vinod kumar: నన్ను చూసి నిజమైన పోలీసు అనుకుని వదిలేసి వెళ్లిపోయారు!

మౌనపోరాటంలో క్లిష్టమైన పాత్ర చేసినా, లెజండ్‌ డైరెక్టర్‌ దాసరితో కలిసి మామగారులో నటించినా ఎక్కడా పరిధి దాటలేదు.

Updated : 02 Mar 2022 11:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివిధ భాషల్లో హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఆజానుబాహుడు.. విభిన్న పాత్రలతో ఆకట్టుకొని.. ఎవర్‌గ్రీన్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన నటుడు వినోద్‌కుమార్‌. ‘మౌన పోరాటం’లో క్లిష్టమైన పాత్ర చేసినా, లెజండ్‌ డైరెక్టర్‌ దాసరితో కలిసి ‘మామగారు’లో నటించినా ఎక్కడా పరిధి దాటలేదు. దక్షిణాది భాషల్లో హీరోగా, నటుడిగా ఇప్పటికీ నటిస్తున్నారాయన.. ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వినోద్‌కుమార్‌ వచ్చారు. ఎన్నో ఆసక్తికర విషయాలను ముఖాముఖిలో పంచుకున్నారు.

అల్వా.. ఇంటి పేరేంటి?

వినోద్‌కుమార్‌: అసలు పేరు వినోద్‌కుమార్‌ అల్వా. కన్నడలో వినోద్‌ అల్వా అని పెట్టారు. కర్ణాటకలో అప్పటికే నా కజిన్‌ జీవరాజ్‌ అల్వా మంత్రిగా ఉన్నారు. చాలా ఫేమస్‌. నన్ను కూడా వినోద్‌ అల్వా అని పిలిచారు. ‘మౌన పోరాటం’ చేసేందుకు వచ్చినప్పుడు అట్లూరి రామారావుగారు ‘బాబూ నీ అసలు పేరేంటి’ అని అడిగారు. ‘వినోద్‌కుమార్‌ అల్వా’ అని చెప్పా. అల్వా తీసేసి వినోద్‌కుమార్‌ పెట్టేద్దామని చెప్పారు.

సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది..?

వినోద్‌కుమార్‌: మంగళూరు నుంచి ముంబయికి వెళ్లిపోయా. అక్కడ జాబ్‌ చేయాలనుకున్నా. మెడికల్‌ రెప్‌గా రెండు రోజులు పనిచేశా. ఓ పార్టీకి హోటల్‌కు వెళ్లా. ఇక్కడేదైనా ఉద్యోగం దొరికితే బాగుండు అనుకున్నా. మేనేజరు పాల్‌దేశాయ్‌ను మా కజిన్‌ పరిచయం చేశాడు. ఉద్యోగం వచ్చింది. మూడు నెలల తర్వాత కన్నడ నిర్మాత అబ్బాయినాయుడు  వచ్చారు. ఇద్దరం పిచ్చాపాటిగా మాట్లాడుకున్నాం. మేం త్వరగానే కలిసిపోయాం. మూడు, నాలుగు నెలల తర్వాత కాల్‌ వచ్చింది. ‘సినిమాలో నటించాలి బెంగళూరు రండి’ అన్నారు. ‘సార్‌ నాకు నటన రాదు.. నేను రాలేను.. నేను విదేశాలకు వెళ్లాలి’ అని చెప్పా. అయినా ఆయన ఒప్పుకోలేదు. ఆ మరుసటి రోజు ఉదయం మేనేజరు వచ్చి బెంగళూరు విమానం టికెట్లు ఇచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా షూటింగ్‌ స్పాట్‌కు తీసుకెళ్లారు. గుర్రంతో వాకింగ్‌ చేయమన్నారు. బైక్‌ నడపమన్నారు.. హీరోయిన్‌తో మాట్లాడించారు.. సాయంత్రం ఎడిటింగ్‌ చేసి చూపిస్తే ఆశ్చర్యపోయా. స్నేహితులు కూడా హీరోగా చేయమనడంతో కాదనలేకపోయా. మొదటి సినిమా ‘దవురుమను’. తొమ్మిదివేలు పారితోషికం. అది కూడా వద్దన్నా. ఇది తీసుకో అదృష్టంగా మారుతుందని నాయుడుగారు చెప్పారు.

‘మౌన పోరాటం’ అవకాశం ఎలా వచ్చింది..?

వినోద్‌కుమార్‌: నా మూడో సినిమా ఖుష్బూతో చేశా. విష్ణువర్ధన్‌ కూడా నటించారు. ఆ సినిమాను అట్లూరి రామారావు చూశారు. ‘మౌనపోరాటం’లో నెగెటివ్‌ క్యారెక్టర్‌కు కావాలన్నారు. ప్రసాద్‌బాబు కెమెరామెన్‌ నా పేరు చెప్పారు. అబ్బాయినాయుడితో మాట్లాడి పంపించమన్నారు. మద్రాస్‌ రాగానే పెద్దాయన రామోజీరావును కలిశా. బాబూ డేట్స్‌ పంపిస్తామన్నారు. సాయంత్రం దర్శకుడు మోహన్‌గాంధీని కలిసి మాట్లాడాను.

‘మౌనపోరాటం’ తర్వాత అమ్మాయిల్లో మీపై సాఫ్ట్‌నెస్‌ ఉండేదా? వీడిని చంపేయాలనే కోపం కనిపించిందా..?

వినోద్‌కుమార్‌: అమ్మాయిల్లో రెండూ ఉండేవి. ఎంట్రీ నుంచి నేనే హీరో, నేనే విలన్‌. చాలా అరుదుగా అలాంటి పాత్ర లభిస్తుంది. మొదట్లో ఆ పాత్రపై జాలి ఉంటుంది. సెకండాఫ్‌లో అమ్మాయిని గర్భవతిని చేశాక.. నాకే ఇబ్బందిగా అనిపించింది. 

ఎన్ని సినిమాలు చేశారు..?

వినోద్‌కుమార్‌: హీరోగా 140, ఇతర పాత్రలు 20.. తెలుగులో 110, కన్నడలో 30, మలయాళంలో ఒకటి, తమిళంలో రెండు చేశా.

బాగా పేరొచ్చిన సినిమా ఏది..?

వినోద్‌కుమార్‌: ‘మామగారు’ మంచి పేరు తెచ్చింది. మౌనపోరాటం, సీతారత్నం గారి అబ్బాయి. కర్తవ్యం, భారత్‌బంద్‌, పోలీస్‌బ్రదర్‌ లాంటి సినిమాలు మంచి టాక్‌ తెచ్చుకున్నాయి.

మోహన్‌గాంధీతో ఎన్ని సినిమాలు చేశారు? ఆయనతో పనిచేయటం ఎలా అనిపించింది?

వినోద్‌కుమార్‌: దాదాపుగా ఐదు సినిమాలు చేశా. అందులో మూడు ఉషాకిరణ్‌మూవీస్‌ వాళ్లవే. ఏ ఆర్టిస్టు అయినా ఒకసారైనా మోహన్‌గాంధీతో పని చేయాలి. నటన నేర్పుతారు. ఆయనకు పర్‌ఫెక్షన్‌ ఉండాలి. 

దాసరి దర్శకత్వంలో నటిస్తూనే ఆయనతో తెర పంచుకోవటం ఎలా అనిపించింది?

వినోద్‌కుమార్‌: ఆయనో డిక్షనరీ. లెజెండ్‌. దాసరి, కోడి రామకృష్ణతో పని చేయడం అదృష్టం. దాసరితో ‘నియంత’, ‘మామగారు’ చేశా. చాలా మంచి వ్యక్తి. అలాగే మంచి భోజన ప్రియుడు. తనతో పాటు ఉన్న వాళ్లకు కూడా అన్నీ అందేలా చేస్తారు.

వినోద్‌ మినీ సైజ్‌ ముఖేష్‌ అంబానీ అంటారు..? ఆస్తులు బాగా సంపాదించారట?

వినోద్‌కుమార్‌: జీరో సైజ్‌ ముఖేష్‌ అంబానీ కూడా కాదు.. అంత ఉంటే లండన్‌లో ఉండే వాడిని. హీరో శోభన్‌బాబు నాకు ఆదర్శం. రూపాయిలో 60పైసలు పొదుపు చేసి భూములు కొన్నా. 40పైసలు ఖర్చు పెట్టేవాడిని.

ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?

వినోద్‌కుమార్‌: లవ్‌ చేసి చేసి విసిగిపోయి.. పెద్దలు కుదిర్చిన మ్యారేజీ చేసుకున్నా. మాకు ఇద్దరబ్బాయిలు. పెద్దబ్బాయి సినిమాలకు సిద్ధమవుతున్నాడు. ‘నీ ప్రయత్నాలు నీవే చూసుకోవాలి’ అని చెప్పా. వాడిపేరు అనోజ్‌ అల్వా. వాడికి తెలుగులో చేయాలని ఉంది. చిన్నోడు లా చదువుతున్నా మంచి విలన్‌గా చేయాలనే ఆలోచన ఉంది.

‘మౌనపోరాటం’లో  సాయికుమార్‌ ఓ డైలాగ్‌ రాసిచ్చారట ఏంటీ...?

వినోద్‌కుమార్‌: పెద్ద డైలాగ్‌ రాసిచ్చాడు. అన్నీ బూతులే. నా గురించి నేనే తిట్టుకునేవి. పబ్లిక్‌లో చెబుతుంటే అందరూ నవ్వుకోవడంతో ఆశ్చర్యమేసింది. ‘భారత్‌బంద్‌’ నుంచి సాయితో అనుబంధం మొదలైంది.

మీ ఆవిడ షూటింగ్‌ చూసేందుకు వచ్చి చూడలేక మధ్యలోనే వెళ్లిపోయారట ఎందుకు..?

వినోద్‌కుమార్‌: ఆ రోజు ఆమనితో పాట షూటింగ్‌ చేస్తున్నారు. మామూలుగా మేకప్‌ వేసుకుంటేనే నవ్వుతుంది. సినిమాలు కూడా చూడదు. రొమాంటిక్‌ సాంగ్‌ కావడంతో చూడలేక వెళ్లిపోయింది.

ఒక థియేటర్‌లో సినిమాకు వెళ్తే యాజమాన్యం సన్మానించిందట..? ఎక్కడ..?

వినోద్‌కుమార్‌: నా  ఫ్రెండ్‌ ఆయూబ్‌తో తిరుపతిలో ‘మౌనపోరాటం’ సినిమాకు వెళ్లా. వెనకసీట్లో కూర్చున్నా.. ప్రేక్షకులు గుర్తుపట్టారు. అల్లరి చేశారు. సెకండాఫ్‌ మరింత ఇబ్బందిగా ఉంటుందని వెళ్లిపోతామనుకున్నాం.. ఇంతలో ఓనర్‌ వచ్చి బాల్కనీలోకి తీసుకెళ్లారు. సన్మానించారు. బయటకు వెళ్లడం కుదరలేదు. కొత్త మారుతి 800 కారు డోర్‌ లాగేశారు. అప్పుడే హీరో అయితే ఎలా ఉంటుందో తెలిసింది. 

వినోద్‌ సాఫ్టా, యారగెంటా..?

వినోద్‌కుమార్‌: ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటా. తెలుగులో ఎన్నో సినిమాలు చేశా. ఎవరితో దురుసుగా, అహంకారంతో మాట్లాడలేదు. ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు. సొంతూరులో పనులు కావాల్సి వచ్చినప్పుడు ఇంటి దగ్గర మాత్రం కఠినంగానే ఉంటా. మనిషికి రెండూ ఉండాలి.

చిన్నప్పుడు మీ సోదరిని మాస్టారు కొడితే నువ్వెళ్లి మాస్టారును కొట్టావట..?

వినోద్‌కుమార్‌: స్కూల్‌లో బాగానే అల్లరి చేసేవాడిని. ముగ్గురు సిస్టర్లు అంటే చాలా ప్రేమ. వాళ్ల పెళ్లి నేనే చేశా. నాన్నకు స్థాయి ఉంది. ఇందిరాగాంధీ చట్టం చేయడంతో 200 ఎకరాల్లో 30 ఎకరాలు మిగిలింది. సినిమాలు హిట్‌ అయ్యాయి. డబ్బు చేతిలో ఉంది. అందుకే నేనే పెళ్లి చేశా.

సీతారత్నంగారి అబ్బాయి సినిమాలోకి రోజా ఎలా వచ్చింది..?

వినోద్‌కుమార్‌: ముందుగా ఈ సినిమాలో వేరే హీరోయిన్‌ అనుకున్నారు. సర్పయాగం సినిమా షూటింగ్‌లో శోభన్‌బాబు గారిని కలవడానికి వెళ్లినపుడు రోజాను చూశా. రికమెండేషన్‌ కాదు.. కానీ మన సినిమాకు రోజా బాగుంటుందని ఈవీవీగారికి చెప్పా తీసుకున్నారు. 

ఎవరైనా చెప్పారా..క్రికెటర్‌ రవిశాస్త్రిలా ఉంటావని.?

వినోద్‌కుమార్‌: చాలామంది చెప్పారు. ఇన్ని సినిమాలు చేశానంటే తెలుగు ప్రేక్షకులే కారణం. 110 చిత్రాలకు పైగా సినిమాలు చేయాలంటే మామూలు విషయం కాదు.. డైరెక్టర్లు, నిర్మాతలు, టెక్నిషియన్లు, ప్రేక్షకులే కారణం..నా సినిమాలు నేనెప్పుడు చూడలేదు. అవన్నీ గుర్తుకు వచ్చేసరికి కన్నీళ్లు వచ్చాయి. కెరీర్‌ విషయంలో అందరూ సాయం చేశారు. అందుకు థ్యాంక్స్‌

2005 తర్వాత సినిమాలు ఎలా తగ్గిపోయాయి..ఎందుకు..?

వినోద్‌కుమార్‌: కుటుంబం కోసం సమయం కేటాయించాలనుకున్నా. అందుకే సినిమాలు తగ్గిపోయాయి. మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు చిత్రసీమ తరలిరావడంతో కొంత గ్యాప్‌ వచ్చింది. 

ఇండస్ట్రీలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరు?

వినోద్‌కుమార్‌: సాయి, సుమన్‌, భానుచందర్‌, నువ్వు(ఆలీ) శ్రీకాంత్‌, చిట్టీ. ఇలా చాలా మంది నాకు మిత్రులున్నారు.

1991లో అసెంబ్లీ ముందు షూటింగ్‌ చేస్తున్నప్పుడు సమస్యలు వచ్చాయట..?

వినోద్‌కుమార్‌: అసెంబ్లీ ముందు కోడిరామకృష్ణ సినిమా షూటింగ్‌ చేస్తున్నపుడు పోలీసులు అందరినీ తీసుకెళ్లారు. నేను కారు దగ్గర పోలీసు డ్రెస్‌లో ఉండటంతో పోలీసులు నిజమైన పోలీసునని వదిలేసి వెళ్లిపోయారు. ఆటో పట్టుకొని ఇంటికి వెళ్లిపోయా.(నవ్వులు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని