కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన టాప్‌లో ఉన్నారు. నేను కూడా ఇలా ఏదైనా జాక్‌పాట్‌ కొట్టకపోతే ఇంకా ఇబ్బందుల్లో పడతామనుకున్నా. ఆ జాక్‌పాట్‌ దొరికింది. మా చిన్నప్పుడు నాన్న సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ రెండోసారి పోటీ చేసి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత నా తమ్ముడు సర్పంచ్‌ అయ్యాడు. మాది చాగల్లు.

భూమిలో నుంచి సుమోలు పైకి లేపాలన్న ఆలోచన ఎవరిది?

వి.వి.వినాయక్‌: నాదే ఆ ఆలోచన. ఆ సినిమాల్లో కథ ముందుకు జరగడానికి కారణమే ఆ సన్నివేశాలు. ‘ఆది’లో ఆ సీన్‌ అద్భుతంగా ఉంటుంది. ‘చెన్నకేశవరెడ్డి’ కొంచె వీక్‌ అయినా, ఆ సీన్‌ చూడటానికే చాలా మంది థియేటర్లకు వెళ్లారు. ‘ఆది’తో నాకు పేరు వచ్చినా, పెద్ద హీరోలు నన్ను గుర్తించడానికి ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాయే కారణం. ఆ మేకింగ్‌ ప్రతి హీరోకూ నచ్చింది. ఆ సన్నివేశాన్ని కేవలం రెండు రోజుల్లో తీశాం. నాలుగు హెలికాప్టర్లు.. 20 సుమోలు వాడాం. సుమోల కోసం చాలా లోతుగా గుంతను తవ్వాం. మొదటి గ్యాస్‌కు సంబంధించిన పరికరాలు పెట్టి, వాటిపై సుమోలు పెట్టాలి. ఆ సీన్‌లు తీయాలంటే ఇండియాలో కృష్ణ అనే వ్యక్తికి మాత్రమే సాధ్యం. పైగా నాలుగు సుమోలు లేపే టెక్నాలజీ వాళ్ల వద్ద లేదు. అయినా ఎంతోకష్ట పడి ఆ సీన్లు తీశాం.

బాలకృష్ణతో పనిచేయడం ఎలా ఉంది?

వి.వి.వినాయక్‌: దర్శకుడికి ఎంతో గౌరవం ఇచ్చేవారు. నేను సీన్‌ చెప్పడానికి వెళ్తే ఎంతో మర్యాదగా మాట్లాడేవారు. కష్టమైనా.. చాలా సన్నివేశాలను మొండిగా చేసేవారు. ఆయన  సతీమణి వసుంధరగారు ‘చెన్న కేశవరెడ్డి’ చూసిన తర్వాత ‘బాలకృష్ణ ఇందులో చాలా బాగున్నారు. ఆయనను బాగా చూపించారు’ అని నన్ను మెచ్చుకున్నారు.

‘చెన్న కేశవరెడ్డి’ చూడటానికి బాగుంటుంది. కానీ, ఏదో తెలియని వెలితి ఎందుకని?

వి.వి.వినాయక్‌: అదే నాకూ అర్థంకాలేదు. ఒక సినిమా బాగా ఆడాలంటే కాస్త సస్పెన్స్‌ ఉండాలి. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ఉండాలి. అది మిస్సయింది. నేను సస్పెన్స్‌ అనుకున్నది కన్ఫ్యూజన్‌కు దారితీసింది. ప్రతి కథకు మార్పు‌ ఉంటుంది. ఒక సినిమాతో మరో సినిమాకు పోలిక ఉందని చెబుతారు. కానీ, అవన్నీ వేర్వేరు.

‘ఆది’ అనుకున్నప్పుడు హీరోగా ఎన్టీఆర్‌నే అనుకున్నారా?

వి.వి.వినాయక్‌: అసలు నేను మొదట అనుకున్న కథ వేరు. ఆ కథలో ‘బాలకృష్ణగారికి ఒక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడిని కాపాడటానికి అన్నయ్య అయిన బాలకృష్ణ బాంబులు వేస్తాడు. కొన్నాళ్ల తర్వాత అదే ఊరికి బాలకృష్ణ ఎస్సైగా వస్తారు. ఆ తమ్ముడిని అరెస్టు చేయాల్సిన పరిస్థితి వస్తుంది’ ఇలా ఏదో ఒక లైన్‌ అనుకున్నా. అయితే, తారక్‌తో సినిమా అనుకున్న వెంటనే చిన్నపిల్లాడు బాంబులు వేసే సీన్‌, సుమోలు గాల్లోకి లేచే సీన్‌లు ఇందులో పెట్టుకుని, ‘ఆది’ తీశా.

పెళ్లి సమయానికి ఇండస్ట్రీలోకి వెళ్లొద్దని మీ నాన్న అన్నారట!

వి.వి.వినాయక్‌: మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. రాజమండ్రి నుంచి బిర్యానీ, స్వీట్స్‌ తీసుకొస్తే, మొదట నాకు తినిపించి ఆ తర్వాత  ఆయన తినేవారు. ఫిల్మ్‌ ఇండస్ట్రీకి వెళ్తే, పెళ్లికాదని టాక్‌ ఉండేది. దీంతో నేను ఇండస్ట్రీకి వెళ్లడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఒక రోజు ఆయన ఫ్రెండ్‌ దగ్గరకు వెళ్లి, ‘ఆయన ఒప్పుకొంటే సరి. లేకపోతే నేనే వెళ్లిపోతా. పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది’ గట్టిగా చెప్పా. చివరకు నాన్న ఒప్పుకొన్నారు.

మళ్లీ జన్మ అంటూ ఉంటే పూరి జగన్నాథ్‌లా పుట్టాలని అన్నారట!

వి.వి.వినాయక్‌: నేను ఇప్పటి వరకూ 17 సినిమాలు చేశా. పూరి జగన్నాథ్‌లో ఉండే ధైర్యం వేరు. అది చాలా ఇష్టం. ‘సినిమా విడుదలైంది. మన చేతుల్లో నుంచి వెళ్లిపోయింది. హిట్‌ అయితే అవుతుంది. లేకపోతే లేదు. నేను అనుకున్నది తీశా’ ఎప్పుడూ ఇలాగే ఆలోచిస్తాడు పూరి. చాలా ఫాస్ట్‌గా రాస్తాడు.. తీస్తాడు. అతనికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు కుంగిపోలేదు. మళ్లీ వరుసగా సినిమాలు తీసి హిట్‌ కొట్టి, ‘దిస్‌ ఈజ్‌ పూరి’ అని నిలబడ్డాడు. ఆ ధైర్యం నాకు ఇష్టం.

మీరు చిరంజీవికి వీరాభిమాని. ఆయనతో సినిమా చేస్తానని అనుకున్నారా?

వి.వి.వినాయక్‌: ఇప్పుడు అనుకున్నది ఏదీ నేను ఊహించింది కాదు. ఏదో 25-30లక్షలు సంపాదించి.. అప్పు తీర్చేస్తే చాలు అనుకున్నా. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉండవచ్చని అనుకునేవాడిని. అప్పుడు దర్శకులు రూ.30-40లక్షలు తీసుకుంటుంటే నేను ఎక్కడో ఉండేవాడిని. అయితే, డబ్బు తలకెక్కకూడదు. ఆయనతో రెండూ రీమేక్‌లే చేశా. అయితే, ఒక కథ కూడా అన్నయ్య కోసం రాశా. ‘ఠాగూర్‌’ కోసం రాజా రవీంద్ర వచ్చి నన్ను తీసుకెళ్లారు. ఒకప్పుడు ‘విజేత’ విజయోత్సవ సభకు వెళ్లి చెప్పులు పోగొట్టుకున్న నేను.. ఆయన్ను నేరుగా కలవడం అదే. అప్పుడు అన్నయ్య మాట్లాడుతూ.. ‘తమిళ రమణ చూశారా. అది నాకు ఎలా ఉంటుంది’అని అడిగారు. ‘మీకు చాలా బాగుంటుంది సర్‌. అయితే, చివరిలో హీరో చనిపోకూడదు. కొన్ని సీన్లు మార్చాలి’ అని చెప్పా. అప్పుడు ఆయన సీఎం అయితే ఎలా ఉంటుంది? అని చర్చించి అలా కూడా కథ అనుకున్నాం. రెండు మూడు షెడ్యూల్స్‌ అయిన తర్వాత క్లోజ్‌ అయ్యారు. రషెస్‌ చూసి చాలా మెచ్చుకున్నారు. నా జీవితంలో మర్చిపోలేని సినిమా. రీమేక్‌ అయినా, సొంత కథ అయినా, కష్టపడాల్సిందే. అదే కష్టం. రమణ సినిమా చూస్తే అందులో చిరంజీవిగారిని ఊహించలేరు. ఆయనకు సరిపోయేలా సినిమాను మార్చాం.

‘ఏ హీరో అయినా మాస్‌లో మంచి ఇమేజ్‌ రావాలంటే మీతో ఒక సినిమా చేయాలి?’ అనే టాక్‌ మీకెలా అనిపిస్తుంది?

వి.వి.వినాయక్‌: చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పటి వరకూ ఉన్న పెద్ద హీరోల్లో పవన్‌కల్యాణ్‌, మహేశ్ ‌బాబులతో సినిమా చేయలేదు.

మీతో బెల్లంకొండ సురేశ్‌ కుటుంబానికి ఉన్న అనుబంధం ఏంటి?

వి.వి.వినాయక్‌: ఆయనే నా మొదటి సినిమా ‘ఆది’ నిర్మాత. అందులో తారక్‌ చిన్నప్పటి వేషం సాయి శ్రీనివాస్‌తో చేయించాల్సింది. చదువు పోతుందని సురేశ్‌గారు ఒప్పుకోలేదు. కొన్నేళ్ల తర్వాత తన కుమారుడిని హీరోగా పరిచయం చేయమని నన్ను అడిగారు.

‘ఆది’ చేస్తున్నప్పుడు తారక్‌ చేయి తెగిందట. అప్పుడు మీ ఫీలింగ్‌ ఏంటి?

వి.వి.వినాయక్‌: చాలా భయపడిపోయాం. రక్తం కారిపోతోంది. నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్‌ మమ్మల్ని భయపెట్టాడు. ‘నా వల్ల కాదు. వైజాగ్‌ తీసుకెళ్లండి. చేతిలో ఒక సన్నటి నరం ఉంటుంది. చాలా సున్నితం. ఏదైనా అయితే నా ప్రాణం పోతుంది’ అని అన్నాడు. ఆ తర్వాత వైజాగ్‌ తీసుకెళ్లాం.

ఒక పాత కథను కొత్తగా చూపించి ‘లక్ష్మి’ హిట్‌ కొట్టారు. ‘యోగి’ ఎందుకు హిట్టవలేదు?

వి.వి.వినాయక్‌: ఆ సినిమాలో తల్లి ఆఖరి చూపు కూడా దక్కదు. కన్నడలో అలాగే ఉంది. అది దెబ్బ కొట్టింది.

ఒక విషయం మీకు తెలియగానే చాలా బాధపడ్డారట!

వి.వి.వినాయక్‌: మా నాన్నగారికి క్యాన్సర్‌ అని తెలియగానే చాలా బాధపడ్డా. చికిత్స దేశ విదేశాలకు తీసుకెళ్లాం. అయినా నాన్న దక్కలేదు. ‘అఖిల్‌’ తీస్తున్న సమయంలో అమ్మ కూడా చనిపోయారు.

‘ఠాగూర్‌’లో కనిపించగానే అందరూ మిమ్మల్ని ఆశ్చర్యపోతూ చూశారు. ఆ పాత్ర చేసినప్పుడు ఏమనిపించింది?

వి.వి.వినాయక్‌: నా ఆలోచనలో అమాయకుడైన ఓ వ్యక్తి ఉన్నాడు. ఆ రోజు షూటింగ్‌ మొదలు పెట్టగానే అన్నయ్య ఆ పాత్ర నన్ను చేయమన్నారు.

ఈ దర్శకుల్లో ఎవరి నుంచి దేన్ని స్ఫూర్తిగా పొందుతారు?

ఎస్‌.ఎస్‌.రాజమౌళి: పర్‌ఫెక్షన్‌

పూరి జగన్నాథ్‌: గట్స్‌

త్రివిక్రమ్‌: డైలాగ్స్‌

బోయపాటి: కాన్ఫిడెన్స్‌

సుకుమార్‌: క్రియేటివిటీ

తమిళ శంకర్‌: గ్రాండియర్‌

కె.రాఘవేంద్రరావు: మ్యూజిక్‌
దాసరి నారాయణరావు: సెంటిమెంట్‌

కె.విశ్వనాథ్‌: మంచి అలవాట్లు

మాస్‌ కమర్షియల్‌ సినిమాల నుంచి కామెడీ వైపు మళ్లారు? ఎందుకు?

వి.వి.వినాయక్‌: ఫ్యాక్షన్‌ సినిమాలు చేసి బోరు కొట్టేసింది. అందుకే ఇటువైపు వచ్చా. ‘అదుర్స్‌’ చాలా బాగుంటుంది. కోన వెంకట్‌ ఒక్క లైన్‌ చెబితే దాని నుంచి కథ రాసుకొచ్చాం. చాలా కష్టపడ్డాం. వేణు మాధవ్‌, ఎమ్మెస్‌ నారాయణ నాకు బాగా దగ్గరైన నటులు. వాళ్ల కామెడీ టైమింగ్‌ కూడా అద్భుతంగా ఉంటుంది.

‘అఖిల్‌’ తర్వాత వినాయక్‌లో స్టఫ్‌ అయిపోయిందని చెప్పేవాళ్లకు మీ సమాధానం?
వి.వి.వినాయక్‌: ప్రతి మనిషి జీవితంలో మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయి. విమర్శించే వాళ్లకు అంతకుమించిన పనేమీ ఉండదు. ఫ్లాప్‌ సినిమా తీయాలని ఎవరూ అనుకోరు. ఒక మనిషిని బాధపెట్టి హాయిగా ఎందుకు ఉండాలనుకుంటారు.

చాగల్లులో వాళ్లందరికీ హోమియో మెడిసన్‌ ఇప్పించారట!

వి.వి.వినాయక్‌: కరోనా సమయంలో ప్రివెన్షన్‌ కోసం ఊరంతా హోమియో మెడిసన్‌ ఇచ్చాం. డాక్టర్‌ ప్రసాద్‌రెడ్డిగారు ఈ విషయంలో ఎంతో సాయం చేశారు. ఆయన గురించి అందరికీ తెలియాలి. మా ఊళ్లో ఎవరూ కరోనాతో చనిపోలేదు. ఇప్పటివరకూ దాదాపు 100 కేసులు నమోదయ్యాయేమో. అందరూ కోలుకున్నారు. ఈ వేదికగా ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నా.

ఆలీ: నా గురించి ఏవో సీక్రెట్స్‌ చెబుతాను అన్నారు ఏంటవి?

వి.వి.వినాయక్‌: నేను దర్శకుడిగా తొలి సన్నివేశాన్ని తీసింది మీ మీదే. ఇప్పటివరకూ ఎవరికీ చెప్పలేదు.

ఇక రెండోది.. అనకాపల్లిలో మీ(ఆలీ) స్నేహితుడు మోహన్‌ ఉన్నాడు. ఒకరోజు తను నన్ను కలిశాడు. అప్పటివరకూ ఆయనతో నాకు పరిచయం లేదు. అయినా, నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడని నేను కూడా మాట్లాడాను. అలా మాటల సందర్భంలో ‘రోజూ మీతో మాట్లాడుతుంటాం. ఇదిగో ఈ నెంబర్‌కు చేస్తాం’ అని అన్నాడు. ఆ నెంబరు నేను ఎప్పుడో పదేళ్ల కిందట వినియోగించేవాడిని. ఎవరో అచ్చం నాలాగానే మాట్లాడుతున్నాడట. ‘మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడిగాడా? ఏదైనా చేస్తానని చెప్పాడా’ అని అడిగా. ‘అదేం లేదండీ. కాకపోతే కాలేజ్‌ సీట్లు ఇప్పిస్తా. ఎన్టీఆర్‌ త్వరలోనే పార్టీ పెట్టబోతున్నాడు’ అంటూ చెప్పేవాడట. సెలబ్రిటీలందరికి ఒక విన్నపం. మీరు మొబైల్‌ మారిస్తే.. పాత నెంబర్‌ మీ వద్దే ఉంచుకోండి. దయ చేసి ఆ నెంబర్‌ బయటకు ఇవ్వొద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు