Allu aravind: ‘గీతాఆర్ట్స్’లో ‘గీత’ వెనుక కథ అదే.. అందుకే ఆ పేరు పెట్టాం: అల్లు అరవింద్
మహా నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలను అల్లు అరవింద్ ‘ఆలీతో సరదాగా’ మొదటి భాగంలో పంచుకున్నారు. రెండో భాగంలో మరికొన్ని విషయాలను చెప్పారు.
మహా నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలను అల్లు అరవింద్ ‘ఆలీతో సరదాగా’ మొదటి భాగంలో పంచుకున్నారు. రెండో భాగంలో మరికొన్ని విషయాలను చెప్పారు. వాటితో పాటు చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల గురించి అల్లు అరవింద్ చెప్పిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.
నాన్నకి కోపం వస్తుందా? మీకు పెళ్లి అయ్యాక కూడా ఆయన చేతిలో సన్మానం(దెబ్బలు తినడం) జరిగిందట నిజమేనా?
అల్లు అరవింద్: చాలా సీరియస్ మనిషి ఆయన. ఆయన హాస్యం తెర వరకే పరిమితం. ఇక సన్మానం విషయమేమిటంటే.. ఒకసారి మా అమ్మా నాన్నల మధ్య గొడవ జరిగింది. మా నాన్న అలిగి చెప్పులు కూడా వేసుకోకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. నేను కారు వేసుకొని వెళ్లి వెతికి తీసుకువచ్చా. ఇంటి దగ్గర కారు ఆపుతుంటే బ్రేక్ కొంచెం ఫాస్ట్‌గా వేశా. ఆయన నన్ను ఒక దెబ్బ కొట్టి ‘ఎవర్రా నీకు డ్రైవింగ్ నేర్పింది’ అని అరిచారు. నాకు అప్పుడు 45 ఏళ్లు ఉంటాయి. ఆయన చెంప దెబ్బ కొట్టినప్పుడు ఎవరైనా చూశారేమోనని కంగారు పడ్డా. కారుదిగి బయటకు వచ్చి చూస్తే ఎవరూ కనిపించలేదు. ‘హమ్మయ్యా’ అని ఊపిరి పీల్చుకున్నా. రాత్రికి ఇంటి వచ్చిన తర్వాత మా ఆవిడ మాట్లాడుతూ.. ‘ఎందుకండీ మావయ్యగారు మిమ్మల్ని కొట్టారు’ అని అడిగింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. మా నాన్న నన్ను కొట్టడం బాల్కనీ నుంచి చూసి, వెంటనే లోపలికి పరుగు తీసిందట (నవ్వులు) ఆ సంఘటన నా జీవితంలో ఓ తీపిగుర్తు. మా పిల్లలతో మాత్రం చాలా కలిసిపోయేవాళ్లు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు.
గీతా ఆర్ట్స్‌లో ‘గీత’ ఎవరు? ఆ పేరు వెనుక ఏదైనా కథ ఉందా?
అల్లు అరవింద్: గీతా ఆర్ట్స్ అనే పేరు పెట్టింది మా నాన్న. భగవద్గీత సారాంశం నచ్చి ఆ పేరు పెట్టారు. ‘ప్రయత్నం మాత్రమే మనది. ఫలితం మన చేతిలో ఉండదు’ ఇది సినిమాలకు బాగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యడమే కానీ, ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. అని గీతా పేరు పెట్టారు. (మధ్యలో ఆలీ అందుకుని.. పెళ్లయిన తర్వాత నిర్మలా ఆర్ట్స్ అని పెట్టవచ్చు కదా అని అడిగారు) గీత పేరు మీద తీసిన సినిమాలన్నీ సిల్వర్‌జూబ్లీ ఆడాయి. అందుకే మార్చాలన్న ఆలోచన మాకు రాలేదు. ఇంకొక విషయం ఏమిటంటే నేను చదువుకునే రోజుల్లో నాకు ‘గీత’ అనే గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. నా స్నేహితులు కూడా ఆ పేరుతో ఆటపట్టించేవారు (నవ్వులు)
దేవీ-శ్రీదేవీ సినిమా హాళ్ల దగ్గర జరిగిన గొడవ ఏంటి?
అల్లు అరవింద్: నేను కాలేజీలో క్లాసులో ఉన్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఎప్పుడూ నాతో 10 మంది ఉంటారు. ఒకసారి నాకు బస్సు కండక్టర్‌తో గొడవ అయ్యింది. డ్రైవర్‌ని, కండెక్టర్‌ని దింపేసి నేను బస్సు నడిపా. అందరినీ కాలేజీల్లో వదిలిపెట్టి బస్సు ఒకచోట ఆపేసి ఇంటికి వచ్చా. నేను వచ్చిన కాసేపటికి పోలీసులు ఇంటికి వచ్చారు. నన్ను స్టేషన్‌కు తీసుకెళ్లారు. మా నాన్న బెయిల్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చారు. అలాగే ఒకసారి దేవీ థియేటర్ దగ్గర ఓ పెద్దాయన(చాలా మంది కాల్ షీట్లు చూస్తారు) చిరంజీవి గురించి అమర్యాదగా మాట్లాడారు. నాకు కోపం వచ్చి కొట్టా. ఆయనకు 13 కుట్లు పడ్డాయి. నేను ఎవరినైనా ఇష్టపడితే అంతే వాళ్లను ఒక్కమాట అన్నా ఒప్పుకోను. చిరంజీవిని ఆయన అలా మాట్లాడేసరికి తట్టుకోలేక కొట్టాను. ఆయన్ని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకునే వాడిని కాదు.
గీతా ఆర్ట్స్‌లో నాన్న ఎన్ని సినిమాలు చేశారు. రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు?
అల్లు అరవింద్: దాదాపు అన్ని సినిమాల్లో చేశారు. ఇక రెమ్యునరేషన్ విషయానికొస్తే నాన్న దగ్గరి నుంచి చిరంజీవి, అల్లు అర్జున్ వరకు అందరికీ వాళ్లు బయట రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారో అంతే ఇస్తాను. ఇటీవల అల్లు అర్జున్‌ని కూడా ‘మీ తండ్రి బ్యానర్‌లో నటిస్తే పారితోషికం తీసుకుంటారా’ అని అడిగారట. దానికి బన్ని ‘ఎందుకు తీసుకోను. కచ్చితంగా తీసుకుంటా. ఆయనకు లాభాలు వస్తే నాకేమైనా ఇస్తారా. ఇవ్వరు కదా! అందుకే నా పారితోషికం నేను తీసుకుంటా’ అని సమాధానం ఇచ్చాడట.
ఒక సినిమా కోసం బాగా ఖర్చుపెట్టిన సందర్భాలు ఉన్నాయా?
అల్లు అరవింద్: మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చుపెట్టిన సినిమా ‘మగధీర’. సినిమా మేము అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైపోతోందని మాకు అర్థమైంది. ఒకరోజు గ్రాఫిక్స్ వర్క్ పూర్తయిన తర్వాత ఫుటేజీ చూశా. వెంటనే నా డిస్ట్రిబ్యూటర్స్‌కు ఫోన్ చేసి, ‘సినిమా మొత్తం మనమే విడుదల చేస్తున్నాం’ అని చెప్పా. వాళ్లు ఆశ్చర్యపోయారు. మేము అనుకున్న బడ్జెట్‌కు దాదాపు 80 శాతం ఖర్చు అధికమైంది. ఆ సినిమాకు నా దగ్గర ఉన్న మొత్తం డబ్బులను పెట్టాను. విడుదలయ్యాక దానికి మూడింతలు వచ్చింది. ఒక్కోసారి రిస్క్ చేసి పొగొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. ‘చూడాలని వుంది!’ సినిమా హిందీలో తీశాను. నేను, దత్తుగారు భాగస్వాములం. ఇద్దరికీ చాలా నష్టం వచ్చింది. ఆరోజుల్లో అది భరించలేనంత అమౌంట్. అయినా అది మా ఇద్దరి స్నేహంపై ఏమాత్రం ప్రభావం చూపలేదు.
పుష్ప సినిమా విజయం చూసి ఒక తండ్రిగా ఏమనిపించింది?
అల్లు అరవింద్: పుష్ప సినిమా బన్నీకి, నాకు ఇద్దరికీ ఒక మైల్‌స్టోన్ లాంటిది. నా కొడుకు నేషనల్‌స్టార్ అయ్యాడు. దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇవ్వన్నీ చూస్తే చాలా తృప్తిగా ఉంటుంది. అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ బాగా వేస్తాడు. ఒకసారి కెనడాలో ఓ యానిమేషన్ స్కూల్‌లో సీటు కోసం అప్లై చేశాడు. దాని కోసం 13 గంటలు కూర్చుని డ్రాయింగ్స్ వేసి పంపాడు. ఏదైనా పని మొదలు పెడితే అంత నిబద్ధతతో చేస్తాడు. ఆ ఏకాగ్రత పుష్ప సినిమాకు బాగా ఉపయోగపడింది. ఆ సినిమాలోని పాత్రకు మేకప్ వేసుకోవడం కోసం బన్నీకి 2 గంటలు పట్టేది. అడవిలోకి వెళ్లి షూటింగ్ చేయాలి. అక్కడకు వెళ్లాలంటే మరో 2 గంటలు పట్టేది. అంటే 4 గంటలు ముందే అల్లు అర్జున్ రెడీ అవ్వాలి. అయినా ఏ మాత్రం విసుగు లేకుండా చేస్తాడు. సినిమాలు కానీ చేసే పని ఏదైనా కానీ అంత తపనతో చేస్తాడు.
మీ బ్యానర్‌లో ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఎవరు?మీరు తీసిన అన్ని సినిమాల్లో మీకు తృప్తిని ఇచ్చిన సినిమా ఏది?
అల్లు అరవింద్: మా బ్యానర్‌లో ఎక్కువ సినిమాలు చేసింది కచ్చితంగా చిరంజీవిగారే. తీసిన అన్ని సినిమాలు దాదాపు హిట్లే. నా జీవితంలో ఒక బ్రహ్మాండమైన సినిమా తీశాను అన్న తృప్తి ‘మగధీర’ ఇచ్చింది. మా బ్యానర్‌లో బన్నీ, చరణ్ కలిసి పనిచేస్తే బాగుంటుంది. అది నా కోరిక. 10 ఏళ్ల క్రితమే దానికి ‘చరణ్-అర్జున్’ అనే పేరు కూడా పెట్టుకున్నా. ఎప్పటికైనా జరుగుతుందని నాకు ఆశ ఉంది.
మీరు మరికొందరు నిర్మాతలతో కలిసి రామాయణం తీస్తున్నారట నిజమేనా?
అల్లు అరవింద్: అవును, దాని కోసం గత నాలుగు సంవత్సరాలుగా పనులు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాటి తర్వాత ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్రయత్నం అంతా పూర్తవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ, ఆ సినిమా వస్తే అది భారతదేశంలోనే అతి పెద్ద, అతి భారీ బడ్జెట్ సినిమాగా నిలిచిపోతుంది.
అల్లు రామలింగయ్యని జైల్లో పెట్టారట నిజమేనా? ఎందుకు?
అల్లు అరవింద్: ఆయన రెండుసార్లు జైలుకు వెళ్లారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా ఒకసారి జైలుకు వెళ్లారు. కమ్యూనిస్ట్ పార్టీ తరపున మరోసారి వెళ్లారు. కానీ, జైళ్లో కూడా నాటకాలు వేసేవారు. ఆయనకు నటన అంటే అంత పిచ్చి. ఒక సందర్భంలో నాతో మాట్లాడుతూ ‘నేను చచ్చేంత వరకు నటిస్తా.. చచ్చాక కూడా నటిస్తా’ అన్నారు. అలా ఎలా అని అడిగా. అప్పుడు ఆయన నాతో ‘నేను చనిపోయాక నన్ను ఊరేగింపు చేస్తారు కదా. అది అందరూ వీడియో తీస్తారు. అందులో నేను ఉంటాను కదా’ అన్నారు.
మీ ముత్తాతగారు దానాలు చేసి అంతా పోగొట్టారట? అసలు ఎంత ఆస్తి ఉండేది అంతకు ముందు (నవ్వుతూ)?
అల్లు అరవింద్: పెద్దగా వివరాలు తెలియదు. మా తాత దగ్గరికి వచ్చేసరికి 20 ఎకరాలు ఉంది. మా నాన్నకు వచ్చిన వాటా 4 ఎకరాలు. అందులో మద్రాసులో గడపడానికి మా నాన్న అమ్మేసింది 2 ఎకరాలు. అన్నిపోనూ మిగిలింది 2 ఎకరాలు. అది మాత్రం ఇప్పటికీ పాలకొల్లులో అలానే ఉంది. మా నాన్న కోసం ఆ ఊరిలో విగ్రహం పెట్టాం. అలాగే శతజయంతి సందర్భంగా ప్రజలకు ఉపయోగపడేలా ఏమైనా చేయాలనుకుంటున్నాం. త్వరలోనే దాని వివరాలు చెబుతాం.
అల్లు రామలింగయ్య ఎవరితో ఎక్కువ స్నేహంగా ఉండేవారు?
అల్లు అరవింద్: కైకాల సత్యనారాయణ, రావుగోపాల్ రావుగారితో మా నాన్న ఎక్కువ స్నేహంగా ఉండేవాళ్లు. అప్పట్లో వర్గాలు ఉండేవి. నాన్నగారు మాత్రం రెండు వర్గాలతో సఖ్యతగా ఉండేవారు. బహుశా అలా ఉన్న వ్యక్తి నాన్న ఒక్కరే. ఇప్పటి రోజుల్లో అలా ఏమీ లేదు. వాళ్ల ఫ్యాన్స్, వీళ్ల ఫ్యాన్స్ అని ఉన్నారు. ఈ ఫ్యాన్స్ అందరికీ అర్థమవ్వాల్సింది ఏంటంటే.. వీళ్లందరూ ఫ్రెండ్స్ అని. మహేశ్, జూనియర్ ఎన్టీఆర్, చరణ్, బన్నీ వీళ్లందరూ మంచి ఫ్రెండ్స్.
చివరిసారి అల్లు రామలింగయ్య మీకేమి చెప్పారు? గుర్తుందా?
అల్లు అరవింద్: ఆయన మరో రెండురోజుల్లో కోమాలోకి వెళ్తారనగా. నన్ను సైగ చేస్తూ పిలిచారు. నేను వెళ్లిపోతున్నా అని సైగలతో చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు చనిపోయారు. అదే మా మధ్య జరిగిన చివరి సంభాషణ. మా నాన్నకు అల్లు అనే పేరు చాలా ఇష్టం. ఆయన ఒకవేళ ఇప్పుడు కనిపిస్తే అల్లు అనే పేరు కోసం నేను కష్టపడ్డాను. ఇప్పుడు మీ మనవళ్లకు ఇచ్చాను. వాళ్లు మరింత పైకి తీసుకెళ్తున్నారని చెబుతాను.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
2018 movie ott release date: ఓటీటీలో 2018 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Sports News
IPL Final: ఫైనల్ మ్యాచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. నేడూ వరుణుడు ఆటంకం కలిగిస్తాడా?
-
General News
Niranjan reddy: దశాబ్ది ఉత్సవాలు.. చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి
-
Sports News
CSK vs GT: వర్షం కారణంగా నా పదేళ్ల కుమారుడికి ధోనీని చూపించలేకపోయా!
-
General News
Koppula Eshwar: హజ్ యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు.. జూన్ 5 నుంచి చార్టర్డ్ విమానాలు: మంత్రి కొప్పుల
-
World News
Voting: ఆ గ్రామం ఘనత.. 30 సెకన్లలో ఓటింగ్ పూర్తి