Malavika: గొడవపడుతూనే రొమాంటిక్‌ సాంగ్‌ చేశాం: మాళవిక

‘చాలా బాగుంది’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన నటి మాళవిక. తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి, గ్లామర్‌ రోల్స్‌లో మెరిశారు. మత్తెక్కించే తన అందంతో ఎందరో కుర్రాళ్ల మతులు పోగొట్టిన ఈ అందాల తార ఆలీ వ్యాఖ్యతగా ఈటీవీలో

Updated : 09 Feb 2022 11:50 IST

‘చాలా బాగుంది’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన నటి మాళవిక. తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి, గ్లామర్‌ రోల్స్‌లోనూ మెరిశారు. మత్తెక్కించే తన అందంతో ఎందరో కుర్రాళ్ల మతులు పోగొట్టిన ఈ అందాల తార.. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి తాజాగా వచ్చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె చెప్పిన సరదా ముచ్చట్లు.. మీకోసం

శ్వేతా కొన్నూర్‌ మీనన్‌కు మాళవిక అని పేరు ఎవరు పెట్టారు?

మాళవిక: దర్శకుడు సుందర్‌. సి గారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘ఉన్నై తేడి’తో నటిగా మారాను. తెలుగు ప్రేక్షకులకు ‘చాలా బాగుంది’ చిత్రంతో పరిచయమయ్యా. మొత్తంగా తెలుగులో 5 సినిమాలు, తమిళంలో 35 సినిమాల్లో నటించాను. తెలుగులో మంచి ఆఫర్లు రాలేదు. అందుకే తమిళంపై దృష్టి పెట్టాను. ప్రస్తుతం నేను ముంబయిలో స్థిరపడి, గృహిణిగా జీవితం గడుపుతున్నా. నా భర్త సుమేశ్‌ ఆర్కిటెక్ట్‌. నాకు ఇద్దరు పిల్లలున్నారు. 

ఆర్కిటెక్ట్‌ అవ్వాల్సిన మీరు.. యాక్టర్‌ ఎలా అయ్యారు?

మాళవిక: ఆర్కిటెక్చర్‌ చదువుకోవడం కోసం పుణెలో ఓ కాలేజీలో చేరా. అక్కడికి ఓ మోడలింగ్‌ కో-ఆర్డినేటర్‌ వచ్చి.. రెక్సోనా సబ్బు ప్రకటన కోసం ఆడిషన్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ ఆడిషన్‌ కోసం ముంబయి వెళ్లా. కానీ, కెమెరా ముందు నటించడానికి చాలా ఇబ్బంది పడ్డా. దీంతో ఆ ప్రకటనకు ఎంపిక కాలేదు. కానీ, నటనపై ఆసక్తి పెరిగింది. అందుకే, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్స్‌తో ఫొటోలు తీయించుకున్నా. ఆ తర్వాత ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ ప్రకటన, వెంటనే ఒక చిత్రంలో నటించే అవకాశాలు వచ్చాయి. నా తొలి చిత్రం పూర్తయిన తర్వాత మళ్లీ చదువుకోవడానికి కాలేజీకి వెళ్లాలనుకున్నా. కానీ, ‘ఉన్నై తేడి’ పెద్ద హిట్‌ కావడంతో వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. అప్పుడు నా వయసు 19 ఏళ్లే. ఇంత చిన్న వయసులో ఏ రంగంలోనూ అంత పాపులారిటీ రాదు కదా అనిపించింది. దీంతో సినిమాలవైపే మొగ్గు చూపాను. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం కలిపి 45 చిత్రాల్లో నటించా.

సినిమాలో అవకాశం వచ్చినప్పుడు మీ ఇంట్లోవాళ్ల స్పందనేంటి?

మాళవిక: సినిమా అవకాశం రాగానే ఇంటికి ఫోన్‌ చేశా. మొదట అమ్మ మాట్లాడారు. ‘‘సినిమాల్లో నటిస్తే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? బంధువులు ఏమనుకుంటారు?’’అని తిట్టి ఫోన్‌ పెట్టేశారు. మళ్లీ ఫోన్‌ చేస్తే నాన్న మాట్లాడారు. ‘‘నేను డాక్టర్‌ అవ్వాలనుకున్నాను.. కానీ, కుదర్లేదు. దీంతో ఆర్మీ అధికారినయ్యా. నువ్వు నటి అవ్వాలని రాసిపెట్టి ఉందేమో.. ఒక చిత్రం చేసి చూడు’’అని చెప్పారు. 

‘చాలా బాగుంది’ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణతో పనిచేయడం ఎలా అనిపించింది?

మాళవిక: ఆ చిత్రంలో ‘రేప్‌’ సీన్‌ తప్పిస్తే అంతా బాగుంది. ఆ సీన్‌లో చాలా ఇబ్బంది పడ్డా. కానీ, అందులో నాకు విభిన్న కోణాలున్న మంచి పాత్ర ఇచ్చారు. నెగటివ్‌ పాత్రే అయినా పెద్ద పెద్ద డైలాగున్నాయి. అప్పుడు నాకు తెలుగు తెలియకున్నా షూటింగ్‌లో చాలా ఎంజాయ్‌ చేశాను. 

కాలేజీ రోజుల్లో మీరు క్లాస్‌రూముల్లో కన్నా క్యాంటీన్‌లో ఎక్కువగా ఉండేవారట?

మాళవిక: కాలేజ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభయ్యేది. ఉదయమే లేచి వెళ్లడం కష్టంగా ఉండేది. అందుకే, ఉదయం 10 గంటలకు వెళ్లేదాన్ని. ఒక క్లాస్‌ విని.. క్యాంటీన్‌కి వెళ్లి.. బన్‌, సమోసా తినేదాన్ని. చిన్న వయసులో నటిగా బిజీ కావడంతో కాలేజీకి వెళ్లకుండా నేరుగా పరీక్షలు రాశా.

తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి కారణమేంటి? ఈ ఇండస్ట్రీ నచ్చలేదా?

మాళవిక: తెలుగు సినీ పరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నటులకు గౌరవం ఇస్తారు. కానీ, అర్థవంతమైన పాత్రలు రాలేదు. ‘చాలా బాగుంది’లో నటనకు మంచి ప్రాధాన్యమున్న పాత్ర. ఆ తర్వాత అన్నీ గ్లామర్‌ పాత్రలు వచ్చాయి. అందుకే ఒప్పుకోలేదు. ఇప్పుడైనా మంచి పాత్రలు వస్తే కచ్చితంగా నటిస్తాను. 

‘యాక్టింగ్‌ కెరీర్‌ను తొందరగా వదిలేశానే..’ అని ఎప్పుడైనా బాధపడ్డారా?

మాళవిక: లేదు. ఎందుకంటే నేను 1998 నుంచి 2008 వరకు పదేళ్లపాటు నటిస్తూనే వచ్చా. 2008లో నేను గర్భవతిని కావడంతో సినిమాలు మానేశా.

కెరీర్‌ ప్రారంభంలో మిమ్మల్ని సన్నీ డియోల్‌ ఆఫ్‌ సౌత్‌ అనేవాళ్లట కదా.. ఎందుకు?

మాళవిక: అప్పుడు నాకు డ్యాన్స్‌ అస్సలు రాదు. దీంతో సన్నీ డియోల్‌లాగా డ్యాన్స్‌ చేస్తున్నానని అలా పిలిచేవారు. 

తెలుగు హీరోల్లో ఎవరంటే ఇష్టం?

మాళవిక: విజయ్‌ దేవరకొండ. అప్పట్లో నాగార్జున. దర్శకుల్లో ముత్యాల సుబ్బయ్య, రాఘవేంద్ర రావు గారంటే ఇష్టం. తమిళంలో మణిరత్నం, శంకర్‌ గారు ఇష్టం. 

రామోజీరావు గారి ఉషా కిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ‘దీవించండి’లో నటించారు కదా? ఎప్పుడైనా ఆయన్ను కలిశారా?

మాళవిక: ఆయన్ను కలవలేదు. కానీ, ‘దీవించండి’ చిత్రంలో శ్రీకాంత్‌తో రెండోసారి కలిసి నటించా. అయితే, తొలి చిత్రం ‘చాలా బాగుంది’లోనే ఓ పాట సమయంలో మా ఇద్దరికి గొడవైంది. ఫొటోగ్రాఫర్‌ వచ్చి స్టిల్స్‌ కోసం పోజు ఇవ్వమని చెప్పారు. అది నాకు కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పా. దీంతో శ్రీకాంత్‌ గారికి కోపమొచ్చి వెళ్లిపోయారు. షూటింగ్‌ జరిగిన మూడు రోజులూ గొడవపడుతూనే రొమాంటిక్‌ పాటలో డ్యాన్స్‌ చేశాం.

మీ వీరాభిమాని ఒకరు మీకు లేఖ రాస్తూ పెళ్లి ప్రపోజల్‌ పెట్టాడట..?

మాళవిక: చెన్నైకి చెందిన ఓ వ్యక్తి.. ‘మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే వచ్చి కలుస్తాను’ అని లేఖ రాశాడు.  ఇప్పటికీ ప్రతి రోజూ ఇన్‌స్టాలో ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అంటూ మెస్సేజ్‌లు వస్తాయి. 

‘చంద్రముఖి’లో రజనీ కాంత్‌తో నటిస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డారట..ఎందుకు?

మాళవిక: అప్పుడు చాలా భయంగా ఉండేది. ఆయన నా కళ్లలో చూసేవారు. దాంతో నేను డైలాగ్‌ మర్చిపోయేదాన్ని. ‘సర్‌.. ప్లీజ్‌ నా కళ్లలోకి చూడకండి’ అని చెప్పి డైలాగు పూర్తి చేశా. ఆ తర్వాత రజనీకాంత్‌ గారి పక్కన కూర్చొని ‘మీరు సిగరెట్‌ తాగడం, గ్లాసెస్‌ పెట్టుకోవడం చాలా స్టైల్‌గా ఉంటుంది. ఆ ట్రిక్స్‌ మీకు ఎవరు చెప్పారు’’అని అడిగా. దానికి ఆయన ‘‘నేను అంత అందంగా ఏమీ ఉండను. అందుకే, ప్రేక్షకులు మూడు గంటలపాటు నన్ను చూడటం కోసం ఇలాంటి ట్రిక్స్‌ చేస్తుంటా’’అని చెప్పారు. ఆయన ఎంత పెద్ద స్టార్‌ అయినా చాలా ఒదిగి ఉంటారు. ఆయనతో కలిసి నటించడం గర్వంగా అనిపిస్తుంటుంది. 

మీ కెరీర్‌లో ‘ఈ సినిమా ఎందుకు చేశాను రా’ అని బాధపడ్డ సందర్భం ఉందా?

మాళవిక: హిందీలో వచ్చిన ‘సీ యూ అట్‌ 9’ చిత్రంలో నటించినందుకు బాధపడుతుంటా. అందులో చాలా ఎక్స్‌పోజింగ్‌, ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. అది చూసి మా తల్లిదండ్రులు కోప్పడ్డారు. 

‘ఉన్నై తేడి’లో నటిస్తున్నప్పుడు మీపై అజిత్‌ కోప్పడ్డారట ఎందుకు?

మాళవిక: న్యూజిలాండ్‌లో పాట షూటింగ్‌ చేస్తున్నాం. నాకేమో డ్యాన్స్‌ తెలియదు. మూమెంట్స్‌ సరిగా రాకపోవడంతో అజిత్‌ గారు ఆగ్రహించారు. దీంతో నేను ఏడ్వటం మొదలుపెట్టా. ఆ తర్వాత ఎలాగో అలా పాట పూర్తి చేశాం.

మీది ప్రేమ వివాహామా? పెద్దలు కుదిర్చిందా?

మాళవిక: ప్రేమ వివాహం. కెన్‌ ఘోష్‌ అనే దర్శకుడి ద్వారా సుమేశ్‌ పరిచమయ్యాడు. నెల రోజుల తర్వాత నాకు ప్రపోజ్‌ చేశాడు. తాగేసి చెప్పాడునుకున్నా. మరుసటి రోజు ప్రపోజ్‌ గురించి అడిగితే.. ఏడాది ఆగమన్నాడు. ఏడాది తర్వాత ‘పెళ్లి చేసుకుంటావా’అని అడిగితే ఆసక్తి చూపలేదు. దీంతో ‘సమాధానం ఇవ్వకపోతే మా ఇంట్లో వాళ్లని నాకు సంబంధాలు చూడమని చెబుతా’నన్నాను. దీంతో పెళ్లికి ఒప్పుకున్నాడు.

ఇండస్ట్రీలో మీ స్నేహితులెవరు?

మాళవిక: సంగీత, మీనా, ఖుష్బూ, జ్యోతిక. 

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఎలాంటి పాత్రలు కోరుకుంటున్నారు?

మాళవిక: హీరోయిన్‌ పాత్రలయితే రావు. తల్లి పాత్రల్లో నటించను. కానీ, కీలక పాత్రలు వస్తే చేస్తాను.

రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, అజిత్‌, విజయ్‌తో కలిసి నటించారు. ఆకస్మాత్తుగా నటనకు దూరం అయ్యారు. ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా?

మాళవిక: విజయ్‌తో ‘కురువి’ నా చివరి చిత్రం. అందులో విజయ్‌తో డ్యాన్స్‌ చేయాల్సి ఉంది. కానీ, నేను అప్పుడు మూడు నెలల గర్భవతిని. దీంతో ఆయనతో డ్యాన్స్‌ చేసే అవకాశం కోల్పోయా. పెళ్లి తర్వాత నాలుగు సినిమాలకు సంతకాలు చేశా. గర్భందాల్చడంతో తీసుకున్న అడ్వాన్సులు తిరిగిచ్చేశా.

హీరోయిన్‌గా చేస్తూనే స్పెషల్‌ సాంగ్స్‌ చేశారు. అది మీ కెరీర్‌పై ప్రభావం చూపుతుందని భావించారా?

మాళవిక: కొన్నిసార్లు అనిపించింది. ఇలాంటి ఐటెం సాంగ్స్‌ వల్లే గ్లామర్‌ పాత్రలు తప్ప సీరియస్‌ పాత్రలు రాలేదని అనుకుంటున్నా. తమిళంలో అన్నీ గ్లామర్‌ పాత్రలే వచ్చాయి. కానీ, తెలుగులో మంచి పాత్రలు పోషించా.

చదువుకునే రోజుల్లో అబ్బాయిలు వెంటపడ్డారా?

మాళవిక: స్కూల్‌, కాలేజ్‌లో నేను చాలా పాపులర్‌. అబ్బాయిలందరూ నా వెంటపడేవారు. 

రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ ఇలా స్టార్ నటులతో కలిసి పనిచేశారు. వారి నుంచి ఏం నేర్చుకున్నారు?

మాళవిక: కమల్‌ హాసన్‌గారితో నేను ఒక్క రోజు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నా. ఆయనతో ఎక్కువ మాట్లాడే అవకాశం రాలేదు. కమల్‌హాసన్‌ అంటే ఆల్‌ ఇన్‌ వన్‌. రజనీకాంత్‌ గారితో చాలా రోజులు షూటింగ్‌లో పాల్గొన్నా. ఎంత పెద్ద స్టార్‌ అయినా నిజాయితీగా, నిరాడంబరంగా, ఒదిగి ఉంటారు. అది చాలా నచ్చుతుంది. అజిత్‌ ఎప్పుడూ మేకప్‌తో ఉండరు. వెన్నునొప్పితో ఉన్నా బైక్‌ రైడింగ్‌ ఆపరు. విజయ్‌ చాలా సైలెంట్‌గా ఉంటారు.

చెన్నై, హైదరాబాద్‌, ముంబై.. ఏ లైఫ్ బాగుంది?

మాళవిక: ముంబయి. ఎందుకంటే ఆ నగరం ఎప్పుడూ నిద్రపోదు. ఎవరినైనా రాత్రి 8.30కి డిన్నర్‌కి ఆహ్వానిస్తే.. 10 గంటల తర్వాతే వస్తారు. దక్షిణాది చిత్రాల్లో నటించే సమయానికే ముంబయిలో స్థిరపడ్డా.

ఏ భాష అంటే ఎక్కువ ఇష్టం?

మాళవిక: హిందీ అంటే ఇష్టం. తెలుగు సినిమాలూ చూస్తుంటా. తాజాగా ‘పుష్ప’ చూశా. 

అందులో ‘ఊ అంటవా’ పాట ఆఫర్‌ మీకు వచ్చి ఉంటే చేసేవారా?

మాళవిక: తప్పకుండా చేసేదాన్ని. 

365 రోజులు 24/7 యోగా చేయమన్నా చేస్తారట?

మాళవిక: నాకు యోగా అంటే చాలా ఇష్టం. 2007 నుంచి యోగా చేస్తున్నా. ఈ మధ్య కష్టతరమైన యోగాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం.

వీరి గురించి ఒక్క మాటలో చెప్పండి..

ఈవీవీ సత్యనారాయణ - స్పెషల్‌
ముత్యాల సుబ్బయ్య - క్యూట్‌ టెడ్డీబేర్‌
రజనీకాంత్‌ - హంబుల్‌
శ్రీకాంత్‌ - ఫ్రెండ్‌
యోగా - లవ్‌
ముంబయి - యాక్షన్‌
ఫ్యామిలీ - మై హార్ట్‌
అజిత్‌ - మై ఫేవరెట్‌
రాజేంద్ర ప్రసాద్‌ - సమాధానం చెప్పదల్చుకోలేదు.
సుందర్‌.సి - నా తొలి చిత్ర దర్శకుడు
ఎస్‌.జే. సూర్య - ఓకే..
విజయ్‌ - సైలెంట్‌
కమల్‌ హాసన్‌ - ఇంటెలిజెన్స్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని