‘RRR’: ఆ సీన్‌ చూస్తుంటే కన్నీళ్లాగలేదు!

ఆయన కలం కదిపితే చాలు కలెక్షన్ల కోటలు బద్దలయ్యే కథలు పుడతాయి. ఆయన కథనాన్ని రచిస్తే చూస్తున్న ప్రేక్షకుల హోరుతో థియేటర్లు దద్దరిల్లుతాయి.

Published : 02 Jun 2021 09:21 IST

ఆయన కలం కదిపితే చాలు కలెక్షన్ల కోటలు బద్దలయ్యే కథలు పుడతాయి.. ఆయన కథనాన్ని రచిస్తే చూస్తున్న ప్రేక్షకుల హోరుతో థియేటర్లు దద్దరిల్లుతాయి.. తెలుగుజాతి ఖ్యాతిని పెంచిన ఎన్నో కథల సృష్టికర్త.. భరతజాతి గర్వించే దర్శకుడిని కన్న మహా రచయిత.. ఆయనే కె.వి.విజయేంద్రప్రసాద్‌. ఆలీ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో విశేషాలు పంచుకున్నారు.

విశ్వ విజయేంద్రప్రసాద్‌ ఎలా ఉన్నారు?

విజయేంద్రప్రసాద్‌: బాగానే ఉన్నాం. కథలు రాసి అందరినీ మాయ చేస్తున్నాం.

దర్శకత్వం సులభమా? కష్టమా?

విజయేంద్రప్రసాద్‌: దర్శకత్వం చాలా కష్టం. ఎందుకంటే కథను ఊహించి రాయటం కథకుడి పని. కానీ, దాన్ని ఎలా తెరకెక్కించాలనేది మాత్రం సాంకేతిక నిపుణులు, నటుల నుంచి రాబట్టుకోవడం దర్శకుడి పని. కథా రచయితకు ఎంత టాలెంట్‌ కావాలో.. అంతకు పదింతలు దర్శకుడికి కావాలి.

హిందీ ఇండస్ట్రీకి మీరు స్వయంగా వెళ్లారా? లేక ఎవరైనా ప్రోత్సహించారా?

విజయేంద్రప్రసాద్‌: రాక్‌లైన్‌ వెంకటేశ్‌గారితో నాకున్న పరిచయం కారణంగా ‘బజరంగీ భాయిజాన్‌’ కథను ఆయనకు చెప్పా. అది ఆయనకు నచ్చింది. దాన్ని ఆయన స్నేహితుడి ద్వారా ఆమీర్‌ఖాన్‌కు చెప్పమన్నారు. జైపూర్‌లో షూటింగ్‌ జరుగుతుండగా వెళ్లి కలిసి కథ చెప్పాం. ఆయనకూ నచ్చింది. జైపూర్‌ ప్యాలెస్‌ నుంచి రోడ్డు మీదకు రావడానికి సుమారు కి.మీ. దూరం ఉంటుంది. అంతదూరం మాతో నడిచి మమ్మల్ని సాదరంగా పంపారు. సినిమా ఓకే అవుతుందని అనుకున్నాం. పదిరోజుల తర్వాత ‘సారీ విజయేంద్రప్రసాద్‌. ఎందుకో ఆ పాత్రకు కనెక్ట్‌ కాలేకపోతున్నా’ అని మెసేజ్‌ పెట్టారు. ఆ తర్వాత అదే కథను కబీర్‌ఖాన్‌ ద్వారా సల్మాన్‌కు చెప్పించారు. సల్మాన్‌కు నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది.

‘బజరంగీ భాయిజాన్‌’ కథను చాలామంది ‘పసివాడి ప్రాణం’తో పోలుస్తారు?

విజయేంద్రప్రసాద్‌: పోల్చడం ఏంటి? దాని నుంచే స్ఫూర్తి పొంది రాసుకున్నాం. ‘పసివాడి ప్రాణం’ నాకు చాలా ఇష్టం. ఒకరోజు నేను కీరవాణి తమ్ముడు, దర్శకుడు మహదేవ్‌ కలిసి ఆ సినిమా చూస్తుంటే ‘భలే బాగుంది. నొక్కేద్దామా’ (నవ్వులు) అని అన్నాను. కథను పాకిస్థాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో రాసుకుంటే బాగుంటుంది అనుకున్నాం. ప్లాట్‌ రాసేశాం. కానీ, ఎందుకో మనసు ఒప్పుకోలేదు. ఒకరోజు ఓ ఇంటర్వ్యూ చూశాను. పాకిస్థాన్‌కు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబం. వాళ్ల పాపకు హార్ట్‌లో హోల్‌ ఉంది. అక్కడ చికిత్స చేయిస్తే రూ.10-15 లక్షలు అవుతుంది. అదే మద్రాసు అపోలో ఆస్పత్రిలో రూ.2-3 లక్షలకే చేస్తారని తెలిసింది. దీంతో వీసా తీసుకుని ఇక్కడకు వచ్చారు. రూ.లక్ష అడ్వాన్స్‌ కట్టి ఆస్పత్రిలో చేరారు. ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది. ఆ తర్వాత వాళ్లు పాకిస్థాన్‌ నుంచి వచ్చారని ఆస్పత్రి వాళ్లకు తెలిసింది. ‘మీరు మాకు అతిథులు. మీకు మా సాయం తప్పకుండా ఉంటుంది’ అని కట్టిన అడ్వాన్స్‌ కూడా ఆస్పత్రి వాళ్లు తిరిగి ఇచ్చేశారు. ఇదే విషయాన్ని ఆ బిడ్డ తల్లి డీడీ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఇండియా వెళ్తే చంపేస్తారంటూ మమ్మల్ని చాలా మంది భయపెట్టారు. కానీ, ఇక్కడ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. పాకిస్థాన్‌ గురించి కూడా ఇక్కడి వాళ్లు ఇలాగే అనుకుంటారు. కానీ, అది నిజం’ కాదు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఏదైనా సినిమా చేస్తే, రెండు దేశాల మధ్య సామరస్యం పెంచేలా తీయాలనుకున్నాం. ఒక పసిబిడ్డను అక్కడకు చేర్చాలన్న మంచితనమే కనిపించాలని ఈ కథ రాసుకున్నాం.

మీరు రచయితగా సక్సెస్‌ అయ్యారా? దర్శకుడిగానా..?

విజయేంద్రప్రసాద్‌: రచయితగా సక్సెస్‌ అయ్యాను. దర్శకుడిగా కాలేకపోయాను. దర్శకుడిగా సక్సెస్‌ కాలేకపోవడానికి కారణం తెలిస్తే, ఈ పాటికే పెద్ద పెద్ద హిట్‌ సినిమాలు తీసేవాడిని (నవ్వులు). దర్శకుడిగా నేను విఫలమవడానికి కారణాలు ఇప్పటికీ తెలియదు. ఒకతను నేను తీసిన ‘రాజన్న’ సినిమా చూసి, ‘తెలుగులో ప్రస్తుతం ఉన్న మంచి దర్శకులతో సమానంగా సినిమా తీశారు’ అని అన్నాడు. అదే వ్యక్తి ‘శ్రీవల్లి’ చూసి ‘మీకు దర్శకత్వం రాదు’ అన్నాడు. అతనే మా అబ్బాయి రాజమౌళి. ప్రశంస, విమర్శలను రెండూ ఒకే రకంగా తీసుకున్నా. విమర్శ చేసిన వాడిని విమర్శించడం కన్నా మనం ఆత్మ విమర్శ చేసుకోవడం మంచిది.

మీరు ఎక్కువసేపు కష్టపడి రాసిన కథ ఏది?

విజయేంద్రప్రసాద్‌: నేను కథ రాయడానికి ఎక్కువసేపు కష్టపడను. కథ తయారు చేయడం ఒక ఆట. నాకెప్పుడూ కష్టంగా అనిపించలేదు. ఇష్టపడి రాస్తా. నేను నా ఆఫీస్‌లో నాలుగు గోడల మధ్య కూర్చొని కథ రాస్తా. పెద్ద రచయితనన్న పేరు తప్ప నన్ను ఎవరూ ఎక్కడికీ తీసుకెళ్లలేదు. (నవ్వులు)

మీ కథలో హీరోకు ఫ్లాష్‌బ్యాక్‌ ఉంటుంది? అది సెంటిమెంటా? అనుకోకుండా అలా జరుగుతోందా?

విజయేంద్రప్రసాద్‌: కమర్షియల్‌ హీరోల విషయాన్ని తీసుకుందాం. సినిమా చూసే ప్రేక్షకుడికి అతను చాలా పవర్‌ఫుల్‌ అని తెలుసు. మొదటి సీన్‌లోనే అన్నీ బద్దలుకొట్టుకుంటూ వచ్చేస్తే, కథలోకి వెళ్లే కొద్దీ ఏమీ ఉండదు. అలా ఒక్కో సీన్‌ ఆపుకొంటూ, ‘ఇంకా రాడేంటి’ అని ప్రేక్షకుడు అనుకుంటున్న సమయంలో హీరో వీరత్వాన్ని చూపిస్తే, చూసేవాడికి ఆనందంగా ఉంటుంది. సౌలభ్యం కోసం ఫ్లాష్‌బ్యాక్‌ పెట్టుకుంటాం కానీ, కచ్చితంగా పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. సాధారణంగా నేను సినిమాలు చూస్తూ నిద్రపోతాను. ‘బాహుబలి’ చూస్తున్నప్పుడు కూడా నిద్రపోయాను. కొన్నిసార్లు నిద్రపోవడానికే సినిమాకు వెళ్లిన సందర్భాలున్నాయి.

‘సింహాద్రి’ తర్వాత రచయితగా మీకు మంచి క్రేజ్‌ వచ్చింది. దాని క్రెడిట్‌ మీదా? దర్శకుడిదా?

విజయేంద్రప్రసాద్‌: కచ్చితంగా దర్శకుడిదే. ఒక రచయితగా మన ఊహకు 100 మార్కులు వేసుకుంటే,  రాజమౌళి ఆ ఊహను 120, 130కి తీసుకెళ్తాడు. నా ఊహకు దగ్గరగా ఉండే సన్నివేశాలు చాలా తక్కువగా ఉంటాయి.

‘సింహాద్రి’ కథను మొదట ఎన్టీఆర్‌-రాజమౌళి కాంబో కోసమే సిద్ధం చేశారా?

విజయేంద్రప్రసాద్‌: ఎవరినీ అనుకోకుండా ఆ కథ రాసుకున్నాం. ఆ తర్వాత బాలకృష్ణగారికి చెప్పాం. ఎందుకో ఆయనకు నచ్చలేదు. రాజమౌళికి మాత్రం బాగా నచ్చింది. ఎన్టీఆర్‌తో దొరస్వామి రాజుగారు ఒక సినిమా చేయాలి. అందుకోసం తమిళ డైరెక్టర్‌ని అనుకున్నారు. కానీ, సినిమా పట్టాలెక్కలేదు. కథ గురించి నా దగ్గర చర్చకు వస్తే, ‘రాజమౌళి కోసం అనుకున్నాను. ఎలాగూ తారక్‌తో ఒక సినిమా తీశాడు కాబట్టి, ఇద్దరి మధ్య మంచి అవగాహన కూడా ఉంటుంది’ అని చెప్పా. అలా ‘సింహాద్రి’ పట్టాలెక్కింది.

‘సింహాద్రి’ మొదట ఇద్దరు దర్శకులు చేసిన తర్వాత ఆగిపోయిందట నిజమేనా?

విజయేంద్రప్రసాద్‌: అసలు ఆ కథలు వేరు. అయితే, ‘సింహాద్రి’ వెనుక చిన్న కథ ఉంది. చెన్నైలో నా అసోసియేట్‌ గణేశ్‌తో కలిసి సినిమాకు వెళ్లా. బయటకు వచ్చిన తర్వాత క్లైమాక్స్‌ గురించి మాట్లాడుకుంటూ ‘శ్రీదేవి అలా వదిలేసి వెళ్లిపోతే, కమల్‌హాసన్‌ గుండెల్లో గుచ్చినట్లు మనకు ఫీలింగ్‌ ఉంది కదా’ అని అన్నాను. ‘అవును సర్‌’ అన్నాడు. ‘ఒక పనిచేద్దాం. అది ఇంటర్వెల్‌ చేసి, కొత్త కథ రాద్దామా’ అన్నాను. ‘చేద్దాం సర్‌.. అయితే, శ్రీదేవి నిజంగా గునపం పెట్టి గుండెల్లో గుచ్చాలి’ అన్నాడు. హీరో చచ్చిపోతాడని చెప్పినా వినలేదు. వారం రోజులు రోజూ అదే విషయాన్ని నాకు చెప్పేవాడు. అతడి పోరు భరించలేక ఆ సీన్‌ రాసుకున్నా. ఆ తర్వాత ముందూ, వెనుక జరిగిన కథ రాసుకున్నాం. అతడు అలా చెప్పకపోతే ఆ కథ పుట్టేది కాదు.

రాజమౌళికి కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ దర్శకులకు కథలు రాశారు?

విజయేంద్రప్రసాద్‌: బి.గోపాల్‌, కోదండరామిరెడ్డి, మహదేవ్‌, స్వర్ణ సుబ్బారావు, ముళ్లపూడి వరా గారికి రాశా.

తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి కాకుండా మీకు నచ్చిన దర్శకుడు ఎవరు?

విజయేంద్రప్రసాద్‌: పూరి జగన్నాథ్‌ గారు. ఆయన అంటే నాకు అసూయ. హీరో-విలన్‌ దెబ్బలాడుకోవాలంటే ఘర్షణ కావాలి కదా! ఆ స్థాయి తీసుకురావడానికి రాజమౌళికి ఒక రీల్‌ పడుతుంది. రెండు, మూడు సన్నివేశాలు పడితే కానీ, హీరో-విలన్‌ కొట్టుకోరు. అదే పూరి చిటికెలో పుట్టిస్తారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికే విలన్‌ను కొట్టాలనిపిస్తుంది. ఆ టెక్నిక్‌ కోసం నేను చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా. నాకు దొరకడం లేదు. అందుకే ఆయనంటే అసూయ. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పా. అందుకే నా ఫోన్‌ స్క్రీన్‌పై వాల్‌పేపర్‌గా పెట్టుకున్నా. ఈ విషయం రాజమౌళికి తెలుసో, తెలియదో నాకు తెలియదు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత మీరు చేస్తున్న కథలేంటి?

విజయేంద్రప్రసాద్‌: చాలా అనుకుంటున్నాం. సీతమ్మతల్లి మీద ఒక కథ రాశా. గతేడాది 196 దేశాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడిని ఎంపిక చేయడానికి కమిటీ పెట్టారు. లండన్‌లో వర్క్‌ ఎ ఫౌండేషన్‌ దీనికి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా 10వేల మందిని ఎంపిక చేసి, దాని నుంచి 10మంది జాబితాను సిద్ధం చేశారు. దానిలో భారత్‌కు చెందిన రంజిత్‌ సింగ్‌ బిశాలి అనే ఉపాధ్యాయుడిని ఎంపిక చేశారు. మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ ఇచ్చారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే ‘నాతో పాటు పది మంది ఫైనలిస్ట్‌లు వచ్చారు. అందరికీ ఈ ప్రైజ్‌మనీ తీసుకునే అర్హత ఉంది. అదృష్టం నా ఒక్కడికే వచ్చింది తప్ప.. అందరూ అర్హులే. అందుకే నా ప్రైజ్‌ మనీలో సగం వాళ్లకు ఇస్తున్నా’ అని మిగిలిన 9మందికి ఇచ్చారు. ఎంతగొప్ప మనిషి. ఎడ్యుకేషన్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌ రూపంలోకి మార్చి, విద్యార్థులకు కొత్త పద్ధతిలో పాఠాలు నేర్పారాయన. ఆడుతూ పాడుతూ పాఠాలు ఎలా నేర్చుకోవాలో చేసి చూపించారు. ఆయనపై బయోపిక్‌ రాస్తున్నా.

ఏ సంవత్సరంలో మీరు చిత్ర పరిశ్రమకు వచ్చారు?

విజయేంద్రప్రసాద్‌: 1985లో ఇండస్ట్రీకి వచ్చాం. మా అన్నయ్య సినిమా తీస్తుంటే చూసి ఆనందపడదామని ఇక్కడకు వచ్చాను. అయితే, పెట్టిన పెట్టుబడి అంతా పోయింది. కనీసం ఆ సినిమా విడుదల కూడా కాలేదు. అన్నయ్య శివదత్తగారు దర్శకత్వం వహించారు. సగం తీయగానే ఆగిపోవడంతో ఎలా బతకాలో తెలియలేదు. అప్పుడే రాఘవేంద్రరావుగారు ఆదుకున్నారు. ఆయన సినిమాలకు పనిచేస్తుండేవాడిని. నాలో టాలెంట్‌ గుర్తించి మురారి గారు ‘జానకిరాముడు’కు అవకాశం ఇచ్చారు. నేను సోలో రచయిత అయిన చిత్రం ‘బంగారు కుటుంబం’. కైకాల నాగేశ్వరరావు ఆ అవకాశం ఇచ్చారు. ‘బొబ్బిలి సింహం’ చిత్రానికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘సమర సింహారెడ్డి’.

చిత్ర పరిశ్రమలో బాగా నచ్చిన విషయం ఏంటి?

విజయేంద్రప్రసాద్‌: అబద్ధాలు ఆడేవాళ్లకు ఇండస్ట్రీలో మంచి చోటుంది. బాగా అబద్ధాలు చెప్పగలిగితే బతికేయొచ్చు.

ఫ్యాక్షన్‌ సినిమా చేయాలన్న ఆలోచన ఎలా ఉంది?

విజయేంద్రప్రసాద్‌: ‘సమర సింహారెడ్డి’ కథ రాస్తున్నప్పుడు నా దగ్గర రత్నంగారు ఉండేవారు. ఆయన సంభాషణలు రాసేవారు. కథల విషయంలోనూ మంచి సలహాలు ఇచ్చేవారు. ఆయన చూసిన సంఘటన ఒకటి చెప్పారు. ఒకరోజు విజయవాడలో రంగా గారు, దేవినేని నెహ్రూగారు ఒకేసారి రైల్వేస్టేషన్‌లో ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. నెహ్రూగారు ఎక్కడి నుంచో విజయవాడకు వస్తున్నారు. మరోవైపు రంగా గారు అదే రైలులో వేరే చోటుకు వెళ్లాల్సి ఉంది. దీంతో పోలీసులు ఆ వర్గాన్నీ, ఈ వర్గాన్నీ ఎదురుపడకుండా చూసేందుకు నానా తంటాలు పడటం రత్నంగారు చూశారు. అదే ‘సమరసింహారెడ్డి’లో బాలకృష్ణ ఫ్లాష్‌బ్యాక్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌. ఈ సినిమాకు ఫ్యాక్షన్‌ జోడిద్దామని చెప్పి వ్యక్తి రత్నంగారే.

విజయేంద్రప్రసాద్ కొడుకు రాజమౌళి..! రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఈ రెండింటిలో మీకు ఏది ఇష్టం!

విజయేంద్రప్రసాద్‌: మొదటిదానిలో నాకు ఎక్కువ పేరు ఉంటే ‘నా కుమారుడు నా కన్నా ఎప్పుడు గొప్పవాడవుతాడన్న కోరిక ఉంటుంది’, రెండో దానిలో ‘వాడంత స్థాయికి నేను ఎప్పుడు ఎదుగుతాను’ అన్న బాధ ఉంటుంది. ఒక ఆనందం.. ఒక బాధ రెండూ ఉంటాయి.

మీ కుటుంబంలో అంతా సినిమా కోసం పనిచేస్తుంటారు!

విజయేంద్రప్రసాద్‌: మా కుటుంబంలో పిల్లలందరినీ కీరవాణి భార్య వల్లి దారిలో పెట్టింది. అందుకే అందరూ ఆమెను ‘అమ్మా..’ అని పిలుస్తారు. మేం ఆరుగురం అన్నదమ్ములం. మాకు ఒక అక్క.

కీరవాణి సంగీత దర్శకుడిగా ఎలా మారారు?

విజయేంద్రప్రసాద్‌: అప్పుడు కీరవాణికి నాలుగైదేళ్లు ఉంటాయి. మా అన్నయ్య యాజి.. అంటే శ్రీలేఖ వాళ్ల తండ్రి దగ్గరకు వచ్చి ‘రాత్రి నాకు కలలో రాక్షసి కనిపించి, నాలుకపై ఏదో రాసింది. నాకు సంగీతం నేర్పించండి’ అన్నాడు. వెంటనే మా ఇంటి ఎదురుగా సీతన్‌ అనే వయోలిన్‌ మాస్టర్‌ దగ్గర చేర్పించాం. అలా కీరవాణికి స్వతహాగా సంగీతం నేర్చుకోవాలని కోరిక పుట్టింది.

‘మా నాన్న సిల్వర్‌ స్పూన్‌తో పుట్టారు’ అని రాజమౌళి ఒక సందర్భంలో చెప్పారు. మీరు ఆస్తులు పోగొట్టుకోవడానికి కారణం ఏంటి?

విజయేంద్రప్రసాద్‌: ఆస్తులు పోవడానికి ఆ స్పూనే కారణం. కష్టాలు, బాధ్యతలు, డబ్బు విలువ తెలియదు. డబ్బు ఉన్న వాళ్లు తమ పిల్లలకు కష్టం తెలియకుండా పెంచితే తీరని ద్రోహం చేసినట్లు అవుతుంది. డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామని ఎప్పుడూ అనిపించలేదు. అసలలా అనుకుని రాలేదు. చచ్చినా బతికినా ఇక్కడే అనుకున్నాం. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది.

రాజమౌళిని దర్శకుడిని చేయాలని మీకు అనిపించిందా? ఆయనే అనుకున్నారా?

విజయేంద్రప్రసాద్‌: ఇంటర్‌ అయిపోయిన తర్వాత డిగ్రీ చదవాలి. కానీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదివించలేకపోయా. దీంతో తను మద్రాస్‌ వచ్చేశాడు. ‘ఏం  చేద్దామనుకుంటున్నావు’ అని అడిగా. ‘నేను దర్శకత్వం చేయాలి’ అన్నాడు. ‘నిన్ను ఎవరైనా డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుకోవాలనుకుంటే ఇష్టపడి పెట్టుకోవాలి. అందుకు అన్ని శాఖలపై పట్టు ఉండాలి. ముందు అవి నేర్చుకో’ అని చెప్పా. అలా త్రివిక్రమరావుగారిని అడిగి చంటి దగ్గర ఎడిటింగ్‌లో సహాయకుడిగా చేర్పించా. కొన్నాళ్లు కీరవాణి దగ్గర సంగీతం గురించి తెలుసుకున్నాడు. ఇంకొన్నాళ్లు నా దగ్గర సహాయకుడిగా చేశాడు. అన్నింటికన్నా ముఖ్యం కథపై దర్శకుడికి పట్టు ఉండాలి. అంటే తనే స్వయంగా కథ రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కథలో ఏది బాగుంది? ఏది బాగోలేదు? ఏది ఎప్పుడు రావాలి? అన్న అవగాహన ఉండాలి. కొన్నాళ్ల తర్వాత రాఘవేంద్రరావుగారి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రకటనలు చేశాడు. ఆ తర్వాత ‘శాంతి నివాసం’.. సినిమాలు..

మీరు కథ చెప్పినప్పుడు  రాజమౌళి ఒక దర్శకుడిగా ఆలోచిస్తారా? మీ అబ్బాయిగా ఆలోచిస్తారా?

విజయేంద్రప్రసాద్‌: కచ్చితంగా దర్శకుడిగానే. నేను చెప్పింది నచ్చకపోతే ‘బాగోలేదు’ అని నేరుగా చెప్పేస్తాడు. ఏదైనా నాకు బాగా నచ్చితే రెండు, మూడుసార్లు చెప్పడానికి ప్రయత్నిస్తా. విని ఊరుకుంటాడు.

‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమా ఎలా ఉంటుంది? మీరు చూశారా?

విజయేంద్రప్రసాద్‌: నేను చూశాను. చాలా బాగుంది. చాలా తృప్తిగా ఉంది. సర్‌ప్రైజింగ్‌ ప్యాకేజ్‌ అలియా భట్‌. కనిపించే రోల్‌ తక్కువే అయినా, ఉన్నంతసేపూ తనే కనిపిస్తుంది.

ఎన్టీఆర్‌తో ఫైట్‌ కంటతడి పెట్టించిందని ఇటీవలో మీరు అన్నట్లున్నారు?

విజయేంద్రప్రసాద్‌: సాధారణంగా మనం ఫైట్స్‌ చూస్తుంటే ‘కొట్టు.. ఇరగదీయ్‌’ అంటాం. కానీ, ఇద్దరు మంచి వాళ్లు కొట్టుకుంటుంటే ఎవరి పక్షాన ఉంటాం. ఇద్దరు బిడ్డలు గొడవ పడుతుంటే వారిని కన్న తల్లి ఎవరివైపు ఉంటుంది. కొట్టుకోవద్దని బాధపడుతుంది. ‘ఆర్‌ఆర్ఆర్‌’లోనూ అంతే, పరిస్థితుల ప్రభావం కారణంగా ఇద్దరు స్టార్‌ హీరోలు ఫైట్‌ చేసుకుంటుంటే మనకు ఏడుపు వస్తుంది. మొదటిసారి సినిమా థియేటర్‌లో ఆ బాధ అనుభవించా. సినిమా అని తెలిసినా బాధపడుతూనే ఉన్నా.

గోదావరి పుష్కరాలకు వెళ్లినప్పుడు ‘బాహుబలి’ సినిమా గురించి మిమ్మల్ని తిట్టుకున్నారట!

విజయేంద్రప్రసాద్‌: గోదావరిలో స్నానం చేసి వస్తుంటే, అక్కడ కూర్చొన్న కొంతమంది అసభ్య పదజాలంతో తిట్టడం గమనించా. ‘కట్టప్ప.. బాహుబలిని  ఎందుకు చంపాడో చెప్పకుండా ఆపేశాడేంటి. అసలు ఏమనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ సినిమా చూడాలా’ అని తిట్టడం మొదలు పెట్టారు. మోదీగారికి కూడా ఈ అనుమానం వచ్చింది. ప్రభాస్‌ను కూడా అడిగారట. (నవ్వులు)

రచయితగా, దర్శకుడిగా మీకు  స్ఫూర్తి ఎవరు?

విజయేంద్రప్రసాద్‌: రచయితగా సలీమ్‌-జావేద్‌గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల సినిమాలు చూసి సినిమా తాలూకూ స్పిరిట్‌ తెలుసుకున్నా.

బయోపిక్‌ తీస్తే, ఎంతవరకూ నిజాలు చెబుతారు?

విజయేంద్రప్రసాద్‌: బయోపిక్‌లో అబద్ధం చెప్పకూడదు. నిజాన్ని నాటకీయంగా రక్తికట్టించవచ్చు. ఉదాహరణకు ఒక మనిషి వందమందికి సాయం చేశాడనుకుందాం. కానీ, అంతా చూపించలేం. అయితే ఒక వ్యక్తికి ఎంత గొప్పగా సాయం చేశాడనేదాన్ని ఉద్విగ్నంగా చెబుతాం. అప్పుడది జనానికి హత్తుకుంటుంది. ‘తలైవి’ అందరికీ నచ్చుతుంది. అయితే, కొన్ని వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడం అనవసరం. అంటే దీనిర్థం అబద్ధాలు చెప్పడం కాదు.. కొన్ని నిజాలను చెప్పకపోవడం.

కంగనా రనౌత్‌కు ఎన్ని మార్కులు ఇస్తారు?

విజయేంద్రప్రసాద్‌: నటన విషయంలో నూటికి నూరు మార్కులు ఇస్తా. మంచి నటి.

‘బాహుబలి’ వరకూ మీ అబ్బాయి సక్సెస్‌ మీ సతీమణి చూసి ఉంటే బాగుండేదని మీకెప్పుడైనా అనిపించిందా?

విజయేంద్రప్రసాద్‌: ఆమెకు స్ట్రోక్‌ వచ్చి, కోమాలోకి వెళ్లిపోయారు. అలా ఆర్నెల్లు ఉన్నారు. ఒక వేళ ఆమె కోమా నుంచి బయటకు వస్తే, పక్షవాతం వస్తుందని వైద్యులు చెప్పారు. అప్పుడు దేవుడిని ఒకటే కోరుకున్నా. ‘ఇస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వు. లేకపోతే తీసుకెళ్లిపో’ ఎందుకంటే స్పృహ తీసుకొచ్చి, పక్షవాతం బారిన పడితే, అంతకుమించిన నరకం మరొకటి ఉండదు. ‘బాహుబలి’ వరకూ ఆమె ఉండి ఉంటే బాగుండేదని చాలా సార్లు అనిపించింది. కానీ, ఆమె పైనుంచి అంతా చూస్తుందనుకుంటున్నా. మాది ప్రేమ వివాహం.

అంతర్జాతీయంగా ఒక సినిమా చేస్తున్నారని తెలిసింది?

విజయేంద్రప్రసాద్‌: రాజమౌళి కోసం కథ రాశాను. లైవ్‌ యానిమేషన్‌. చాలా పెద్ద ప్రాజెక్టు. అంటే హాలీవుడ్‌ నటులతో సినిమా చేస్తున్నాడని కాదు. అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమా ఉంటుంది. భారతీయ కంటెంట్‌తోనే సినిమా ఉంటుంది. హాలీవుడ్‌ నిర్మాణ సంస్థతో కలిసి పనిచేస్తారంతే.

‘ఈగ’ కథ ఎలా పుట్టింది?

విజయేంద్రప్రసాద్‌: స్పీల్‌బర్గ్‌ గురించి కె.ఎల్‌.ప్రసాద్‌గారు ఒక విషయం చెప్పారు. ఆయన తన ప్రొడక్షన్‌ డిజైన్‌ వాళ్లను పిలిచి ‘అత్యంత అసహ్యంగా ఉండే ఒక జీవిని తయారు చేయండి. అది వాళ్ల అమ్మకు తప్ప ఎవరికీ అందంగా కనిపించకూడదు’ అని అన్నారట. ‘ఎందుకు సర్‌’ అని అడిగితే ‘దాన్ని హీరోగా పెట్టి, సినిమా చేస్తా. సినిమా పూర్తయ్యే సమాయానికి అందరికీ నచ్చేలా చేస్తా’ అన్నారట. అలా నాకు ‘ఈగ’ అగ్లీగా కనిపించింది. కథ రాసుకున్నా.

ఈ హీరోలకు కథ రాయమంటే ఎలాంటి కథ రాస్తారు?

* అమితాబ్‌ బచ్చన్‌: పిసినారి వ్యక్తిగా ఉండే కథ రాస్తా. ఎందుకంటే అలాంటి పాత్రలో ఆయన నటించలేదు.

* కమల్‌హాసన్‌: ఆయనకు రాయనవసరం లేదు. అన్నీ చేసేశారు.

* విజయ్‌ దేవరకొండ: గొప్ప లక్ష్యం ఉన్న నటుడు. అతనిలో కనిపించే యాంగర్‌ చాలా బాగుంటుంది. అమితాబ్‌ చేసిన దివార్‌, జంజీర్‌ అలాంటి కథతో ఏ సినిమా చేసినా బాగుంటుంది.

* రజనీకాంత్‌: రావణాసురుడు

* పవన్‌కల్యాణ్‌: కథ రాయనవసరం లేదు. ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని సీన్లు మళ్లీ తీసి పెట్టేస్తే సరిపోతుంది. పవన్‌కల్యాణ్‌గారి సినిమా చూడటానికి వచ్చేవాళ్లు. ఆయన హీరోయిన్‌తో పాటలు పాడాలి.. విలన్‌లను ఇరగొట్టాలి. పంచ్‌డైలాగ్‌లు చెప్పాలి. అంతే.. కథతో సంబంధం లేదు. కేవలం ఆయనను చూడటానికే వస్తారు. ఆయనొక డైనమైట్‌.

* మహేశ్‌బాబు: చాలా కష్టమైన పని. పూరి జగన్నాథ్‌గారి సలహా తీసుకుంటా!

* అల్లరి నరేశ్‌: మీ సలహా(ఆలీ) తీసుకుంటా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు