రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర దొరికినా చాలు

‘ప్రేమికులు’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టి, ‘రణం’తో అద్భుతమైన విజయం అందుకుంది కామ్నా జెఠ్మలానీ. ఓరుగల్లుకే పిల్లా..పాటతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత దగ్గరింది. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆమె పంచుకున్న విషయాలు మీకోసం. 

Updated : 22 Aug 2022 16:05 IST

అందానికి ప్రతిభ తోడైతే చాలు.. ఏ క్లాస్‌ సెంటర్లలోనైనా ఆడియన్స్‌తో ఈలలు వేయించవచ్చని నిరూపించింది ఈ బ్యూటీ. ‘ప్రేమికులు’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టి, ‘రణం’తో అద్భుతమైన విజయం అందుకుంది కామ్నా జెఠ్మలానీ. ఓరుగల్లుకే పిల్లా.. పాటతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆమె పంచుకున్న విషయాలు మీకోసం. .

వెల్‌కమ్‌ టు ఆలీతో సరదాగా డింకీ

కామ్నా జెఠ్మలానీ: థాంక్యూ సో మచ్‌ సర్‌

నీ పేరు డింకీ నుంచి కామ్నాగా ఎలా మారింది?

కామ్నా జెఠ్మలానీ: డింకీ నా ముద్దుపేరు.  చిన్నప్పటి నుంచి మా అమ్మ ఆ పేరుతోనే పిలిచేది. కామ్నా జెఠ్మలానీ స్ర్కీన్‌ నేమ్‌‌. 

ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు?

కామ్నా జెఠ్మలానీ:  పరిశ్రమలోకి అడుగు పెట్టకముందు కాలేజీకి వెళ్లే సాధారణ అమ్మాయినే. మాది వ్యాపార నేపథ్యమున్న సంప్రదాయ కుటుంబం. 21 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవాలని మా తాతగారి నియమం. అలాంటి కట్టుబాట్లున్న ఫ్యామిలీ నుంచి వచ్చాను. 

రామ్‌ జెఠ్మలానీ మీ బంధువా? 

కామ్నా జెఠ్మలానీ: అవునండీ. రామ్‌ జెఠ్మలానీగారు మా తాతకి పెద్దన్నయ్య. 

జెఠ్మలానీ కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్‌వి కదా?

కామ్నా జెఠ్మలానీ: మా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నేనే.  సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లో వాళ్లు ముందు ఒప్పుకోలేదు. ఇలాగైతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారని అని అడిగేవారు. ఆ సమయంలో మా అమ్మ నన్ను ప్రోత్సహించారు. మనసుకు నచ్చింది చేయమని అండగా నిలబడ్డారు.

మనం మొదట కలుసుకుంది ఎక్కడో తెలుసా?

కామ్నా జెఠ్మలానీ: అయ్యో.. గుర్తుకు రావట్లేదు సర్‌. ‘రణం’ సినిమాలో కలిసి చేశాం.  

రణం మూవీలో ‘నమ్మొద్దు..నమ్మొద్దు’ పాట చేస్తున్నప్పుడు మొదటిసారి కలిశాం.  మీ అమ్మ గారు కూడా పక్కనే ఉన్నారు. మీరు సినిమాలు చేయొచ్చు కదా? అని ఆవిడను అడిగాను.

కామ్నా జెఠ్మలానీ: కొన్నాళ్లు నాకిది పెద్ద సమస్యగా మారింది(నవ్వులు). హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు ఎక్కడికెళ్లినా..ఇలాగే అనేవారు. ‘కామ్నా నువ్వు కూర్చో..అమ్మగారు నటిస్తారని’ చెప్పేవారు. అమ్మ అంత అందంగా ఉండేది. ఇప్పుడూ అలాగే ఉంది.  

మీది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిందా?

కామ్నా జెఠ్మలానీ: పెద్దలు కుదిర్చిందే. ఆయన బిజినెస్‌మ్యాన్.

మీ ఆయన సరదాగా ఉంటారా? సీరియస్‌గా ఉంటారా?

కామ్నా జెఠ్మలానీ: నేను ఎలా ఉంటానో తెలుసుగా..

నువ్వు బాగా అల్లరిచేసేదానివి. అసిస్టెంగ్ డైరెక్టర్లను  ఆటపట్టించే విషయం నాకు తెలుసు.

కామ్నా జెఠ్మలానీ: నేను అందరితో ఫ్రీగానే ఉంటాను. సెక్యూరిటీ, అసిస్టెంట్‌లతో కూడా సరదాగా మాట్లాడతాను. మా ఆయన అలా కాదు. నాకు పూర్తిగా వ్యతిరేకం. సీరియస్‌గా ఉంటారు. ఎక్కువగా మాట్లాడరు. ఆయన దృష్టి అంతా బిజినెస్‌ మీదే ఉంటుంది.

పెళ్లయ్యాక కెరీర్‌కి కామా పెట్టావా? ఫుల్‌స్టాప్‌ పెట్టావా?

కామ్నా జెఠ్మలానీ: నేను చాలా కష్టపడి  ఈ స్థాయికి వచ్చాను. బ్యాక్‌గ్రౌండ్‌ ఆర్టిస్ట్‌, మోడలింగ్‌‌ అఖరికి డ్యాన్సర్‌గా కూడా చేశాను. దేన్నయినా ఆపేస్తాను కానీ,  సినిమాలు చేయడం మానను. ఈ విషయం మా ఆయనకు కూడా తెలుసు. 

మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది?

కామ్నా జెఠ్మలానీ: నేను హిందీలో చేసిన ‘చోడ్‌ దో ఆంఛల్‌’ అని బాంబే వికింగ్స్‌ ఆల్బమ్‌ సూపర్‌ హిట్‌ అయింది. ఆ తర్వాత కొన్ని యాడ్స్‌లో నటించాను. అవి చూసే బి. జయ గారు ఫోన్‌ చేశారు. తెలుగు సినిమా అనేసరికి చేయనని ఫోన్‌ కట్‌ చేశాను. మా అమ్మకి ఫోన్‌ చేశారు. ముంబయికి వచ్చి కథ చెప్పారు. అప్పుడు మా అమ్మ ఇచ్చిన ధైర్యంతో సినిమా ఒప్పుకున్నాను. అలా మొదటి సినిమా ‘ప్రేమికులు’లో హీరోయిన్‌ అవకాశం వచ్చింది. 

‘రణం’ ఎలా వచ్చింది?

కామ్నా జెఠ్మలానీ: ప్రేమికులు సినిమా చేస్తున్నప్పుడే జయగారు నిర్మాత పోకూరి బాబురావుని పరిచయం చేశారు. అప్పుడాయన ‘నేను పరిచయం చేసిన ముంబయి హీరోయిన్లంతా  రైల్లోనే వచ్చారు. నువ్వు ట్రైన్‌లో వస్తావా? ఫ్లైట్‌లో వస్తావా?’ అని అడిగారు. నేను ఫ్లైట్‌లోనే వస్తానని చెప్పాను. మేం మాట్లాడుకుంది అంతే. ఆ తర్వాత ‘రణం’ షూటింగ్‌ మొదలైంది. అది ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే.

ఈ షో అంతా మనం తెలుగులోనే మాట్లాడాలి. తెలుసా?

కామ్నా జెఠ్మలానీ: నేను తెలుగులో సినిమా చేసి చాలా రోజులైంది. పెళ్లవడం, పిల్లలతో బిజీ అవడంతో..తెలుగు మాట్లాడటం కుదరలేదు.  సినిమాలు చేస్తున్నప్పుడు తెలుగు నేర్చుకున్నాను. ఈ గ్యాప్‌ వల్ల ఇప్పుడు తెలుగంతా మరిచిపోయాను. కన్నడం, తమిళం, తెలుగు ఇలా వివిధ భాషల్లో చేయడం వల్ల కూడా చిన్న కన్ఫ్యూజన్‌ ఏర్పడింది. 

ఇంట్లో ఏం మాట్లాడతారు?

కామ్నా జెఠ్మలానీ: ఇంగ్లీష్‌, హిందీ, సింధీ భాషల్లో మాట్లాడుకుంటాం. 

ఇద్దరి పాపలా తల్లిలా లేవు. ఇంకా పెళ్లి కానట్లే ఉన్నావు.

కామ్నా జెఠ్మలానీ:  థాంక్యూ. మా అమ్మ ఇప్పటికీ అలానే ఉంటారు. మా అమ్మమ్మ కూడా అంతే.  80 ఏళ్లైనా ఇప్పటికీ యంగ్‌గా, చురుగ్గా ఉంటుంది. మా జీన్స్‌ వల్లే ఇలా ఉన్నాననిపిస్తుంది. 

చదివిందంతా మహిళా‌ కాలేజీ కదా? బంక్‌ కొట్టి అబ్బాయిలతో సినిమాలకు వెళ్లేదానివట?  

కామ్నా జెఠ్మలానీ: గర్ల్స్‌ కాలేజీకి ఎందుకు వెళ్లానో తెలియదు. నాకసలు ఇష్టం లేదు.  మా కాలేజీ ఎదురుగా బాయ్స్ కాలేజీ ఉండేది. వాళ్లతో స్నేహం ఏర్పడింది. అలా సినిమాలు, పబ్బులకు వెళ్లి ఎంజాయ్‌ చేసేవాళ్లం. ఈ విషయాలన్నీ మా అమ్మతో పంచుకునేదాన్ని. 

మీకు రఘుబాబు అంటే ఇష్టం అనుకుంటాను?

కామ్నా జెఠ్మలానీ: ‘కత్తికాంతారావు’ షూటింగ్ సమయంలో జరిగింది. అప్పటికే అర్ధరాత్రి అయింది. నేను అలసిపోయి ఉన్నాను. వెనకాల నుంచి ఎవరో తుమ్మినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే రఘుబాబు ఉన్నారు. అందరూ పగలబడి నవ్వారు. చాలా కోపం వచ్చింది. కానీ, సీనియర్‌ యాక్టర్‌ నేను ఏమీ అనలేను. ఆ తర్వాత రఘుబాబు గారు ఆటపట్టించడానికే బాటిల్‌ స్ప్రే చల్లి ఇలా చేశారని తెలిసింది.

ఈవీవీతో పని చేసిన అనుభవం ఎలా ఉంది?

కామ్నా జెఠ్మలానీ:  ఆయనతో రెండు సినిమాలు చేశాను. ‘కత్తి కాంతారావు’, ‘బెండు అప్పారావు’ రెండూ హిట్టయ్యాయి. ‘బెండు అప్పారావు’ సినిమా ఒప్పుకొన్నప్పుడు అందరూ భయపెట్టారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. మొదటి వారం భయమేసింది. అందరితో దూరంగానే ఉన్నాను.  కానీ ఆయన కోప్పడటం, అరవడం ఎప్పుడూ చూడలేదు. షూటింగ్‌ చాలా బాగా ఎంజాయ్‌ చేశాను. 

ఒక పెద్ద డైరెక్టర్‌ నిన్ను జూనియర్ శ్రీదేవి అన్నారట?

కామ్నా జెఠ్మలానీ: కె. బాలచందర్‌ సర్‌. తమిళంలో జయం రవితో మొదటి సినిమా చేశాను. దానికి ఆయనే నిర్మాత. అందులో ఓ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు ఆయన నా దగ్గరకి వచ్చి, పక్కన కూర్చొని.. ‘నువ్వు చిన్న శ్రీదేవిలా ఉన్నావు’ అన్నారు. ‘ కొంచెం నటనను మెరుగుపరుచుకుంటే చాలు’  అని సలహా ఇచ్చారు. పక్కనే ఉన్న ప్రకాశ్‌ రాజ్‌ గారు నేను బాగా నటిస్తానని బాలచందర్‌ సర్‌తో చెప్పారు. నా లైఫ్‌లో మరిచిపోలేని క్షణాలవి. 

జనరల్‌గా హీరోయిన్‌కు ఒక హిట్‌ పడితే సినిమాలు వరుస కడతాయి. నీకు నాలుగైదు హిట్లు వచ్చినా  కెరీర్‌ను సరిగా ప్లాన్‌ చేసుకోలేదు. ఎందుకని?

కామ్నా జెఠ్మలానీ: నేను రోజూ ఈ ప్రశ్న వేసుకుంటాను. 2005లో ఇండస్ట్రీకి వచ్చాను. కొన్ని పెద్ద సినిమాలకు సంతకం చేశాను. అవి కార్యరూపం దాల్చలేదు. అందుకు బాధైతే లేదు. సరైన సమయానికి పెళ్లి చేసుకున్నాను. ఇద్దరు పిల్లలు. పెళ్లి, కెరీర్‌ రెండింటిలో సంతృప్తిగానే ఉన్నాను. కొంతమంది హీరోలు, దర్శకులతో పని చేయాలనే డ్రీమ్స్‌ మాత్రం ఉన్నాయి. 

ఈ విషయంలో మీ భర్త సహకారం ఎలా ఉంటుంది?

కామ్నా జెఠ్మలానీ: సూరజ్‌ వ్యాపారం మొదలెట్టినప్పుడు అండగా నిలబడ్డాను. ఇప్పుడు ఆయన ప్రోత్సాహం అందిస్తున్నాడు. నాకు సినిమానే ప్రపంచమని తెలుసు. 

మహేశ్‌తో ఒక ఐటమ్‌ సాంగ్‌ చేశావు కదా? 

కామ్నా జెఠ్మలానీ: ‘ఓరుగల్లుకే పిల్లా’ పాట. సైనికుడు సినిమా.

మహేశ్‌ కోసం చేశావా? బ్యానర్‌ కోసం చేశావా? 

కామ్నా జెఠ్మలానీ: నేను 24 గంటలు పని చేయమన్నా చేస్తాను. నటించడం అంటే అంత ఇష్టం. నేను అప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను. ఇది చేస్తే ఇంకా మంచి ఆఫర్‌ వస్తుందనే ఉద్దేశంతో.. ఎలాంటి అవకాశం వచ్చినా చేసేదాన్ని. అందుకే ‘సైనికుడు’లో ఆ పాట చేశాను.

తెలుగులో అవకాశం వస్తే  ఏ డైరెక్టర్‌తో పనిచేయాలని ఉంది?

కామ్నా జెఠ్మలానీ: పూరి జగన్నాథ్‌. రెండు సార్లు ఆయన షూటింగ్‌కు వెళ్లాను. చాలా సరదాగా ఉంటారు. రాజమౌళి సినిమాలో చిన్నపాత్ర దొరికినా చాలు. 

చైనాకు మళ్లీ ఎప్పుడు వెళ్తున్నావు?

కామ్నా జెఠ్మలానీ: ‘చోడ్‌ దో ఆంఛల్‌’  పాటను దాదాపు 500 వేదికలపై ప్రదర్శించాను. అలా చైనాలోని భారతీయుల కోసం ప్రదర్శించేందుకు అవకాశమొస్తే వెళ్లాను. వాళ్లు బాగా చూసుకున్నారు. కానీ అక్కడ ఏది పడితే అది తింటారు. పాములు, బొద్దింకలు, చీమలు, ఎలుకలు ఇలా దేన్నయినా తినేస్తారు. నేను శాకాహారిని. అందుకే అది నాకు మొదటి, చివరి చైనా ట్రిప్‌ అయింది.

ఇండస్ట్రీలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరు?

కామ్నా జెఠ్మలానీ: పూనమ్‌ బజ్వా. ఇండస్ట్రీకి ఇద్దరమూ ఒకేసారి వచ్చాం. అంతకుముందు నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌. ఆమె పక్కన ఉంటే సంతోషంగా ఉంటాను. అల్లరి నరేశ్‌, దేవీశ్రీ ప్రసాద్, శ్రద్ధా దాస్‌ ఇలా చాలా మంది స్నేహితులు ఉన్నారు. 

నిన్ను కూల్‌ చేయాలంటే ఐస్‌ ఇస్తే చాలంట?

కామ్నా జెఠ్మలానీ: నాకసలు కోపం రాదు. సంవత్సరంలో ఒకటి, రెండు సార్లు వస్తుంది అంతే.  

ఏ విషయంలో కోపం వస్తుంది మరి? 

కామ్నా జెఠ్మలానీ: అది కూడా తెలియదు. 

చందమామ హీరోయిన్‌ ఆఫర్‌ ఎలా మిస్‌ అయింది? 

కామ్నా జెఠ్మలానీ: నేను తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను. అందులో నా పాత్ర పరిధి పెద్దది. అక్కడ 65 రోజుల షూటింగ్‌ ఉంది. అదే సమయంలో ‘చందమామ’ లో చేయమని కృష్ణవంశీ అడిగారు. డేట్స్‌ కుదరకపోవడం వల్ల అది మిస్‌ అయింది. 

ఏ రోల్‌ మిస్‌ చేసుకున్నావు?

కామ్నా జెఠ్మలానీ: సింధూ మేనన్‌ చేసిన పాత్ర చేయమని అడిగారు. కాజల్‌ అప్పటికే ఓకే అయింది. సినిమా మిస్‌ అయినందుకు చాలా బాధపడ్డాను. ఇలా నాలుగైదు సూపర్‌ హిట్‌ సినిమాలు వదులుకున్నాను. 

అలా మిస్ అయినప్పుడు ఫీల్‌ ఉంటుంది కదా?

కామ్నా జెఠ్మలానీ: చాలా బాధ ఉంటుంది. చెప్పుకోలేని బాధ.

‘రణం’ సినిమా షూటింగ్‌ లో దర్శకుడు అమ్మ రాజశేఖర్‌ సీరియస్‌ అయ్యారంట కదా? ఎందుకు?

కామ్నా జెఠ్మలానీ: ఒకరోజు పూనమ్‌ నేనూ పబ్‌కు వెళ్లాం. తెల్లవారుజామున 3 గంటలకు హోటల్‌కు వచ్చి మళ్లీ 5 గంటలకు షూట్‌కు వెళ్లాను. ఆ రోజు గోపిచంద్‌తో పాట షూటింగ్‌ ఉంది.  నిద్ర లేకపోవడం వల్ల నా కళ్లు, మొహం ఉబ్బిపోయాయి. నన్ను చూసిన అమ్మ రాజశేఖర్‌కు విపరీతమైన కోపం వచ్చింది. దాదాపు 400 మంది జూనియర్‌ ఆర్టిస్టులున్నారు అక్కడ. మైక్‌లో గట్టిగా అరుస్తూ ప్యాకప్‌ చెప్పారు. నేను అక్కడే ఏడ్చేశాను. 

కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి సమాధానం తెలుగులోనే చెప్పాలి.

నీకు బాగా ఇష్టమైన ఫేవరేట్‌ డైలాగ్‌ ఏంటీ?

కామ్నా జెఠ్మలానీ: మర్చిపోయాను..

ఏదో ఒకటి చెప్పండి.

కామ్నా జెఠ్మలానీ: బావా..బావా..బావా..

ఇది డైలాగేనా?

నవ్వులు
తెలుగులో ఇష్టమైన పాట?

కామ్నా జెఠ్మలానీ: పక్కా లోకల్‌. నాకు ఇలాంటి ఒక సోలో సాంగ్‌ చేయాలని కోరిక. ఓరుగల్లు చేశాను కానీ సోలో పాట కాదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు