Published : 18 Mar 2022 01:33 IST

satya prakash: నడిరోడ్డుపై నన్ను కొట్టుకుంటూపోతే అంతా నిజమేననుకున్నారు..!

ఆల్‌ ఇన్‌ వన్‌ నటుడు.. బహుభాషా పాత్ర పోషకుడు.. విభిన్న రసాల అభినయకారుడు.. సత్యప్రకాశ్‌. ఏ పాత్ర చేసినా దానికి కిక్‌ ఉండటమే కాదు.. దానికో లెక్క ఉంటుంది. విలన్‌గా చేస్తే ఇంత క్రూరుడా అనేంత నటన.. హాస్యం పండిస్తే కడుపుబ్బిపోవాల్సిందే.. దర్శకుడిగానూ సత్తా చాటుకున్న సత్యప్రకాశ్‌ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో తన మేనరిజంతో ఆకట్టుకున్నారు. సరదా.. సరదాగా తన సంగతులను పంచుకున్నారు.

మీ వయస్సు ఎంత?

సత్యప్రకాశ్‌: 16 ఏళ్లు ఉంటాయనుకుంటున్నారా? కాదులేండి 46.

అంత పెద్ద పేరు ఎలా పెట్టారు..? ఇంట్లో ఏమని పిలుస్తారు..?

సత్యప్రకాశ్‌: పొరపాటున నన్ను పాఠశాలకు పంపించారు (వ్యంగ్యంగా). పేరి వెంకట సూర్య సత్యనారాయణ సోమయాజులు ప్రసాద్‌ అని పిలిస్తే పలకలేదు. ఫస్ట్‌క్లాస్‌లో బిస్కెట్‌ ఇస్తారు కదా.. తింటూ కూర్చున్నా. నాకే ఆ పేరు తెలియదు. ఏం పలుకుతాను. మా నాన్న వీడు పలకడం లేదు కదాని.. సూర్య ప్రసాద్‌ అని చిన్నగా పెట్టారు. తాతయ్య పేరు సోమయాజులు అని పిలవకూడదని ఇంట్లో నాన్నమ్మ ప్రసాద్‌ అని పిలిచేది. అదే తెలుసు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాన్న సత్య ప్రకాశ్‌ అని పెట్టారు. కలిసొస్తుందో లేదో తర్వాత చూద్దామన్నారు.

ఎప్పుడూ ఇలాగే యాక్టివ్‌గా, సరదాగా ఉంటారా? ఈ షోలో ఇలా చేస్తున్నారా..?

సత్యప్రకాశ్‌: మీ దగ్గర చాలా రిస్ట్రిక్టెడ్‌గా ఉన్నా.. లేకపోతే అల్లరే అల్లరి. చేయమంటారా..?నేను పుట్టింది విజయనగరం. పుట్టగానే ఏడ్వడమో, ఏదో చేయాలి కదా..! నేను ఏమీ చేయలేదు.. వీడు డేంజర్‌ అని అక్కడి నుంచి ఒడిశాలోని రూర్కెలా పంపారు. అక్కడ మా నాన్న జాబ్‌ చేసేవారు.

సినిమాల్లోకి రాకముందు బ్యాంకులో జాబ్‌ చేశారు కదా..?

సత్యప్రకాశ్‌: అవును. ప్రతీ దానికి పాజిటివ్‌, నెగెటివ్‌ ఎనర్జీ రెండూ ఉంటాయి. ఎంప్లాయిగా తీసుకున్నారు. నాకేమైనా వస్తే కదా చేయడానికి.. క్లర్క్‌ కంటే పైజాబ్‌ ఇచ్చారు. డబ్బు వస్తే క్రెడిట్‌లో, డబ్బు ఇస్తే డెబిట్‌లో రాయాలని చెప్పారు. బ్యాంకులో ఉన్న రోజు తప్పే చేశా. ఇప్పటివరకు డెబిట్‌, క్రెడిట్‌ ఏంటో తెలియదు.

మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు..?

సత్యప్రకాశ్‌: నాకు ఒక తమ్ముడు. ఒక చెల్లి. తమ్ముడు చెన్నైలో ఉన్నాడు. పెద్ద కంపెనీలో జనరల్‌ మేనేజరుగా చేస్తున్నాడు. చెల్లి ముంబయిలో.. వాళ్లంతా వైద్య రంగంలో పనిచేస్తారు.

సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు..?

సత్యప్రకాశ్‌: నేనేదో పిచ్చిపనులు చేస్తుంటే..ఓ డైరెక్టర్‌ పిలిచి ‘చిన్న పాత్ర ఇస్తా రా బాబూ’ అన్నాడు. నన్ను ఆర్టిస్ట్‌ను చేసినందుకు అతడు ఇప్పటికీ బాధపడుతున్నాడు.

మీరు బ్యాడ్‌ యాక్టర్‌ అని అతని అభిప్రాయమా..? అయితే ఇన్ని సినిమాలు ఎలా చేశారు..?

సత్యప్రకాశ్‌: ఓపినియన్‌ కాదు.. కన్‌ఫర్మ్‌. నన్ను బ్యాడ్‌ యాక్టర్‌ అని నిర్ణయించారు. ఒక క్యారెక్టర్‌ వేయించాడు. అది అతనికి రాహుకాలం అయి ఉండొచ్చు. ఎందుకు పెట్టుకున్నానా అనుకున్నారు. డైలాగ్‌ చెప్పడం రాదు.. అనుకునే లోపు సినిమా పూర్తయ్యింది. అతను ఒక నిర్మాతకు సత్యప్రకాశ్‌ను తీసుకోవద్దని చెప్పే లోపల అవకాశం వచ్చేది. ఇలా నా రాత మారిపోయింది.

ఎన్ని భాషల్లో నటించారు..?

సత్యప్రకాశ్‌: దేశంలోని అన్ని భాషల్లోనూ నటించా. ఏమీ తెలియని నన్ను కళామతల్లి కోటీశ్వరుడిని చేసింది. కళామతల్లికి రుణపడి ఉంటా. ఎన్నో కష్టాలు పడుతున్న సమయంలో కన్నడ పరిశ్రమ ఆదుకుంది. పోలీస్‌ స్టోరీ సినిమాలో అవకాశం వచ్చింది. థ్రిల్లర్‌ మంజు డైరెక్టర్‌కు ఇప్పటికీ రుణ పడి ఉంటా. అప్పటినుంచి ఇప్పటి దాకా హీరో సాయికుమార్‌ నన్ను భరిస్తూనే ఉన్నాడు.

మీ మీద ఒక ఫిర్యాదు ఉంది..? ఎంతవరకు నిజమో చెప్పాలి..? పాఠశాల ముందు చాక్లెట్‌ దొంగతనం చేసేవారట కదా..?

సత్యప్రకాశ్‌: దొంగతనం చేసేవాడిని. అప్పటి పిప్పర్‌మెంట్లకు ఇప్పుడు డబ్బులు కట్టాలంటే కష్టం. పెద్దవాళ్లు ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వెళ్లి ఇష్టమున్నట్టు డబ్బు ఖర్చు పెడతారు. సిబ్బందికి జీతాలు ఇవ్వాలంటే లెక్కలు వేస్తారు. అలాగే ఇదీ అంతే. చిన్నప్పటి దొంగతనం డబ్బులు ఇవ్వను.

మీ ఇంట్లో వాళ్లు భరిస్తున్నారా..? బయటకు తరిమేస్తున్నారా..?

సత్యప్రకాశ్‌: నన్ను భరిస్తున్నారు. అందరికంటే ఎక్కువగా నా భార్య. ఆ మహాతల్లి చెన్నైలో ఉంది. ఆమెది అసలు ఊరు జంషెడ్‌పూర్‌. సొంత మామయ్య కూతురే. ఆమెతో పెళ్లి అయిన తర్వాతే నా జీవితం మారిపోయింది. కళామతల్లి ముంగిటకు వెళ్లా. 600 సినిమాల్లో నటించా.

సినిమాల్లోకి ఎప్పుడు వచ్చారు?

సత్యప్రకాశ్‌: 1987లో వచ్చా. ఇంట్లో చెప్పకుండా ముంబయి వెళ్లా. డబ్బు లేదు. ఫ్లాట్‌ఫాంపై ఉండే వాడిని. నాన్న దగ్గర డబ్బు ఉండేది కాదు.. మాది లోయర్‌ మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీ. ముంబయిలో కొంచెం డబ్బు ఉంటే మేనేజ్‌ చేయొచ్చు. ఎన్నో కష్టాలు భరించా. ఎన్నో కార్యాలయాలకు వెళ్లా. మహేశ్‌ భట్‌, సుభాష్‌లాంటి డైరెక్టర్లను కలిశా. దేనికైనా టైం రావాలి అంటారు కదా.. టైం వచ్చింది. చాలా సినిమాలు చేశా. 

ఆడియన్స్‌ మీ మేనరిజమ్‌, సైకో క్యారెక్టర్‌ చూసి ఇష్టపడ్డారు. మీరు నటించిన సినిమాల్లో బాగా చేశావని అనిపించిన సినిమా ఏది..?

సత్యప్రకాశ్‌: చిన్న చిన్న పాత్రలు వేస్తున్న సమయంలో పెద్ద వేషాలు కావాలని అడిగే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో కన్నడలో ‘పోలీస్‌ స్టోరీ’ అవకాశం వచ్చింది. నాకు ఆ సమయంలో కన్నడం రాదు. ఆ సినిమాలోచేస్తున్నపుడు రోజు ఏడ్చే వాడిని. అబ్బ! ఎంత మంచి సినిమా అనుకునే వాడిని. సినిమా విడుదల తర్వాత చూసి నిజంగా ఏడ్చేశా.. అదే తొలిసారి. మళ్లీ మా అబ్బాయి నట్‌రాజ్‌తో ‘మనసు మల్లిగే’ సినిమాను రాక్‌లైన్‌ వెంకటేష్‌ కన్నడలో తీశారు. మరాఠీ సైరాత్‌కు రీమేక్‌ అది. ఆ సినిమా ప్రివ్యూలో మా అబ్బాయి నటన చూసి కన్నీళ్లొచ్చాయి. వాడు నాకంటే పెద్ద ఆర్టిస్టు అవుతాడని అనుకున్నా. సీతారామరాజు, కృష్ణవంశీతో డేంజర్‌, బాలయ్య బాబుతో సమరసింహారెడ్డి చేశా. చిన్నప్పటి సంగతి చెప్పనా.. రూర్కెలాలో హిందీ, ఒరియా సినిమాలే వచ్చేవి. తెలుగు సినిమా చూడాలంటే విజయనగరం రావాల్సిందే. అక్కడి నుంచి విజయనగరం వచ్చేందుకు ఓ దొంగల బండి ఉండేది. దానికి టికెట్‌ తీయకుండానే వచ్చేవాణ్ని. 12 గంటలు జర్నీ. రూర్కెలాలో దొరకని ఇడ్లీ, దోసె, చిరంజీవి సినిమాలు చూసే వాడిని. ఆయన సినిమాలు చూసి, స్టెప్పులు చూసి సినిమాల్లోకి వస్తే ఇలాంటి దేవుడితో చేసే అవకాశం ఇవ్వాలని కోరుకున్నా. దేవుడు నా మొర ఆలకించాడు. నా మొదటి తెలుగు సినిమానే ‘బిగ్‌బాస్‌’. తర్వాత ‘మాస్టర్‌’లో చేశా. తెలుగులో అందరితోచేశా. హిందీలో అమితాబ్‌తో జమానత్‌ చేశాను.

అమితాబ్‌తో చేస్తున్నపుడు మీ ఫీలింగ్‌ ఏంటి? 

సత్యప్రకాశ్‌: వాహిని స్టూడియోకు 9 గంటలకు రమ్మన్నారు. 7 గంటలకు వెళ్లా. ఒక విషయం చెప్పాలి.. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు ‘షోలే’ విడుదలయ్యింది. నాన్న జేబులో రూపాయి పది పైసలు కొట్టేశా. సినిమా హాలుకు వెళ్లి టికెట్‌కు చేయి పెట్టేలోపే అయిపోయాయన్నారు. మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు టికెట్‌ తీసుకున్నా.. లోపలికి వెళ్లగానే కరెంటు పోయింది. 3 గంటల సినిమా. 7 గంటలకు అయిపోయింది. ఇంటికి వెళ్లగానే గబ్బర్‌సింగ్‌లా మా నాన్న బెల్ట్‌ పట్టుకొని ఇంటి ముందర ఉన్నారు. ఇంటికి వెళ్లగానే వీర కుమ్ముడే. కొట్టో..కొట్టో.. మా బామ్మ వచ్చి ‘వాణ్ని చంపేస్తావా’ అంటూ అడ్డుకున్నారు. అప్పట్లో సినిమాలకు వెళ్లనిచ్చేవారు కాదు.. షోలే చేసిన గ్రేట్‌ పర్సన్‌తో నేను నటిస్తానని అనుకోలేదు. ఆయన్ను చూస్తే డైలాగులు రావడం లేదు. నువ్వే అమితాబ్‌ అనుకొని డైలాగ్‌ చెప్పమంటే ఇరగదీశా. ఆయనకి మా నాన్న భగవద్గీత ఇచ్చారు.

సినిమాల్లో చాలా మందితో తన్నులు తిన్న మీరు రియల్‌ లైఫ్‌లో ఎవరినైనా కొట్టారా..?

సత్యప్రకాశ్‌: ఇప్పటిదాకా ఎవరినీ కొట్టలేదు.. ఎవరినీ తిట్టలేదు. ఇంట్లో వాళ్లు కాదు.. బయటివాళ్లు కాదు.. ఎవరినీ ఏమీ అనలేదు. నేనే అందరితో సరదాగా ఉంటా.. చాలా సింపుల్‌. సత్యప్రకాశ్‌ జీరో అని చెబుతుంటా. ఈ ప్రపంచంలో అందరి కంటే చిన్న వాడిని నేనే. అప్పుడే మిగిలిన వాళ్లు నాకంటే పెద్దవాళ్లుగా కనిపిస్తారు. ముందున్న ఈగోను పక్కన పెడితే వెనక నుంచి లవ్‌ వస్తుంది. దానితో రిలేషన్‌షిప్‌ ఏర్పడుతుంది. దాని కోసమే తాపత్రయపడతాను. ఎక్కడికి వెళ్లినా ఇలాగే ఉంటా. అందుకే అందరూ అభిమానిస్తారు.

దైవభక్తి ఎక్కువనుకుంటా..?

సత్యప్రకాశ్‌: ఒక చిన్న రియలైజేషన్‌. ఈగోని పక్కన పెడితే వాస్తవం బోధ పడుతుంది. మనం ఎక్కడి నుంచి అమ్మ కడుపులోకి వచ్చాం. దానికి ఎక్కడో శక్తి ఉంటుంది. దాన్నే దేవుడు అన్నాం. అది అల్లా అవ్వని, ఈశ్వర్‌, జీసస్‌ కానీ.. ఆ శక్తిని చాలా గౌరవిస్తా. దానితో మనలో పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది. ఎదుటి వారు మనల్ని బ్యాడ్‌ అని చెప్పరు. భరిస్తారు. సినిమా అవకాశాలకు చెన్నైలో ఒక ఆఫీస్‌కు వెళ్లినప్పుడు వాచ్‌మెన్‌ నన్ను చూసి ‘నువ్వు అసలు మనిషిలా ఉన్నావా’ అన్నాడు. అయినా మళ్లీ, మళ్లీ వెళ్లా..పి. వాసు, విజయ బాపినీడు ఆఫీసులకు వెళ్లినా రానీయలేదు.

భవిష్యత్తులో యాక్టర్‌ కాకుండా ఏమవుదామనుకుంటున్నారు..? ఏం చేద్దామనుకుంటున్నారు..?

సత్యప్రకాశ్‌: మీ లాంటి(ఆలీ) కమెడియన్‌, డైరెక్టర్‌ కావాలనుకుంటున్నా. కమెడియన్‌గా చేయడానికి చాలా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నా. అందులో ఒక సినిమాలో రెండు పాత్రలు చేస్తున్నా. నత్తి పాత్ర. మరొక దాంట్లో పూర్తి కమెడియన్‌గా చేస్తున్నా. డైరెక్టర్‌గా రెండు సినిమాలు చేశా. 2020లో మా బాబుతోనే ఉల్లాల..ఉల్లాల చేశా. కళామతల్లి అనుగ్రహం ఉంటే డైరెక్టర్‌గా చేస్తా. టైంను రిక్వెస్టు చేస్తే అవకాశం ఇస్తుంది.. అదే రావాలంటే రాదు. ఎంత కోపం వచ్చినా రిలేషన్‌షిప్‌ను వదులుకోవద్దు.

ఫ్యామిలీలు కలవకపోవడానికి కారకులు ఎవరు..?

సత్యప్రకాశ్‌: ప్రధానంగా ఫ్యామిలీలు కలవకపోవడానికి వాళ్ల తల్లిదండ్రులే కారకులు. భార్యాభర్తలే ఎక్కడికయినా వెళ్తున్నారు. పిల్లలను తీసుకెళ్లడం లేదు. పిల్లలకు అనుబంధం, అభిమానం, ప్రేమ తగ్గిపోవడానికి తల్లిదండ్రులే కారణం. ఈ సెల్‌ఫోన్‌తో అపార్థాలు పెరిగిపోయాయి.  ఒకచోట ఉండి మరొక చోట ఉన్నట్టు చెప్పడం..ఒకరి దగ్గర ఉండి మరొకరి వద్ద ఉన్నట్టు చెప్పడంతో నమ్మకం పోయింది. రిలేషన్‌ తగ్గిపోయింది.

మొదటిసారి మీ టాలెంట్‌ గుర్తించి మీ నాన్న ఆయన షష్టి పూర్తి సమయంలో మిమ్మల్ని కౌగిలించుకున్నారు.మీ సంపాదనతో మీ అమ్మకు బంగారం కొనిచ్చిన తర్వాత వాళ్ల రియాక్షన్‌ ఏంటి?

సత్యప్రకాశ్‌: ఇది నిజంగా చాలా ఎమోషనల్‌. (ఆలీని కౌగిలించుకున్నారు) అమ్మకు బంగారం చాలా ఇష్టం. నేను సంపాదించిన తర్వాత అమ్మకు అన్ని రకాల ఆభరణాలూ కొన్నా. వాటిని వేసుకున్న తర్వాత అమ్మ సంతోషమే వేరుగా ఉండేది. నా కొడుకు కొనిచ్చాడనే ఫీలింగ్‌ కనిపించేది. మా నాన్న కొనలేదని ఎప్పుడూ ఫిర్యాదులు లేదు. బంగారం కొనే పరిస్థితి మాది కాదు. చాలా చిన్న ఇల్లు. నాన్న నెల జీతంతో ఇల్లు గడిచేది. అమ్మ అనే పదం ఓంకారంతో ముగుస్తుంది. అమ్మ దేవుడిచ్చిన వరం. నేను మొదటి సారిగా కారు కొన్నపుడు నాన్న కళ్లలో నీళ్లు వచ్చాయి. కళామతల్లి ఇచ్చిన అవకాశంతో నాన్న షష్టి పూర్తి ఘనంగా చేశా. ఆ వేళ సాయంత్రం నన్ను హగ్‌ చేసుకున్నారు. ఇప్పటికీ నాన్న ముఖంలోకి చూసి మాట్లాడలేను. ఆయనంటే అంత గౌరవం.

చిన్నప్పుడు జూకు వెళ్లి వచ్చిన తర్వాత మీలో ఏదో తేడా వచ్చిందట..?

సత్యప్రకాశ్‌: అదే ఇది. బోనులో కోతులు చాలా రకాలున్నాయి. వాటికి ఆహారం వేస్తున్నపుడు నా చేయి అందులో ఉండిపోయింది. కోతి నా వేలును గట్టిగా కొరికి వదల్లేదు. అందరూ అరిచి రాళ్లు వేస్తే వదిలేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికీ చెప్పలేదు. నాయర్‌ ఇంటికి వచ్చి నాన్నకు చెబితే సైకిల్‌పై ఆసుపత్రికి తీసుకెళ్లారు. బొడ్డుచుట్టూ 14 ఇంజెక్షన్లు వేశారు. అప్పటి నుంచే కోతి చేష్టలు మొదలయ్యాయి. (నవ్వుతూ)

ఒక సినిమా షూటింగ్‌లో హీరో మిమ్మల్ని కొట్టుకుంటూ పోతుంటే సిటీలోని ప్రెస్‌వాళ్లంతా వచ్చారట..?

సత్యప్రకాశ్‌: ఒక హీరో కాదు.. నా హీరో సాయి కుమారే. సినిమా అగ్ని ఐపీఎస్‌. బెంగళూరులోని నడిరోడ్డుపై సాయికుమార్‌ నిజంగానే కొట్టుకుంటూ తీసుకొని పోతున్నాడు. నా పంచె కూడా ఊడిపోయింది. చూడ్డానికి రౌడీలా ఉన్నా. నిజంగా జరుగుతుందేమోనని ఎవరో ఫోన్‌ చేస్తే ప్రెస్‌ అంతా వచ్చారు. వాళ్లకు సినిమా షూటింగ్‌ అని చెప్పి వదిలించుకునే లోపే పోలీసులు వచ్చి పర్మిషన్‌ ఏదీ అంటే అదీ లేదు.

మీ అబ్బాయి మీలా ఉంటాడా..? హీరోలా ఉంటాడా..? ఎన్ని సినిమాలు చేశారు..?

సత్యప్రకాశ్‌: సింపుల్‌గా ఉంటాడు. అందంగా ఉంటాడు..చాలా హ్యాండ్సమ్‌. మంచి డ్యాన్సర్‌ కూడా. మొత్తం ఐదు సినిమాలు చేస్తే రెండు విడుదలయ్యాయి. రెండు పూర్తి కావొస్తున్నాయి. తెలుగులో ఒక సినిమా చేయబోతున్నాడు. అందరి సహకారం ఉంటే తెలుగులో మంచి హీరో అవుతాడు.

ఓ కో-డైరెక్టర్‌ తిట్టి అవమానించారట.. ఎందుకు?

సత్యప్రకాశ్‌: అప్పుడే పైకి వస్తున్న నటుడిని. ఓ ఫైట్‌ సీను సుమన్‌ గారితో ఉంది. కొడితే రియాక్షన్‌ ఇవ్వాలి. రావడం లేదు. 50 మందిలో నేనొక్కడిని. ఫైట్‌ మాస్టర్‌ వాడికి సరిగా రావడం లేదు.. వాని బదులు మరొకరిని పెట్టమని చెప్పారు. బయటకు వచ్చా. ఫైటర్‌తో మాట్లాడుతుండగా కో డైరెక్టర్‌ వచ్చారు. ‘ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీకి ఎలా వస్తారు. అందుకే ఇండస్ట్రీ నాశనం అవుతోంది’ అన్నారు. చాలా  ఫీల్‌ అయ్యా. ఆ తర్వాత టైం మారింది. నేను క్యారవ్యాన్‌లో కూర్చున్నా. అతను నాకు డైలాగ్‌ చెప్పడానికి వచ్చాడు. అతన్ని కూర్చోబెట్టి కొన్నేళ్ల క్రితం నేనే సత్యప్రకాశ్‌ అని నాకే తెలియనప్పుడు ఓ మాట అన్నారు.. మా లాంటి వందల మందికి గాడ్‌ఫాదర్‌ ఎవరూ లేరు. కష్టపడాలనే తపనతో వస్తాం. దయచేసి ఎవరినీ కించపరచకండి.. సాధ్యమైతే సహకరించండి అని చెప్పా. అప్పటికీ అతను కో డైరెక్టర్‌గానే ఉండిపోయాడు. నేను క్యారవ్యాన్‌లో ఉండే ఈ స్థాయికి చేరుకున్నా.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని