Updated : 22 Jun 2022 11:12 IST

కుమారి 21ఎఫ్‌.. దృశ్యం సినిమాలు అందుకే వదులుకోవాల్సి వచ్చింది: చాందిని

చిన్న సినిమాలతో యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న యువ హీరో ‘కిరణ్‌ అబ్బవరం’(kiran abbavaram). అదే చిన్న సినిమాలలో సత్తా చాటి, ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్‌ ‘చాందినీ చౌదరి’(chandini chowdary). ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’తో కిరణ్‌, ‘కలర్‌ ఫోటో’తో చాందిని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘సమ్మతమే’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వీరిద్దరూ ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి అనేక విషయాలు పంచుకున్నారు.

మీ ఇద్దరిది ఏ ఊరు? ఇండస్ట్రీకి ఎలా పరిచయమయ్యారు?

కిరణ్ అబ్బవరం: మాది కడప జిల్లా రాయచోటి. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఇష్టంతోనే పెరిగా. షార్ట్‌ ఫిల్స్మ్‌  ద్వారా ఇండస్ట్రీకి దగ్గరయ్యా!

చాందిని: మాది వైజాగ్‌. నేను చిన్నతనంలో త్రో బాల్ స్టేట్‌ ఛాంపియన్‌ని. అదీ కాక హీరోలని అనుకరించడం బాగా అలవాటు. ఎక్కువగా రజనీకాంత్‌ని ఇమిటేట్ చేసేదాన్ని. అలా నటన అలవాటైంది. చాలా షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించా. వాటి ద్వారా పెద్ద చిత్రాలలో చేసే అవకాశం వచ్చింది.

రూ.70 వేల జీతం వదిలి సినిమాల్లోకి ఏ ధైర్యంతో వచ్చావు?

కిరణ్ అబ్బవరం: నాకసలు నమ్మకం లేదు. కాలేజ్‌ డేస్‌లో ఒకసార్‌ రోజూ నా దగ్గరికి వచ్చి ‘నువ్వైతే కచ్చితంగా బస్టాండ్‌లో బఠానీలు అమ్ముకుంటావ్‌’ అనేవారు. అటువంటిది కాలేజ్‌లో ఫస్ట్‌ జాబ్‌ నాకే వచ్చింది. జాబ్‌లో జాయిన్‌ అయిన కొన్ని రోజులకే చిరాకొచ్చింది. ఇక జీవితం ఇంతేనా అనుకుంటున్న సమయంలో గిరీష్ అనే స్నేహితుడు షార్ట్‌ ఫిల్మ్స్‌ తీద్దామంటూ నా దగ్గరికి రావడం, అవి చూసిన ఫ్రెండ్స్‌ ‘హీరోగా బాగున్నావు’ అని మెచ్చకోవడంతో నా పైన నాకు నమ్మకం పెరిగింది.

మీ కుటుంబ నేపథ్యం ఏంటి?

చాందిని: మాది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. మా తల్లిదండ్రులిద్దరూ బిజినెస్ చేస్తారు. చిన్నప్పటి నుంచి యాక్టివ్‌గా ఉండేదాన్ని. క్లాస్‌లో హీరోలని అనుకరించేదాన్ని. అద్దంలో చూసుకుంటూనే నటనను మెరుగుపరుచుకున్నా. కాలేజీ సమయానికి నన్ను నేను స్ర్కీన్‌పై చూసుకోవాలనే కోరిక రోజురోజుకి పెరిగిపోయింది. అప్పుడు ఒక ఫ్రెండ్‌ ద్వారా రాజ్‌తరుణ్‌ పరిచయమయ్యాడు. 2011నుంచి నా షార్ట్‌ ఫిల్మ్స్‌ ప్రస్థానం మొదలైంది. అప్పుడు షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసే తెలుగు అమ్మాయిని నేనే. ఆ తరువాత చదువు పూర్తయ్యాకే సినిమాలు అని ఇంట్లో కండీషన్‌ పెట్టడంతో చదువు పూర్తిచేశాను.

ఇద్దరికి మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది?

కిరణ్ అబ్బవరం: షార్ట్‌ ఫిల్మ్స్‌ ద్వారా 2017లో ఒక సినిమా అవకాశం వచ్చింది. అప్పుడే హీరో అయిపోయానా అనిపించింది. సెట్స్‌లోకి వెళ్లేసరికి అది నేను చేయాల్సిన సినిమా కాదనిపించింది. ఇచ్చిన డబ్బులు వెనక్కిచ్చేసి షూటింగ్‌ నుంచి మధ్యలో వచ్చేశా. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే హీరో అవ్వాలంటే మనల్ని మనమే లాంచ్‌ చేసుకోవాలి. అప్పుడే ప్రారంభమైంది ‘రాజావారు రాణిగారు’. విక్కీ అనే నా స్నేహితుడు, నేను, దర్శకుడు రవి కష్టపడి తీశాం. సురేష్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. మా కష్టానికి ఫలితం దక్కిందనిపించింది.

నీలో మంచి రచయిత ఉన్నాడని తెలిసింది. అతనెప్పుడు బయటికొస్తాడు?

కిరణ్ అబ్బవరం: ‘రాజావారు రాణీగారు’ తర్వాత నాకు హీరోగా అవకాశాలు వచ్చాయి. అన్నీ మలయాళ రీమేక్‌లు కావడంతో నాకు నచ్చలేదు. దాంతో నేనే ‘ఎస్‌ఆర్ కల్యాణ మండపం’ కథ రాసుకున్నా. ఆ తరువాత సాయికుమార్‌ సార్‌కి స్టోరీ వినిపించడం, ఆయన వెంటనే తండ్రి పాత్ర చేయడానికి ఒప్పుకొన్నారు.

నీ కెరీర్‌ ఎదుగుదలకి ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ ఎంతవరకు ఉపయోగపడింది?

కిరణ్ అబ్బవరం: అసలు అంత విజయాన్ని ఊహించలేదు. లాక్‌డౌన్‌లో థియేటర్లకి ప్రేక్షకులు వస్తారా అనే సందేహంతో ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ విడుదల చేశాము. హౌస్‌ఫుల్‌ రన్‌తో ఆ సినిమా విజయం సాధించింది. ఇప్పుడు నా చేతిలో ఆరేడు సినిమాలు ఉన్నాయంటే ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపమే కారణం.

మీకు(చాందినీ చౌదరి) డైరెక్షన్‌ అంటే ఆసక్తా? ఎప్పుడు డైరెక్ట్‌ చేస్తున్నారు?

చాందిని: మీకెలా తెలుసు?(నవ్వుతూ) చిన్నప్పట్నుంచి కథలు రాసేదాన్ని. నేనొక రైటర్‌ను అవుదామనుకున్నా. కానీ, సినిమాల్లోకి వచ్చాక మంచి నటిగా స్థిరపడి ఆ తరువాత డైరెక్టర్‌ అవుదామనుకుంటున్నా. ఈ లోపు డైరెక్షన్‌ సంబంధించి మెలకువలు నేర్చుకుంటాను. ఎక్కువగా హారర్‌ స్టోరీలు అంటే ఇష్టం. చిన్నప్పుడు ఫ్రెండ్స్‌కి దెయ్యాల కథలు చెప్పి భయపెట్టేదాన్ని(నవ్వుతూ).

నటులుగా మీ రోల్‌ మోడల్‌ ఎవరు?

కిరణ్ అబ్బవరం: రోల్‌ మోడల్‌ అంటూ ఎవరూ లేరు. నేను మొదట చూసిన సెలబ్రిటీ మీరే. ఒక సినిమా షూటింగ్‌లో మిమ్మల్ని కలిశా. అప్పుడా షూటింగ్‌లో చూసిన హడావిడి, చిన్నప్పట్నుంచి ప్రతి సినిమా విడుదలకి మేము చేసిన హంగామా, సినిమాలు తీయడానికి మేము చేసిన ప్రయత్నాలు ఇవన్నీ నాకు రోల్‌ మోడలే.

నటిగా మీకు పేరు తెచ్చిన సినిమా ఏది? ఫస్ట్‌ హిట్ ఎప్పుడొచ్చింది?

చాందిని: నా మొదటి మూడు నాలుగు సినిమాలు ఫ్లాపేలేండి! ‘మను’ అనే సినిమాకి నటిగా పేరొచ్చింది. నా ఫస్ట్‌ హిట్ మాత్రం ‘కలర్‌ ఫోటో’. ఆ సినిమాకే మంచి పేరొచ్చింది.

‘కలర్‌ ఫోటో’ సినిమాకి ఒక పెద్ద హీరో నుంచి ఫోన్‌ వచ్చిందట కదా? ఎవరు?

చాందిని: అల్లు అర్జున్ గారు. సినిమా హిట్టయ్యాక ఆయన ఫోన్‌ చేసి అభినందించడం మర్చిపోలేను. టీమ్‌ అందరిని కలిసి ప్రశంసించారు.

మీ సినిమా పేరు ‘సమ్మతమే’. మీరిద్దరూ ఎవరి సమ్మతం కోసం ఎదురుచూస్తున్నారు?

కిరణ్ అబ్బవరం: నేనైతే 24న ఆడియన్స్‌ సమ్మతం కోసం ఎదురు చూస్తున్నా.

చాందిని: బాగా చెప్పావ్‌(నవ్వుతూ)

అసలు ‘సమ్మతమే’ కథ ఏంటి?

కిరణ్ అబ్బవరం:  ఈ కథ ప్రేమికులందరికీ కనెక్ట్‌ అవుతుంది. చాలా స్టడీ చేసి దర్శకుడు గోపీ మంచి పాయింట్ పట్టుకున్నారు. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది.

నీకు చాలా లవ్‌ ప్రపోజల్స్‌ వస్తున్నాయట? దేనికైనా జెండా ఊపావా?

కిరణ్ అబ్బవరం: నాకా? అదేం లేదండి(నవ్వుతూ)

చాందిని: వస్తున్నాయి కదా!(నవ్వుతూ) మా వాడికి కొంచెం సిగ్గు ఎక్కువ.

కిరణ్ అబ్బవరం:చాందిని నా వ్యక్తిత్వానికి పూర్తి భిన్నం. నా సిగ్గు మొత్తం ఎగిరిపోయేలా చేస్తాది.

హీరో, హీరోయిన్‌గా ఇది మీకెన్నో సినిమా? మీ తరువాతి సినిమాలు ఏంటి?

కిరణ్ అబ్బవరం: హీరోగా నాకిది నాలుగో సినిమా. దీని తరువాత ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అని కోడిరామకృష్ణ గారి బ్యానర్‌లో విడుదల కానుంది. గీతాఆర్ట్స్‌ లో ఒకటి, మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో మరొకటి, ఇంకా ఏఎమ్‌ రత్నం గారి బ్యానర్‌లో ఇంకొకటి, ఇలా నాలుగు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఇంకో రెండు సినిమాలు ప్రకటించనున్నారు.

చాందిని: ఆగస్టులో ‘గామి’ విడుదలవనుంది. అందులో విశ్వక్‌సేన్‌ సరసన నటించా. ఆ తరువాత అశోక్‌ సెల్వన్‌ హీరోగా కోలీవుడ్‌లో అడుగుపెడుతున్నా. ఇంకో రెండు సినిమాలు ప్రకటించాల్సి ఉంది.

నీ డ్రీమ్‌ డైరెక్టర్‌ ఎవరు? ఫలానా దర్శకుడి సినిమాలో చేయాలని ఏదైనా ఉందా?

చాందిని: ‘మణిరత్నం’. ఆయన నా అభిమాన దర్శకుడు. ఆయన సినిమాలో నటించాలనేది నా కల.

నువ్వు హీరో అవ్వడానికి కారణం ఒక అమ్మాయి అని విన్నాను! నిజమేనా?

కిరణ్ అబ్బవరం: అమ్మాయా! (నవ్వుతూ) అలా ఏం లేదు సార్‌! నేను కాలేజ్‌ డేస్‌లో చాలా లావుగా ఉండేవాడిని. అయినా నా ఫ్రెండ్స్‌ అంతా ‘నువ్వు బాగుంటావ్‌’ అనేవారు. ఆ ధైర్యంతోనే కాలేజీలో ఒక అమ్మాయికి ప్రపోజ్‌ చేశా. ఆ అమ్మాయి పదిరోజులు కాలేజీ మానేసింది. రిజెక్ట్‌ చేసిందని అప్పుడు నాకర్థమయ్యింది. దాంతో ఎలాగైనా లావు తగ్గాలని ఫిక్సయ్యా.

‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ షూటింగ్‌లో ఎస్వీ రంగారావు గారి ఆశీర్వాదం దొరికిందట కదా?

కిరణ్ అబ్బవరం: ఆ సంఘటన మర్చిపోలేను. షూటింగ్‌లో భాగంగా ఎస్వీ రంగారావుగారి నిలువెత్తు ఫొటోకి దండ వేయించి స్పాట్‌లో పెట్టించాం. సీన్‌ తీసే ముందు సాయికుమార్‌ గారు, నేనూ ఆయన ఫొటోకు దండం పెట్టుకోవడానికి వెళ్లాం. అక్కడికి అసలు గాలి వచ్చే పరిస్థితి లేదు. కానీ ఆయన ఫొటోకి ఉన్న దండ మూడు సార్లు వేగంగా కొట్టుకుంది. నేను ఆశ్చర్యపోయి చూస్తుండగా, సాయికుమార్‌ గారు ‘నీకు పెద్దాయిన ఆశీర్వాదం దొరికింది. నీ సినిమా సూపర్‌ హిట్టు’ అన్నారు. గొప్పోళ్ల ఆశీర్వాదం విలువ నాకప్పుడే తెలిసింది. చాలా హ్యాపీగా ఫీలయ్యా.

పెద్ద ప్రొడ్యుసర్‌ నీ డేట్స్‌ తీసుకుని మూడు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారని విన్నాను నిజమేనా?

చాందిని: నిజమే సార్‌...అతనో పెద్ద నిర్మాత. పేరు చెప్పను. రెండు సంవత్సరాలకి నాతో ప్రాజెక్టు సైన్‌ చేయించుకుని ఒక్క సీన్‌ కూడా షూట్‌ చేయలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ రెండు సంవత్సరాలు  నా ఎదుగుదలకు చాలా ఉపయోగపడేది. మంచి సినిమాలు మిస్‌ అయ్యాను. వేరే సినిమాలు చేసుకుంటానంటే ఆయన నన్ను బెదిరించారు. ఇండస్ట్రీకి కొత్తమ్మాయిని కావడంతో ఏం చేయలేకపోయా.

అప్పుడు మీరు మిస్‌ అయిన సినిమాలు ఏంటి?

చాందిని: ఆ సమయంలో షార్ట్‌ఫిల్మ్స్‌ వలన నాకు చాలా పేరొచ్చింది. ఆఫర్లు కూడా అలానే వచ్చాయి. ‘ఊహలు గుసగుసలాడే’, ‘కుమారి 21ఎఫ్’, ‘పటాస్‌’, ‘దృశ్యం’ చిత్రాలు చేయాల్సింది. అవి చేసుంటే కెరీర్‌ ఇంకా బాగుండేది. కాని నాకప్పుడలా అన్యాయం జరిగింది.

నువ్వు తెలుగమ్మాయివి కదా! తెలుగమ్మాయిలకు మన ఇండస్ర్టీలో అవకాశాలు ఎలా ఉన్నాయి?

చాందిని: ఇది చాలా కష్టమైన ప్రశ్న. మామూలుగా ఎక్కడైనా సొంత భాష వాళ్లకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ, మన తెలుగు ఇండస్ట్రీలో ఆ అవకాశం తక్కువే. ఇది ఒప్పుకోవాల్సిన నిజం.

ఇన్ని అవరోధాలు దాటి ఇప్పుడు హీరో-హీరోయిన్‌గా స్థిరపడ్డారు. మీ తల్లిదండ్రుల స్పందన ఏంటి?

కిరణ్ అబ్బవరం: చాలా హ్యాపీ. మా నాన్నైతే ‘నా గౌరవాన్ని మళ్లీ నిలబెట్టావు. ఇంకో పది సంవత్సరాలు ప్రశాంతంగా బతికేస్తా’ అన్నారు. చాలా ఆనందంగా అనిపించింది. మరొక విషయం నేను చేసిన ఓ షార్ట్‌ ఫిల్మ్‌ ఆధారంగా శర్వానంద్‌ ‘శ్రీకారం’ సినిమా చేశారు.

చాందిని: మా అమ్మా నాన్న చాలా హ్యాపీ. మా అమ్మ మొదట హీరోయిన్‌ అవుతానంటే ‘సినిమా ఇండస్ట్రీలో కష్టం’ అన్నారు. కానీ, ఇప్పుడు నా ఎదుగుదలపై సంతోషంగా ఉన్నారు.

కిరణ్ అబ్బవరం: సార్‌! మిమ్మల్ని ఎప్పట్నుంచో అడుగుదామనుకుంటున్నా ప్రశ్న ఇది. జల్సా, ఖుషి సినిమాలలో మీరు, పవన్‌కల్యాణ్‌ గారు మందు తాగే సీన్‌లకు ఎన్ని టేకులు తీసుకున్నారు. అంత సహజంగా ఎలా నటించగలిగారు?

అలీ: సింగిల్‌ టేక్‌లో ఆ సీన్లు చేశాం. ఖుషిలో సీన్‌ అయితే ఒకసారి ప్రాక్టీస్ చేశాం. జల్సాలో సీన్‌కు మా సొంతంగా కొంత జోడించాం. రెండు సూపర్‌ హిట్టయ్యాయి.

కిరణ్ అబ్బవరం:  నిజంగా మీ ఇద్దరి కాంబినేషన్‌ సూపర్‌ సార్‌. ఇప్పటికీ ఎదురు చూస్తుంటాం..!

అలీ: త్వరలో మళ్లీ చూస్తారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని