Vakkantham Vamsi: ‘టెంపర్’ క్లైమాక్స్ విన్నాక పూరి జగన్నాథ్ భోజనం ప్లేట్ నెట్టేశారు!
ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ తన భార్యతో కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు.
ఆయన కథలోని పాత్రలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆడియన్స్‌ను ఉర్రూతలూపే మంచి కిక్ ఉంటుంది. రచయితగా సూపర్ హిట్ కథలను అందించడమే కాక దర్శకుడిగా చక్కటి చిత్రాన్ని తెరకెక్కించి, నటుడిగా, టీవీ యాంకర్‌గా తన ప్రతిభ చూపిన క్రేజీ రైటర్ వక్కంతం వంశీ (Vakkantham Vamsi). తన భార్య శ్రీవిద్యతో కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చి తన సినీ ప్రయాణం గురించి వివరించారు. మరి వంశీ చెప్పిన ముచ్చట్లేంటో చూద్దాం.
ఈటీవీతో ఉన్న అనుబంధం ఏంటి?న్యూస్ రీడర్ అవ్వాలని ఎలా అనిపించింది?
వక్కంతం వంశీ: ఈటీవీ లేకపోతే ఏదీ జరిగేది కాదేమో. ఎందుకంటే ఇండస్ట్రీకి ఎలా రావాలో తెలీదు. ఈటీవీవల్లే అన్నీ చేయగలిగాను. రచన, యాక్టింగ్ ఇలా అన్ని చేస్తూ ఈ ఫీల్డ్‌లో నిలదొక్కుకోగలిగాను. న్యూస్ రీడరే కావాలని అనుకోలేదు. సినిమాలంటే పిచ్చి ఎలా ఇండస్ట్రీలోకి రావాలా అనుకుంటున్న సమయంలో పేపర్‌లో యాడ్ వచ్చింది. అది చూసి న్యూస్ రీడర్‌కు అప్లై చేశాను. 5వేల మంది వచ్చారు. లక్కీగా నేను సెలక్ట్ అయ్యా. ఆ తర్వాత దాసరి నారాయణ రావుగారి ‘కల్యాణ ప్రాప్తిరస్తు’లో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అక్కడికి ఆడిషన్స్ కోసం వెళ్లి.. హీరోగా సెలక్ట్ అయ్యా. అందులో సుమ, కావ్య హీరోయిన్‌లు.
మీలో రైటర్, దర్శకుడు ఉన్నాడని ఎవరు గుర్తించారు?
వక్కంతం వంశీ: నాలో రైటర్ ఉన్నాడని నేను గుర్తించుకున్నా(నవ్వుతూ). ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ సినిమా ఆడలేదు. కానీ ఎలాగైనా నేను సినిమా రంగంలోనే ఉండాలని నిర్ణయించుకున్నా. అప్పుడు కథలు రాయడం మొదలుపెట్టా. మా నాన్న రచయిత. ఆయన నుంచి కాస్త రచనశైలి నాకు వచ్చినట్లుంది. ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమాతో డైరెక్షన్ వైపు వచ్చాను. ఆ సినిమా నిజానికి తారక్‌తో తీయాల్సింది. తనే నన్ను ఎంతో ప్రోత్సహించాడు. తనకోసమే ఆ కథ రాసుకున్నా. ఆ కథ రాయడానికి మూడు సంవత్సరాలు పట్టింది. కానీ ఎందుకో తారక్‌ను ఊహించుకుంటుంటే కథ కుదరడం లేదు. కొన్నిరోజులు రాయడం ఆపేసి పక్కనపెట్టా. ఆ తర్వాత నా స్నేహితుడు ఆ కథని బన్నీ దగ్గరకు తీసుకువెళ్లాడు. బన్నీ కథ విన్న వెంటనే ఓకే చేసేశాడు. నాకైతే ఆ సినిమా ఇప్పటికీ ఓ కల లాగా ఉంది.
‘కిక్’ గురించి చెప్పండి?మీ నాన్నగారు సినిమా రచయిత లేదంటే మామూలు రచయితా?
వక్కంతం వంశీ:నా జీవితంలో రైటర్‌గా నిజమైన గుర్తింపు ఇచ్చిన సినిమా ‘కిక్’. 12 సంవత్సరాల తర్వాత కూడా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మీరే అర్థంచేసుకోండి. ‘కిక్’లో మీ(ఆలీ) పాత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మెమొరీ లాస్ డాక్టర్‌గా థియేటర్లో నవ్వులు పూయించారు. మా నాన్న సినిమా రచయిత కాదు, ఆయన తితిదే ఉద్యోగి. చాలా కథలు, నవలలు రాశారు. ఇప్పటికీ నవ్య మ్యాగజైన్‌లో ఆయన సీరియల్స్ వస్తూనే ఉంటాయి.
‘కల్యాణప్రాప్తిరస్తు’ హీరోయిన్స్ ఇప్పటికీ టచ్‌లో ఉన్నారా?
వక్కంతం వంశీ: ఆ సినిమాలో సుమ, కావ్య హీరోయిన్స్. వాళ్లలో కావ్య ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. ఇక సుమను రోజు చూస్తునే ఉన్నాం కదా. రాజీవ్ కనకాల నాకు ఫ్రెండ్. ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ సినిమా షూటింగ్ టైమ్‌లో రోజూ నన్ను సుమ గురించి అడిగేవాడు. నా గురించి అడగకుండా సుమ గురించి అడుగుతున్నాడేంటని అనుకునే వాడిని. ఆ తర్వాత అర్థమైంది వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని. ఇప్పటికీ మేమంతా కుటుంబసభ్యుల్లా ఉంటాం. ఆ సినిమా ఎందుకు ఆడలేదో తెలీదు. ఆ సమయంలో ‘ప్రేమదేశం’ విడుదలై మంచి విజయం సాధించింది. బహుశా అందుకే మా సినిమా ఆడలేదేమో!
సురేందర్ రెడ్డితో ఎక్కడ పరిచయం?
వక్కంతం వంశీ: నాకు ఎన్టీఆర్ ద్వారా సురేందర్ రెడ్డి పరిచయం. ‘అశోక్’ సినిమా సమయంలో కలిశాం. అదే టైమ్‌లో ఆయన మహేశ్ బాబుతో ‘అతిథి’ చేస్తున్నాడు. కథకు సంబంధించిన విషయాలు మాట్లాడుకునే వాళ్లం. తన సినిమాలు అప్పటికే మంచి విజయాలు సాధించాయి. నేను నీతో కలిసి పనిచేయలేను. నా వల్ల నీకు ఫ్లాప్‌లు వస్తున్నాయి అని చెప్పాను. ఆ టైమ్‌లో ఇద్దరం కలిసి కిక్ తీశాం. ఆ సినిమా వండర్ క్రియేట్ చేసింది. అప్పటి నుంచి ఇద్దరం కలిసే పనిచేస్తున్నాం.
పూరీ జగన్నాథ్ టెంపర్ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది ?
వక్కంతం వంశీ: ఇది కూడా ఎన్టీఆర్ వల్లే జరిగింది. తనతో నా ఆలోచనలన్నీ పంచుకుంటూ ఉంటా. అలా ఒకసారి ‘టెంపర్’ ఐడియా చెప్పాను. 3 సంవత్సరాల తర్వాత పూరీ, తారక్‌లకు కథ కుదరకపోతే నన్ను అడిగారు. ఆ టెంపర్ ఐడియాను వెంటనే తారక్‌కు చెప్పా. ఆయన పూరీకి చెప్పమన్నారు. నేను మొదట పూరీ జగన్నాథ్‌కు కథ చెప్పాలంటే భయపడ్డా. కానీ సగం వినగానే పూరీ ఓకే చేసేశారు.
టెంపర్ క్లైమాక్స్ గురించి చెప్పండి?
వక్కంతం వంశీ: ‘టెంపర్’కు సంబంధించిన కథ మొత్తం అయిపోయింది. క్లైమాక్స్‌లో పూరీ గారు చెప్పింది నాకు నచ్చట్లేదు. ఆయన ఎవరినీ నొప్పించరు. ఆయనతో ‘మీరు చెప్పే క్లైమాక్స్ నచ్చలేదని’ ఎలా చెప్పాలా అనుకున్నా. ఆఖరికి ధైర్యం చేసి, ‘నాకు ఒక గంట టైమ్ ఇవ్వండి’ అని బాగా ఆలోచించి క్లైమాక్స్ చెప్పా. అది విని పూరీ గారు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నాకు ఇంకా గుర్తుంది. సీట్‌లో నుంచి లేచి నన్ను హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత అందరం భోజనానికి కూర్చున్నాం. పూరీ ఉన్నట్లుండి భోజనం ప్లేట్ పక్కకు నెట్టేశారు. ‘నేను భోజనం చేయను నువ్వు చెప్పిన క్లైమాక్స్‌కు కడుపు నిండిపోయింది’ అని సంతోషంగా అన్నారు. నా జీవితంలో నేను మర్చిపోలేను ఆ సంఘటన అది.
మీ కథలు రీవర్క్ చేసి చేస్తా అని అల్లుఅర్జున్ అన్నారట?
వక్కంతం వంశీ: అల్లుఅర్జున్‌కు నా కథల్లో రెండు బాగా ఇష్టం. ఆ రెండు ఆయన నటించినవి కూడా కాదు. ‘ఊసరవెల్లి’, ‘కిక్2’ ఈ రెండు సరిగా ఆడలేదు కానీ అల్లుఅర్జున్‌కు చాలా ఇష్టం. ఊసరవెల్లి సినిమా కథని రీ వర్క్ చేసి ఏదో ఒక రోజు నేను చేస్తా అని నాతో చాలాసార్లు అన్నారు.
నాపేరు సూర్య సినిమాలో హీరో కంటే అన్వర్ పాత్రను ఎందుకు హైలైట్ చేశారు?
వక్కంతం వంశీ: ఈ ప్రశ్న ఇప్పటికి చాలా మంది అడిగారు. ఆ పాత్ర ప్రభావం సినిమా రిజల్ట్ మీద పడిందని అంటుంటారు. అన్వర్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఆ సినిమా కథే అన్వర్ పాత్ర. అల్లుఅరవింద్ గారు కథ విన్నాక ‘క్లైమాక్స్ ఇలా తీయడం రిస్క్. కానీ సినిమాకు అదే హైలైట్’ అన్నారు. ఆ సినిమాకు సంబంధించి ఏ విషయంలోనైనా పూర్తి బాధ్యత నాదే. నేను స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది.
‘కొండవీటి రాజా’ కోసం ఏదో అల్లరి పని చేశారట?
వక్కంతం వంశీ: చిరంజీవి గారి సినిమా చూడకపోతే నావల్ల కాదు. మొదటి ఆట చూడాలి. కానీ, స్కూల్‌కు వెళ్లకుండా సినిమాకు వెళ్తా అంటే కొడతారు. మా అమ్మ పోపుల డబ్బాలోంచి రూ.20 దొంగతనం చేసి సినిమాకు వెళ్లా. సినిమా అంతా అయ్యాక ఇంటికి ఎలా వెళ్లాలి అని అసలు టెన్షన్ మొదలైంది. ఇంటికి వెళ్లగానే మా అమ్మ డబ్బులు తీశావా అని అడిగింది. లేదని చెప్పా. మా నాన్న ప్రేమగా ‘అవసరం కోసం తీస్తే మిగిలినవి అక్కడ పెట్టు’ అన్నారు. నేను మంచి వాడిలాగా మిగిలిన చిల్లర బల్ల మీద పెట్టి దొరికిపోయా. ఆ తర్వాత ఉతికి ఆరేశారు. (నవ్వులు)
ఇప్పటికి ఎన్ని కథలు అయ్యాయి?మీ నాన్నగారి కథలు తీసుకునే ఆలోచన ఉందా?
వక్కంతం వంశీ:సుమారు 12 కథలు సినిమాలుగా తీశాను. మా నాన్న కథలు సినిమాలుగా తీయాలనే ఆలోచన ఉంది. ఆయన రాసిన వాటిల్లో 3 కథలు నాకు బాగా నచ్చాయి. వాటిని చేయాలి. ఇప్పుడు నాకు కావాల్సింది దర్శకుడిగా బాగా సక్సెస్ అవ్వడం. ఒకసారి సక్సెస్ అయ్యాక అప్పుడు ఆ కథల గురించి ఆలోచిస్తా.
‘నాపేరుసూర్య’ తర్వాత ఎందుకు గ్యాప్ వచ్చింది?
వక్కంతం వంశీ:ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. సినిమా అంటేనే పెద్ద వ్యాపారం. కానీ ఆ సినిమా హిట్ అవుతుందని నాకంటే బన్నీ, అరవింద్ గారు బాగా అనుకున్నారు. సినిమా విడుదలయ్యాక నన్ను పిలిచి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఏది రాసినా బాగా ఆలోచించి రాయాలి అనుకున్నా. ఈలోగా కొవిడ్ వచ్చింది. నితిన్‌తో సినిమా ఫిక్స్ చేసి ఏడాదిపైనే అయింది. స్క్రిప్ట్ కోసం టైం తీసుకుంటున్నా.
పెళ్లెప్పుడైంది? ఫ్యామిలీ గురించి చెప్పండి?మీ ఇద్దరికి ఎలా పరిచయం?
వక్కంతం వంశీ: తన పేరు శ్రీవిద్య. 2009లో లవ్ మ్యారెజ్ చేసుకున్నాం. ఇద్దరు పిల్లలు. తను మీడియా పర్సనే. ఆట ప్రోగ్రామ్ ద్వారా అందరికీ పరిచయం. మొదట ఫోన్‌లో మాట్లాడుకున్నాం. ఒకర్ని ఒకరు చూసుకోకుండానే ప్రేమించుకున్నాం. ఇంట్లో వాళ్లే మా పెళ్లి కుదిర్చేలా ప్లాన్ చేసుకున్నాం. పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్ వచ్చాకనే కిక్ సినిమా వచ్చింది. అది హిట్ అయింది. తనే నా కిక్.
మీ భార్యకు ఏమైనా హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారా?
శ్రీవిద్య: మా ఆయన నాకు పనిఅమ్మాయిగా కూడా అవకాశం ఇవ్వట్లేదు. మీరు ఏకంగా హీరోయిన్ అంటున్నారు(నవ్వుతూ).
వక్కంతం వంశీ (నవ్వుతూ): లేదండీ. అల్రెడీ శ్రీలీలతో ఓ పాట కూడా షూట్ చేశాం. ఇప్పుడు హీరోయిన్‌ను మార్చడం కుదరదు.
నేను సక్సెస్ అయ్యాను అని మీకు ఎప్పుడు అనిపించింది?
వక్కంతం వంశీ: కిక్ సినిమా హిట్ అయ్యాక ఇండస్ట్రీలో ఉంటాను కొన్ని రోజులు అనుకున్నా. బండి ట్రాక్ ఎక్కింది బతకడానికి భయం లేదనిపించింది.
వంశీ గురించి చెప్పండి?
శ్రీవిద్య: నాకు జీవితంలో వేరే లవ్‌స్టోరీలు ఏవీ లేవు. మేము కలిసి మా ప్రయాణాన్ని మొదలుపెట్టి 13 సంవత్సరాలు అయింది. ఒక అమ్మాయి నుంచి పరిపూర్ణమైన మహిళగా మార్చాడు. ఓ మంచి కొడుకు, తండ్రి, భర్త. అన్నిట్లో ఆయన బెస్ట్ అంతే. అంతకు మించి ఎలా చెప్పను.
మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు?
శ్రీవిద్య: జంధ్యాల గారి ‘పోపులపెట్టె’తో నేను ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు నాకు 5 ఏళ్లు. చిరంజీవిగారితో అయితే చేస్తా అని ఏవేవో లిస్ట్ చెప్పేశాను (నవ్వుతూ). ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఈటీవీ నుంచి ఫోన్ వచ్చింది. సంఘర్షణ అనే డైలీ సీరియల్ కోసం. ఆ సీరియల్ సూపర్ హిట్ అయింది. ఇక అప్పటి నుంచి కొనసాగుతున్నా. ప్రస్తుతానికి హౌస్‌వైఫ్‌గా బిజీగా ఉన్నా. భవిషత్తులో మళ్లీ టీవీల్లో కనిపిస్తా.
వక్కంతం వంశీ: ఓ భర్తగా తను ఏది కోరుకుంటే అది చేయడానికి నా సపోర్ట్ నేను ఎప్పుడూ ఇస్తాను.
ఇంతకు ముందు సోషల్‌మీడియాలో బాగా కనిపించేవారు ఇప్పుడెందుకు కనిపించడం లేదు. ఏం జరిగింది? ఏదైన సంఘటన బాధ పెట్టిందా?
శ్రీవిద్య: బాధ కంటే ఇంకా పెద్ద మాట ఏమైనా ఉంటే అది వాడాలి. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లు పుట్టడానికంటే ముందు నాకు ఓ బాబు పుట్టి చనిపోయాడు. నాకు ముగ్గురు పిల్లలు ఉండడం ఇష్టం. కొవిడ్ టైంలో మళ్లీ ఓ పాప పుట్టింది. ఆ పాప నాకళ్ల ముందే పుట్టింది. 4 నిమిషాల తర్వాత నా కళ్ల ముందే చనిపోయింది. ఆ సంఘటనతో నేను చాలా బాధపడ్డా. కానీ సోషల్‌మీడియాలో అందరూ నాకు సపోర్ట్ చేసి ధైర్యం చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Sports News
ఎంతో భావోద్వేగానికి గురయ్యా.. మరోసారి అలాంటి బాధ తప్పదనుకున్నా: సీఎస్కే కోచ్
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
India News
Mahindra - Dhoni: ధోనీ రాజకీయాల గురించి ఆలోచించాలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!