Allu Sirish: నేను నటించిన ఆ సినిమా నచ్చిందని చెబితే.. షాక్‌ అవుతా..: అల్లు శిరీష్‌

‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో అల్లు శిరీష్‌ పంచుకున్న విశేషాలివి. 

Updated : 09 Nov 2022 10:36 IST

Allu sirish: ఈ హీరో ఇంటిపేరే ఓ బ్రాండ్‌. అలాంటి ఫ్యామిలీ నుంచి పరిశ్రమకు వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కంటెంట్‌ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రతి చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాకుండా.. పాపులర్‌ ఈవెంట్స్‌కు హోస్ట్‌గా చేసి తన టాలెంట్‌తో ఆడియన్స్‌ను మరింత అలరిస్తున్నాడు. అతనే అల్లు శిరీష్‌. ఈ హీరో తాజాగా నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. ఈ సినిమా విశేషాలతోపాటు వ్యక్తిగత వివరాలెన్నో ఆలీతో పంచుకున్నాడు. ఆ కబుర్లు ఏంటో చూసేద్దాం..

ఈ మధ్య ఎక్కువగా ముంబయి వెళ్తున్నావట? కథల కోసమా.. కోడలు కోసమా? నీది బిజినెస్‌ మైండ్‌ అని విన్నాం నిజమేనా?

శిరీష్: కోడలు కోసం మాత్రం కాదు. ముంబయిలో నాకు కావాల్సిన కథలు ఉన్నాయని అక్కడికి వెళ్లి 3 నెలలు ఉండి నచ్చిన కథలను ఎంచుకున్నా. నాది బిజినెస్‌ మైండ్‌ ఏం కాదు కానీ, ఒక నిర్మాత కొడుకుని కాబట్టి కొంచెం అవగాహన ఉంది. ఒక రూపాయిని ఎలా కాపాడు కోవాలి. పది మంది మనుషుల్ని ఎలా మేనేజ్‌ చేయాలి.. తదితర విషయాలు తెలుసు. డబ్బు విషయంలో ఇంట్లో అందరం జాగ్రత్త పడతాం.

‘ఊర్వశివో.. రాక్షసివో’ కథను సెలక్ట్‌ చేసిందెవరు? ఈ సినిమాలో నటించాలన్నది నీ నిర్ణయమా? లేదంటే ఇంట్లో వాళ్ల నిర్ణయమా?

శిరీష్: ఈ కథ మా నాన్నకు బాగా నచ్చింది. ఆయన తీద్దామనుకున్నారు. నేనైతే ఈ కథకు సెట్‌ అవుతా అని ఆయనకు అనిపించింది. అందుకే నన్ను హీరోగా ఎంచుకున్నారు. ఇంతకు ముందు నేను చేసిన సినిమాలు ఏబీసీడీ, గౌరవం, ఒక్క క్షణం.. ఇవన్నీ నా సొంత నిర్ణయాలు. ఈ సినిమా చేశాక నాకంటే మా నాన్నకు సినిమాల గురించి బాగా తెలుసని అర్థమైంది. గతంలో ఆయన వద్దు అని చెప్పిన కథలు చేశాను. ఇక ఇప్పుడు ఆయన ఓకే అంటేనే చేస్తా.. వద్దు అంటే చేయదలచుకోలేదు.

అను ఇమ్మాన్యుయేల్‌ (Anu Emmanuel) ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేసిందా?

శిరీష్: చాలా న్యాయం చేసింది. మేము ఈ సినిమా తీయాలి అనుకున్నప్పుడు మాకొచ్చిన మొదటి ఆలోచన అను ఇమ్మాన్యుయేల్‌. తనకు కథ చెప్పగానే నచ్చిందని చెప్పి ఓకే చేసింది. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే నేను, డైరెక్టర్‌ క్యారెక్టర్స్ గురించి వర్క్‌షాప్‌ చేశాం. తను మాత్రం ప్రాక్టీస్‌ చెయ్యకుండానే తన పాత్రలో లీనమైంది. చాలా బాగా చేసింది.

ఈ సినిమా మీ ఇంట్లో వాళ్లు చూశారా? మీ అమ్మ ఏమన్నారు?

శిరీష్: చూశారు. వాళ్లందరికీ నచ్చింది. కాకపోతే ఇందులో ఉన్న రొమాంటిక్‌ సీన్స్‌ గురించి  అడగలేదు. అయినా ఇప్పటి తరం చాలా ఫాస్ట్‌గా ఉంది. వాళ్లకి ఇవన్నీ నథింగ్‌(నవ్వుతూ).

ఏబీసీడీ సినిమాకు ఈ సినిమా(ఊర్వశివో.. రాక్షసివో)కు మధ్యలో ఎందుకు అంత గ్యాప్‌?

శిరీష్: మంచి కథ దొరకడానికి టైమ్‌ పట్టింది. ఏదో ఒకటి చేసేసి దానికి సరైన స్పందన రాకుండా ఇబ్బంది పడడం ఎందుకని మంచి కథను ఎంచుకొన్నాం. మేము ఈ సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమం చేసిన రెండో రోజే కొవిడ్‌ మొదలైంది. అందుకే ఆలస్యం అయ్యింది. ఈ కథకు మొదట ‘ప్రేమ.. కాదంట’ అనే టైటిల్‌ పెడదామనుకున్నాం. కానీ ఈ సినిమాలో హీరోయిన్‌ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. తనని హైలైట్‌ చేయాలని ఈ పేరు పెట్టాం.

ఆలీతో సరదాగా అల్లుఅరవింద్‌ ఎపిసోడ్‌ చూశారా? అందులో మీకు నచ్చిన పాయింట్‌ ఏంటి?

శిరీష్: మొత్తం ఒకేసారి చూడలేదు కానీ వీలున్నప్పుడల్లా కొంచెం కొంచెం చూశా. తాతయ్య గురించి నాన్న చెప్పిన విషయాలు నచ్చాయి. అలాగే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ గొడవలకు సంబంధించి ఆయన చెప్పిన సమాధానం బాగా నచ్చింది. ఎక్కడికి వెళ్లినా జనాలు దీనికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. మేము ఎప్పుడూ కలుస్తూనే ఉంటాం. ప్రతి పండగకు మేమందరం కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో పెడుతూనే ఉంటాం. అయినా ఎందుకు అడుగుతుంటారో తెలీదు. నాన్న ఈ ప్రశ్నకు సమాధానం చెబితే బాగుంటుందనుకున్నా. మీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇకపై ఆ ప్రశ్న ఎవరూ అడగరు అనుకుంటున్నా.

ఈ ప్రశ్న అల్లు అరవింద్‌గారిని అడుగుదామనుకున్నా. కానీ, ఎమోషనల్‌ అవుతారేమో అని అడగలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా మీ నాన్నగారికి సంతానం ఎంతమంది?

శిరీష్: నలుగురు. పెద్దన్నయ్య వెంకటేష్‌, రెండో అన్నయ్య రాజేష్‌. అర్జున్‌, నేను. వీళ్లలో రాజేష్‌ అన్నయ్య నేను పుట్టకముందే యాక్సిడెంట్‌లో చనిపోయారు.

గీతా ఆర్ట్స్‌లో తరచూ కథలు వింటుంటారు కదా? అలాంటప్పుడు శిరీష్‌ కోసం కథలు ఎందుకు సెలెక్ట్‌ చేయలేదు? 

శిరీష్: నా కోసమే కథలు వినరు కదా? గీతా ఆర్ట్స్‌ అనే సంస్థ కేవలం నాకోసమో, మా అన్నయ్య కోసమో కాదు. అది మేము పుట్టక ముందు నుంచి ఉంది. మా ఫ్యామిలీ వాళ్లతోనే కాదు బయట హీరోలతో కూడా సినిమాలు తీస్తాం. మా సంస్థ కథకు ప్రాధాన్యత ఇస్తుంది.

పుష్ప సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. దీనిపై నీ అభిప్రాయం ఏంటి?

శిరీష్: నేను ఆ సమయంలో ముంబయిలో ఉన్నా. మొదట రెండు రోజులు నాకేం తెలీదు. హిట్‌ అంటున్నారు కానీ నేషనల్‌ లెవల్లో సక్సెస్‌ అయ్యిందా లేదా అనుకున్నా..తర్వాత సినిమా మేము అనుకున్న రేంజ్‌లో విజయం సాధించింది అని తెలిశాక చాలా సంతోషపడ్డా. అక్కడ చాలా మందికి బన్నీ తెలుసు కానీ నేను తెలీదు. వాళ్లందరూ నా ముందే ‘పుష్ప’ గురించి మాట్లాడుకుంటుంటే విని ఎంజాయ్‌ చేశా. నాకు సుకుమార్‌పై పూర్తి నమ్మకం ఉంది. మా అన్నయ్య ఎంతో కష్టపడ్డారు. చిత్తూరు యాస నేర్చుకోవడానికి రోజు రెండు గంటలు కేటాయించేవాడు.

ఎవరైనా వచ్చి నువ్వు నటించిన గౌరవం సినిమా ఇష్టమని చెబితే షాక్‌ అవుతావట ఎందుకు?

శిరీష్: ఆ సినిమా ప్లాప్ అయ్యింది. కానీ నాకు చాలా ఇష్టమైన సినిమా అది. మాములుగా కొత్తజంట, శ్రీరస్తు ఇవి ఎవరికైనా నచ్చాయంటే ఓకే అనుకుంటా. కానీ గౌరవం సినిమా నచ్చిందంటే షాక్‌ అవుతా. ఎందుకంటే ఈ సినిమా 98శాతం మందికి నచ్చలేదు. అందుకే అలా షాక్‌ అవుతా.

సలహాలు అడగాల్సి వస్తే ఎవరిని అడుగుతావు. నాన్ననా.. మీ అన్నయ్యలనా?

శిరీష్: ఎక్కువ శాతం నాన్నని అడుగుతా. యాక్టింగ్‌కు సంబంధించిన విషయాలైతే బన్నీని అడుగుతా. కానీ బన్నీ ఏమనుకుంటాడంటే.. తన నిర్ణయాలు నాపై రుద్దకూడదు. తనకు సరిపోయే కథలు వచ్చాయి. వాటిలో తను నటించాడు. అవి నాకు సెట్‌ అవ్వవు అనుకుంటాడు. అందుకే ఏది అడిగినా పైపైనే చెబుతాడు.

మీ ముగ్గురు అన్నదమ్ముల్లో కోపిష్టి ఎవరు?నువ్వు రెబల్ అని విన్నాం?

శిరీష్: కోపిష్టిలు ఎవరూ లేరు. అందరం సరదాగానే ఉంటాం. ఇక నా విషయానికొస్తే నేను ఇంతకు ముందు ఏది అనుకుంటే అది మాట్లాడే వాడిని. సినిమా బాగుందా అని ఎవరైనా అడిగితే ‘బాగోలేదు.. ఇలా కాకుండా అలా చేస్తే బాగుండేది’ అని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు సినిమా వెనకాల ఎంతమంది కష్టపడతారో తెలిశాక అర్థమైంది. అలా సింపుల్‌గా ఓ సినిమా గురించి నిర్ణయం చెప్పకూడదు. అయినా అప్పట్లో అంటే కుర్రతనం. ఉడుకురక్తం కదా అందుకే గొడవలు పెట్టుకునే వాడిని. ఇప్పుడు అలా కాదు. కూల్‌గా ఉంటున్నా.

గీతా ఆర్ట్స్‌లో తీసిన సినిమాల్లో నీకు నచ్చింది ఏది?

శిరీష్: గజనీ (హిందీ వెర్షన్‌). ఈ సినిమాలో నేను పనిచేశా. నాకు చిన్నప్పటి నుంచి ఆమీర్‌ఖాన్‌ అంటే ఇష్టం. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో పని చేస్తున్నట్లు పగటి కలలు కనే వాడిని. గజనీ టైంలో అవి నిజమయ్యాయి. 2009లో ఆ సినిమా విడుదలైనప్పుడు ఇండియాలోనే మంచి వసూలు సాధించిన సినిమాగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు కలెక్ట్‌ చేసింది.

శిరీష్‌ని గీతా ఆర్ట్స్‌లో కాకుండా ప్రకాష్‌ రాజ్‌ బ్యానర్‌లో ఇంట్రడ్యూస్‌ చేయడానికి కారణం ఏంటి?

శిరీష్: దానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. నాకు సరిపోయే కథలు రాలేదు అంతే. నేను హీరో కాకముందు నుంచి నాకు రాధామోహన్‌ గారంటే ఇష్టం. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచే ఉంది. మీ సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి సర్‌ అని ఆయనతో చెప్పాను. 9 నెలల తర్వాత ఆయన ఫోన్‌ చేసి రమ్మన్నారు. అలా తీసిన సినిమానే గౌరవం.

 కమర్షియల్‌గా నువ్వు విజయం సాధించావని చెప్పగలవా?

శిరీష్: ఇంకా లేదు. మాస్‌ సినిమా చేస్తే తప్ప అలా కమర్షియల్‌ అని ముద్ర పడదు. మంచి సినిమాలు తీశాను కానీ కమర్షియల్‌ హీరో స్థాయికి అయితే ఇంకా చేరుకోలేదు. కొంచెం టైం పడుతుంది.

చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ సినిమాల్లో నీకు ఇష్టమైన సినిమా ఏది?

శిరీష్: జగదేకవీరుడు అతిలోక సుందరి. ఆ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ఇవ్వాళ చూసినా నాకు బోర్‌ కొట్టని సినిమా అంటే అదే. ఈ మధ్య అలాంటి సినిమాలేవీ రావట్లేదు అనిపిస్తుంది. గ్యాంగ్‌లీడర్‌, అన్నయ్య, బావగారు బాగున్నారా, ఇంద్ర.. ఇలా చాలా ఉన్నాయి. పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో అన్నిటికంటే ఇష్టమైన సినిమా ఖుషి,తర్వాత తమ్ముడు, బద్రీ, గబ్బర్‌ సింగ్‌, అత్తారింటికి దారేది. ఒకప్పుడు ఖుషీ సినిమా డైలాగ్‌లు అన్ని చెప్పేసేవాడిని.

మీ నాన్న చేతిలో ఎక్కువసార్లు దెబ్బలు తిన్నది ఎవరు?

శిరీష్: మా పెద్దఅన్నయ్య బాబీ ఎక్కువసార్లు దెబ్బలు తిన్నాడు. తర్వాత నేను. అందరికంటే తక్కువ కొట్టించుకుంది బన్నీ. అప్పట్లో మానాన్నకి చాలా కోపం. చిన్నప్పుడు బన్నీ చాలా సైలెంట్‌గా, డల్‌గా ఉండేవాడు. ఎక్కువ అల్లరి చేసేవాడు కూడా కాదు. గంటలు గంటలు చదువుకునే వాడు. కానీ ఎంత చదివినా గుర్తుండేది కాదు(నవ్వుతూ). ఆఖరి వాళ్లకు రూల్స్‌ తక్కువ ఉంటాయి. పెద్దయ్యాక నా మీద అందరికీ జాలి ఉండేది. చదువుకోడానికి ముంబయి వెళ్లాడు అనుకునే వాళ్లు.

ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించావు? ఏ సినిమా కోసం ఎక్కువ కష్టపడ్డావు?

శిరీష్: ‘ఊర్వశివో.. రాక్షసివో’ నా ఆరో సినిమా. ఒక్కక్షణం సినిమా కోసం బాగా కష్టపడ్డాను. కానీ అనుకునంత హిట్‌ అవ్వలేదు. ఈ సినిమా అంటే మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టం.

బన్నీకి, చరణ్‌కి 21 సంవత్సరాలకు కారు గిఫ్ట్‌ ఇచ్చారట? నువ్వు అడిగితే ఏదో అన్నారట? ఏమన్నారు?

శిరీష్: అప్పట్లో నాకు డబ్బు విలువ తెలిసేది కాదు. 21 ఏళ్లు రాగానే మా నాన్న దగ్గరకు వెళ్లి నాకు  కారు కావాలి. ఆ ప్రొడ్యూసర్‌ వాళ్ల అబ్బాయి దగ్గర ఉంది. మనమెందుకు కొనుక్కోకూడదు నాకు కొనాల్సిందే అని అడిగా. మా నాన్న  ‘చెప్పుతీసుకుని కొడతా’ అన్నారు. నేను ఇవ్వాలనుకున్న డబ్బులు ఇస్తా మిగతావి నువ్వు సంపాదించుకుని కొనుక్కో అన్నారు. మూడేళ్లు పట్టింది నాకు అనుకున్న కారు కొనుక్కోడానికి. మా నాన్న అనుకుంటే నేను అడిగింది ఇవ్వచ్చు. కానీ దాని విలువ తెలియాలని అలా చేశారు. అప్పట్లో ఆయన్ని తిట్టుకున్నా కానీ.. ఇప్పుడర్థమైంది అదే సరైనది అని.

ప్రతి కొడుకు వాళ్ల నాన్నను గర్వపడేలా చేయాలి అనుకుంటాడు. బన్నీ విషయంలో నాన్న సంతోషంగా ఉన్నారు. నువ్వు మీ నాన్న సంతోషం కోసం ఏమి చేయాలనుకుంటున్నావు‌.

శిరీష్: మా నాన్న ఎప్పుడు మాకు గోల్స్ పెట్టలేదు. నువ్వు ఇది చేస్తే నేను సంతోషిస్తా. అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ కచ్చితంగా ఏదో ఒకరోజు ఆయన గర్వపడేలా చేస్తా. మా అమ్మ గర్వపడాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకుంటే చాలు(నవ్వుతూ).

పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?చిన్నప్పుడు చేసిన చిలిపి పని ఏది?

శిరీష్: ఎందుకో నాకు పెళ్లి అంటే భయం. చేసుకోక తప్పదు. నేను 18 ఏళ్లు వచ్చిన దగ్గరి నుంచి ఒక్కడినే ఉన్నా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నాతోపాటు మరొకరు ఉంటారు. బాధ్యతలు ఉంటాయి.  కొత్తగా అనిపిస్తాయి. చిన్నప్పుడు నేను బాగా చిలిపి వాడిని. గర్ల్‌ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అమ్మాయిలు మనల్ని నచ్చాలంటే.. చదువైనా ఉండాలి. లేదంటే ఆటల్లో అయినా ఉండాలి. ఇవి రెండు లేకుండానే హీరోయిజం చేసి అమ్మాయిలు నా వైపు చూసేలా చేసేవాడిని. టీచర్స్‌కు ఎదురు చెప్పేవాడిని. క్లాసులకు వెళ్లేవాడిని కాదు. నేను నా జీవితంలో ఎంజాయ్‌ చేసిన డేస్‌ ఏంటంటే ముంబయిలో ఉన్న రోజులు. మా నాన్న పంపిన డబ్బుల్లో మిగుల్చుకోవాలని బస్సులో వెళ్లేవాడిని. ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఉండేవాడిని.

నీలో దర్శకుడు, రచయిత కూడా ఉన్నారని విన్నా నిజమేనా?

శిరీష్: దర్శకుడు అయితే కచ్చితంగా లేరు. సినిమా ఫీల్డ్‌లో ఉన్న ఎవరికైనా కాస్త అవగాహన ఉంటుంది కాబట్టి కథకు తగ్గ మార్పులు సూచిస్తా అంతే.

ప్రతిబంధ్‌ హిందీ సినిమాలో యాక్ట్‌ చేశావు కదా? అప్పుడు ఎందుకు భయపడ్డావట?

శిరీష్: అవును. నాకు మూడేళ్లప్పుడు చేశా ఆ సినిమా. ఓ సన్నివేశంలో మంత్రి గారు నా చేతిలో ఉన్న బొకేలో బాంబ్‌ ఉంది అని అరుస్తారు. అది విని నిజంగానే బాంబు అనుకుని పరిగెత్తా.  చైల్డ్‌ ఆర్టిస్టుగా నా మొదటి సినిమా అది. రూ.100 ఇచ్చారు. తర్వాత భానుమతి గారి సీరియల్‌లో నటించాను. అది తెలుగు, తమిళ్‌లో వచ్చింది. అలాగే చిన్నప్పుడు అమ్రిష్‌పూరీని చూసినా భయపడేవాడిని.

ఒకవేళ ఇండస్ట్రీకి రాకపోతే ఏం చేసేవాడివి?

శిరీష్: నేను జర్నలిజం చదివాను. అటువైపు వెళ్లేవాడినేమో తెలీదు.

బన్నీ.. వాళ్ల భార్య స్నేహాకు కూడా చెప్పని రహస్యాలు నీకు చెబుతారట? ఏంటవి?

శిరీష్: అందరికీ చెబితే అవి రహస్యాలు ఎందుకవుతాయి. ప్రతి మనిషికి తన మనసులో మాటలు చెప్పడానికి ఒకవ్యక్తి ఉండాలి. మా అన్నయ్యకు అలాంటి వ్యక్తిని నేను. అలాగే నేను ఎవరికీ చెప్పని విషయాలు మా అన్నయ్యకు చెబుతా. అలా ఒకరి రహస్యాలు ఒకరం కాపాడుకుంటూ వస్తున్నాం. మా వదిన గన్‌ పెట్టి అడిగితే చెప్పలేను(నవ్వులు).

డబ్యూడబ్యూఎఫ్‌ గేమ్‌కి ఎంట్రీ దొరికిందా?

శిరీష్: చిన్నప్పుడు ఆ ఆట అంటే పిచ్చి. నేను మా అన్నయ్య గోడలెక్కి దూకేవాళ్లం. ఇద్దరం రక్తం వచ్చే దాక కొట్టుకునే వాళ్లం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని