Sriram: రజినీకాంత్‌ వెనకనుంచి వచ్చి కౌగిలించుకున్నారు : శ్రీరామ్‌

తెలుగు, తమిళం, మళయాళంలోనూ 50కిపైగా చిత్రాలలో హీరో, క్యారెక్టర్‌ నటుడు, విలన్‌ గా నటించి సత్తా చాటాడు.  

Updated : 16 Feb 2022 12:06 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: హీరోగానే కాదు..పాత్ర బాగుంటే అద్భుతంగా నటించగలనని తెలుగు అబ్బాయి నిరూపించాడు. తెలుగు, తమిళం, మలయాళంలోనూ 50కిపైగా చిత్రాలలో హీరో, క్యారెక్టర్‌ నటుడు, విలన్‌ గా నటించి సత్తా చాటాడు.  ఆ క్రేజీ నటుడే శ్రీరామ్‌. ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన  ఆయనతో అలీ ముచ్చటించారు.

అలీ: శ్రీకాంత్‌ ఎప్పుడు శ్రీరామ్‌గా  మారాడు..?

శ్రీరామ్‌: ‘రోజాపూలు’ నిర్మాత మార్చారు. తమిళంలోనూ అక్కడ శ్రీకాంత్‌ ఉన్నారని పేరు మార్చాలన్నారు.  శ్రీకాంత్‌ పేరును మా అమ్మమ్మ పెట్టారు. సినిమాల్లోకి రాగానే పేరు మార్చుకోక తప్పలేదు. 

చక్కని తెలుగు మాట్లాడుతున్నారు. కుటుంబ నేపథ్యం ఏమిటీ..?

శ్రీరామ్‌:మా సొంతూరు తిరుపతి. పుట్టింది చెన్నై.  పెరిగింది హైదరాబాద్‌ .. చదువు, తిరిగిన ప్రదేశాలు జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, రాజ్‌భవన్‌ రోడ్డులోనే . నాన్న ఎస్బీఐలో పనిచేశారు. నాన్నది చిత్తూరు, అమ్మ వాళ్లది కుంభకోణం.  నాకు అన్నయ్య ఉండేవాడు. అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చిన కొద్దిరోజులకే డెంగీతో చనిపోయాడు.

నీకు పెళ్లయ్యిందా..?

శ్రీరామ్‌:తెలుగు అమ్మాయినే చేసుకున్నా. ఆమె  సిట్‌ అంటే సిట్‌..స్టాండ్‌ అంటే స్టాండ్‌ నేను. మాది ప్రేమ పెళ్లి. పెద్దలకు మాత్రం వాళ్లు కుదిర్చిన పెళ్లి.  మా ఆవిడకు తెలుగు రాదు..ఇంగ్లిష్‌ మాత్రమే. అత్తమామలు తెలుగు మాట్లాడుతారు.

ఎలా ప్రేమ ప్రయాణం మొదలయ్యింది..?

శ్రీరామ్‌: ఓ రోజు నాతో పని చేసే హీరోయిన్‌ ఫోన్‌ చేసి.. మీ అభిమాని, నా స్నేహితురాలు బర్త్‌డే పార్టీ ఉంది. రావాలంది..రానని చెప్పా..మళ్లీ మరో హీరోయిన్‌ ఫోన్‌ చేసి అదే పార్టీకి రావాలని కోరితే..ఐదు నిమిషాలు మాత్రమే ఉండి వెళ్తానని చెప్పా. ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయా.  ఆ పార్టీలో నాలుగైదు గంటలు ఉండిపోయా. హీరోయిన్లు వెళ్లాలని చెప్పినా వెళ్లలేదు. చివరికి మూడేళ్ల చర్చల తర్వాత పెళ్లి అయ్యింది.

ఎంత మంది పిల్లలు..?

శ్రీరామ్‌: నా భార్య పేరు వందన. అబ్బాయి ఆహిల్‌ 12 ఏళ్లు, అమ్మాయి అహనా పదేళ్లు. 

తెలుగు ఇండస్ట్రీకి రాక ముందు చెన్నైలో మిస్టర్‌ మద్రాస్‌ అని విన్నాం..

శ్రీరామ్‌ 1996-97లో కాలేజీలో ఉన్నపుడు మోడలింగ్‌కు వెళ్లా. కాలేజీ పోటీల్లో గెలిచా.  ఒక షోకు రూ.5 వేలు ఇచ్చారు.

తొలి సినిమా ఛాన్సు ఎలా వచ్చింది..?

శ్రీరామ్‌: మోడలింగ్‌ చేసే సమయంలో ఖదీర్‌ గారు చూశారు.. కాదల్‌వైరస్‌లో ఛాన్సు ఇచ్చారు.  భూమిక హీరోయిన్‌. చివరికి ఇద్దరం ఆ సినిమా చేయలేదు. ఏడాది శిక్షణ తర్వాత గడ్డం, మీసాలు లేవని వద్దన్నారు.  చేతిలో హల్వా పెట్టి వెళ్లమన్నారు. బాగా ఏడ్చా. రెండేళ్లకు రోజాకూటం(రోజాపూలు) చేశా. తెలుగులో ఒకరికొకరు తొలి సినిమా.

సినిమాటోగ్రాఫర్‌ రసూల్‌తో ఎలా పరిచయం..?

శ్రీరామ్‌: పెద్దబాబుతో పరిచయం. రసూల్‌ పెద్ద పెద్ద కండలతో ఉండేవారు. చాలా మంచి స్నేహితుడు. హీరోయిన్‌ హీరోకు పడిపోతుందా..? రసూల్‌కు పడిపోతుందా అనే అనుమానం ఉండేది. హీరోలా ఉంటారు. ఆస్కార్‌ ఫిల్మ్‌ చేస్తున్నపుడు అగ్ని ప్రమాదంలో గాయపడ్డా. ఆరు నెలలు అయ్యింది. రెండేళ్ల దాకా కోలుకోలేవన్నారు. అప్పుడు రసూల్‌ వచ్చి లేచి రా..ఏం కాదులే..నీవు లేకపోతే సినిమా చేయనన్నారు. ఈ ప్రోత్సాహంతోనే తొందరగా కోలుకున్నా.

ఆనంది ఆర్ట్స్‌ వాళ్లతో చుట్టరికం ఉందా..?

శ్రీరామ్‌: లేదు సార్‌. మూడు సినిమాలు చేయడంతో అనుబంధం పెరిగి పోయింది.  రెండు తమిళంలో, ఒకటి తెలుగులో చేశా. వారికి నేనంటే చాలా ఇష్టం. 

అగ్ని ప్రమాదం ఎలా జరిగింది..?

శ్రీరామ్‌: డ్యాం దగ్గర సాంగ్‌ తీస్తున్నారు. చివరి రోజది. ఒకవైపు మంటలు మూడు వైపులా నీళ్లు. దాదాపుగా 30 అడుగుల లోతులో ఉంటాయి.  న్యూఫేస్‌ అవార్డు చెన్నైలో తీసుకోవాలి. అందు కోసం వెళ్లాల్సింది.. చివరి షూట్‌లో మంటల్లో పడ్డా.  ప్రత్యామ్నాయం లేదు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నిచ్చెన వేసి రక్షించారు. దుస్తులతో  చర్మం ఊడి వచ్చింది. చెవులు, పెదవులు, జుట్టు కాలిపోయాయి. ఆసుపత్రిలో అచేతనంగా పడిపోయి ఉన్నా. నాన్నకు వీఆర్‌ఎస్‌ ఇప్పించా. బ్యాంకు బ్యాలెన్సు లేదు. ఆస్తులు లేవు.  జీవితం ఎలా అనే ప్రశ్న వేధించసాగింది.

మీ మీద కొన్ని ఫిర్యాదులున్నాయి.  ఏంటో తెలుసుకుంటారా..?

శ్రీరామ్‌: రసూల్‌ గారు చేసిన ఫిర్యాదు బాగా నచ్చింది. బాగా పని చేస్తారనే కాదు..మళ్లీ సినిమా చేయాలని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలా మంచి విమర్శకుడు.

అన్నయ్య తప్పులకు నీకు శిక్ష పడేదట..?

శ్రీరామ్‌: అవున్సార్‌.. అన్నయ్య సిగరెట్‌ తాగుతున్నాడని నాన్నకు చెబితే.. నువ్వు చదవకపోగా అన్నపై ఫిర్యాదు చేస్తావా అంటూ బాదాడు.. పరీక్షలకు ముందు సినిమాకు వెళ్తున్నాడని చెప్పినా నాకే శిక్ష.  అన్నయ్య బాగా చదివేవాడు.. నేను ఆటలతో ఎంజాయ్‌ చేశా. ఓసారి అన్నయ్య ఫ్రెండ్‌ ప్రేమించిన అమ్మాయికి లవ్‌లెటర్‌ ఇవ్వమన్నాడు..అందులో అతని పేరు రాయలేదు. నా పేరు రాసి ఇచ్చా. ప్రిన్సిపల్‌కు  ఫిర్యాదు.. ఆ తర్వాత రచ్చ అయ్యింది.

భీమవరం నుంచి ఓ అమ్మాయి ఫోన్‌ చేసింది.. గాజులు వేయరాకపోతే రూ.10 ఇచ్చి నేర్చుకున్నావట..?

శ్రీరామ్‌: చిన్న వయస్సులో ఏది లవ్వో తెలియదు.  క్రష్‌. తిరుపతిలో బాబాయ్‌కి కొట్టు ఉంది. ప్రతిరోజు అమ్మాయిలు వచ్చేవారు. పనబ్బాయికి రూ.10 ఇచ్చి పంపించా..అమ్మాయికి డబ్బులు తీసుకోకుండానే గాజులు వేశా. బాబాయ్‌ అడిగితే దొరికిపోయా.

హైస్కూల్‌లోనే ఇంటర్‌ అమ్మాయితో లవ్‌ ఏంటీ..?

శ్రీరామ్‌: ఏమో తెలియదు సార్‌. నచ్చింది.  అమ్మాయి నవ్వింది..నేను నవ్వా,, అంతా అల్లరి.

ఎంతమందితో ప్రేమలో పడ్డారు..?

శ్రీరామ్‌: లవ్‌ను విస్తరించాలనుకున్నా. ఎంతమంది ఉన్నారో ఎంచకూడదు సార్‌.  వయస్సు తగ్గిపోతుంది.  శ్వాసించే గాలికంటే ఎక్కువగా ఉండేది ప్రేమే.

హీరోగా చేస్తూ సపోర్టింగ్‌ అర్టిస్టుగా మారిపోయారు. కారణం ఏంటీ..?

శ్రీరామ్‌: ఏమీలేదు. తెలుగు సినిమాలంటే ఇష్టం. ఎవరడిగినా చేశా. చిన్నదా, పెద్ద పాత్ర చూసుకోలేదు. బ్లైండ్‌గా అంగీకరించా. కొన్నిసార్లు మోస పోయా. 

తమిళంలో సీనియర్‌ మోస్ట్‌ మహిళ చాలా మంది దర్శకులకి  మిమ్మల్ని ప్రతిపాదించారట.. ఎవరావిడ.?

శ్రీరామ్‌: నా మంచి మిత్రుడు రవిసిద్దార్థ్‌ వాళ్ల అమ్మ సత్యప్రియ.  అందరికి పరిచయమున్న నటి. ఇంటర్‌ తర్వాత చాలా మందికి పరిచయం చేసింది.  బాలచందర్‌, సురేష్‌కృష్ణలకు చెప్పారు.  బాలచందర్‌  సర్‌ కొన్ని సీరియళ్లలో నటించిన తర్వాత సినిమాలు చేద్దామన్నారు. కొన్ని ఎపిసోడ్లు చేసిన తర్వాత అమెరికా వెళ్తా. వదిలేయాలని కోరా..అవసరమైతే నా పాత్రకు దండేయాలని సూచించా. తిట్టి పంపించారు.

మణిరత్నం నీ విషయంలో బాధ పడ్డారట..?

శ్రీరామ్‌: వాస్తవానికి నేనే బాధ పడ్డా.  ఆయన సినిమా కోల్పోయాను.  ప్రమాదం జరిగినపుడు మణిగారు ఆరు నెలలు ఆగారు. వేరే నిర్మాత దగ్గర అడ్వాన్సు తీసుకోవడంతో లీగల్‌ యాక్షన్‌కు వెళ్తాననడంతో మణి సినిమా చేయలేదు. 

ఎన్ని సినిమాలు చేశారు..?

శ్రీరామ్‌: తమిళంలో 30కిపైగా, తెలుగులో 10, మలయాళంలో ఆరు సినిమాలు చేశా. తమిళంలో ఈ ఏడాది 9 సినిమాలు చేయబోతున్నా.  తెలుగులో టెన్త్‌క్లాస్‌ డైరీస్‌ రాబోతుంది. 

ఒకరికొకరులో సుబ్బలక్ష్మి పేరు ఎన్నిసార్లు వస్తుంది.. వెంటనే చెప్పాలి..?

శ్రీరామ్‌: ఇలా అడిగితే కష్టం సార్‌. సుబ్బలక్ష్మి పేర్ల ముందు ఇంటిపేర్లు వస్తాయి..వాటిని గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం.  పాట మొత్తంలో 33సార్లు వచ్చిందని చెబుతున్నారు కదా నిజమేనా..

ఐస్‌క్రీం బాగుంటుందా..? ఇద్దరు తమిళ హీరోలతో కలిసి ఐస్‌క్రీం దొంగతనం చేశారట..?

శ్రీరామ్‌: స్నేహితుడు సినిమా చేస్తున్నపుడు జరిగింది...జీవా, నేను, విజయ్‌ బయటకు వెళ్లేటప్పుడు సత్యంను కూడా రమ్మన్నాం..కడుపులో నొప్పి రానన్నాడు..ఇంతలో మూడుఐస్‌క్రీమ్‌ల బాక్సు ఆయన రూంలోకి వెళ్తోంది.. దాన్ని దాచేశాం.. మళ్లీ బాయ్ తెచ్చాడు.. దాన్ని మేమే తీసుకెళ్లి సత్యం రూం ముందు నిలబడ్డాం.. తలుపు తీయగానే ముఖంపై కొట్టాం.

ఒకరికొకరు సినిమాలో ముందు కత్రినాకైఫ్‌ అనుకున్నారట..ఎందుకు మారిపోయింది..?

శ్రీరామ్‌: ముందు కత్రినాకైఫ్‌ అన్నారు..ఎంతో ఉత్సాహంతో షూటింగ్‌కు వెళితే అక్కడ ఆర్తిఛాబ్రియా ఉంది.

రామోజీ ఫిల్మ్‌సిటీలో నిన్ను వెనకనుంచి కౌగిలించుకున్నారట ఎవరా హీరో..?

శ్రీరామ్‌: వన్‌అండ్‌ఓన్లీ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌. నాన్నతో కలిసి వెళ్లా. శివాజీ  పాట చిత్రీకరణ జరుగుతోంది. అద్భుతమైన సెట్టింగ్‌. కళ్లు చెదిరిపోతున్నాయి. శ్రియ అందంగా ఉంది. రజినీ సర్‌ను చూడాలని ఎదురు చూస్తుండగానే వెనకనుంచి వచ్చి వాటేసుకున్నారు.  శ్రీరామ్‌ ఎలా ఉన్నావ్‌..థాంక్యు ఫర్‌ కమింగ్‌ అన్నారు.. మిమ్మల్ని కలువడం నా అదృష్టం అన్నా.

ప్రస్తుతం ఏం చేస్తున్నారు..?

శ్రీరామ్‌: తెలుగులో ఒకటి, తమిళంలో నాలుగైదు చేస్తున్నా

ఇష్టమైన ప్రదేశం:హైదరాబాద్‌
నటుడు: కమల్‌హాసన్
దర్శకుడు: శంకర్‌
మంచి మిత్రుడు:రసూల్‌
తొలి సినిమా: తమిళంలో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని