Alitho saradaga: యజమానిలా ఉండాలనుకున్నా.. ఉద్యోగిలా కాదు: అల్లుఅరవింద్

ప్రేక్షకుల హృదయాల్లో హాస్య చక్రవర్తిగా చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్న మహానటుడు అల్లురామలింగయ్య ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలను అల్లు అరవింద్‌ ఆలీతో సరదాగాలో పంచుకున్నారు.

Updated : 11 Oct 2022 15:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అల్లు ఆయన ఇంటి పేరు. హాస్యానికి ఆయన మారు పేరు. ఆరు దశాబ్దాల హాస్యనట ప్రస్థానంలో సుమారు వెయ్యి చిత్రాల్లో తనదైన నటనతో మనల్ని అలరించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో హాస్య చక్రవర్తిగా చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్న మహా నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలను అల్లు అరవింద్‌ ‘ఆలీతో సరదాగా’లో పంచుకున్నారు. మరి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాల నిర్మాత చెప్పిన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

అల్లు రామలింగయ్య ఏం చదివారు. ఎన్ని సినిమాల్లో నటించారు?
అల్లు అరవింద్‌: వెయ్యి దాటిందని గుర్తుంది కానీ.. ఇక ఆ తర్వాత ఎన్ని సినిమాల్లో నటించారన్నది మాకు కూడా తెలియదు. నాన్న పదో తరగతి కూడా పూర్తి చేసి ఉండరు.

ఆయనకు హోమియోపతి నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? 
అల్లు అరవింద్‌: నాన్నకు నూరి నారాయణ అనే స్నేహితుడు ఉండేవారు. ఆయన లాయర్‌, హోమియోపతి డాక్టర్‌. నాన్న హోమియోపతి నేర్చుకోవడానికి ఆయనే స్ఫూర్తి. ఆ తర్వాత సినిమాల్లో ఒక స్థాయికి వచ్చాక కూడా.. విజయవాడ వెళ్లి హోమియోపతికి సంబంధించిన పరీక్ష రాసి పాసయ్యారు. ఆ సర్టిఫికెట్‌ తీసుకొచ్చి... ఇప్పుడు నేను రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టిషియన్‌ అని చెప్పేవారు.

మీ అమ్మ ఎలా ఉన్నారు. మీరు మొత్తం ఎంతమంది?
అల్లు అరవింద్‌: అమ్మకు 92 సంవత్సరాలు. కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. అయితే నాన్న శత జయంతి ఉత్సవాల ముందు కొంచెం కంగారు పెట్టింది. ‘ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.. అమ్మకు బాగోలేదు ఏమవుతుందో’ అని కాస్త భయపడ్డాను. కానీ అంతా సాఫీగా జరిగిపోయింది. నాన్న ఫంక్షన్‌లో అమ్మ పాల్గొన్నారు. మేము మొత్తం ఐదుగురం. మా అన్నయ్య చిన్నప్పుడే చనిపోయారు. ఇటీవలే మా అక్క లోకాన్ని విడిచారు. ప్రస్తుతం నేను, మా ఇద్దరు అక్కలు ఉన్నాం.

మీ భార్య నిర్మల ఎలా ఉన్నారు. మీకు ఒక ఆడపిల్ల పుట్టి ఉంటే బాగుండేదని ఎప్పుడూ అనిపించలేదా?
అల్లు అరవింద్‌: నిర్మల ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఏమండీ.. ఎందుకు ఇంత లేటుగా వచ్చారని ఎప్పుడూ అడగలేదు. మధ్యాహ్నం భోజనానికి ఎందుకు రాలేదనీ అడగదు. ఎక్కువ ప్రశ్నించదు, ఎక్కువ హింసించదు (నవ్వుతూ). నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. కానీ ఆ లోటు నాకు మా మేనకోడళ్లు తీర్చారు. వీళ్లతో పాటు ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. వాళ్లలో అర్హ (అల్లు అర్జున్‌ కూతురు)కి చాలా తెలివి.

మీ నాన్న మీ గురించి ఏమనుకునే వారు?
అల్లు అరవింద్‌: మా నాన్న దృష్టిలో నేను చాలా తెలివైనవాణ్ని. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడే ఆయన నన్ను ఆర్థికపరమైన సలహాలు అడిగేవారు. ఒకసారి ఉన్నట్లుండి నాన్న ఫోన్‌ చేసి చిన్నప్పదేవర్‌ (ప్రముఖ తమిళ నిర్మాత) నిన్ను చూడాలంటున్నారు. కారు పంపుతాను ఇక్కడకి రా అన్నారు. అక్కడికి వెళ్లాక తెలిసింది.. మా నాన్నగారి రెమ్యునరేషన్‌కి సంబంధించి నేను ఇచ్చిన సలహా ఆయనకు నచ్చి నన్ను చూడాలన్నారని.

మీ నాన్న చాలా కష్టపడ్డారు. ఆయన దగ్గరి నుంచి మీరేం నేర్చుకున్నారు?
అల్లు అరవింద్‌: మనకు తల్లిదండ్రుల దగ్గరి నుంచి ఆస్తిపాస్తులు వస్తుంటాయి. వాటితో పాటు నాకు మా నాన్న ఇచ్చిన బహుమతి  ఏంటంటే.. చిన్నతనంలో మిడిల్ క్లాసులో నన్ను పెంచడం. మిడిల్‌ క్లాస్‌ అనేది నేను ఒక బహుమతిగా భావిస్తా. చిన్నప్పుడు మేమందరం రెండు గదుల ఇంట్లోనే ఉండేవాళ్లం. అలా ఉంటేనే ప్రేమానురాగాలు ఉంటాయి. అందుకే ఇప్పటికీ వారానికి రెండు, మూడు సార్లు నేను మా అక్కవాళ్లని చూడకుండా ఉండలేను. అందుకే  నేను నా పిల్లలకు అలా ఉండడం బలవంతంగా నేర్పించా. వాళ్ల చిన్నప్పుడు మా ఇంట్లో కార్లు ఉన్నా వాళ్లని స్కూల్‌కు బస్సుల్లోనే పంపేవాణ్ని. 

నాన్నకి మొదటిసారి సినిమాలో అవకాశం ఇచ్చింది ఎవరు?
అల్లు అరవింద్‌: మా నాన్నకి నాటకాలంటే పిచ్చి. ఒకసారి తెనాలిలో నాటకం వేస్తుంటే ప్రేక్షకుల్లో గరికపాటి రాజారామ్‌గారు ఉన్నారు. ఆయన మా నాన్నను కలసి నేను సినిమా తీయాలనుకుంటున్నా.. అందులో పంతులు పాత్ర మీరు వేస్తారా.. అని అడిగి మా అడ్రసు తీసుకుని వెళ్లారు. కొన్ని నెలల తర్వాత మా ఇంటికి పోస్టు కార్డు వచ్చింది. ‘మద్రాసు రండి.. మీరు సినిమాలో నటించాలి’ అని దాని సారాంశం. వెంటనే మా నాన్న బయల్దేరి మద్రాసు వెళ్లారు. ఆ రోజుల్లో పాలకొల్లు నుంచి మద్రాసు వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత ఆయన అక్కడ ఎన్నో కష్టాలు పడి స్థిరపడ్డారు. ఆయన అలా కష్టపడ్డారు కాబట్టే.. ఈ రోజు ఇంత మంది ఇలా ఉన్నాం అని నాకు ఎప్పుడూ అనిపిస్తుంటుంది.

మీరెందుకు నటన వైపు వెళ్లకుండా ప్రొడక్షన్‌ వైపు వచ్చారు. జీవితంలో ఎప్పుడూ ఉద్యోగం చెయ్యలేదా?
అల్లు అరవింద్‌: ఒక సన్నివేశంలో నటించడం రాక... 10 టేకులు అయ్యాక దర్శకుడు విసుక్కున్నారని మా అమ్మతో నాన్న చెబుతుంటే విన్నాను. అప్పుడు నేను మా నాన్న కళ్లల్లో నీళ్లు చూశా. ఆ సంఘటన బలంగా గుర్తుండిపోయింది. ఆ తర్వాత చాలా రోజులకు చిరంజీవి నటించిన ‘చంటబ్బాయ్‌’లో అందరూ బలవంతపెడితే ఒక పాత్ర చేశా. ఆ పాత్ర మంచి ప్రేక్షకాదరణ పొందింది.

ఆ సినిమా విడుదల తర్వాత ‘నిర్మాతగా ఉంటే డబ్బులు వస్తాయో రావో తెలియదు. అదే నటిస్తే ఆ సమస్య ఉండదు. యాక్టర్‌ అవ్వచ్చు కదా’’ అని ఓ రోజు నాన్న నన్ను పిలిచి అడిగారు. నేను మరుసటి రోజు ఉదయం నాన్న దగ్గరకు వెళ్లి.. ‘నేను ఎప్పుడూ యజమాని అవ్వాలనుకున్నా కానీ, ఉద్యోగి కావాలని అనుకోలేదు’ అని చెప్పా. మరోసారి మా నాన్న తెలిసిన మంత్రి ద్వారా నాకు స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం ఇప్పించాలని చూశారు. అప్పట్లోనే రూ.900 జీతం. నేను మాత్రం ఉద్యోగం చెయ్యను, వ్యాపారం చేస్తానని అన్నాను.

అప్పట్లో మీ నాన్న నటుడు, మీరు నిర్మాత. ఇప్పుడు మీ అబ్బాయిలు హీరోలు, మీరు నిర్మాత... ఎలా అనిపిస్తోంది?
అల్లు అరవింద్‌: అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. అప్పట్లో నిర్మాత యజమానిలా ఉండేవాడు. ఇప్పుడు హీరోలే యజమానులు. నిర్మాతలు వాళ్ల దగ్గర ఉద్యోగుల్లా ఉంటున్నారు (నవ్వుతూ). సరదాగా చెప్పాలంటే గతంలో నిర్మాతలు హీరోలను ఎంపిక చేసుకునేవాళ్లు. ఇప్పుడు హీరోలే నిర్మాతలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ విషయం నేను మా ఇంట్లో ఏడుగురు హీరోలను పెట్టుకుని మాట్లాడుతున్నా.

మీ నాన్న బాగా పేరు వచ్చాక కూడా సైకిల్‌ మీదే వెళ్లేవారట నిజమేనా?
అల్లు అరవింద్‌: మా నాన్నకు ఒక ఇంపోర్టెడ్‌ సైకిల్‌ ఉండేది. ఆయన ఎప్పుడూ దాని పైనే వెళ్లేవారు. ఆ తర్వాత ‘మూగ మనసులు’లో ఆయన నటనకు మంచి పేరొచ్చింది. అప్పుడు ఆయన రెమ్యునరేషన్‌ రూ.2,500. అయితే ‘నువ్వు ఇలా సైకిల్‌ మీద వస్తే నీకు రెమ్యునరేషన్‌ పెరగదు’ అని ఎవరో నాన్న దగ్గర అన్నారట. దాంతో ఆ తర్వాత ట్యాక్సీలో వెళ్లడం ప్రారంభించారు. ఆయన రెమ్యునరేషన్‌ రూ.2,500 నుంచి రూ.5,000కు పెరిగింది. అది ఆ సైకిల్‌ వెనుక ఉన్న కథ.  అలా అని సైకిల్ నుంచి కారుకు మారగానే డబ్బులు పెంచుతారని నేను అనను. దానికి తగ్గ టాలెంట్‌ ఉండాలి. ఆ టాలెంట్‌కు అదృష్టం కలిసి రావాలి.

మీ నాన్న సినిమాలు చేసే రోజుల్లో రేలంగి, రమణా రెడ్డి హవా కొనసాగింది. ఆ సమయంలో అల్లు రామలింగయ్య తన ఉనికి ఎలా చాటుకున్నారు?
అల్లు అరవింద్‌: మా నాన్న ఎవరితోనూ పోటీ పెట్టుకోరు. ఎక్కడ ఉన్నా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. 1990ల్లో రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య కాంబినేషన్‌ అంటే ఒక కిక్‌ ఉండేది. ఇక మా నాన్నకు రేలంగి అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆయన్ను ఇమిటేట్‌ చేస్తూ ఉండేవారు. 

అరవింద్ ఫ్యామిలీకీ, చిరంజీవి ఫ్యామిలీకి చిన్న భేదాభిప్రాయం వచ్చింది అని టాక్‌. ఇందులో నిజమెంత?
అల్లు అరవింద్‌: సమాజంలో ఇలా అనుకోవడం సహజం. నేను, చిరంజీవి మంచి స్నేహితులం. మేము బావబావమరుదులుగా కాకుండా... మంచి స్నేహితులుగా ఉన్నాం. అలానే జీవితంలో పైకి వచ్చాం. కాలానుగుణంగా మా కుటుంబంలో సభ్యులు పెరిగారు. అందరిలోనూ పోటీతత్వం ఏర్పడింది. ఎవరి స్థానాన్ని వాళ్లు పదిలపరుచుకుంటూ పైకి ఎదుగుతున్నారు. ఇక్కడ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. వీళ్లందరూ ఒక్కటే. వీళ్లల్లో ఎవరిని ఏమన్నా అందరూ ఒక్క మాట మీద ఉంటారు. ఈ విషయం అందరికీ తెలియాలి. మేము సంక్రాంతి, దీపావళికి మా కుటుంబంతో సహా చిరంజీవి ఇంటికి వెళ్తాం. ఇవ్వన్నీ అందరికీ తెలియాలని మేము వీడియోలు తీసి పెట్టం కదా. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. 

చిరంజీవిని మొదటిసారి ఎప్పుడు, ఎక్కడ కలిశారు? చిరంజీవిని మీ ఇంటి అల్లుడిని చేసుకోవాలన్న ఆలోచన ఎవరిది?
అల్లు అరవింద్‌: ఒకసారి పనిమీద చలసాని గోపి ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఎవరో చిరంజీవిని పరిచయం చేశారు. ఆ సమయంలో ఒకరికి ఒకరం షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకున్నాం. ఆ షేక్‌హ్యాండ్‌ ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. చిరంజీవిని అల్లుడిని చేసుకోవాలన్న ఆలోచన మొదట మా అమ్మకు వచ్చింది. మా ఇంటి పైన సత్యనారాయణ అనే ఆయన ఉండేవాడు. ఒకసారి చిరంజీవి ఆయన్ని కలవడానికి మా ఇంటికి వచ్చాడు. చిరంజీవి తిరిగి వెళ్లిపోయాక మా అమ్మ సత్యనారాయణనుచిరంజీవి గురించి  వివరాలు అడిగింది. రాత్రి నాన్న ఇంటికి వచ్చాక ఆయనకు చెప్పింది. మొదట్లో నాన్న ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. ‘మన ఊరి పాండవులు’ అప్పుడు చిరంజీవితో కలిసి నాన్న 20 రోజులు పని చేశారు. అప్పుడు చిరంజీవి గురించి అన్ని తెలుసుకుని... మంచివాడు అని నిర్ధరణకు వచ్చారు. ఆ తర్వాత డీవీఎస్‌ రాజుని అడిగి నిర్ణయం తీసుకున్నారు.

కాలం వెనక్కి వెళ్తే మీరేం కోరుకుంటారు?
అల్లు అరవింద్‌: కాలం వెనక్కి వెళ్తే నాకు విజయ వాహిని సంస్థ గుర్తొస్తుంది. ఆర్టిస్టుల కమిట్‌మెంట్‌ గానీ, వాళ్ల ఫోకస్‌ గానీ అద్భుతం. ఉదయం 7 గంటలకు షాట్‌ తీయాలంటే తెల్లవారుజామున 4:30కే అంతా సిద్ధమయ్యేవాళ్లు. అలాంటివి చిన్నప్పటి నుంచి చూసిన నాకు ఇండస్ట్రీ అలా ఉంటే ఎంతో బాగుంటుందని అనిపిస్తుంది.

చిరంజీవి, అల్లుఅర్జున్, రామ్‌ చరణ్‌ల గురించి అల్లు అరవింద్‌ పంచుకొన్న మరికొన్ని విషయాలు వచ్చే వారం చూద్దాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని