jonnavithula: 32మంది హీరోయిన్ల పేర్లతో పాట రాశా.. నాకు నచ్చిన నటి ఎవరంటే?

ఆలీతో సరదాగా కార్యక్రమంలో గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పంచుకున్న ఆసక్తికర విశేషాలు  మీకోసం..

Updated : 27 Jul 2022 13:54 IST

ఆయన ఆహార్యం చెబుతుంది తెలుగుపై ఆయనకున్న అభిమానం ఎంతో. ఆయన రచన చెబుతుంది ఆయన పాండిత్య పటిమ ఏంటనేది. పదాలతో ప్రయోగాలు చేసినా, అక్షరాలతో గారడీ చేసిన, భక్తిరసంలో ముంచిన, హాస్యరసంతో కడుపుబ్బా నవ్వించినా, అది ఆయన కలం నుంచి జాలువారిన అక్షరాలకే చెల్లింది. సంప్రదాయాన్ని, ఆధునికతను తనదైన శైలిలో పేరడీ చేసి ప్రేక్షకుల మదిలో చెరగని సంతకం చేసిన మన ‘పేరడీ పెద్దన్న’ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు(Jonnavithula Ramalingeswara Rao).  ‘తెలుగు భాషా ప్రవీణ’గా పేరొందిన ఈయన రచయితగా తన 30ఏళ్ల సినీప్రస్థాన విశేషాలను ప్రేక్షకులతో పంచుకోవటానికి ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేశారు.

చిత్రవిచిత్ర కవిగారికి స్వాగతం..జొన్నవిత్తులగానే మీ పేరు స్థిరపడిపోయింది దానికి కారణం ఏమిటి?

జొన్నవిత్తుల: సినిమా ఇండస్ట్రీలోనూ, పాటల ద్వారా నా పరిచయం ఉన్న వ్యక్తులే నన్ను ‘జొన్నవిత్తుల’ అని పిలుస్తారు. నా స్నేహితులు, బంధువులు, ఇండస్ట్రీలో కొందరు పెద్దలు రామలింగేశ్వరరావు అనే పిలుస్తారు. 

సినీకవిగా మీ ప్రస్థానం ఎలా ప్రారంభమయ్యింది?మీ నేపథ్యమేంటి?

జొన్నవిత్తుల: నేను పుట్టి, పెరిగింది విజయవాడ. 1985లో ఉద్యోగనిమిత్తం మద్రాసుకు బయలుదేరా. వెళ్లేముందు చిన్నజీయర్‌ స్వామి ఆశీర్వాదం కోరగా ఆయన.. ‘సినిమా పాటలు రాయడానికి వెళ్తున్నారా’ అని నన్ను ఆశ్చర్యపరిచారు. అప్పటికి నాకసలు ఆ ఆలోచనే లేదు. అదే విధంగా మా గురువుగారు ఉపద్రష్ట వెంకటకృష్ణయ్య నన్ను ‘సినిమా కవి’ అని పిలిచారు. జీవీఎస్‌మూర్తి అనే నాకు తెలిసినాయన నన్ను ‘పేరడీ కవి’గా గుర్తించి నన్ను ప్రోత్సహించారు. వీళ్ల వాక్కు ఫలితమే నా ఈ గుర్తింపు. మద్రాసుకు ఉద్యోగార్థం వెళ్లిన నేను 10నెలలకే ఉద్యోగం మానేసి, నా రూమ్‌మేట్‌ ద్వారా మురళీమోహన్‌ గారిని కలిశా. ఆయన ద్వారా రెండు నెలలకే ‘రౌడీ పోలీస్‌(1987)’లో నేను రాసిన మొదటి పాట విడుదలయ్యింది. తద్వారా దర్శకుడు రాఘవేంద్రరావు గారి పరిచయం జరగడం, ఆయన నన్ను బాగా ప్రోత్సహించారు.

వేటూరి, సిరివెన్నెల ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో వచ్చిన మీ సినీ ప్రయాణం ఎలా సాగింది?

జొన్నవిత్తుల: అప్పటికి వేటూరి ప్రభంజనం కొనసాగుతోంది. సిరివెన్నెల నాకంటే పదినెలల ముందొచ్చారు. నా మొదటి పాట విడుదలయ్యాక రాఘవేంద్రరావుగారు నాపై నమ్మకంతో ‘భారతంలో అర్జునుడు(1987)’లోని అన్ని పాటలకు అవకాశం ఇచ్చారు. అప్పట్లో రాఘవేంద్రరావుగారి సినిమాకు పాటలు రాయటం చాలా గొప్ప విషయం. 

అప్పట్లో మీ సినిమా ప్రయత్నాలను మీ తల్లిదండ్రులు ప్రోత్సహించారా?వారి స్పందన ఎలా ఉండేది?

జొన్నవిత్తుల: మా కుటుంబంలో కొందరికి అప్పటికే సినిమాల ప్రవేశం ఉంది. పాత సినిమాలకు కొందరు రచయితలుగా పనిచేశారు. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు ఉపాధ్యాయులు. మేము మొత్తం అయిదుగురం. అందరు నన్ను ప్రోత్సహించారు. దాదాపు 600వందలపాటల రచయితగా నా ఎదుగుదల నా తల్లిదండ్రులకు ఆనందాన్నిచ్చింది.

మీరు అడుగుపెట్టేనాటికే మంచి స్థాయిలో ఉన్న సినీ రచయితల నుంచి మీకు ప్రోత్సాహం లభించిందా?

జొన్నవిత్తుల: అందరు నన్ను ప్రోత్సహించారు. ముఖ్యంగా ‘సరిగమపదని’ అక్షరాలతోనే అప్పట్లో నేను రాసిన పాటను ఆరుద్ర మెచ్చుకున్నారు. ‘ఇలా రాయటం చాలా కష్టం. కానీ, నువ్వు అద్భుతంగా రాసావ్‌’ అని అన్నారు.

ఒక రచయితగా మీకు ఎవరి రచన నచ్చుతుంది?మీకు స్ఫూర్తిగా నిలిచిన పాటల రచయిత ఎవరు?

జొన్నవిత్తుల: అప్పుడైనా, ఇప్పుడైనా ఎవరు అద్భుతంగా రాసినా నాకు నచ్చుతుంది. కానీ, పాటతో సమ్మోహనం చేసిన రచయిత వేటూరి. ఆయన పాటకి పరాకాష్ట. ఆయనే ఆ గొప్పతనానికి అర్హుడని భావిస్తా. 

మీరు ‘మహర్షి(1987)’ సినిమా కోసం అప్పట్లో ఒక ప్రయోగం చేశారట? ఏంటది?

జొన్నవిత్తుల: అవును..సంస్కృతం పదాలతో డిస్కో పాట ఒకటి రాశాను. నిజానికి అది నేనెప్పుడో చదువుకునే రోజుల్లో చేసిన ప్రయోగం. అది వంశీగారికి చూపిస్తే  ఆయనకు బాగా నచ్చింది. ఇళయరాజాగారికి ఇస్తే దానికి ట్యూన్‌ కట్టారు.

అప్పట్లో మీరు రాసిన ఒక పాటను ఇప్పటికీ కాలర్‌ట్యూన్‌గా పెట్టుకుంటున్నారు? ఆ పాటేంటి?

జొన్నవిత్తుల: అది మీరు(ఆలీ) హీరోగా నటించిన ‘కాలేజీ స్టూడెంట్‌’(1996)లోని ‘మనసే హారతి షిరిడి శ్రీపతి’ అనే  పాట. రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు రెండు లక్షల మంది ఆ పాటను కాలర్‌ట్యూన్‌గా పెట్టుకున్నారట. ఆ పాటకు మీరు పలికించిన అభినయం అద్భుతంగా ఉంటుంది.

32 హీరోయిన్ల పేర్లతో సూపర్‌హిట్‌ పాట రాసిన మీకు నచ్చే హీరోయిన్‌ ఎవరు?

జొన్నవిత్తుల: ‘పెళ్లిసందడి’ సినిమాలో 32మంది హీరోయిన్ల పేరుతో నేను రాసిన ‘రమ్యకృష్ణ లాగ ఉంటదా’ పాట అప్పట్లో పెద్ద హిట్‌. అప్పటి హీరోయిన్లంతా అందగత్తెలే. కానీ నేను అభిమానించే నటి జమున.  

మీకు బాగా పేరు తెచ్చిన ప్రయోగాలు ఏంటి?తిట్ల దండకం, రూపాయి దండకం వాటి గురించి చెప్పండి?

జొన్నవిత్తుల: ‘ష్ గప్‌చుప్‌(1993)’ సినిమాలో నేను రాసిన ‘తిట్ల దండకం’ బాగా పేరు తెచ్చింది. నిజానికి అది నేను అంతకుముందెప్పుడో రాఘవేంద్రరావు గారి సినిమాకు రాశాను. కానీ బాగా పెద్దగా ఉందని ఆయన పెట్టలేదు. ఒకసారి ధర్మవరపు సుబ్రహ్మణ్యంగారు చూసి జంధ్యాల గారి దగ్గర ప్రస్తావిస్తే, దాన్ని ‘ష్‌ గప్‌చుప్‌’ సినిమాలో వాడారు. అప్పట్లో ఈ తిట్లదండకాన్ని చాలామంది బట్టీ పట్టారు. కొన్నేళ్ల క్రితం ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో నేను పాడేసరికి మరోసారీ బాగా పాపులర్‌ అయ్యింది. అదే కాదు రూపాయి దండకం, కాఫీ దండకం, కలి దండకం, శనిదండకం ఇలా చాలా రాశాను.

రైటర్‌గా మీకు మంచి పేరుంది. సినీ దర్శకుడిగా మీ అనుభవం గురించి చెప్తారా?

జొన్నవిత్తుల: దర్శకుడిగా రెండు సినిమాలు తీశా. ఒకటి రాజేంద్రప్రసాద్‌ హీరోగా ‘పెళ్లాం పిచ్చోడు(2005)’. ఆ సినిమాలోనే ‘రూపాయి దండకం’ ఉంటుంది. రెండు నంది అవార్డులు వచ్చాయి. ఆ తరువాత మీరు హీరోగా సోంబేరి (2008) అనే సినిమా తీశాను. 

మరి దర్శకుడిగా మీరు ఎందుకు కొనసాగలేదు?ఆసక్తి తగ్గిందా?

జొన్నవిత్తుల: నా ఆలోచనలకు తగినట్లు, నా కథలను అర్థం చేసుకునే నిర్మాత కావాలి నాకు. ‘శంకరాభరణం’లాంటి సినిమా తర్వాత మళ్లీ అలాంటి సినిమా రాలేదంటే ప్రయోగాలు చేయడానికి భయపడుతున్నారనే అర్థం. నేను ‘మాణిక్య వీణ’ అనే ఒక కథను సిద్ధం చేశాను. అన్నీ ఒకే అయ్యాక చివరి నిమిషంలో నిర్మాత ఈ సబ్జెక్టుకి మార్కెట్‌ ఉండదని తప్పుకున్నాడు. అప్పట్లో ‘శంకరాభరణం’సినిమాకి అటువంటి పరిస్థితే ఎదురయ్యింది. ఇది కూడా అలాంటి సబ్జెక్టే. కథను, దర్శకున్ని నమ్మినపుడే అలాంటి అద్భుతాలు  జరుగుతాయి. అటువంటి సాహసం చేసే నిర్మాత ఉంటే ఆ సినిమా తీయడానికి నేను సిద్ధమే.

మీరు చాలా సందర్భాల్లో ‘వేటూరి అందర్నీ మింగేశారు’అని అన్నారు. దాని అర్థం ఏమిటి?

జొన్నవిత్తుల: అప్పటిదాకా ఉన్న రచయితలందర్ని ఆయనలో ఆవాహన చేసుకుని వేటూరి తెలుగువారిని సమ్మోహనానికి గురి చేశారు. తెలుగు పాటను తారాస్థాయికి తీసుకెళ్లారు. అందరిలా అందరికన్నా గొప్పగా కాబట్టే అలా అనే సాహసం చేశాను నేను. వేటూరి లాంటి కవి, రచయిత దొరకడం తెలుగు జాతి చేసుకున్న అదృష్టం.

రచయితగా గొప్ప పేరున్న మీకు అవార్డులు రాకపోవడానికి కారణమేంటి?

జొన్నవిత్తుల: దానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ ఇప్పటికీ ఏ పండుగ వచ్చినా నేను రాసిన ‘దేవుళ్లు’(2000) సినిమాలో పాటలు వినిపిస్తాయి. ప్రతి శ్రీరామనవమికి  శ్రీరామరాజ్యం(2011) పాటలు వినిపిస్తాయి. ఇంకా నేను రాసిన ‘జింతాత చితచిత’ ‘జుంబారే జుజుంబరే’ పాటలకు ఇప్పటికీ మాస్‌ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఇంతకన్నా గొప్ప అవార్డులు ఏముంటాయి. నాపాటలకివ్వాల్సిన గౌరవం ప్రేక్షకులెప్పుడో ఇచ్చేశారు. 

ఈ తరం సినీ రచయితల్లో మీకు బాగా నచ్చేవారు ఎవరు?వారికి మీరిచ్చే సలహా ఏమైనా ఉందా?

జొన్నవిత్తుల: ఇప్పటి రచయితలంతా బాగానే రాస్తున్నారు. ప్రజాదరణ పొందిన ప్రతి పాట బాగుంటుంది. నేను మీకు సినిమా పాటల రచయితగానే తెలుసు. కానీ నేనొక కవిని. సాహిత్యానికి సంబంధించి చాలా ప్రయోగాలు చేశాను. మహాకవులు అసంపూర్తిగా వదిలిపెట్టేసిన చాలా రచనలను పూర్తి చేశాను. దాదాపు 12 శతకాలు రాశాను. సాహిత్యపరంగా అన్ని కోణాలను విశ్లేషించాను. నేనొకరిని మెచ్చుకోవాలంటే వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని నిర్ధారించాలి. అలా ఇప్పటివరకు ఎవర్ని అనుకోలేదు. కానీ పాటపరంగా  చూసుకుంటే ఈ కాలంలోనూ మెచ్చుకోదగిన సాహిత్యమే ఉంటోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని