Mani Sharma: వాళ్లకు నా సంగీతం బోర్ కొట్టిందేమో..: మణిశర్మ
ఆలీతో సరదాగాలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ పంచుకున్న ఆసక్తికర విషయాలు.
సంగీతమే ఆయన సామ్రాజ్యం. స్వరాలు ఆయన చేతిలోని అస్త్రాలు. ఆయన సంగీతం కలిసిన సన్నివేశాలు సంచలనాలు సృష్టించాయి. ఆయన స్వరాలతో నిండిన చిత్రాలు కలెక్షన్లు కురిపించాయి. చరిత్ర తిరగరాసిన బ్లాక్‌బాస్టర్ హిట్స్‌తో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ స్థాయికి చేరి సంగీతంతో ప్రేక్షకుల హృదయాలను శాసిస్తున్నారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma). మరి ఈ లెజెండరీ మ్యూజిక్ డైరక్టర్ ‘ఆలీతో సరదాగా’లో పంచుకున్న మ్యూజికల్ ముచ్చట్లేంటో చూసేద్దామా..
మీ పూర్తి పేరు ఏంటి? మీ కంపోజిషన్‌లో మీ నాన్నకు ఇష్టమైన పాట ఏది?
మణిశర్మ: నా పూర్తి పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. మణిశర్మగా నేనే మార్చుకున్నా. మా నాన్నగారికి సంగీతమంటే ఇష్టం. వయోలిన్ వాయిస్తారు. ఆయన గొప్ప పండితులు. ఓర్పు ఎక్కువ. చిన్న తప్పులకు ఏమనేవారు కాదు. ఆయన నా విజయాన్ని చూశారు. కానీ, అసలు పొగడరు. ‘చూడాలని ఉంది’ సినిమాలో పాటలు విని ‘ఏంటి ఆ గొంతులు ఎప్పుడు వినని వాళ్లతో ఎందుకు పాడిస్తావు’ అని క్లాస్ పీకారు. కానీ, ‘సమరసింహారెడ్డి’లోని ‘రావయ్య ముద్దుల మామ’ పాట ఇష్టమని ఒక సందర్భంలో చెప్పారు. నేను పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే. మేము మొత్తం ఐదుగురం. నేను అందరికంటే చిన్నవాడిని. నాన్నగారిది గోదావరి జిల్లా పొడగట్లపల్లి. చిన్నప్పటి నుంచి ఇంట్లో సంగీతం వినిపిస్తూనే ఉంటుంది. అది మా రక్తంలో కలిసిపోయింది.
మొదట అవకాశం వచ్చింది తెలుగులోనా? తమిళంలోనా?
మణిశర్మ: తెలుగులోనే వచ్చింది. ఇప్పటి వరకు 200కు పైగా సినిమాలకు సంగీతం అందించాను. తమిళ్‌లో 25 సినిమాలు చేశాను. కన్నడలో కొన్ని సినిమాలకు బాణీలు అందించా. మొదట సంతకం చేసిన తెలుగు సినిమా అశ్వనీదత్, రామ్‌గోపాల్ వర్మ, చిరంజీవి కాంబినేషన్. కానీ, అది 2 పాటలు కంపోజ్ చేశాక కొన్నికారణాల వల్ల సినిమా ఆగిపోయింది. రెండేళ్ల తర్వాత ఆ ప్రాజెక్టులోకి గుణశేఖర్ వచ్చారు. అదే ‘చూడాలని ఉంది’. దీని కంటే ముందు ‘రాత్రి’, ‘అంతం’ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించా.
పోకిరి సినిమాలో ‘డోలె డోలె’ సాంగ్ ఐడియా ఎలా వచ్చింది?‘లైగర్’ సినిమాకు ఎందుకు సంగీతం అందించలేదు?
మణిశర్మ: ‘డోలె డోలె’ బీట్ పూరీగారు పంపారు. అవసరం అవుతుందేమో చూడండి అన్నారు. ఒక్కరోజులోనే ఈ బీట్‌కు ట్యూన్ కట్టి పంపించాను. ఈ క్రెడిట్ అంతా ఆయనదే. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్సే. మొదట ‘బద్రి’ సినిమాకు మూడు ట్యూన్స్ ఓకే చేశారు. కానీ వేరే కారణం వల్ల ఆ సినిమా కుదరలేదు. ఆ తర్వాత చాలా సినిమాలకు చేశా. లైగర్ సినిమాకు కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను.
సంగీతంలో ఎంతవరకు చదివారు?1992లో మీరు భారతదేశంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే కీ బోర్డు ప్లేయరని విన్నాం? ఎంత తీసుకునే వారు?
మణిశర్మ: సినిమాకు కావలసినంత చదివాను(నవ్వులు). మన సినిమాకు ఎక్కువ చదివినా ఇబ్బందే. ఇక్కడ కావలసింది ఎంత అని కాదు.. కొత్తదనం కావాలి. సినిమాలకు ఎప్పుడు కొత్తగా సంగీతం అందించాలి. అప్పట్లో అనుమాలిక్ దగ్గర ప్రోగ్రామ్స్ కోసం ముంబయికి ఎక్కువ వెళ్లేవాడిని. ఒక సాంగ్‌కు లక్షల్లో తీసుకునేవాడిని. అప్పుడు కీ బోర్డు ప్లేయర్స్‌కి రూ.10వేలు ఇచ్చేవారు.
మీరు, ఏఆర్ రెహమాన్ కలుస్తూ ఉంటారా?ఇప్పటి వరకు ఎంతమంది దగ్గర వర్క్ చేశారు?
మణిశర్మ: రెహమాన్ నన్ను ‘ఓయ్’ అని పిలుస్తారు. నాకు పాటలు పాడడం కూడా నేర్చుకోమని సలహా ఇచ్చారు. మేమిద్దరం కలిసి చాలా సినిమాలకు పనిచేశాం. రెహమాన్ నాకంటే గొప్ప ప్లేయర్. అందులో ఏ సందేహం లేదు. అప్పుడప్పుడు కలుస్తుంటాం. ఏదైనా అవసరం అయితే మెసేజ్ చేస్తా. చూసుకొని ఫోన్ చేస్తారు. తనకు ఆస్కార్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. తను ఆస్కార్‌కు అర్హుడు. ఇప్పటి వరకు ఎంతమంది దగ్గర వర్క్ చేశానో లెక్కపెట్టలేదు. కీరవాణి గారికి 100 సినిమాల దాకా పనిచేసి ఉంటా. నేను సంగీత దర్శకుడిని అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను ఆర్జీవీ బలవంతంగా దర్శకుడు అయ్యేలా చేశారు(నవ్వుతూ).
‘చూడాలని ఉంది’ చేసేటప్పుడు భయం వేసిందా?అప్పటికే చిరంజీవి మెగాస్టార్ కదా?
మణిశర్మ: ‘చూడాలని ఉంది’ సినిమా సమయంలో దర్శక నిర్మాతలు అందరూ నాకు సహకరించారు. చిరంజీవికి రెండు ట్యూన్స్ వినిపించి సరదాగా రెహమాన్ చేశారని చెప్పారు. ఆయన ఎగిరి గంతేశారు. ఆ తర్వాత నన్ను తీసుకెళ్లి పరిచయం చేశారు. మాములుగానే నాకు పని అంటే ఇష్టం. ఈ ఇష్టం ముందు మిగతా విషయాలు నేను మర్చిపోయేవాడిని. ఇక భయం అనిపించలేదు. పైగా నేను పనిలో మునిగిపోయే వాడిని. రోజూ బిజీయే. థియేటర్లకు వెళ్లి ఆయన సినిమాలు చూసిన అనుభవం కూడా లేదు. అందుకే నాకు భయం వేయలేదేమో. ఇంద్రలో వీణ స్టెప్ చిరంజీవి గారు చేయడం వల్లే అంత హిట్ అయింది. ఆ బీట్‌కు లారెన్స్ తనదైన శైలిలో స్టెప్ క్రియేట్ చేశారు. ఆ పాట హిట్ కావడానికి లారెన్స్ కూడా ఒక కారణం.
‘రామ్మాచిలకమ్మా’ పాట బాలుగారితో ఎందుకు పాడించలేదు?
మణిశర్మ: నేనేప్పుడు నా మనసు ఏది చెప్తే అది చేస్తా. దానికోసం పోరాటాలు కూడా చేశా. అలా పోరాడి గెలిచిన సాంగ్ ‘రామ్మా చిలకమ్మా’. ఈ పాట ఉదిత్‌నారాయణతో పాడించిన తర్వాత చిరంజీవి గారికి వినిపిస్తే నచ్చలేదన్నారు. అప్పుడు ఒకరోజంతా షూటింగ్ ఆపేసి డైరెక్టర్, వేటూరి అందరూ కూర్చొని బాలు గారితో మరో పాట చేశారు. ఈ రెండు పాటల్లో ఏది సెలక్ట్ చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఓటింగ్ పెట్టారు. అందులో ఉదిత్ నారాయణ పాటే గెలిచింది. ఆ సినిమాలో బాలు గారు పాడినవి మూడు ఉంటాయి. నేను బాలు గారు అన్నదమ్ములా ఉంటాం. ఆయన నన్ను ‘ఓరేయ్’ అని పిలిచేవారు.
మీ అబ్బాయి మహతి ఏం చేస్తున్నాడు?
మణిశర్మ: నేను చేస్తున్న పనే చేస్తున్నాడు. నా సలహాలు తీసుకోడు. నేను ఏది చేయమంటే అది తప్ప అన్ని చేస్తాడు. అలానే ఉండాలి.. ఎందుకంటే నేను చెప్పింది చేస్తే నాలాగా ఉంటుంది.. కానీ కొత్తదనం ఉండదు. రీసెంట్‌గా ‘భీష్మ’ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ కంపోజ్ చేశాడు. ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.
ఈ రోజు మణిశర్మ ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఎవరు?
మణిశర్మ: పేర్లు కాదు కానీ , విధిని నేను నమ్ముతాను. అదే ఇంతదూరం నన్ను లాక్కొచ్చింది. నాకు తెలిసింది సంగీతం మాత్రమే. ఊపిరి వదిలేసే వరకూ పనిచేస్తూనే ఉండాలని నేను అనుకుంటాను. అది నా ఆశ.
మీ శిష్యులు ఎంతమంది సంగీత దర్శకులు అయ్యారు?
మణిశర్మ: చాలామంది ఉన్నారు. హేరిస్ జయరాజ్, దేవీశ్రీ ప్రసాద్, తమన్.. వీళ్లందరూ నా దగ్గర చేసినవాళ్లే. దేవీ శ్రీ ప్రసాద్‌ను సింగర్ చేసింది కూడా నేనే అనుకుంటా. వీళ్లందరిలో జీరో నుంచి వచ్చిన వ్యక్తి మాత్రం తమన్. తన సహనమే అతడిని ఇంతవాడిని చేసింది. నా దగ్గర ఉన్నప్పుడు పని ఒత్తిడిలో నేను ఏది ఉంటే అది విసిరేసేవాడిని. టీవీ వెనక్కి వెళ్లి దాక్కునేవాడు. ఇక శివమణి ఏది దొరికితే దానితో వాయించేస్తాడు. ఫ్లైట్ ఎక్కినప్పుడు చేతిలో స్టిక్స్ ఉంటే వాటితోనే అద్భుతం చేస్తాడు. ప్లైట్ ఎక్కినవాళ్లందరూ క్లాప్స్ కొట్టేవాళ్లు.
సమరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ అభిమానులు మిమ్మల్ని ఎలా చూసేవాళ్లు?
మణిశర్మ: నేనెప్పుడూ అభిమానులతో ఇంట్రాక్ట్ అవ్వలేదు. ఈ పాటలు హిట్ అయ్యాయని స్నేహితులు చెప్పేవారు. అప్పుడు తెలుసుకునే వాడిని. అంతగా పనిలో మునిగిపోతా.
మీకు బాగా తృప్తిని ఇచ్చిన సినిమా ఏది?
మణిశర్మ: చూడాలని ఉంది, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు... చాలా ఉన్నాయి. ఫలితం దక్కని సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. రావోయి చందమామ, గుడుంబా శంకర్ ఇలా కొన్ని సినిమాలు ఆశించిన హిట్ అవ్వలేదు. దానివల్ల మ్యూజిక్‌కు కూడా తగిన గుర్తింపు రాలేదు.
సాధారణంగా హిందీ పాటను పెట్టాలంటే ఆలోచిస్తారు? కానీ ఖుషీ సినిమాలో ఫుల్ సాంగ్ హిందీలో ఉంటుంది. ఆ ఆలోచన ఎవరిది?
మణిశర్మ: ఆ ఐడియా పవన్‌కల్యాణ్ గారిది. ఖుషీ సినిమాలో పాట ట్యూన్ చేశాక చాలా బాగుంది హిందీలో చేసి నేషనల్ లెవెల్లో రీలీజ్ చేద్దాం అన్నారు. కానీ కుదరలేదు. ఇక్కడ మాత్రం సూపర్ హిట్ అయింది. ఇక పాత పాటల్ని రీమేక్ చేయాలన్న ఆలోచన కూడా పవన్‌కల్యాణ్‌దే. అందుకే ‘ఖుషీ’లో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే పాట పెట్టాం.
బొమ్మాలి పాట వినగానే అనుష్క రియాక్షన్ ఏంటి? ఆ పాటలో నాపేరు ఎందుకు వాడారు(నవ్వుతూ)?
మణిశర్మ: సారీ సర్(నవ్వుతూ) అయినా మీరు ఆలీ. ఆ లిరిక్ బొమ్మాలి. ఈ పాట కంపోజ్ చేశాక అనుష్క వేరే షూటింగ్‌లో ఉంటే వినిపించారు. వెంటనే గంతులేసిందట. రీసెంట్ గా ప్రభాస్ పుట్టినరోజుకు బిల్లా సినిమా రీరిలీజ్ చేస్తే, నాకు ఈ పాట బాగుందని ఎన్ని ఫోన్స్ వచ్చాయో. మొదటిసారి కూడా అన్ని రాలేదు.
‘ఇంద్ర’లో ఒక్కపాట మాత్రమే ఆర్పీపట్నాయక్ ఎందుకు చేశారు?
మణిశర్మ: నేను ప్రతి సంవత్సరం మే లో ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్తా. నేను ఆస్ట్రేలియా వెళ్లాక మూవీ టీంకు ఒక ఐడియా వచ్చింది. అన్ని మెలోడీలే ఉన్నాయి. ఒక్క పాట వేరే జోనర్‌లో ఉంటే బాగుంటుందనిపించింది. అప్పుడు చిరంజీవి గారు ఫోన్ చేసి చెప్పారు. ఇలా అనుకుంటున్నాం. ఈ పాట వేరే మ్యూజిక్ డైరెక్టర్‌తో చేయిస్తామన్నారు. అలా చేసిన పాట ‘అయ్యయ్యయో..చలి కాలం చంపేస్తుందయో’.
మీరు కంపోజ్ చేసిన తెలుగు సినిమాలోని పాటలన్నీ విని తనకు ఇవ్వాలని అడిగారట ఓతమిళ హీరో. ఎవరతను?
మణిశర్మ: వెంకటేష్ గారి ‘శ్రీను’ సినిమా పాటలు నచ్చి ఆర్బీ చౌదరి గారు తమిళంలో పెడదాం అన్నారు. అందులో విజయ్ హీరో. నేను విజయ్ కోసం కొత్తగా ట్యూన్స్ చేస్తా ఇవి వద్దు అని చెప్పాను. ఆ తర్వాత విజయ్ కూడా నేను కంపోజ్‌చేసిన పాటలు నచ్చి అవే కావాలని అడగారు. అలా వేరే చిత్రాల్లోని ‘అమ్మాయే సన్నగా..’ ఆటకావాలా పాటకావాలా’ వంటివి తీసుకున్నారు.
హోటల్‌లో స్పూన్లు, ఫోర్కులు ఎత్తుకెళ్లేవారట?తొండలకు దారాలు కట్టి చెట్టుఎక్కించేవారట.? పోపుల పెట్టెలో డబ్బులు కొట్టేసేవారట? ఏంటి ఈ కథలు?
మణిశర్మ: ఎప్పుడో చిన్నప్పుడు చేశాను(నవ్వుతూ). హోటల్‌కు వెళితే అలా స్పూన్లు జేబులో పెట్టుకుని వచ్చేసేవాడిని. ఐస్‌క్రీమ్స్ కోసం పోపుల డబ్బాలో నుంచి డబ్బులు తీసుకునే వాడిని.
బాగా కష్టపడిన సినిమా ఏది?తక్కువ సమయం తీసుకున్న సినిమా ఏది?
మణిశర్మ: ఎప్పుడూ పనిని ఎంజాయ్ చేస్తాను. కష్టం ఏమి కాదు కానీ ఎక్కువ పని చేసింది మాత్రం ‘మృగరాజు’కి. దానికి కోయభాషలు అన్ని రాయించి. వాటికి ట్యూన్ చేసి, అలాగే కోయభాషకు కోరస్‌లు పాడించి ఇలా చాలా సమయం పట్టింది. అలాగే చాలా తక్కువ సమయంలో చేసిన సినిమాలు ‘ఖుషీ’, ‘రాయలసీమ రామన్న చౌదరి’... ఇక లిరిక్స్ రాసి ట్యూన్ చేసిన పాటలు చాలా ఉన్నాయి. ‘నీ నవ్వుల తెల్లదనాన్ని’, ‘జాజిరి జాజిరి మామ’ ఇలా.
రాజ్ కోటితో ఎలా ఉండేది మీ అనుబంధం?
మణిశర్మ: వాళ్ల దగ్గర నుంచి ఎక్కువగా నేర్చుకున్నా. నా నేపథ్య సంగీతమంటే వాళ్లకు చాలా ఇష్టం. చాలా ఆసక్తిగా చేసేవాళ్లు. పని మాత్రం మాములుగా ఉండేది కాదు. అప్పట్లో రోజుకు ఐదు రీల్స్ చేసే వాళ్లం. ఒకవైపు ఏఆర్ రెహమాన్, మరోవైపు నేను.
ఇటీవల విడుదలైన ఆచార్య సినిమాలో సంగీతం ఎందుకు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది?
మణిశర్మ: రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి కదా! దాని గురించి అడగరా(నవ్వుతూ). నేను ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి చిరంజీవిగారితో సినిమాలు చేస్తూ ఉన్నాను. ఆచార్య సినిమాకు నేను ఒక వెర్షన్ చేశా. డైరెక్టర్ గారు వేరే ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అన్నారు. తప్పులేదు.. ఎందుకంటే ఎప్పుడూ కొత్తగా చేస్తుండాలి.
మీ దగ్గరకు తమన్ వస్తుంటే చాలా మంది తనని తీసుకోవద్దని ఫోన్‌చేసి చెప్పేవారట?
మణిశర్మ: పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ కొందరు భయపడ్డారు. ఎవరితో ఎలా పనిచేయించుకోవాలో నాకు తెలుసు. వాళ్లపేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ, నేను ఎలా పని చేస్తాను అని నాకు మాత్రమే తెలుసు.
తమన్ వచ్చాక మణిశర్మ అవసరం లేదనుకునే వాళ్లకి మీ సమాధానం ఏంటి?
మణిశర్మ: నాకు తెలీదు. అది టైమింగ్ అంతే. అన్ని సినిమాలు నేనొక్కడినే చేయాలి అనుకోను. నాతో పాటు అందరూ చేయాలనుకుంటాను. అలా చేస్తేనే జనాలకు కూడా కొత్తదనం అందుతుంది. అలా మాత్రమే ఆలోచిస్తా. బహుశా వాళ్లకి బోర్ కొట్టిందేమో నా సంగీతం.
మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీగా ఉన్న రోజుల్లో ఎందుకు సినిమా ప్రొడ్యూస్ చేశారు?
మణిశర్మ: ఎప్పుడో జరిగింది. నాకు గుర్తుకూడా లేదు(నవ్వుతూ). పాత స్నేహితుడు నా దగ్గరకు వచ్చి చిన్న బడ్జెట్‌లో సినిమా తీద్దామన్నాడు. రూ.30లక్షలు పెట్టి ‘రూపాయ్’ సినిమా తీశాం. రూపాయి కూడా రాలేదు. తర్వాత ఓ హిందీ సినిమా కూడా ప్రొడ్యూస్ చేశా. తెలియని పనులు చేయకూడదని పాఠాలు నేర్చుకున్నా. ‘సత్యం శివం సుందరం’ సినిమాలో నటించాను కూడా.
మీకు కోపం ముక్కు మీదే ఉంటుందట? ప్రస్తుతం ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు?
మణిశర్మ: ఆ కోపం ఎక్కువసేపు ఉండదు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంది. ఏదైనా పని గురించే ఉంటుంది కానీ వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’ చేస్తున్నా. కన్నడలో కొన్ని సినిమాలు చేస్తున్నా.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers Protest: ఆందోళనకు దిగిన రెజ్లర్లపై కేసులు నమోదు
-
General News
CM Jagan: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ
-
India News
Stalin: బుల్లెట్ రైలులో సీఎం స్టాలిన్.. రెండున్నర గంటల్లో 500కి.మీల ప్రయాణం!
-
Movies News
The Kerala Story: వాళ్ల కామెంట్స్‌కు కారణమదే.. కమల్‌హాసన్ వ్యాఖ్యలపై దర్శకుడు రియాక్షన్
-
General News
TSPSC Paper Leak Case: సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరం.. ఐటీ ఉద్యోగి అరెస్టు
-
World News
Cosmetic Surgeries: సౌందర్య చికిత్సతో ఫంగల్ మెనింజైటిస్.. కలవరపెడుతున్న మరణాలు