MS Raju: ‘డర్టీ హరి’ అందుకే తీశా.. ఫైటర్‌పై భూమిక ఫైర్‌ అయింది: ఎంఎస్‌ రాజు

మాంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, లవ్‌స్టోరీలు నిర్మించి, వరుస విజయాలు అందుకున్న నిర్మాతగా పేరొందారు ఎం.ఎస్‌ రాజు. ‘వాన’తో దర్శకుడిగా మారిన ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘7 డేస్‌ 6 నైట్స్‌’.

Published : 06 Jun 2022 16:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, లవ్‌స్టోరీలు నిర్మించి, వరుస విజయాలు అందుకున్న నిర్మాతగా పేరొందారు ఎం.ఎస్‌ రాజు (MS Raju). ‘వాన’తో దర్శకుడిగా మారిన ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘7 డేస్‌ 6 నైట్స్‌’ (7 Days 6 Nights). ఈ సినిమా జూన్‌ 24న విడుదలకానున్న నేపథ్యంలో తన తనయుడు, హీరో సుమంత్‌ అశ్విన్‌తో కలిసి రాజు ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ వేదికపై తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. తాను నిర్మించిన చాలా చిత్రాలు సంక్రాంతి సీజన్‌లో విడుదలవడం వల్ల తనని ‘సంక్రాంతి రాజు’ అని చాలామంది పిలిచేవారని చెప్పారు. ‘దేవి’ సినిమాతో సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్‌, ‘వర్షం’తో నాయికగా త్రిష, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తో దర్శకుడిగా ప్రభుదేవాను టాలీవుడ్‌కి పరిచయం చేశానన్నారు. ‘ఒక్కడు’ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ ఫైటర్‌పై భూమిక ఫైర్‌ అయిందని తెలిపారు. ఆంగ్లంలో ఆమె భయంకరంగా తిట్టిందన్నారు. ‘కుటుంబ ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీసిన ఎం.ఎస్‌ రాజు డర్టీ హరి అనే చిత్రాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది’ అని ఆలీ ప్రశ్నించగా ‘చిన్న బడ్జెట్‌లో అన్ని రకాల జానర్‌ సినిమాలు చేయాలనుకున్నా. ఎవరు ఏం అనుకున్నా, విమర్శలు ఎదురైనా సైలెంట్‌గా ఉండాలని నిర్ణయించుకుని ముందడుగేశా’ అని రాజు తెలిపారు.

తాను నటుడు కాక ముందు సుమారు 90 కిలోల బరువున్నానని, క్రమంగా బరువు తగ్గానని సుమంత్‌ తెలిపారు. తన తండ్రిలో మంచి దర్శకుడున్నాడని కొనియాడారు. వెంకటేష్‌ హీరోగా వచ్చిన ‘శత్రువు’ సినిమాతో నిర్మాతగా పరిశ్రమలో అడుగుపెట్టిన ఎం. ఎస్‌. రాజు ‘దేవి’, ‘దేవీ పుత్రుడు’, ‘మనసంతా నువ్వే’, ‘నీ స్నేహం’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘పౌర్ణమి’, ‘ఆట’ తదితర చిత్రాలు రూపొందించారు. ఈ ఎపిసోడ్‌ సోమవారం రాత్రి 9: 30 గం.లకు ‘ఈటీవీ’లో ప్రసారంకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని